May 2, 2024

నా పక్కనే ఉన్నావు గదరా

రచన, సంగీతం, గానం:
శ్రీనివాస భరద్వాజ్ కిశోర్ (కిభశ్రీ)

ఎక్కడో దూరాన గిరిపై
ఎక్కి కూర్చున్నావనందురు
చక్కగా ఓస్వామి నువు నా
పక్కనే ఉన్నావురా

ఎత్తి తల చుట్టూర చూడగ
మొత్తమగపడు నీలిగగనము
ఉత్తముడ నీ రూపమే అది
చిత్తరువువలెనుండెగదరా

మొక్కలందూ మానులందూ
రెక్కలుండిన పక్షులందూ
ఎక్కడెక్కడ చూడదలచిన
అక్కడగుపించేవుగదరా

మొక్కుటకు గుడి గోపురమ్ములు
అక్కరేలర భక్తితోడను
ఎక్కడున్నా నిన్ను మనసున
నిక్కముగ నిలిపేనుగదరా

కుమ్ములాటల మధ్యనొకతోల్
బొమ్మలాటైయున్న బతుకిది
నమ్మకము ననుబ్రోతువన్నది
వమ్ము చేయవు తెలుసుగదరా

చిక్కి జీవిత చక్రమందున
రొక్కమే పరమార్థమనుకొని
దిక్కు తెలియక తిరుగువాడిని
నొక్క దరిచేర్చితివిగదరా

అక్కసున నాబుద్ధి చెరచెడి
రక్కసులు నను ఆవహించగ
ఇక్కటుల పాలైన బతుకును
చక్కపరచితివీవుగదరా

కల్లకపటము లేని మనసుతొ
పిల్లవాడై కొలిచినానని
తల్లివీ తండ్రివీ నీవై
ఎల్లపుడు కాచేవుగదరా

ఎక్కకున్నా ఏడుకొండలు
మొక్కకున్నా ఎన్నడైనను
చిక్కియుంటివి గుండెలో నా
కెక్కువింకేమొద్దురా

ఈ గేయాన్ని ఈ కింది లింకులో వినవచ్చు
http://picosong.com/dX6d

1 thought on “నా పక్కనే ఉన్నావు గదరా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *