May 26, 2024

మాయానగరం – 36

రచన: భువనచంద్ర

బోంబే లో ట్రైనింగ్ అయ్యాక అక్కడే ‘జూహూ’ లో పోస్టింగ్ ఇచ్చారు ఆనందరావుకి… ఇది కాస్త ఊహించని విషయమే. జనరల్ గా ఎవరి స్వరాష్ట్రానికి వారిని పోస్ట్ చేస్తారు…. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి. ఆనందరావు విషయంలో చిన్న తేడా జరిగింది. తొలి పోస్టింగ్ గనక చెయ్యక తప్పదు. ఛాయిస్ అడగటానికిప్పుడు వీలుండదు.
బొంబే లో అన్నీ దొరుకుతాయి …. ‘ఇళ్ళు ‘ తప్ప. వెయ్యి అడుగుల అపార్ట్మెంట్ సంపాదించుకొన్న బాలీవుడ్ నటవర్గమే ఆనందంతో పొంగిపోతారు. కోట్లు పెడితే గానీ కొనుకునే ఛాన్సు లేదు. పోనీ అద్దెకు ప్రయత్నిద్దామంటే ‘పగిడీ ‘ సిస్టమ్ .
బేచ్యులర్స్ కి ఓ సౌకర్యం ఉంది. పేయింగ్ గెస్ట్ గా ఉండటం…. అదీ తేలిక కాదన్నది వేరే విషయం. అతనితో ట్రైనింగ్ అయిన వాసుదేవ్ కులకర్ణి ఆనందరావుని వాళ్ళ చుట్టాలింటికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. వాళ్ళుండేది ‘అంధేరి’ లో. వాసుదేవ్ మేనత్త దిలీప్ నింబాల్కర్ అనే వాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుని పూణే నుంచి ముంబై కి మాకం మార్చింది. వాసుదేవ్ ఆనందరావుని తీసుకెళ్ళింది వాళ్ళింటికే. వాళ్ళింట్లో ఉండేది ముగ్గురే…. దిలీప్ నింబాల్కర్, అతని భార్య వాసుదేవ్ మేనత్తైన నిరుపమ నింబాల్కర్ వాళ్ళ ఏకైక సంతానం వందనా నింబాల్కర్. వందనకి పద్దెనిమిదేళ్ళు. అప్పుడే విచ్చుకున్న గులాబి పువ్వులా వుంటుంది. వాళ్ళింట్లో ఓ చిన్న గది వుంది. వాసుదేవ్ మాట మీద ఆ గదిని ఆనందరావుకివ్వడానికి ఒప్పుకున్నారు. దిలీప్ , నిరుపమా ఇద్దరూ పని చేసేది బ్యాంకులోనే. మిస్ వందనకు మాత్రం ఇది ఇష్టం లేదు. రాత్రంతా ఆ విషయంలో తల్లితండ్రులతో గొడవపడింది కానీ , ఆనందరావుని చూశాక ఆనందంగా ఒప్పుకుంది.
ప్రేమించి పెళ్ళి చేసుకొన్న వాళ్ళు వాళ్ళ సంతానం విషయంలో చాలా స్ట్రిక్ గా ఉంటారు. కారణం తాము చేసిన పనే తమ పిల్లలూ చేస్తారేమోనని. నింబాల్కర్ దంపతులు కూడా ఆ కోవకి చెందిన వారే.
వాళ్ళ ప్రేమ పెళ్ళి ఎంతో సఫలమైనా , వందన విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ గా ఉన్నారు. ఏమో … పొరపాటున కూతురు ఏ వెధవనో ప్రేమిస్తే బొంబే లో ‘టపోరా ‘ గాళ్ళ సంఖ్య తక్కువేం కాదు.
ఆనందరావు ముంబై వచ్చి ఆర్నెల్లయ్యింది. ఈ ఆర్నెల్లల్లో కనీసం అరవై ఉత్తరాలన్నా మిసెస్ మాధవి రావుకి వ్రాశాడు. ఎవరి జ్ఞాపకాలు మరుగునపడ్డా , ఆనందరావు మనసులో మాధవి, శోభ, మదాలస మాత్రం ఫ్రష్ గా తిష్ట వేసుకొని ఉన్నారు. ఏడేనిమిది సార్లు శోభకు ఫోన్ చేసి , మాధవి బాగోగుల గురించి మాట్లాడాడు. మాధవికి ఫోన్ లేదు. పెట్టించలేదు. ఆమె దృష్టిలో ఫోన్ ఇంట్లో అనవసరం. ఉత్తరాలు అందుకోవడం, ఉత్తరాలు రాయడమూ అంటే మాధవికి ఎంతో ఇష్టం.
ఆనందరావు మాధవి గురించి కనుక్కోడానికి మాత్రమే శోభారాణికి ఫోన్ చేసినా , శోభ మాత్రం అతను తన కోసమే, తన గొంతు వినడం కోసమే, తన మంచీ చెడ్డా తెలుసుకోవడం కోసమే అని వూహల్లో తేలిపోయింది.
ఆమెకి తెలియని విషయం ఒకటుంది. ఎప్పుడు స్కూల్ కి ఫోన్ వచ్చినా, ఆ విషయం ‘బిల్లు ‘ లో తెలియకపోయినా , కాల్ లిస్ట్ అడిగితే తెలుస్తుందనీ, అలా తెలుసుకున్న శామ్యూల్ రెడ్డి ఆమె… ఆనందరావు మాట్లాడుకుంటుంటే ఎక్స్టెన్షన్ ఫోన్ లో విన్నాడని.
అయితే శామ్యూల్ రెడ్డి శోభలా పిచ్చివాడు కాకపోవడం వల్ల ఆనందరావుకి శోభ మీద ప్రత్యేకమైన ఇంట్రస్టు లేదని మొదటిసారి వాళ్ళ సంభాషణ విన్నప్పుడే అర్ధం చేసుకున్నాడు. అంతేకాదు, ఆనందరావు ప్రేమిస్తున్నది మాధవినని కూడా వాళ్ళ మాటల వల్ల అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచీ శోభకొచ్చే కాల్స్ ని పెద్దగా పట్టించుకోవడం మానేశాడు శామ్యూల్ రెడ్డి.
శోభారాణి పెరటి కోడి. ఎప్పుడైనా పట్టొచ్చు. ముందు చూడాల్సింది ఎన్నికల సంగతి. అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయన్న రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. గుడిసెల సిటి లొ వచ్చిన ‘మంచి పేరు ‘ని నిలుపుకోవడమే గాక , ఇంకా పేరు ఇనుమడించేందుకు పకడ్బందీ ప్రణాలికల్ని రచించమని ‘సర్వనామం ‘ మీద ఒత్తిడి కూడా తెస్తున్నాడు శామ్యూల్ రెడ్డి.
“అయ్యా… తమరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. అనేక పధకాల్ని సిద్ధం చేశాను. భోగిపండగనాడు చలి మంట వేస్తే అర్ధమౌతుంది గానీ దీపావళినాడు కాదుగా. అందుకే సమయాన్ని బట్టి ఎప్పుడు, ఎలా, ఏం చెయ్యాలో నేనే మీకు విన్నవించుకుంటాను ” వినయంగా అన్నాడు సర్వనామం.
ఇంకేం ఉంది అనడానికి! అయినా ” సర్వనామం అవతల వాడ్ని తక్కువ అంచనా వేయలేం. అతన్ని రాజకీయ గురువు సామాన్యుడు కాదు. శుక్రాచార్యుడిలాంటి వాడు. అనుకున్న పనిని సాధించడంలో చాణక్యుడిలాంటి వాడు. ఎత్తుకుపై ఎత్తులు వేయడంలో శకునిలాంటి వాడు… మనం మన జాగ్రత్తలో లేకపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దక్కేది శూన్యమే ” అన్నాడు.
“ఎదుటి వాడి గురించి అంచనా వెయడం తెలివైనవాడు చేసే పని. ఎదుటివాడి గురించి ఎంతెంతో వూహించడం అంటే , మనని మనం తక్కువ చేసుకోవడమే కాదు , ‘భయం ‘ అనే పంజరంలోకి అనాలోచితంగా అడుగుపెట్టడమే ” నవ్వాడు సర్వనామం
“అంటే? ” అని ప్రశ్నించాడు శామ్యూల్ రెడ్డి.
“అయ్యా.. రెడ్డిగారు, బోస్ రాజకీయ గురువు శుక్రాచార్యుడన్నారు, చాణక్యుడన్నారు, శకుని అన్నారు… నిజమే కావొచ్చు, కాదన్ను. ఎదుటివాడ్ని ఆకాశాన్ని ఆక్రమించిన వామనుడిలా చూస్తుంటే మనకు మనం గులకరాళ్ళల్లాగా కనిపిస్తాము. మన ధైర్యం నీరుగారి అరికాళ్ళలోంచి నేలలో ఇంకిపోతుంది. ఆయన గొప్పదనాన్ని అంచనా వేద్దాం. దానికి తగినట్టు మనం సిద్ధమవుద్దాం…. సాగాల్సిన పద్ధతి ఇదీ ! ” వివరించాడు సర్వనామం
మౌనంగా వున్నాడు శామ్యూల్ రెడ్డి
“నేను చెప్పింది మీకు అర్ధమైనా , నా మాటలు మీకు ప్రస్తుతం నచ్చవు. ఎందుకంటే మీరు చూస్తున్నది ఆ రాజగురువు ఫటాటోపం . నగరంలోని ధనవంతులందరూ కొద్దోగొప్పో ఆయన ‘గ్రిప్ ‘ లోనే వున్నారు. ఇటు స్టేటు అటు సెంట్రల్ మంత్రులు కూడా ఆయనతో సత్సంబంధాలనే కొనసాగిస్తారు. ఇక అధికార గణం గురించి చెప్పేదేముంది! యీ పవిత్ర దేశంలో అధికారుల్లో నూటికి తొంబై శాతం తాము ప్రజా సేవకై ఉద్దేశింపపడ్డారు కానీ జీతంగా పుచ్చుకుంటున్నది ప్రజాధనమని ఏనాడు అనుకోరు. నేరం రుజువు కాకపోయినా ఓ సామాన్యుడిని లాఠితో చావగొట్టి లాకప్ లో తోసే పోలీసే , డబ్బుండేవాడు కళ్ళ ఎదుటే నేరం చేస్తున్నా నోరుమూసుకొని వుంటాడు. రౌడీలకు గూండాలకు చచ్చే భయపడతాడు. కనక, అధికారగణం ఓ చిత్రమైన గణం. ‘మనం రిప్రజెంట్ చేసేది ప్రభుత్వాన్ని. మనం ప్రభుత్వాధికారులం. ” అనే సృహ ఏనాడూ వాళ్ళకుండదు. ఇవన్నీ నేను గమనించట్లేదని మీ ఉద్దేశ్యం. ఓ చిన్న విషయం చెప్పనా! పటిష్టమైన చోట్ల వున్నామనుకున్నవాడే అతి తేలిగ్గా శతృవుకి చిక్కుతాడు. ఈ స్ట్రేటర్జీ అంత తేలిగ్గా అర్ధమయ్యేది కాదు. కానీ నిజం ” బీడీ వెలిగించాడు సర్వనామం.
శామ్యూల్ రెడ్డి మొహంలో చాలా రిలీఫ్ కనపడింది. ‘రాజ గురువు ‘ గురించి సమాచారం సర్వనామానికి తెలుసని అతను ఊహించను కూడా లేదు. సర్వనామం చాలా ఎడ్వాన్సెడ్ గా వుండటం శామ్యూల్ రెడ్డికి చాలా రిలీఫ్ నిచ్చింది.
“డబ్బు ఏమన్నా కావాలా? ” తీయగా అన్నాడు శామ్యూల్ రెడ్డి. మెచ్చుకోవాలనుకున్నప్పుడు వుపయోగించే మాట అది.
“హ…హ… హా.. మీరు నా షేర్ గా ఇచ్చేది చాలా వుంది రెడ్డి సాబ్ ” త్వరలోనే మిమ్మల్ని ఓ కోరిక కోరుతాను. అఫ్ కోర్స్.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదీ కాదు, మీకు నష్టం కలిగించేది కాదు. అప్పుడు మీరు నేనడిగింది చేద్దురు గాని ” చిన్నగా నవ్వి అన్నాడు సర్వనామం.
“సర్వనామం నువ్వు తెలివైనవాడివి ” తనూ నవ్వి లేచాడు శామ్యూల్ రెడ్డి.
శామ్యూల్ వెళ్ళిపోయినా సర్వనామం శామ్యూల్ ఆఫీస్ లోనే కూర్చున్నాడు. ఏ. సి. చల్లగా వుంది. ఇప్పుడతన్ని ఆపేవాళ్ళెవ్వరూ లేరు. అటు సెక్యూరిటీ వాళ్ళు కానీ, ఇటు స్కూల్ స్టాఫ్ వాళ్ళు కానీ, లోపల ఏమనుకున్నా బయటకు మాత్రం సర్వనామం దగ్గర విధేయత ప్రదర్శిస్తునారు. కారణం అతను శామ్యూల్ కి కావల్సిన వాడని అందరికీ తెలుసు.
సర్వనామం మనసులో నవనీతం దోబూచులాడుతోంది. అబ్బా… ఏమా పొంకం. స్త్రీ శరీరం ఇంత అద్భుతమైనదా … మైగాడ్. ఇంత కాలం జీవితం ఎంత వ్యర్ధమయ్యిందీ! అసలీమే నాకు ముందే పరిచయం అయ్యుంటే?
ఎన్నెన్నో ఆలోచనలు. క్షణానికోసారి ఆమె మృదువైన శరీరమే గుర్తొస్తోంది. చూడాలని గుండె కొట్టుకుపోతోంది. ఇది వాంఛా… లేక ప్రేమా? అతనికే అర్ధం కావడం లేదు. వానాకాలంలో రావాల్సిన వరద మండే ఎండాకాలంలో వస్తే ! యవ్వనంలో వుండాల్సిన ‘తీపి కోత ‘ నడివయస్సులో వస్తే! నవ్వుకున్నాడు సర్వనామం. ఏమైనా సరే , ఎలాగైనా సరే నవనీతాన్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. కానీ, తను చేసిన ప్రతిజ్ఞ గుర్తుకొచ్చి ఆగిపోయాడు. “నో… తొందరపడను… ఆమే రానీ” అనుకొని నిట్టూర్చాడు.
**********************************************
మనిషి జీవితం ఎంత విశాలమైనదంటే, విశ్వమంత విశాలమైంది. తల్లి కడుపులో తొమ్మిది నెలల పాటు ఒంటరిగా వున్నా, కనీసం నాలుగు నెలల పాటు ఇతరుల మాటల్ని వింటూ పెరుగుతాడు.
ఈతల భూమ్మీద పడ్డాక అతని ప్రపంచం మెల్లమెల్లగా పెరగడం ప్రారంభమవుతుంది. తల్లి, తండ్రి, అన్న చెల్లి చుట్టాలూ పక్కాలూ స్కూలు స్నేహితులు కాలేజీ ప్రేమలు పెళ్ళిల్లూ పిల్లతో సినిమాలు దేశవిదేశ ప్రయాణాలూ పరిచయాలూ ఇలా మెల్లగా ప్రపంచం పెరుగుతుంది.
జీవితం ఎంత పెద్దదో అంత చిన్నది. ఎంత పెద్దదో అంత చిన్నది. నవనీతం మనసు బీటలు వారి చాలా కాలమయింది. ఆ బీటలు ఆమెని కొద్దిగా ‘మందు ‘ వైపు మళ్ళించాయి. బోస్ కి ఎంత దగ్గరగా ఉందో అంత దూరంగానూ ఆమె మనసుంది. ఆ విషయం బోస్ కి అర్ధమయ్యింది. నూటికి నూరు పాళ్ళూ సుఖాన్ని ఇచ్చి సుఖాన్ని రాబట్టుకొనే మనిషి , వొంటి మీద చెయ్యి వేస్తే ప్రతిఘటించకుండా వొళ్ళు అప్పగిస్తోందే కానీ అదివరకులా శరీరాన్నే ఆయుధంగా ‘యుద్ధం ‘ చెయ్యడం లేదు.
అందుకే బోస్ ఆమె మీద చెయ్యి వెయ్యడానికి కూడా భయపడుతున్నాడు. నిజం చెబితే, సర్వనామం ఆమెని అనుభవించిన తరవాత బోస్ ఆమె మీద చెయ్యి వేసినా , అంతకు మించి ఏమీ చెయ్యలేకపోయాడు. కారణం నవనీతం నిర్లిప్తత. బోస్ కి క్లియర్ గా అర్ధమయ్యింది … తను ఆనాడు లాగి చెంప మీద కొట్టిన దెబ్బ , తగిలింది మనసుననీ, శరీరాన్ని కాదనీ . ఆమె మనసుని మళ్ళీ ఎలా ‘మామూలుగా ‘ మార్చాలో అతనికి తెలీదు. తెలియచెప్పే వాళ్ళెవరూ లేరు. అతనికర్ధమవుతోంది … తను కోల్పోతోంది నవనీతం శరీరాన్నీ, మనసునే కాదు… అంతకు మించిన ఆప్యాయతనీ, అనురాగాన్నీ, మమకారాన్నీ.
ఒకే కప్పుకింద వున్నా ఎవరిలోకం వారిదైంది. నవనీతానికి చెప్పలేని నీరసం మగతా ఆవహిస్తున్నాయి.

ఫాదర్ ఆల్బర్ట్ నుంచి వెంకటస్వామి అడ్రస్ తీసుకొని ఫోన్ చేసి పరమశివం సంగతి చెప్పింది. వెంకటస్వామి చెప్పాడు , ఆ విషయం తనకి తెలిసిందనీ , తగిన జాగ్రత్తల్లోనే వున్నాననీ.
“నవనీతం వాడి కన్ను నీ మీద వుంది . అవాళ నీ వెనకాల వచ్చాడు … దెబ్బ తిన్నాడు. వాడ్ని కొట్టింది నేనే. ఈ విషయం నేను ఫాదర్ కి కూడా చెప్పలేదు. వాడిది పాము పగ. అంతే కాదు భయంకరమైన తెలివితేటలు. అయితే నువ్వు యీ వూర్లో ఉన్నట్టు వాడికి తెలుసో లేదో నాకు తెలీదు. వాడి కంట మాత్రం పడకు. ” అని చాలా జాగ్రత్తలు చెప్పాడు. మనసులో ఏదో భయం పట్టుకుంది నవనీతానికి.
“ముంగిలాగా కూర్చుంటావేంటి? ఇంతకాలం పెట్టాను. ఒక్క దెబ్బ కొట్టగానే పెట్టిందంతా విషంగా మారిందా? ఏనాడన్నా నిన్నేమన్నా అన్నానా? ప్రేమగానే చూసుకొన్నానుగా …. ఛా.. ఛా.. ఛా… కొంపకొస్తే చాలు…. “కాళ్ళు దబదబా నేలకొట్టి అన్నాడు బోసు.
అతని చికాకుకి అంతులేదు. ఓ పక్క ‘గురువు ‘ గారి హెచ్చరికలు, ఇంకో పక్క శామ్యూల్ రెడ్డిగాడు రోజురోజుకి ఎదిగిపోవడం, మరో పక్క నిన్నటి దాకా ‘సేద ‘ తీర్చే నవనీతం నేడు మూగమొద్దై సహనాన్ని పరీక్షించడం.
“ఏం కావాలి? ” కళ్ళెత్తి సూటిగా బోసు కళ్ళలోకి చూస్తూ అడిగింది నవనీతం. మొన్నటిదాకా ఆ కళ్ళలో అభిమానం, కోరికా, ఓ చిత్రమైన ప్రేమా, తనవాడనే నమ్మకం కనిపించేవి. ఇప్పుడు ఆ చూపుల్లో నిర్లిప్తంగా వున్నాయి.
ఏం మాట్లాడాలో తెలీలేదు బోస్ కి. మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అతని స్థితి నవనీతానికి అర్ధమౌతూనే వుంది. అనంతమైన ‘జాలి ‘ కలుగుతూనే వుంది. కానీ ఎక్కడో ఏ ‘తీగో ‘ తెగింది. తీగ తెగిన వీణ ఎలా రవళిస్తుంది.
ఉన్నటుంది భళ్ళున వాంతి అయ్యింది. నీరసంగానే లేచి అంతా శుభ్రం చేసి, నిస్సత్తువగా చాప మీద పడుకుంది. సర్వనామం చెర పట్టిన రోజు నుండి ఆమె మంచం మీద పడుక్కోలేదు.
పక్క ఇంటి వాళ్ళ కూరలో ఘాటైన పోపు వేశారు. ఆ వాసన తగలగానే మళ్ళీ వాంతయ్యింది. ఈసారి దొడ్లోనే వాంతి చేసుకుంది గనక ఇల్లు శుభ్రం చేయ్యక్కర్లా. నీరసంతో పడుకుంటే ఎక్కడో పాతాళానికి జారిపోతొన్న భావన.
ఆమెకి తెలీదు… సర్వనామం దూరంగా ఓ బీడీ షాప్ దగ్గర బీడి మీద బీడి తాగుతూ , తను బయటకొస్తే చూద్దామని గంట నుంచీ ఎదురు చూస్తున్నాడని. … పరమశివం కావాలనీ కాళ్ళీడ్చుకుంటూ గుమ్మం మీద రెండు కళ్ళూ వేసి వుంచారనీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *