April 28, 2024

కలం.

రచన: విజయలక్ష్మీ రుద్రరాజు

పుస్తకం నా నేస్తం
పఠనం నా ప్రాణం
కవిత్వం నా ఊపిరి
కలం నా ఆయుధం.

ఈ కలాన్ని హలాన్ని చేయగలను
నాట్లేయగలను నారేయగలను
కానీ
అన్నార్తుల ఆకలిని తీర్చలేక పొతున్నాను
న్యాయాన్ని పండించలేకపోతున్నాను
నేను ఓడిపొతున్నాను.

ఈ కలాన్నీ గళంగా మార్చగలను
యుగాలగీతాలని ఆలపించగలను
కానీ
అన్యాయాన్ని అణచలేకపోతున్నాను
సమావత్వాన్ని పెంచలేకపోతున్నాను
నేనూ ఓడిపొతున్నాను.

ఈ కలాన్ని మగ్గంగా మార్చుకోగలను
రంగుల దారలను ఒడకగలను
సుందర వస్త్రాలను అల్లగలను
కానీ
ఆడంబరాలను ఆపలేకపోతున్నాను
అతివల మానాల్ని ఆదుకోలేకపోతున్నాను
నా దేశం మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను
నేను ఓడిపోతున్నాను

ఈ కలాన్ని ఉలిని చేయగలను
శిలలను కరిగించగలను
శిల్పాలుగా తీర్చగలను
కానీ
కులపుగోడల్ని కూల్చలేకపోతున్నాను
కుతంత్రాల నీడల్ని తుడవలేకపోతున్నాను నేను ఓడిపోతున్నాను

ఈ కలాన్ని జలంగా మార్చగలను
కానీ
మతం జాడ్యాన్ని కడగలేకపోతున్నాను
మానవులంతా ఒక్కటేనని చాటలేకపోతున్నాను
నేను ఓడిపోతున్నాను

ఈ కలంతో కాలాన్ని ఎదిరించగలను
నా దేశం కన్నీటిని తుడవలేకపోతున్నాను
ఈ నా దేశాన్ని కన్నెత్తి చూడలేకపోతున్నాను
నేను ఓడిపోతున్నాను

కలాన్నై ముందుకు సాగిపోతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *