May 2, 2024

రియాలిటీ – షో -రియాలిటీ

రచన: జొన్నలగడ్డ కనకదుర్గ

“హాయ్ సుమ! రా ఎలా వున్నావు? ” పనిపిల్ల తలుపు తియ్యగానే సోఫాలో పడుకునే హుషారుగా పలకరించింది మా వదిన. ఆవిడ గొంతులో హుషారుకి నేను కొంచెం ఆశ్చర్యంతోనే “ బావున్నా వదినా! నువ్వు ఎలా వున్నావు? కాలు ఎలా వుంది? కొంచెం పర్వాలేదా?” అని పరామర్శించా.
ఈ మధ్య మా వదిన కాలు స్ప్రెయిన్ అయింది, డాక్టరూ వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడని అన్నయ్య పదిరోజుల క్రితం ఫోను చేసి చెప్పాడు. పిల్లల పరీక్షలు అవ్వడంతో అప్పుడే వచ్చి వదిన్ని చూడలేకపోయా . కుదుర్చుకుని వచ్చేటప్పటికి ఇదిగో పదిరోజులు పట్టింది.“
“ఆ పర్వాలేదులే, కాని ఇంకా 3 రోజులు పవళింపు సేవే” అంటూ నవ్వింది వదిన.
“అదేంటి? అన్నయ్య నాకు ఫోన్ చేసే పదిరోజులు ఆయ్యిందిగా వదిన, ఇంకా తగ్గలేదా?” అని నేను అంటూ ఉండగానే, “ఎలా తగ్గుతుందమ్మా? కుంటి కులాసం ఇంటికి మోసం అని , ఆ కుంటి కాలు వేసుకునే కుంటుతూ, కుంటుతూ డాన్సులు చేస్తే?”అని అన్నయ్య అనడం,”మీరు ఊరుకుంటారా? “ అంటూ వదిన మిర్రిమిర్రి చూడడమూ… నాకు విషయం మీద ఆసక్తి ఇంకా పెరిగిపోయింది.
కాస్త చోటు ఇస్తానే దూరే రకం మనం- అలాంటిది, వాళ్ళు విషయం చెప్పి చెప్పక ఉంటే మనం ఊరుకుంటామా “ ఏం జరిగింది? ఎలా జరిగింది?అంత స్ప్రెయిన్ ఎలా అయింది అన్నయ్య?” అని నేను చాల కంగారు పడుతున్నటుగా అడిగాను. ఇంకా అన్నయ్య మొదలుపెట్టాడు..
“ఏమి జరిగిందా? అసలు స్ప్రెయిన్ ఎందుకు అయిందో తెలుసా? “
“ఏవండి….సరే .. సరే..ఉరుకోండి”అని వదిన అరుస్తూనే వుంది,అయినా అన్నయ్య ఆపకుండా తన ధోరణిలో చెప్పనే చెప్పాడు..” అదేదో టీ.వి వాళ్ళు వీళ్ళని ఒక రియాలిటీ షో కి పిలిచారట. ఇప్పుడు రియాలిటీ షోలలో డాన్సులు చెయ్యడం ట్రెండ్ అట. అందరూ బలవంత పెట్టారని ఈవిడ కూడా డాన్స్ ఆడబోయారు….కాలు మెలికపడి బెడ్ రెస్ట్ ..”
“ఇంకా ఆపుతారా? గౌరీ, అయ్యగారికి కాఫీ పట్టుకురా”అంటూ పనిపిల్లని కేకవేసి అన్నయ్యను డిస్టర్బ్ చెయ్యపోయింది.
“నువ్వు అరిచి గీపెట్టినా నేను ఆపేది లేదు” అంటూ అన్నయ్య “అక్కడితో ఆగిందా? ఆహా! కొంచెం నొప్పి తగ్గగానే మళ్లీ ప్రాక్టీసు షురూ.. ఆ నొప్పి కాలు మళ్లీ మడతపడి, ఈవిడ మంచాన పడి మళ్ళీ బెడ్ రెస్ట్ మొదలు …”అంటూ అన్నయ్య తన అక్కసు అంతా ఏకరువు పెట్టాడు.
“నేను ఏమన్నా కావాలని డాన్సులు ఆడటానికి వెళతానా, నువ్వే చెప్పు సుమా?”
“నలుగురితో నారాయణ అని ఏదో కర్టెసీ కోసం. పైగా నేను లేడీస్ క్లబ్ ప్రెస్సిడెంట్ ని కూడా., వాళ్ళతో పాటు చెయ్యకపోతే ఏమి బావుంటుంది?” అన్నది.
నా సమాధానం కోసం ఎదురు చూడకుండానే “అయినా ఈయన ఉసురు తగిలి ఆ ప్రోగ్రాం షూటియింగ్ కి వెళ్ళలేదు…ప్రోగ్రాములోను లేను.”
“ఈయన కోరుకున్నట్టు నేను ఇల్లు కదలకుండా, కాలు కదపకుండా హాయిగా మంచాన పడి వున్నా..”అంటూ వదిన రుసరుసలాడింది.
ఈలోపు పనిపిల్ల తెచ్చి ఇచ్చిన కాఫీ తాగుతూ “నీకు కొన్ని కోట్ల సార్లు చెప్పినా, నేను ఎందుకు చెబుతున్నానో, ఏమి చెబుతున్నానో నీకు అర్ధం కాదు.”
“ఇన్నాళ్లు నీ ఇష్టం వచ్చినట్టే చేసావ్. ఆ తైతక్కలు ఏవో నువ్వే ఆడు, నాతో మాత్రం ఆడించక” అని ఫినిషింగ్ టచ్ ఇచ్చి మరీ వెళ్ళాడు అన్నయ్య.
“చూశావా? ఎంత లేసి మాటలు అన్నారో. మా లేడీస్ క్లబ్బ్ ఎంత ఆక్టివ్ గా సోషల్ సర్వీస్ చేస్తాము ? ఆవి అన్ని ఆయనకి గుర్తు లేవు. ఎప్పుడు అయినా వాటిని గురించి పొగడలేదు కాని, ఇప్పుడు మాత్రము ఎలా ఎగతాళి చేస్తున్నారో? “
“ఏదో టైంపాస్ కోసం మొదలుపెట్టిన క్లబ్బు, మేము ఎన్ని మంచి పనులు చేస్తునాము నీకు అవన్ని తెలుసు కదా. వాటి గురించి ఒక్క మాట అయినా అన్నారేమో చూడు . చిన్న తేడా వస్తే మాత్రం నన్ను తిట్టడానికి సిథ్థం సుమతి” చేతులు తిప్పుతూ అంటున్న వదినని చూస్తే, ఎందుకు ఆడిగానురా “ద్యావుడా” అని అల్లుఅర్జున్ స్టైల్ లో నన్ను నేను మనసులో తిట్టుకోవాల్సి వచ్చింది.
గబగబ నాలుగు మాటలు అనేసి అన్నయ్య మానాన అన్నయ్య వెళ్ళిపోయాడు. వదిన అందుకుంది. అనవసరంగా మాట్లాడా, ఈవిడని ఆపడం ఏలా అని ఆలోచస్తూన్న నాకు, మెరుపులాంటి అవుడియా వచ్చి “ఇంతకీ నీ ప్రొగ్రామ్ ఎప్పుడు వస్తుంది వదినా?” అని అడిగా. “అయ్యో!! ఈయన గోలలో పడి అసలు సంగతి మార్చేపోయాను, టైం ఎంత అయింది –అయ్యో ఇంకో పది నినిమిషాల్లో మొదలు ఆవుతుంది“ అంటూ టీ.వి ఆన్ చేసింది. “హమ్మయ్య! సర్దుకుంది!” అని నేను కూడా సంతోషంగా పూర్తీగా టి.వి .వైపు తిరిగిపోయా.
“వెల్కం టు నారి-పోరి “అంటూ చప్పట్లు కొడుతూ ఒక ముప్పయ్ ఏళ్లలోపు కుర్రవాడు స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాడు. “పి .టీ.వి వారు సమర్పించు నారి-పోరి కార్యక్రమము ఆడవాళ్ళలోని హుషారుని, ఉత్సాహాన్ని వెలికి తీసి వాళ్లకి ఉల్లాసాన్ని ఇవ్వడానికి మేము ఈ రోజు నుంచి మొదలుపెడుతున్నాము. ముందుగా మమ్మల్ని ఈ కాలనీకి ఆహ్వానించిన వనితగారిని పరిచయం చేసుకుందాం.” “వనితగారు , మా నారి-పోరి కార్యక్రమానికి. మీరు మీ కాలనీకి మమ్మల్ని అహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు.”
అబ్బో మరీ పేరంటంలాగా వుంది కదా” అంటూ చుట్టూ వున్న వాళ్ళ వైపు చూసి “ మన స్టైలో చేబుదాం. ”ఆంటీ-మీరు మమ్మల్ని పిలిచినందుకు ధ్యాంక్స్” అంటూ పక్కన వున్న ఆవిడని పరిచయం చేసాడు. చుట్టూ అన్ని వయస్సులలో వున్న ఆడవాళ్లు వున్నారు. అందరు తళతళలాడుతూ పెళ్ళికో పేరంటంకో వెళ్లేవాళ్లకు మల్లే ఫుల్ మేకప్ లో వున్నారు. ఈ షో లో రెండు టీమ్స్ ఉంటాయ్. ఒక్కక్క టీంలో ఇద్దరు ఉంటారు, ”అనగానే నలుగురు ఆడవాళ్ళు ముందుకు వచ్చివాళ్ళను పరిచయం చేసుకున్నారు. వాళ్ళలో ఇద్దరికి ఇంచు మించు యబ్బైయేళ్ళు ఉంటాయి . మిగతా ఇద్దరికీ ముప్ఫై ఏళ్ళ లోపు ఉంటుంది. అందరు ఫుల్ మేకప్పులు, మోచేతుల దాకా మ్యాచింగ్ గాజలు, పాతికేళ్ళ లోపు వాళ్లు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయిన లంగావోణీలలో, సత్యభామ జడలాగా జడ వేసుకుని, దానికి కూడా తళుకులు బెళుకులు పెట్టి మెరుస్తూ వున్నారు., పెద్దవాళ్ళు కూడా వాళ్లకు పోటీగా అన్నట్టు, లేటెస్ట్ చీరలలో-డ్రామాలో పాత్రలలాగ రెడీగా వున్నట్టు అనిపించింది .
“వాళ్ళని గుర్తు పట్టావా? అదిగో ఆ చిలకపచ్చ చీరలో వున్న అమ్మాయి రమణి- బబ్లూ వాళ్ళ అమ్మ.
ఆ ఎర్రచీర అమ్మాయి- సన వాళ్ళ ఆమ్మ. ఆవిడ తెలుసు కదా-ఆ గళ్ళచీర ఆవిడ అంజలిగారు. ఆ బ్లూ మెరుపు చీరలో వుంది భారతిగారు, ఆవిడని నువ్వు గుర్తుపట్టి వుండవు. పాపం ఆవిడ బయట ఎప్పుడు క్లాస్ గా వుంటారు. వీళ్లు ఈవిడని సురభి కంపెనీ ఆర్టిస్టుగా మేకప్ చేసారు “అని వదిన నాతో చెపుతుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ”అరె వదిన వీళ్ళు అందరు నాకు తెలుసు కదా, అసలు గుర్తే పట్టలేకపోయా.
“మరే పాపం ఆ రమణి అయితే బయట ఎంత సింపుల్ గా ఉంటుందో! అంజలిగారికి అసలు జుట్టే లేదు ఆవిడకి అంత కొప్పు పెట్టారు, షూటింగ్ తరువాత ఆవిడ రెండు రోజులు మెడ నొప్పులతో అవస్థ పడిందిట.”

“మనం గేమ్ స్టార్ట్ చేసేముందు వీళ్లకి పాయింట్స్ ఇవ్వాలి కదా. దానికి మీరు ఏమి చెయ్యాలంటే,” అంటూ ఆ నలుగురి వేపు తిరిగి, “ఈ రింగ్ చుట్టూ పరుగెత్తాలి“ అంటూ నేల మీద పెట్టిన ఒక పెద్ద హులా రింగ్ చూపించాడు. నేను విజిల్ ఊదగానే మీరు ఆ రింగ్ లోపలికి వెళ్ళాలి. స్టార్ట్ అనంగానే నలుగురు ఆ రింగ్ చుట్టూ పరిగెత్తడం మొదలుపెట్టారు. అంజలిగారికి కాస్త వొళ్ళు మీదట ఆ కెమెరా అలవాటు లేకపోవడం వల్లనా మొహమాటంగా, నిదానముగా నడుస్తున్నారు. ఆవిడ దగ్గరకి వెళ్లి యాంకర్ “అత్తమ్మో, ఏంటి పెళ్లి నడకలు నడుస్తున్నావ్? ఇట్లా అయితే పాయింట్లు రావు, పరిగెత్తు అత్తమ్మో“ అనగానే ఆవిడా పరిగేత్తే ప్రయత్నం చేయడం, అప్పుడే యాంకర్ విసిల్ ఉదడంతో ఈవిడ కంగారుగా రింగు లోపలకి వెళ్ళబోయారు. రింగు తట్టుకుని పడబోయారు. వెనకాలే వున్న రమణి పట్టుకుంది కాబట్టి బొక్కబోర్లా కిందపడకుండా తప్పించుకుంది ఆవిడ. అయితే టీ.వి. వాడు వదిలాడా అంటే, అదే దృశ్యాన్ని మూడుసార్లు పదే పదే చూపాడు..ఎలాగో అలాగా నాలుగు రౌండ్లు పరిగెత్తించి అందరికి తలా పదిమార్కులు ఇచ్చి సమన్యాయం చేసాడు. అటువంటి అప్పుడు ఆ పరుగులు పెట్టించడం ఎందుకు?? వాళ్లకి ఆయాసం అన్నా తగ్గేది కదా.
ఫస్ట్ రౌండ్లో ”ఇంట్లో అత్తగారితో పని చేయించుకోవడం ఎట్లా” అని ఒక టాపిక్ రౌండ్. ఇచ్చిన టాపిక్ గురించి 1 నిమిషం తెలుగులో మాట్లాడాలి. “ఈ రౌండ్లో ముందుగా పెద్దవాళ్ళు మాట్లాడుతారు . ఎందుకు అంటే వాళ్ళకు అనుభవం ఎక్కువ కనుక, – ఏం అత్త, నేను చెప్పింది కరెక్టేనా? అంటూ అంజలిగారు, భారతిగారి వేపు చూసి వెకిలి నవ్వులు. నవ్వితే వాళ్ళకు ఎలా అనిపించిందో కాని నేనే కనుక అక్కడ వున్నట్టు అయితే ఆ అంకర్ ముక్కు పచ్చడి చేసేదాన్ని ఏమో…
ఇంక రెండో రౌండు మధ్యలో “ఇప్పుడు మీతో పాటు వున్న ప్రేక్షకులకు కూడా ఒక చిన్న పోటీ. పెద్ద జడలు లేక జుట్టు వున్న నారీమణులు ఒక నలుగురు రావాలండి “ అనంగానే ఒక నలుగురు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆడబోయే గేమ్ ”కురులు-సిరులు”. అంటే మీకు తెలుసు ఇప్పుడు అందరికీ గుర్రపు తోకలే– అదేనండి పోని టేల్స్. సో ఇప్పుడు వచ్చే నారి-పోరిలో ఎవరికీ పెద్ద జుట్టు ఉంటే ఆ కురుల సిరులకు ఓక గిఫ్ట్ హంపెర్”. అనంగానే అక్కడ వున్నవారు అందరూ బాగా పొడుగు జడ వున్న ఒక అమ్మాయిని ముందుకు తోసారు. ఆ యాంకర్ ఏ కాలేజ్? అని అడగగానే ఆ అమ్మాయి “జాబ్” అని సమాధానం చెప్పింది ”ఓ సంతూర్ సోపా, జడ ఒరిజినాలా?” అని అడిగాడు. ఆ అమ్మాయి “అవును” అని చెప్పగానే “అయితే ఇప్పుడు నువ్వు మాకు జడ విప్పి చూపితే మేము ఒప్పుకుని నీకే ఆ గిఫ్ట్ హంపర్ ఇస్తాము” అనంగానే ఆ అమ్మాయి జడ విప్పి ఎదో తల నూనె మోడల్లలా జుట్టు ముందుకు వెనుకకు తిప్పుతూ తిరిగింది.
‘వెరీ గుడ్, చాల స్పోర్టివ్ గా ఉన్నావ్. అందుకు గాను నీ సొంత జుట్టుకి, మా షో నించి ఫలానా ఆయిల్ వాళ్ళనించి నీకు ఒక గిఫ్ట్ హంపర్ ”అని ఒక ప్యాకెట్ ఆ అమ్మాయి చేతిలో పెట్టి, మిగతా వాళ్ళ వైపు చూస్తూ ” చూశారా గుర్రపు తోకలకి ఏమి రాలేదు” అంటూ ఇంకొక బ్రేక్ ఇచ్చాడు.
“ఆ గిఫ్ట్ ప్యాక్ లో ఏమి వుందో తెలుసా?ఫలానా కంపెనీ వాళ్ళ కంపు కొట్టే ఆయిల్స్” అని వదిన నవ్వింది. “షూటింగ్ అయిపోయాక వాళ్ళు అందరు మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు, పాపం, ఆ టీ.వి. క్రూ బయట బాగా మర్యాదగానే ఉన్నారట. కాని షో హిట్ అవ్వాలి అని వాళ్ళకి అదే స్క్రిప్ట్ ఇచ్చారట. లేకపోతే వీళ్ళకి టి.ర్.పి రేటింగ్స్ రావట. ఎంత వెకిలిగా ఉంటే అంత హిట్ షో అన్న మాట. ఈ విషయం తెలియకుండా మధ్యలో వెళ్లిన మన వాళ్ళు బకరాలు అయ్యారు.”
“మన ప్రోగ్రాంలో ఇంకా నయం అమ్మగారు. కె టి.వి. లో మధ్యానం పూట వచ్చే “ఆడవాళ్లు –ఆవకాయ పచ్చడి” ప్రోగ్రాంలో అయితే ఓక బండవాడి బెల్ట్ కి ఒక తాడు కట్టి దాని ఈ అమ్మాయిల నడుముకి కడతారు. వీళ్లు పరిగెత్తుకెళ్ళి బాక్స్ మూత తీసి అందులో గిఫ్ట్ తీసుకోవాలి. వాళ్ళు పరిగెత్తేలోపు వాడు ముందుకు వెనుకకు పరిగెత్తి వాళ్లు ఆ బాక్స్ అందుకోకుండా చేస్తాడు. అలాంటి గేమ్ అయితే అందరు కిందే పడిపోయి వుండేవారూ” అంది వేడి వేడి పకోడీలు ప్లేట్ మా చేతికి అందిస్తూ గౌరీ.
“నీకు తెలుసా గౌరీ ఈ ప్రోగ్రాం ఇలా వుంటుంది అని” ఆశ్చార్యంగా అడిగింది వదిన.
“అదేంటి వదిన ? ప్రోగ్రాం ఏంటో కూడా తెలియకుండా ఎలా వెళ్లారు?” అన్న నా ప్రశ్నకు వదిన సమాధానం చెప్పే లోపు మళ్ళీ ప్రోగ్రాం మొదలు అయింది.
జనంలో వున్నా ఒక ఆవిడ “బాబు, నాకు ఒక డౌట్” అంది. ”ఇంకెందుకు లేట్, అడగండి” అంటూ మైక్ ఆవిడ ముందు పెట్టారు. “ఈ ప్రోగ్రాముకు నారి-పోరి అని పేరు ఎందుకు పెట్టారు అని” ఆవిడ అనంగానే ”మీకు చిన్నప్పటినించి ఇటువంటి ఆనుమానాలేనా పిన్ని, నీ అనుమానాలతో, బాబాయి నీతో ఎట్లా ఉంటున్నాడు ఏమో,” నీ అనుమానం తీరుస్తా విను,”-మనకు తెలంగాణా, ఆంధ్రా రెండు రాష్ట్రాలు కదా, అందుకని ఆంధ్ర నించి నారి, తెలంగాణ నుంచి పోరి అన్న మాట. పిన్ని ఓకేనా” అని
ఇప్పుడు “సెకెండ్ రౌండ్ – డ్యాన్స్ రౌండ్ అని ఆ నాలుగురితోనూ డాన్సు చేయించాడు. “కెవ్వుకేక” లాంటి రెండు కళాఖండాలకి డాన్సులు వేయించి ”అబ్బో తెలుగు సినిమా వాళ్ళు మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి “ అంటూ ఇవతల టీమ్ దగ్గరకు వచ్చి ఎవరికో ఒకరికి ప్రైజు ఇవ్వాలి కదా.. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నా. తరువాత రౌండులో మీకే. ఇప్పుడు ఏడవకుండా వాళ్లకి ప్రైజ్ మీ చేతుల మీదుగా ఇవ్వండి “అంటూ వీళ్ళతో వాళ్ళకి ప్రైజ్ ఇప్పించాడు. ప్రైజు ఇచ్చే వాళ్ళు సంతోషంగా ఇస్తే, తీసుకునేవాళ్ళు సిగ్గుపడుతూ తీసుకోవడం ఈ రౌండు ప్రత్యకత.” అన్న వ్యాఖ్యానానికి గౌరి పగలబడి నవ్వింది.
“వాళ్ళూ ప్రోగ్రాం ముందు వీళ్ళకి ఈ డాన్సులలో ట్రయినింగ్ ఇచ్చారట. వీళ్ళేమో ఆ స్టెప్పులు వేయిలేకపోతే, ఆ మాత్రం రాదా అన్నట్టు మాట్లాడారట. మాధవమ్మ చెప్పింది. ఆవిడగారు చూడ్డానికి వెళ్ళారు కదా. దానికి కూడా అన్ని రూల్స్ అంట. “ఇప్పుడు చప్పట్లు కొట్టండి, ఇక్కడ నవ్వండి అని అన్నీ వాళ్ళు చెప్పినట్టే చేయాలట. పైగా ఒక రోజు అంతా నిలువు జీతం. దాని తాలుకా హైరానా . ఇంట్లొ తిట్లు. బుధ్ధి వచ్చింది. ఇంక ఎప్పుడు చూడటానికి కూడా వెళ్ళను. మీ బస్తీకీ వస్తారేమొ. పొరపాటున కూడా వెళ్ళకు“ అని నాకు చెప్పారమ్మ అంటూ గౌరీ నవ్వుతూ అసలు సంగతి చెప్పింది.
మళ్లీ బ్రేక్. ఇంకొక గేమ్ రౌండ్. ఒక బట్టలు ఆరేసుకునే తాడుకి జంతికల కట్టారు. ఆడేవాళ్ళ్ళు చేతులు వెనక్కి పెట్టుకుని నోటితో ఆ చక్రాలు తినాలట. సరదా అనుకుని, ఆడేవాళ్ళను ఉత్సహపరిచే ప్రక్రియలో ఆ యాంకరు కుర్రాడు పేలిన ప్రేలాపనలు అన్న హింస ఆయినాక ఓక టీంవాళ్ళని నారి అని, ఇంకొక టీం వాళ్ళని పోరి అని నిర్ణయించి నలుగురి చేతిలో డబ్బాలు పెట్టి టాటా చెప్పాడు.
ఆ ప్రొగ్రామ్ అంతా అయ్యేసరికి నాకు వంటి మీద తేళ్ళు జెర్రులు పాకుతున్నటు అనిపించింది. వదిన అప్పుడే జ్వరపడి లేచినదానిలా అయిపొయింది. పనిపిల్ల మాకు వేడివేడి టీ తెచ్చి మేము కాస్త తెప్పరిల్లేలాగ చేసింది.
“అసలు ఇలాంటి దానిలో పాల్గొనాలని మీకు ఎలాగా అనిపించింది వదిన “అంటే “మాకు తెలియదు, ఎదో గేమ్ షో లేడీస్‌కి మాత్రమే అంటే మేము మా లేడిస్ క్లబ్బులో ఆడుకునే గేమ్స్ లాంటివే అనుకున్నాం. వనితగారికి తెలిసినవాళ్ళు ఉన్నారని పిలిచింది. కాని వాళ్ళు వచ్చి కాన్సెప్టు చెప్పాక, వీళ్లు చేయము అంటే వాళ్ళు అలాగా కుదరదని చేయించారట. ఈ షూటింగ్ అయిపోయాక అందరూ షాక్.” అని వదిన అంటుండగానే పనిపిల్ల అంది “మీరు వెళ్ళకపోవడమే మంచిది అయింది అమ్మ. ఆ పైన అమ్మకి అసలే చాలా ఫీలింగ్, దానికి తోడు ఆయమ్మ పడిపోయింది ఆన్నిసార్లు చూపెటాడు.. ఆ పి. టీ.వి వాడు ఆవిడకి కనపడ్డాడో చచ్చాడే. పి.టివి అంట.. పిచ్చి టీవీ అన్ని పెట్టుకోవలసింది..”అని అది అంటూ ఉండగానే, మా వదిన అంది కదా ” ఆందుకే అంటారు సుమ అన్ని మన మంచికే అని. ఈ కాలు నొప్పి లేకపోతే నేను వెళ్ళేదాన్ని. మీ అన్నయ్య నన్ను బయటకు పంపి, అప్పుడు ఇంకో మాట మాట్లాడేవాళ్ళు.”
“అదే వదినా, సరదాకి వెకిలితనానికి తేడా కాని, చిన్న పెద్ద తారతమ్యం కాని తెలియకుండా పోతుంది. ఆ రెండిటికి మథ్య చాలా సన్న గీత వుంటుంది. అది కొంచెం అటు ఇటు అయినా హాస్యం అపహాస్యం అవుతుంది. పైగా దురదృష్టం ఏమిటంటే అదే హాస్యం అని నట్టింట్లో తెచ్చి పెట్టుకుంటున్నాము, టి.వి.లో వచ్చే ప్రోగ్రాములకు మనం ఎలాగా బానిసలు ఔతూన్నామో నాకు చాలా చక్కగా అర్ధం అయింది. టి.విలో వచ్చే యాడ్స్ మనకు నచ్చినా, నచ్చకపోయినా మన నట్టింట్లో మనం ఎలాగా అయితే చూస్తూ ఉన్నామో అలాగే ఈ ప్రోగ్రాములలో పాల్గొనే వాళ్లు ఇంకా వాళ్లు చెప్పిన దానికల్లా తల ఆడించక తప్పదేమో. కాప్టివ్ ఆడియన్స్ లాగ కాప్టివ్ పార్టిసిపెంట్సి అన్న మాట!!. నేను ఈ ఆలోచనలలోనే “వస్తా వదిన జాగ్రత్త అని బయలుదేరాను-కాని జాగ్రత్త అన్న మాట ఎందుకు వచ్చిందో నాకు అర్ధం కాలేదు మీకు ఏమైనా అర్ధం అయిందా???

8 thoughts on “రియాలిటీ – షో -రియాలిటీ

  1. Narration చాల బాగుంది. విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పారు. ఇలాగే మరిన్ని రచనలు మీ నుంచి ఆశిస్తున్నాము.

  2. Congratulations Durga garu
    Your short story is good and we wish you good luck.
    It shows the cost of craziness to appear on small screen

  3. నోళ్ళు తెరుచుకు చూసే ఈ రియాలిటీ షో ల వెనకాల ఎంత బాధ వుందో నువ్వు అంత నవ్వుతూ చెప్పి, చక్కటి మెసేజ్ అందించింది రచయిత్రి. అభినందనలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *