April 16, 2024

నా కూతురు..

రచన: విశాలి పెరి

“”నాన్నా.. ప్లీజ్ పెళ్ళి విషయంలో నాకో ఆలోచన ఉంది.. ప్లీజ్ మీరు చెప్పిన సంబంధం నేను చేసుకోను ” అని స్పష్టంగా అంది ధన్య.
ఒక్కసారి నిశేష్టులయ్యాము..
“అది కాదూ ధన్య.. ” అని ఏదో చెప్పబోతే…
“నాన్న.. ప్లీజ్ రేపు అన్నీ విషయాలు మాట్లాడతాను.. నేను ఏవి అనుకుంటున్నానో, నా నిర్ణయమేమిటో కూడా రేపే విందురు, రేపు సాయంత్రం ఐదు గంటలకు నా నిర్ణయం చెబుతాను ” అని మాట తుంచేసి లోపలకి వెళ్ళిపోయింది ధన్య.
నిజంగా ఇదొక పెద్ద షాక్ నాకూ, రఘుకి. నోట మాట రాలేదు మా ఇద్దరికి. కళ్ళు అప్పగించి అలా చూస్తూ ఉండిపోయాము. ఏం జరుగుతోందో రెండు నిమిషాల వరకు మాకేం అర్ధం కాలేదు. ధన్యని ఇంత సీరియస్ గా ఎప్పుడూ చూడలేదు. “నాన్నా నువ్వు ఎంత చెబితే అంతా ‘ అని సూది పిన్నీసు నుంచి సెల్ ఫోన్ వరకు అన్నీ నాన్న మాటలే వినే ధన్య ఇప్పుడు జీవితంలో అది పెద్ద నిర్ణయంలో రఘుని ఇన్వాల్వ్ కావద్దని సూటిగా చెప్పడం నిజంగా షాకే!
రఘుకి ఏడుపొక్కటే తక్కువ.. తన గారాల పట్టి, తను ఎంత చెబితే అంతే అనే తన ముద్దుల కూతురు ఇప్పుడు పెళ్ళి విషయంలో ఇంత వ్యతిరేకంగా ఉంటుందని అనుకోలేదు. నిద్ర అస్సలు పట్టడం లేదు తనకి. అటు ఇటూ తిరుగుతూనే ఉన్నాడు రాత్రంతా. ఇదంతా నేనూ గమనిస్తునే ఉన్నాను, ఏంటో నాకు కూడా సరిగ్గా నిద్రపట్టడం లేదు. ఒకవైపు నుండి చూస్తే ఎన్నో ఏళ్లుగా నేను ఎదురు చూస్తున్న సందర్భం ఇది. ధన్య, రఘుకి ఎదురు తిరగడం చూడాలన్న నా జీవిత వాంఛ తీరిన క్షణమది.. కానీ ఏంటో ఒక ఆందోళన. రఘు ఇలా మొహం వాలేసుకుంటే చూడటం కష్టంగానే ఉంది నాకు. ఇలాంటి సందర్భాన్నా నేను కోరుకుంది?

***********

సరిగ్గా ఇరవై రెండేళ్ళ క్రితం రఘు నా చేతిలో ఒక అందమైన కుందనపు బొమ్మని తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారు. నేను చేతిలోకి తీసుకొన్న వెంటనే ఒక చిరునవ్వు నవ్వింది… చాలు ఆ నవ్వు ఎన్నో వసంతాలు నా జీవితంలోకి తీసుకొని రాడానికి. దాని బుజ్జి బుజ్జి చేతులతో నన్ను తాకినప్పుడు ఓ అద్వితీయమైన అనుభూతి. చిన్న చిన్న గులాబి రంగులో ఉన్న కాళ్లతో తన్నితే ఒళ్ళంతా తీయని పులకరింత. ఇది మన జీవితంలోకి రావడమే మన జీవితం ‘ధన్యమ ‘య్యింది.. దీన్ని ‘ధన్య ‘ అనే పిలవాలి అన్నారు రఘు. ఒక్కసారి అలా చూస్తూ ఉండిపోయాను. నాకు ఆ పేరు నచ్చిందో లేదో కూడా అడగలేదు. నా నిర్ణయంతో పనేముంది? ధన్య.. రఘు కూతురు.

***********

తరవాత ధన్యకి బేబీ ఫుడ్స్ అని ఏవేవో చిన్న చిన్న సీసాలు తీసుకొచ్చారు రఘు.
“ఇవన్నీ ఎందుకు, ఇప్పుడేగా అన్నప్రాస అయ్యింది. గుజ్జులా అన్నము, రాగి, పళ్ళు, కూరలు ఉడికించి, అవి పెడితే చాలు. ఈ బేబీ ఫుడ్స్ లో ఏ ప్రిజర్వేటివ్స్ ఉంటాయోనండి. ఇలాంటి వద్దు ” అని అన్నాను.
” నీవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళు, నా ధన్యకేమి కావాలో నాకు తెలుసు ” అని తను కొన్న తిళ్ళే తినిపించసాగారు. అదేంటో రెండు రోజులకే ధన్యకి వాంతులు, విరోచనాలు. ఇంక ఆ బయట తిళ్ళు మానిపించాకే అవి తగ్గాయి. ధన్యని మామూలు పిల్లని చెయ్యటానికి పదిరోజులు పట్టింది . ఆ తరవాత ధన్య తిండి విషయం మళ్ళీ నా మాట జవదాటలేదు. నేను వండడం వరకే.. దాన్ని తినిపించేది మాత్రం రఘుయే! సరిగ్గా పెడుతున్నానో లేదో ఎప్పుడూ తనకి అనుమానమే! ఎంతైనా ధన్య రఘు కూతురు కదా!
ఆ తరవాత ధన్య డ్రస్సుల విషయం. అన్నీ జిగ్ జిగ్ మనే డ్రస్సులే కొనేవారు రఘు. అవి గుచ్చుకొని ధన్య ఏడుస్తూనే ఉండేది. లోపల ఒక మెత్తటి కాటన్ డ్రస్సు వేసి అప్పుడు ఆయన కొన్నవి వేసేదాన్ని. అంత మంచి డ్రస్సులు ఇటు రఘునీ నొప్పించక, ధన్యకి నొప్పి కలిగించక ఏవో పాట్లు పడుతుండేదాన్ని. ఆ డ్రస్సు వేసేవరకే నా పని. అది ముస్తాబవ్వగానే దాన్ని ఎత్తుకొని బయటకెళ్ళిపోయేవారు నేను రెడీ అయ్యే లోపల.. హ్మ్మ్.. నేనెందుకు ఆ తండ్రీ కూతుర్ల మధ్యలో?
దాని ఇంటర్ అయ్యక అప్పుడు చదువు విషయంలో మళ్ళీ రాద్ధంతం మొదలయ్యింది. అది హాస్టల్ కి వెళ్ళి చదువుకుంటానని. దానికి ఆయన కూడా వంత పాడారు. ఊర్లో ఉంటూ హాస్టల్ ఎందుకని నా ఉద్దేశం. నా మాటకి ఎవరు ప్రాముఖ్యత ఇస్తారు? తండ్రీ కూతురు ఇద్దరూ ఒకటే! అది హాస్టల్ కి వెళ్ళింది. అది వెళ్ళిన రెండో రోజు దానికి ఇస్టమని ‘మజ్జిగ పులుసు ” చేసి పట్టుకెళ్లాము. కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. మళ్ళీ రెండు రోజుల తరవాత గులాబ్ జామూన్ చేసి పట్టుకెళ్ళాము.
” అమ్మా… నువ్వు ఇలా ప్రతి వారం వచ్చేస్తే నా చదువుకి డిస్టబ్ అవుతుంది ” అని అంది.
ఆ మాట కాస్త నొప్పించిన మాట వాస్తవమే కానీ… దాని చదువు కోసం నేను దూరంగా ఉండటం తప్పదు. జీవితంలో కొన్ని సార్లు డిటాచ్ అవ్వాలి. పిల్లల విషయంలో ఇది ఎప్పుడూ మరచిపోకూడదు. చిన్నప్పుడు అన్నీ పట్టించుకుంటే ఊరుకొనే పిల్లలు కాస్త వయసు వస్తే అతి జోక్యాన్ని ఒప్పుకోరు. ఎప్పటికైనా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకొన్న నిర్ణయం మంచిదో కాదో గ్రహించే విజ్ఞత మాత్రం మనమే ఇవ్వాలి. ఇంక అప్పటి నుంచి ధన్య హాస్టల్ కి నెలకోసారి వెళ్లసాగాము. ఒక ఆరు నెలలు హాస్టల్లో ఉండి ” నాన్నా.. నేను ఇంక హాస్టల్లో ఉండను.. ఇంట్లోనే ఉండి చదువుకుంటా ” అని తన నిర్ణయం చెప్పింది.
ఇదీ ఒకందుకు మంచిదే. తనంతట తానే ఏదీ మంచో తెలుసుకుంది.
ఒకరోజు ధన్య, రఘు సినిమా ప్రోగ్రాం పెట్టారు. తీరా వెళ్ళిన సినిమా నాకేమీ కొత్తగా అనిపించలేదు. సినిమా పేరు “ఆకాశమంతా” రోజూ చూస్తున్నదే అక్కడా కనిపించింది. కాస్త విసుగ్గా అనిపించింది. సినిమాలో కూడా తల్లి పాత్రకి ప్రాధాన్యత లేదు. త్రిషా ఎవడో ఒక సర్దార్ ని తీసుకొచ్చి బాయ్ ఫ్రండ్ గా పరిచయం చేసిన సీన్ వచ్చేటప్పుడు రఘు ముఖ కవళికలు నాకు తెగ నచ్చేశాయి. అస్సలు నచ్చలేదు ఆ సీన్ రఘుకి. నాకు మాత్రం సినిమాలో అదే రసవత్తర ఘట్టంలా అనిపించింది. అలాంటి సీను మా ఇంట్లో ఎప్పుడొస్తుందా అని ఇన్నేళ్లు ఎదురు చూశాను. ధన్య కూడా ఎవరో ఒకర్ని ఇష్టపడాలి. తండ్రి నిర్ణయాలకే పెద్ద పీట వేస్తే ధన్య అప్పుడు “నాన్న నా ఇష్టం నాది ” అనాలి, రఘు మొహం ప్రకాశ్ రాజ్ మొహం లా ఏడ్వలేక నవ్వలేక అలా పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్టుగా ఉండాలి… అబ్బా… ఊహే ఎంత మధురంగా ఉంది.
ధన్య చదువు అయ్యిపోయింది. చుట్టాలలోనే బోలెడు సంబంధాలు రాసాగాయి. రఘుకి ఇవేవీ నచ్చలేదు. ఒక మాట్రిమోనీలో ధన్య పేరు రిజిస్టర్ చేయించారు. ఈ విషయం ఆరు నెలల తరవాత నాకు తెలిసింది. నాకు మాత్రం రఘు ఫ్రండ్ ప్రసాద్ గారి అబ్బాయి నచ్చాడు. చిన్నప్పటి నుంచి చూస్తోన్నవాడు. ఫామిలీ కూడా బాగా తెలుసు. ఇదే విషయం రఘుకి చెప్పకూడదనే అనుకుంటూనే చెప్పాను.
వినిపించుకున్నట్టు లేరు ….
“అది కాదండి. ఇంత ముద్దుగా పెంచుకొన్న కూతుర్ని ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి ఎలా చేయగలము? స్టాటసా… అదీ మనకి తెలిసిన వాళ్ళలోనే చుట్టాలలోనే ఉంటారు. కాస్త సమయం తీసుకుని వెతుకుదాము. గొప్ప గొప్ప చదువులూ, అందం, స్టాటస్ ఉన్న ఈ మాట్రీమానీ వాడు మంచివాడయ్యి ఉంటాడని ఎంటీ నమ్మకం? దేశం కానీ దేశంలో మన పిల్లని ఆ ముక్కూ మొహం తెలియని వాడికి ఇచ్చి ఎలా వదిలేస్తామూ? కుటుంబం అదీ తెలిసిన వాడైతే మంచిది అని నా ఉద్దేశం , అయినా పెళ్ళికి ఇప్పుడేం తొందరొచ్చింది? మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వనీయండి. ఇంకో రెండేళ్ళ తరవాత చెద్దాము ” అని రఘు విన్నా వినకపోయినా నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను.
” ధన్య పెళ్ళి విషయంలో నాది. ధన్యదే నిర్ణయం ” అని నా మాటకు విలవ ఇవ్వలేదు.
నిన్న అదే విషయం దాని దగ్గర ప్రస్తావించారు ” ధన్య ఇదిగో ఈ అబ్బాయి ప్రొఫైల్ చూడు యూ. ఎస్ లో సెటిల్ అయ్యాడు… నీకు సరిపోతాడు అన్ని విషయాలలో. వెల్ సెటిల్డ్ , తల్లీ తండ్రులు కూడా లేరు.. ఎవరి పోరూ ఉండదు ” అని ఎవరో అబ్బాయి ప్రొఫైల్ చూపించారు.
“అయ్యో అయ్యో… ఎవరూ లేని వాడికా ఇచ్చేది పిల్లని. ఈ రోజుల్లో అత్తగారి ఆరళ్ళు ఎక్కడున్నాయండి? అత్తగారు , మావగారు ఉంటేనే ముచ్చట్లు. అవి లేని వాడికి ఎలా ఇస్తాము పిల్లని? రేపు ఏదైనా మంచి చెడు మాట్లాడటానికి పెద్దవారు లేకపోతే ఎలా? ” అని ఆవేశంగా అన్నాను… అది ఆయన పట్టించుకుంటేగా!
“చూడు వాణీ! సంతలా కుటుంబ సభ్యులు సినిమాలలో ఉంటే సినిమా హిట్ అవుతుంది… కానీ నిజంగా ఉంటే ఒళ్ళు హూనమౌతుంది. ఇలాంటివి నా కూతురికి ఉండటం నాకు ఇష్టం లేదు. అది ఆడింది ఆట పాడింది పాటగా రాజ్యమేలాలి ” అని అన్నారు రఘు
” ధన్య.. అమ్మ మాటలేవీ పట్టించుకోకు… ఈ సంబంధం నీకు కూడా నచ్చుతుందని నాకు తెలుసు.. నా మాటే నీ మాట కదా.. ఒక్కసారి నువ్వు ‘ఊ ” అంటే ఆ అబ్బాయిని కాంటాక్ట్ చేస్తాను ” అని అన్నారు రఘు
అప్పుడు ధన్య ” నాన్నా.. ప్లీజ్ పెళ్ళి విషయంలో నాకో ఆలోచన ఉంది.. మీరు చెప్పింది నేను చేసుకోను ” అని అంది.

************************************

ఇంకొన్ని గంటలలో ధన్య నిర్ణయం చెబుతుంది. రఘుకి ఆ మాటలు జీర్ణించుకోలేక ఆకలి లేదు. నాకు జరిగే తమాషా చూడాలన్న ఆతృతతో ఆకలి లేదు. ధన్య ఎలాంటి వాడిని ఎంచుకుంటుంది? అన్నిటికీ తొందర నిర్ణయాలు తీసుకొనే ధన్యకి చాలా బాగా ఆలోచించగలిగే వాడు కావాలి. ముక్కు మీద కోపం ఎక్కువ ఉన్న ధన్యకి కాస్త ఓర్పు కలవాడు, ఆలోచనాపరుడు కావాలి. ఎంత కోపం ఉన్నా ధన్య మాత్రం చాలా మెచూర్డ్ గాళ్ . చూడాలి అది ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుందో? అయినా ఇవన్నీ నాకెందుకు? అది రఘు కూతురు. నేను ఈ తమాష చూసి ఆనందించాలి. ఏంటో అదొక రాక్షసానందం అనిపించింది నాకు.
సాయంత్రం నాలుగు నలభై కి ధన్య ‘ టీ ‘ చేసి తీసుకొచ్చింది.
“నాన్నా! టీ తీసుకో.. అమ్మా.. నువ్వూ తీసుకో ” అని ఇచ్చింది.
నా చూపులన్నీ వీధి వైపే ఉన్నాయి.. ఏ సర్దార్ జీ వస్తాడో అని. ఒక్కడే వస్తాడా? లేక సర్దార్ జీ వాళ్ళ అమ్మ, నాన్న , చెల్లి, బీజీ (ఆకాశమంత సినిమాలో నాన్నమ్మ ని బీజీ అంటారని తెలిసింది) కూడా వస్తారా? పంజాబీ వాళ్లది ఎక్కువ పెద్ద ఫామిలీలే ఉంటాయిట. ఒక పది మంది సంతానంలో నాలుగో వాడిని ధన్య ఇష్టపడితే బాగుండును. ఆ ఫామిలీనీ చూసి రఘు చిరాకు పడితే… భలే భలే….
రఘు టైం చూసుకొని ధన్య వైపు చూసి ” నీ నిర్ణయం చెబుతానన్నావు… ” అని ముక్తసరిగా అన్నారు.
“నాన్న! నా చిన్నతనం నుంచీ నాకు ఏది కావాలన్నా నువ్వే చూసుకొన్నావు ” అంటే ఇప్పుడు ఇంక చూడాల్సిన అవసరం లేదన్న మాటేగా, ఇదే మాట ధన్య అంటే వినాలని ఉంది.
” కొన్ని నా నిర్ణయాలు తొందరతో తీసుకొన్నా, నువ్వు వాటినే సమర్ధించావు, అప్పుడు నువ్వు నాకు చాలా నచ్చేసేవాడివి, కానీ అమ్మ ప్రతీ విషయంలోనూ మనది తప్పు అని తన నిర్ణయం చెప్పేది, అప్పుడు అమ్మ అంటే నాకు చాలా కోపం వచ్చేది. కానీ నాన్నా మనం ఎన్ని నిర్ణయాలు తీసుకొన్నా చివరకు అమ్మ నిర్ణయమే కరక్ట్ అయ్యేది ”
ఒక్కసారి కళ్ళు పెద్దవి చేస్తూ ధన్య వైపే చూస్తూ ఉండిపోయాను…
” నాన్నా… ఇంత వరకు తీసుకొన్న నిర్ణయాలు మళ్ళీ వెనకు తీసుకొనే అవకాశమున్నవి. కానీ పెళ్ళి జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చేది. ఇది తప్పుడు నిర్ణయంతో మా ఇద్దరి జీవితాలే కాదు నాతో పాటు మీవి కూడా బాధకరం అవుతాయి. అమ్మ కి చిన్నప్పటి నుంచి నా విషయంలో ఏ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఇవ్వలేదు మీరూ నేను. కాబట్టి నా పెళ్ళి విషయంలో అమ్మదే తుది నిర్ణయం. అమ్మ ఎవర్ని చూపించి పెళ్ళి చేసుకోమన్నా నేను రెడీ ” అని అంది ధన్య.
నాకు కంఠంలో ఏదో అడ్డుపడినట్టు ఉంది. ధన్య ఇలా మాట్లాడి నన్ను మూగదాన్ని చేసేసింది.
” అమ్మా.. హాపీ మదర్స్ డే, హాపీ బర్త్ డే! నువ్వు పుట్టినరోజే నాకు మదర్స్ డే అమ్మా ” అని అంది..
“అరే ఈ రోజు నా పుట్టినరోజా… అస్సలు గుర్తులేదురా ” అని మాటలు కూడ బెట్టుకొని అన్నాను.
“ఇదే నీ బర్త్ డే గిఫ్ట్ అమ్మా ” అని అంది ధన్య … రఘు కూతురు… కాదు .. నా కూతురు.. నా కన్న కూతురు…

*****

1 thought on “నా కూతురు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *