April 26, 2024

జీవితం ఇలా కూడా వుంటుందా? 11

రచన: అంగులూరి అంజనీదేవి

”మేమూ అదే అనుకున్నాం. కానీ మాటల మధ్యలో అన్నయ్యను అనరాని మాటలు అన్నాడట. ఆనంద్‌ పైకి పద్ధతిగా అన్పిస్తాడు కాని కోపం వస్తే మనిషికాడు మోక్షా! అందుకే అన్నయ్య వదిన నగలు అమ్మి ఇచ్చేశాడు. ఎప్పటికైనా ఇవ్వాల్సినవే… ఇవ్వకుండా ఆపి ఇంటిఅల్లుడిని ఇబ్బంది పెట్టడం మాకు కూడా మంచిది కాదు. మా ఇబ్బందులు ఎప్పటికీ వుండేవి. ఇప్పటికే చాలా రోజులు ఆగాడు ఆనంద్‌. ఈ విషయంలో అతను చాలా ఓపిక మంతుడే అనుకోవాలి. చూస్తున్నాంగా వేరేవాళ్ల అల్లుళ్లను…” అందామె ఒకవైపు అల్లుడిని మెచ్చుకుంటూ, ఇంకోవైపు అల్లుడు తన కొడుకుని ఏదో అన్నాడని బాధపడుతూ.
”ఇంతకీ ఆయన దగ్గర నుండి ఆ ప్రోనోటును వెనక్కి తీసుకున్నారా లేదా?”
”పంచాయితీ పెద్దలు ఆ విషయంలో జాగ్రత్తగానే ఉంటారు మోక్షా! అన్నయ్య డబ్బులు ఇవ్వగానే నాన్న రాసిచ్చిన ప్రోనోటును ఆనంద్‌ నుండి ఇప్పించారు”
మోక్ష ఆశ్చర్యపోయి ”పంచాయితీ పెద్దలా!! పెద్ద గొడవే చేసినట్లున్నాడుగా?” అంది.
”చేశాడు మోక్షా! క్షణాల్లో డబ్బు తెచ్చిచ్చేలా చేశాడు”
”ఛ…ఛ… నా తలరాత బాగా లేదమ్మా!”
”నీ తలరాతకేం మోక్షా! నువ్వే అలా అనుకుంటే అసలు పెళ్లిళ్లే కాక ఒంటరిగా ఉద్యోగాలు చేసుకుంటూ తమకంటూ ఓ తోడు లేకుండా నా అనేవాళ్లు లేకుండా వుండే ఆడవాళ్లేమనుకోవాలి? వాళ్లంతా వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్లో వుండి సుఖ పడుతున్నారనుకుంటున్నావా? తృప్తే జీవితం. తృప్తి పడటం నేర్చుకో. లేనిదాని గురించి ఆలోచించకు. పోయిన దాని గురించి అసలే ఆలోచించకు… అలా ఆలోచిస్తే మనకు ఎన్నిసార్లు తుఫాన్లు వచ్చి పంటలు పోలేదు” సర్ధి చెప్పింది.
”అమ్మా! నాకు తలనొప్పిగా వుంది. నీతో మళ్లీ మాట్లాడతాను” అంటూ కాల్‌ కట్ చేసింది మోక్ష.
దృతి వచ్చినప్పటి నుండి తారమ్మ పొలం వెళ్లటం మానేసింది. దృతిని చూసుకుంటూ ఇంట్లోనే వుంది.
ఒకరోజు దృతి ”ఆంటీ! మీరు పొలం వెళ్లకుంటే ఇబ్బందవుతుందేమో! సౌమ్య వుందిగా! మీరు వెళ్లండి పర్వాలేదు. నాకోసమే మీరిలా ఇంట్లో వుంటుంటే నేనొచ్చి మీ పనుల్ని పాడు చేసినట్లు బాధగా వుంది” అంది.
”అలాటి బాధలేం పెట్టుకోకు. పనులకేం తొందర. వాటిపాటికి అవి జరిగిపోతూనే వున్నాయి. ముందు నువ్వు ఇది తిను” అంది అన్నం కలిపి ముద్దలు చేసి దృతికి చేతిలో పెడుతూ.
నాలుగు ముద్దలు తిన్నాక ”అబ్బా… ఇకచాలు ఆంటీ! తినలేను” అంది దృతి లేచి వెళ్లబోతూ…
ఆమె చేయిపట్టి ఆపి కూర్చోబెడుతూ ”ఇప్పుడు నువ్వు తినేది నీకోసమనుకుంటున్నావా? లోపల వుండే నీ బిడ్డకోసం. ఈ టైంలో నువ్వెంత తిన్నా అదంతా నీ బిడ్డకే పోతుంది తెలుసా? అందుకే వద్దు అనకుండా నేను పెట్టింది తిను. మళ్లీ నీకు స్టెరాయిడ్‌ వాడకుండా మనం ఈ తిండితోనే లోపల బిడ్డను పెంచుకోవాలి. బిడ్డ బరువెలా పెరగదో చూస్తాను” అంటూ ఇంకో ముద్ద కలిపి ‘ముందా చేతిలో ముద్ద తిను. ఇది పెడతాను’ అన్నట్లు చూసింది.
అది తిని ఇక తినలేక ”తర్వాత తింటాను ఆంటీ!” అంటూ తప్పించుకోబోయింది.
”అదేం కుదరదు. ఈ కొంచెం తినాలి” అంది మొండిగా తారమ్మ.
దృతి కళ్లలో కన్నీటిపొర లీలగా మెరిసి క్షణంలో మాయమైంది.
చిన్నప్పటి నుండి దృతికి తల్లి ప్రేమ తెలియదు. ఒకవేళ తన తల్లే బ్రతికి వుంటే ఈ తారమ్మలా వుండేదా? దగ్గర కూర్చుని ఇలాగే తినిపించేదా? ఈ తారమ్మకు తనంటే ఎందుకింత ప్రేమ…? ఏమి ఆశిస్తోంది తన దగ్గర? ఏమీ లేదు. అసలు ఇలాటి ప్రేమల్లో ఎలాటి ఆశింపు వుండదు. అందుకే తారమ్మ పక్కన ఎప్పుడు కూర్చున్నా ఒక పన్నీటి కొలను పక్కన కూర్చున్నట్లే హాయిగా వుంటుంది. కూర్చున్నంత సేపు తారమ్మ హృదయాకాశంలోంచి అమృతదారలు కురుస్తూనే వుంటాయి.
గబగబ చేతిలో వున్న ముద్దను తిని తిరిగి తారమ్మ చేతిలో వున్న ముద్దను అందుకుంది దృతి.
”అది. అలా తినాలి. నువ్వలా తింటేనే నీ బిడ్డ సతీష్‌చంద్రలా, ప్రవీణ్‌లా చక్కటి రూపురేఖలతో, మంచి మేధస్సుతో పుడతాడు” అంది.
అది వింటుంటే దృతికి తన లోపల వున్న బిడ్డపై మమకారం పెరగసాగింది. ఇలాటి మాటలు తన అత్తలో లేవు. మామలో లేవు.
”అమ్మా!” అంటూ అల్లుకుపోయింది దృతి తారమ్మను.
తారమ్మ దృతి వీపుపై ప్రేమగా నిమిరింది. ఆమెకు అంకిరెడ్డి దృతికి స్టెరాయిడ్‌ ఇప్పించకుండా ఇక్కడకి తీసుకొచ్చి ప్రిస్క్రిప్షన్‌ ప్రవీణ్‌ చేతిలో పెట్టటం గుర్తొచ్చింది. ఆ దృశ్యాన్ని మరచిపోవాలని తల విదిలించి
”నీకేం కాదురా దృతీ! నేనున్నాను కదా! నీ బిడ్డను లోపల బరువు పెంచే పూచీ నాది… నన్ను నమ్ము” అంది తారమ్మ…. ఆరోజు ప్రవీణ్‌ దృతికి హాస్పిటల్లో స్టెరాయిడ్‌ ఇప్పించి, ఆమెను తారమ్మకు అప్పజెప్పి వెళ్లినప్పటి నుండి తారమ్మకు ఇదే ముఖ్యమైన పనయిపోయింది.
తారమ్మ రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని తన కళ్లకి అద్దుకుంది దృతి.
తారమ్మ దృతికి ప్రతిరోజు పాలు, ఆకుకూరలు, పళ్లు, గుడ్లు, మాంసం, చేపలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రైఫ్స్రూట్స్ క్రమం తప్పకుండా తినిపిస్తుంది. మూడు పూటల భోజనం, మరో మూడుపూటలు మసాలా లేని స్నాక్స్‌ తినిపిస్తుంది. చాలా జాగ్రత్తగా చూస్తుంది. డాక్టర్‌ దగ్గరకి వెళ్లినప్పుడు కూడా తనేం పెడుతుందో డాక్టర్‌కి చెబుతుంది. ఇంకా ఏం పెట్టాలో అడిగి తెలుసుకుంటుంది.
ఆహారం విషయంలో తారమ్మ అలా వుంటే సౌమ్య ఇంట్లో పనంతా అయ్యాక సాయంత్రం వేళల్లో దృతిని వెంటబెట్టుకొని ఇంటికి దగ్గర్లో వున్న పచ్చి కొండల దగ్గరకి, చెరువు దగ్గరకి వెళ్తుంది. అలా వెళ్లటం వల్ల దృతికి మానసిక ప్రశాంతత వచ్చింది.
ఎప్పుడైనా కడుపు నిండినట్లే మనసు కూడా నిండాలి. లేకుంటే ఏదో లేనట్లు వెలితిగా వుంటుంది. ఆ వెలితిని కూడా ప్రేమాభిమానాలు లేని వ్యక్తుల మధ్యలో వుండి అనుభవిస్తేనే స్పష్టంగా తెలుస్తుంది. నరకాన్ని తలపింపజేసే వాతావరణం ఎలా వుంటుందని ఎవరైనా అడిగితే ‘నేను చెబుతాను’ అంటూ ముందుకొచ్చి చెప్పే అనుభవాలు వున్నాయి దృతికి… వస్తువు పగిలితే శబ్దం వస్తుంది. మనసు పగిలితే శబ్దం రాదు. ఆమె నిశ్శబ్దంగా గడిపిన క్షణాలే ఎక్కువ. ఇప్పుడు అలాటి క్షణాలు లేవు. ఆ వెలితి లేదు.
అన్నం తిన్నాక పండు ఒలిచి పెడుతూ దృతి దగ్గరే కూర్చుని వుంది తారమ్మ. సౌమ్య వాళ్లకి కొద్ది దూరంలో నిలబడి తన చీరలతో పాటు అత్తగారివి, దృతివి మడతలేసి పెడుతోంది.
ప్రవీణ్‌ స్నేహితులు వచ్చి మిర్చి బస్తాలను మార్కెట్ కి తీసికెళ్లాలని పక్కగదిలో వున్న బస్తాలను లారీకెక్కిస్తున్నారు. శేషేంద్ర లారీ దగ్గర నిలబడి వాళ్లతో మాట్లాడటం తారమ్మకు విన్పిస్తోంది.
దృతి వచ్చాక శేషేంద్ర చెయ్యాల్సిన పనులన్నీ ప్రవీణ్‌ స్నేహితులు క్షణంలో చేసి వెళ్తున్నారు. సిటీనుండి ఏది కావాలన్నా పంపుతున్నారు. విత్తనాలకి, మందు బస్తాలకి ఈసారి శేషేంద్ర సిటీకి వెళ్లలేదు. ఒక్కసారే లారీ కట్టెలు తెచ్చి ఇంటిపక్కన వున్న ఖాళీ స్థలంలో గుట్టలా పేర్చి వంటకి ఇబ్బంది లేకుండా చేశారు. ఊరిలో వారు అదంతా చూసి అవాక్కవుతున్నారు.
”నువ్వొచ్చాక మా శేషయ్య ముసలి ప్రాణం హాయిగా వుంది తల్లీ! మాలాటి వాళ్లకి ఈ వయసులో పాతికేళ్ల కొడుకైనా దగ్గర వుండాలి. లేదంటే కొంత సంపద అయినా దగ్గర వుండాలి. మాకు మా కొడుకు నరేంద్ర దగ్గర లేని లోటును ప్రవీణ్‌ భర్తీ చేస్తున్నాడు” అంది తారమ్మ.
దృతి వెంటనే ”అన్నయ్యకు ఇలాటి పనులు అలవాటే ఆంటీ! ఇప్పుడే కాదు, ఎప్పటికీ అన్నయ్య మీకు సపోర్ట్‌గానే వుంటాడు. ఆయన తత్వం నాకు బాగా తెలుసు” అంది.
”సంతోషం తల్లీ!” అంది తారమ్మ. ఆమెకు ఈ మధ్యన శేషేంద్రను చూస్తుంటే భయంగా వుంది. రోజురోజుకి బాగా సన్నబడిపోతున్నాడు.
”మీరు నన్నింత ప్రేమగా చూస్తున్నారని అన్నయ్య వచ్చినప్పుడు చాలా సంతోషపడుతున్నాడు ఆంటీ! ఒక్కరోజు కూడా మా అత్తగారికి నన్నిలా చూడటం వచ్చేది కాదు” అంది.
తారమ్మ నవ్వి ”గర్భంతో వున్నవాళ్లని ఇలా చూడాలి. ఇలాగే చూడాలి అన్నది పుస్తకాలు నేర్పవు దృతీ రావడానికి… మనం బాగుండాలి, మనవాళ్లు బాగుండాలి. మన వంశం బాగుండాలి అన్న భావన తపన వుంటే చాలు”
”ఏమో ఆంటీ నాకు తెలిసి మా మామగారు మాత్రం నన్ను మీరింత బాగా చూస్తారని అనుకుని వుండరు. అలా అనుకొని నన్నిక్కడ వదిలి వుండరు. నాకేదో షెల్టర్‌ కావాలన్న హడావుడిలో ఇది తప్ప మరో దారి లేదన్నట్లు వదిలి వెళ్లారు. కానీ మీరు మాత్రం నాలో ఏదో అద్భుతం వున్నట్లు అపురూపంగా చూసుకుంటున్నారు. ఇదే నాకు ఆశ్చర్యంగా వుంది”
”ఇందులో అంత ఆశ్చర్యపోవలసిందేమీ లేదు దృతీ! నిన్ను కాని, మా సౌమ్యను కాని ఇంకా సైనికుల భార్యల్ని ఎవరినైనా సరే మాలాటి అత్తలు, మామలు, బావలు, తోడికోడళ్లు, ఆడపడుచులు ప్రేమగా చూడాలి. మీరు మీ భర్తల్ని ఏదో సంపాయిస్తార్లే అన్నట్లు అంతదూరం పంపలేదు. యుద్ధం వచ్చినప్పుడు వాళ్లు తప్పకుండా యుద్ధంలోకి వెళ్లాలన్నది తెలియక పంపలేదు. అక్కడికెళ్లాక ఆ శిక్షణలో వాళ్లు దేశం బాగుండడం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టానికి సిద్ధంగా వుంటారని మీకు తెలుసు. వాళ్లక్కడ వుంటేనే మన దేశం మీదకు శత్రువులు రారు. దీనివల్ల మనందరం ఇక్కడ బాగుంటాయి. ఇదంతా మీలాటి భార్యలు, మాలాటి అమ్మలు మగవాళ్లను సైన్యంలోకి పంపటం వల్లనే జరుగుతుంది. మగవాళ్లను సైన్యంలోకి పంపి, ఇక్కడ అత్తలు కోడళ్లని, కోడళ్లు అత్తలని హింసించుకుంటుంటే వాళ్లక్కడ చేసే యుద్ధానికి అర్థం వుంటుందా? ఏ యుద్ధం జరిగినా ప్రశాంతత కోసమే జరుగుతుంది. అత్తాకోడళ్ల యుద్ధం వల్ల వున్న ప్రశాంతత పోతుంది. ఇది మీ అత్తలాటి వాళ్లకే కాదు చాలామంది సైనికుల అమ్మలకి తెలియదు. నాకు ఏమాత్రం అవకాశం దొరికినా అలాటి అమ్మలందర్ని ఓచోట చేర్చి ఇది పద్ధతి కాదు అని చెప్పాలని వుంటుంది. చెబుతాను కూడా…” అంది తారమ్మ.
”మిమ్మల్ని చూస్తుంటే మీరు అనుకున్నది తప్పకుండా చేసేలా వున్నారు ఆంటీ” అంది దృతి.
”చేస్తాను దృతీ! అంకిరెడ్డికి ఏం తక్కువైందని నిన్ను ఇక్కడ వదిలాడు. మాధవీలతకు ఏం బరువయ్యావని కడుపులో వున్న నీ బిడ్డను బరువు పెరగకుండా చేసింది? తెలిసి చేసినా తెలియక చేసినా ఇవన్నీ వాళ్లు చేసిన తప్పులే! కావాలని చెయ్యకపోయినా కావలసి చేస్తున్నా తప్పులు, తప్పులే!” అంది.
దృతి మాట్లాడలేదు. సౌమ్య పక్కనే వుండి వింటోంది.
…మిర్చిలోడు ఎత్తడం పూర్తికాగానే ఇంటిముందువున్న లారీ సిటీ వైపుకి పరుగు తీసింది.
అప్పుడే బయట జీపు దిగిన ప్రవీణ్‌ లోపలకొచ్చాడు. లోపలకి రాగానే తారమ్మ పక్కన కూర్చుని ”శుభవార్త ఆంటీ!” అన్నాడు.
ఆమె ముఖం నిండా నవ్వి ”ఏంటి నాయనా ఆ వార్త?” అని అడిగింది.
”ఉదయం మనం హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు తీసిన దృతి స్కాన్‌ రిపోర్ట్స్‌ రావడం ఆలస్యమవుతుందని మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలి వెళ్లాను కదా! ఆ రిపోర్ట్స్‌ ఇప్పుడు వచ్చాయి. అవి తీసుకొని వెళ్లి డాక్టర్‌ని కలిశాను. ఇక స్టెరాయిడ్‌ వాడనవసరం లేదట. లోపల బేబీ బరువు కూడా బాగానే పెరిగిందట… అది చూసి డాక్టర్‌ ఏమన్నదో తెలుసా ఆంటీ!” అన్నాడు సంతోషంగా.
”ఏమన్నది?” అంతే సంతోషంగా అడిగింది తారమ్మ.
”ఏడోనెల వచ్చాక లోపల శిశువు బరువు పెరగడంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ వుండదట. అలాటిది ‘తారమ్మ నీ చెల్లెలికి ఏం పెట్టిందయ్యా బరువు బాగానే పెరిగింది. అసలు ఇంత ప్రొగ్రెస్‌ వుంటుందని నేను వూహించలేదు. ఇక మనం సిజేరియన్‌ చేసి బిడ్డను ముందుగానే బయటకు తియ్యాల్సిన అవసరం లేదు’ అంటూ డెలివరీ డేట్ కూడా చెప్పింది” అన్నాడు.
”డెలివరీ డేట్ చెప్పిందా? ఎప్పుడు?” అంది తారమ్మ సంబరపడుతూ.
ఈలోపల సౌమ్య ప్రవీణ్‌ చేతిలో వున్న ప్రూట్స్ , డ్రైప్రూట్స్ తీసికెళ్లి లోపల పెట్టి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. సౌమ్య ఇచ్చిన మంచినీళ్లు ఒక గుక్క తాగి డాక్టర్‌ ఇచ్చిన డెలివరీ డేట్ చెప్పాడు. అది వినగానే తారమ్మ ఆనందంతో ఉక్కిరిబిక్కిరై,
”ముందు నువ్వు ఈ విషయం సతీష్‌చంద్రకి ఫోన్‌ చేసి చెప్పు నాయనా!” అంది.
”అలాగే ఆంటీ!” అంటూ ప్రవీణ్‌ తన ప్యాంట్ జేబులో వున్న మొబైల్‌ని బయటికి తీసి సతీష్‌చంద్రకి కాల్‌ చేసి చెప్పాడు.
అవతల వైపున ఆ వార్త విన్న సతీష్‌చంద్ర ”ఓ.కే ప్రవీణ్‌! నాకు అప్పుడు లీవ్‌ ఇస్తారు. ఆ డేట్ వరకు అక్కడ వుంటాను. ఒకసారి ఆంటీకి ఫోన్‌ ఇవ్వు” అన్నాడు.
ప్రవీణ్‌ వెంటనే తారమ్మ చేతికి మొబైల్‌ ఇచ్చి ”మ్లాడండి ఆంటీ! బావగారు లైన్లో వున్నారు” అన్నాడు.
తారమ్మ సతీష్‌చంద్రతో మాట్లాడుతూ కూర్చుంది.
సౌమ్య, దృతి, ప్రవీణ్‌ కొంచెం పక్కకెళ్లి కూర్చున్నారు. ప్రవీణ్‌ సౌమ్యను కూడా దృతిని చూసినట్లే ప్రేమగా చూస్తాడు. సౌమ్య కూడా అతన్ని ‘అన్నయ్యా’ అంటూ దృతి పిలిచినట్లే ఆత్మీయంగా పిలుస్తుంది.
*****
ఈమధ్యన ఆనంద్‌కి, మోక్షకి ప్రతిరోజూ ఘర్షణ జరుగుతూనే వుంది.
ఇవాళ ఏం గొడవా వద్దు. ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకుందాం అని ఆఫీసులో అనుకుంటూనే వచ్చింది మోక్ష. తీరా ఇంటికొచ్చి భోంచేసి బెడ్‌రూంలోకి వెళ్లాక ఆనంద్‌ని చూడగానే తారాజువ్వకు నిప్పు అంటించినట్లు ”మీరు అసలు నాకు తెలియకుండా నా సంతకం పెట్టి లోనెందుకు తీసుకున్నారు? మా ఊరెళ్లి మా అన్నయ్యతో గొడవెందుకు పెట్టుకున్నారు? కనీసం పూర్వి ముఖం చూసైనా వాళ్లతో గొడవ పెట్టుకోకుండా వుండాల్సింది. అసలేం చేస్తున్నారండీ మీరు? ఏం చేయబోతున్నారు? అదైనా చెప్పండి!” అంది.
”ఏం చేయమంటావు?”
”అది నేను చెప్పాలా? మీకు తెలియదా భార్యను, బిడ్డను పోషించాలని… ఇప్పుడెలా పోషించాలను కుంటున్నారు?”
”ఇప్పుడు నువ్వేమైనా తినకుండా చస్తున్నావానే? వేరే పెట్టి పోషించటానికి… రోజూ తింటూనే వున్నావుగా…”
”మీకు తెలుసా రోజూ నా లంచ్‌ బాక్స్‌లో నేనేం తింటున్నానో… మీ అమ్మ నాకేమైనా అమ్మనా అన్నంలో రసం పోసుకున్న వెంటనే ఆమ్లెట్ వేసి పెట్టటానికి… చూడండి! నేను ఈ ఇంట్లో వుండలేను. మీరేం చేస్తారో నాకు తెలియదు. నన్ను మాత్రం వేరే ఇంట్లో వుంచండి! అయినా ఇదేం పెద్ద తీర్చలేని కోరిక కాదే! అంతగా ఆలోచించానికి” అంది.
”నేనేం ఆలోచిస్తున్నాను. నా దగ్గర ఏముంది. అంతా ఆ కమల్‌నాథ్‌కి ఇచ్చాను. అతను తిరిగి ఇచ్చినప్పుడు నువ్వన్నట్లే చేద్దాం!”
”ఎప్పుడిస్తాడు?”
”ఇప్పుడే ఎలా ఇస్తాడు. టైం పడుతుంది”
”ఎంత టైం?”
”నాకేమైనా తెలుసా!”
”తెలియకుండా తెలుసుకోకుండా ఎలా ఇచ్చారు? అయినా డబ్బుల దగ్గర బయటవాళ్లను నమ్మొచ్చా? ఇన్నిరోజులుగా ఉద్యోగం చేస్తున్నారు. ఆ మాత్రం లోకజ్ఞానం లేదా?”
”ఏదో రూపాయికి రూపాయి పెంచుదామనుకున్నాను. అవి పెరిగే లోపలే ప్రశ్నలతో చంపుతున్నావు కదే!”
”అందరూ మీ అంత అమాయకులే వుంటారనుకున్నారా రూపాయిలకు రూపాయిలు పెంచి ఇవ్వటానికి…”
”అంటే ఆ డబ్బులు పోతాయేమోననా నీ డౌట్! నోనో అలా ఏం జరగదు. కావాలంటే రేపే కమల్‌నాథ్‌కి ఫోన్‌ చేసి మాట్లాడతాను. నీతో కూడా మాట్లాడిపిస్తాను. పడుకో”
”నేనెందుకు మాట్లాడటం… మీరు, మీ నాన్నగారు మాట్లాడారుగా. నా సంతకం మీచేత చేయించింది మీ నాన్నే కదూ?”
”అబ్బా! ఇక దాన్ని వదలవా?”
”ఆ ఒక్క సంతకమే కదండీ నన్ను అనాధను, దిక్కులేనిదాన్ని చేసింది. అలాంటి సంతకం విలువ మీకు తెలియకపోవచ్చు. నాకు బాగా తెలుసు. ఒక మనిషిని ఉన్నపళంగా అధఃపాతాళానికి తొక్కినా, పైకి తెచ్చినా ఆ ఒక్క దొంగ సంతకానికే సాధ్యం!”
”అబ్బా! ఇంకెప్పుడూ అలా పెట్టనులేవే పడుకో! తప్పయిపోయిందంటున్నానుగా!” అన్నాడు.
”నేను మీకు చిన్నపిల్లలా కన్పిస్తున్నానా?”
”ఎవరన్నారలా?” అన్నాడు.
ఆమె ఏది మాట్లాడినా అతను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడని అర్థమైంది మోక్షకి. ఇక ఏం మాట్లాడినా వృధా అనుకుంది. అతనికో నమస్కారం పెట్టింది. ఆమె కంట్లో నీళ్లు కదులుతున్నాయి. ముక్కు తుడుచుకుంటూ”ఎలాగైతేనేం చాలా కష్టపడ్డారులెండి! నా కష్టాన్ని నాకు, నా బిడ్డకు దక్కకుండా చేశారు. ఆ పుణ్యం వూరికే పోతుందా!”
”శాపనార్థాలు పెట్టకే! నేను నీ మొగుడిని”
”మొగుడనేవాడు ఎలా వుండాలి. ప్రపంచాన్ని ముంచైనా భార్యను పోషించాలి. కానీ మీరు నన్ను ముంచి నా డబ్బులు తీసికెళ్లి కమల్‌నాథ్‌ అకౌంట్లో వేశారు. ఇదేమైనా బాగుందా?”
”నీకు దణ్ణం పెడతా పడుకోవే! ఆ డబ్బులు ఎక్కడికీ పోవు” అన్నాడు.
”పోవని నేను కూడా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. నన్ను నేను పోషించుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఉద్యోగం కూడా చేస్తున్నాను. నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అడిగి తెచ్చి నా అకౌంట్లో వేయగలరా?”
బిత్తరపోయాడు ఆనంద్‌…. తల గిర్రున తిరిగినట్లైంది.
”తప్పు చేశానా?” అనుకున్నాడు. ఒక్కక్షణం అతనిలో అంతర్మధనం మొదలై మళ్లీ ఆగింది. ‘ఆ… ఇదేం పెద్ద తప్పు కాదులే. డబ్బులు డబులై వస్తాయిగా’ అనుకున్నాడు. మోక్ష వైపు ధైర్యంగా తిరిగాడు.
”నీ అకౌంట్లో డబ్బులేసి నిన్ను ఖర్చు పెట్టుకోమటనానికి వాళ్లు నీకెవరని… తండ్రా, కొడుకా, భర్తా… ఓ పేద్ద చెబుతోంది మాటలు. నువ్వేమైనా కాంట్రాక్ట్‌ బిజినెస్‌ చేస్తున్నావా లేక రియల్‌ఎస్టేట్ నడుపుతున్నావా? నీకు డబ్బులిస్తే ఒక్క రూపాయికి రెండు రూపాయలు తిరిగి వస్తాయని ఆశపడి ఇవ్వటానికి… ఎందుకిస్తారే నీకు డబ్బులు. ఎవరిస్తారని మాట్లాడుతున్నావ్‌! వినే ఓపిక లేదిక. నోరు మూసుకుని పడుకో!” అన్నాడు.
”కమల్‌నాథ్‌ విషయంలో మీరందరూ చేసింది అదే! కానీ పైకి అలా అనిపించదు” అంటూ మోక్ష పడుకుంది. నిద్ర మాత్రం రాలేదు. ఇన్ని రోజులు పూర్విని కూడా దూరంగా వుంచి కెరీర్‌ కోసం కృషి చేసింది. ఇంతా చేసి ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చినట్లైంది. మొదటికి రావడం కాదు. అదనంగా లోన్‌ మిగిలింది. ఇదంతా ఆనంద్‌ వల్లనే. ఇలాటి భర్తలు కూడా వుంటారా?
*****

దృతికి డెలివరీ డేట్ దగ్గర పడుతుందనగా సతీష్‌చంద్ర అస్సాం నుండి వచ్చాడు. అతను నేరుగా తారమ్మ వాళ్ల ఊరెళ్లకుండా తన ఊరే వెళ్లాడు.
ఇంట్లో మనుషులెక్కడో లోపల వున్నట్లు ఇంటిముందు చాలా నిశ్శబ్దంగా వుంది. ఒకప్పుడు వున్నంత శుభ్రంగా కూడా లేదు. గేటు తీసుకొని లోపలకి వెళ్తున్నప్పుడు కూడా కారువైపు చూస్తే ఆ కారు నిండా వేలితో గీతలు గీస్తే స్పష్టంగా కన్పించేంత దుమ్ము వుంది. నీట్ గా పెట్టుకోవచ్చు కదా అనుకుంటూ ఎంట్రన్స్‌ డోర్‌ తీసుకొని హాల్లోకి వెళ్లాడు సతీష్‌చంద్ర.
అక్కడ సోఫాలో కూర్చుని వుంది మాధవీలత.
”అమ్మా!” అని పిలిచాడు సతీష్‌చంద్ర.
ఆమె సతీష్‌చంద్రను చూసింది. చూడగానే పైకి సంతోషపడినట్లు అతనికి అన్పించలేదు.
”ఇదేనా రావడం?” అంది.
”అవునమ్మా!” అన్నాడు.
”నీకు లీవ్‌లు ఇవ్వరేమో! ఉద్యోగం మానేసేమైనా వచ్చావా?” అంది.
సతీష్‌చంద్ర తల్లికి ఎదురుగా కూర్చున్నాడు.
”అమ్మా! బాగున్నావా?” అన్నాడు.
”నా బాగు సరే! నీ సంగతి చెప్పు?” అంది.
”నాకో నెల రోజులు క్యాజువల్‌ లీవులున్నాయి. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోకుండా దృతి డెలివరీ కోసం దాచుకున్నాను. ఇప్పుడు ఆ లీవ్‌ల మీదనే వచ్చానమ్మా!”
”బాగుంది. అయితే ఉద్యోగం మానలేదన్నమాట…” వెటకారంగా అంది. ఆమెకెందుకో సతీష్‌చంద్ర అంటే చిన్నప్పటి నుండి అంతే! ఇప్పుడు దృతి మీద కోపం అతనిమీద చూపిస్తోంది.
”ఉద్యోగం ఎందుకమ్మా మానడం? అక్కడ మా సైనికులకు ఏం తక్కువైందని…?”
”తక్కువేం లేదు. పేద్ద సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నావుగా. కాలనీలో అందరు అదే అనుకుంటున్నారు. అసలు ఆనంద్‌కి వున్న మర్యాద, విలువ నీకు వున్నాయిరా! ఎప్పుడు చూసినా చెత్త స్నేహితులతో తిరిగి నా పరువు తీసేవాడివి. వద్దన్నా వినేవాడివి కాదు. ఇప్పుడేదో వున్నావంటే వున్నావన్నట్లు మేం చెప్పుకుంటున్నాం గాని… నువ్వెంత, నీ ఉద్యోగం ఎంత? ఆఫ్‌ట్రాల్‌ ఒక సైనికుడివి… అంతేగా! అంతమాత్రానికే అక్కడ మాకేం తక్కువని గొప్పలు చెప్పుకుంటావెందుకు?”
”అది కాదమ్మా నేను అనేది. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదు”
”ఏముందిలే అర్థం చేసుకోటానికి…”
”నువ్వలా ఏముందిలే అని అనకమ్మా! అక్కడ మాకు అన్నీ వున్నాయి”
”ఏమున్నాయిరా అన్నీ…?”
”మేము అక్కడికి వెళ్లిన క్షణం నుండి మాకు అన్నీ ఫ్రీగానే లభిస్తాయి. తిండి, బట్టలు, వసతి, మందులు, జీవితభీమా, రవాణా సదుపాయం, కుటుంబం వుండానికి ఇల్లు, సంవత్సరానికి మూడు నెలలు సెలవులు. ఇలా అన్నీ ఉచితంగానే ఇస్తారు. అందుకే మా సైనికులు తమకొచ్చే జీతం మొత్తం ఇంటికే పంపుకుంటారు. ఇంతకన్నా ఏం కావాలి ఎవరికైనా?” అన్నాడు.
ఆమె ముఖంలో సంతోషం కన్పించలేదు.
”నీకు మొదటి నుండి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ మీద మమకారం ఎక్కువగా వున్నందువల్ల మా సైనికుల విలువ తెలియడం లేదు. కాని ఒక్కసారి మా సైనిక దళాలు ఎలాటి ధైర్యసాహసాలతో కూడిన పనులు, త్యాగాలు చేస్తారో తెలిస్తే నువ్విలా అనవు. గర్వపడతావు”
”ఎవరిక్కావాలి త్యాగాలు? చెప్పుకోటానికి ఏమీ కన్పించనప్పుడు త్యాగాలను మెడలో వేసుకొని తిరగ్గలవా?”
”ఎవరూ ఏదీ మెడలో వేసుకొని తిరగరమ్మా! తృప్తిగా బ్రతికితే చాలనుకుంటారు… ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తనకొచ్చే హైరేంజ్‌ శాలరీతో ఒక మంచి కారు, ఇల్లు కొనుక్కొని తృప్తిపడతాడు. నాలాంటి సైనికుడు దేశం మీదకి శత్రువుని రానివ్వకుండా దేశాన్ని కాపాడి తృప్తిపడతాడు. తృప్తే పరమావధి అయినప్పుడు ఎవరు ఏ రంగంలో వున్నా దానికి న్యాయం చేస్తే చాలు కదా! ఇది కాదు అది కావాలి. అది ఇది కావాలి అనుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు” అన్నాడు.
ఆ మాటలకు ఆమె ఏమాత్రం తృప్తిపడలేదు.
”నాకు క్లాస్‌ తీసుకుంటున్నావా?” అంది.
అతనిక ఆ విషయాన్ని వదిలేసి అటుఇటు చూస్తూ ”అమ్మా! నాన్న లేరా?” అన్నాడు.
”లేడు. అన్నయ్యతో కలిసి ఎటో వెళ్లినట్లుంది”
”కారు తీసికెళ్లలేదా?”
”లేదు. దానికేదో రిపేరు వచ్చినట్లుంది! నాన్న అన్నయ్య పని మీద ఈ మధ్య బిజీగా ఉన్నాడు” అంది.
అంతలో సతీష్‌చంద్ర మొబైల్‌ రింగయింది. నెంబర్‌ చూడగానే వెంటనే లిఫ్ట్‌ చేసి ”ఇప్పుడే వచ్చాను ఆంటీ! అమ్మ దగ్గర వున్నాను. అటే వస్తున్నాను” అన్నాడు.
”త్వరగా రా సతీష్‌! దృతికి నొప్పులొచ్చాయి. హాస్పిటల్‌కి తీసికెళ్తున్నాము. ప్రవీణ్‌ కూడా ఇప్పుడే వచ్చాడు” అంటూ హడావుడిగా కాల్‌ కట్ చేసింది తారమ్మ.
సతీష్‌ లేచి నిలబడి ”అమ్మా! నేను వెళ్తున్నాను. దృతిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారట. నాన్న, అన్నయ్య వచ్చాక మీరంతా హాస్పిటల్‌కి రండి” అంటూ వెళ్లిపోయాడు.
******

సతీష్‌చంద్ర హాస్పిటల్‌కి వెళ్లిన గంటకే దృతికి మగపిల్లవాడు పుట్టాడు.
”ఈ రోజుల్లో ఆపరేషన్‌ లేకుండా కాన్పులు జరగడం అరుదు. నువ్వు అదృష్టవంతుడివి సతీష్‌చంద్రా! దృతికి నార్మల్‌ డెలివరీ అయింది. బాబు బాగున్నాడు” అంటూ ఒక్కొక్కరినే తీసికెళ్లి బాబును, దృతిని చూపించింది తారమ్మ. ఆమె హడావుడి, సంబరం చూస్తుంటే ముచ్చటేసింది సతీష్‌చంద్రకి.
సతీష్‌చంద్ర హాస్పిటల్లో వున్నాడన్న మాటేకాని మాటిమాటికి అతనికి తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు. ముఖ్యంగా బాబు పుట్టాక. వాళ్లంతా వచ్చి బాబును చూడాలని వుంది. చూసి ఆనందపడుతుంటే ఆ ఆనందాన్ని చూడాలని వుంది. అందుకే అతను జర్నీలో వున్నప్పుడే తండ్రికి కాల్‌ చేశాడు. కాల్‌ లిఫ్ట్‌ చేసి
”నేను కొంచెం అర్జంట్ పనిలో వున్నాను సతీష్‌! నీకు మళ్లీ కాల్‌ చేస్తాను” అంటూ సతీష్‌చంద్ర చెప్పబోయేది వినకుండానే కాల్‌ కట్ చేశాడు. ఆయన తిరిగి కాల్‌ చెయ్యలేదు. మరచిపోయి వుంటాడనుకుని మళ్లీ కాల్‌ చేశాడు. అప్పుడు కూడా అంకిరెడ్డి అలాగే మాట్లాడాడు.
ఇప్పుడు వెళ్లి కన్పించి, బాబు పుట్టినట్లు చెప్పి, వాళ్లను హాస్పిటల్‌కి తీసుకొద్దామని ఒక్కడే బయలుదేరి ఇంటికెళ్లాడు సతీష్‌చంద్ర.
మాధవీలత దగ్గరకి వెళ్లి ”నీకు మనవడు పుట్టాడమ్మా! తల్లీ, బిడ్డా హాస్పిటల్లోనే వున్నారు. నిన్ను తీసికెళ్లాలని వచ్చాను. రామ్మా! వెళ్దాం. బాబును చూద్దువు గాని” అన్నాడు సంతోషపడుతూ.
అది వినగానే ”కీరమ్మా!” అంటూ కేకేసింది మాధవీలత.
కీరమ్మ వెంటనే వచ్చి అక్కడ వున్న సతీష్‌చంద్రను చూసి ”బాబుగారు! మీరా! బాగున్నారా?” అంటూ అభిమానంగా పలకరించి వినయంగా నిలబడింది.
ఇప్పుడంత వినయం అవసరమానే. ఓవర్‌ యాక్షన్‌ కాకపోతే అన్నట్లు కీరమ్మవైపు చూసి ”రాత్రేగా నీ చెల్లెలుకు కొడుకు పుట్టాడు. ఎలా వున్నాడు?” అడిగింది మాధవీలత.
”బాగున్నాడమ్మా! ఇప్పుడు అక్కడ నుండే వస్తున్నాను”
”సరే! ఇక నువ్వు వెళ్లు” అంది మాధవీలత.
కీరమ్మ వెళ్లగానే అక్కడ వున్న సతీష్‌చంద్రను చూసి ”అలా పలకరించి తెలుసుకోవటమే నాకు హాయిగా వుంటుంది సతీష్‌! వెళ్లి చూడటం ఇష్టం వుండదు” అంది.
సతీష్‌చంద్ర గాయపడ్డట్లు చూసి ”పనిమనిషి చెల్లెలు కొడుకు నా కొడుకు ఒకటేనా అమ్మా!” అన్నాడు.
ఆమె మాట్లాడలేదు.
”ఇంత మెటీరియలిస్ట్‌గా ఎలా వుండగలుగుతున్నావమ్మా?”
”నాకు మాత్రం తెలుసా సతీష్‌! నేను కలలు కన్న విధంగా నా జీవితం లేక బాధపడుతూ కూర్చుంటే లేని రోగాలు వస్తాయని, బాధపడలేక నవ్వలేక ఇదిగో ఇలా గడుపుతున్నాను” అంది ముఖాన్ని పక్కకి తిప్పుకుని.
ఆమెను పరీక్షగా చూసి ”నేను వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను! నీకు ఒంట్లో బాగుండటం లేదా? కన్ను నొప్పిగా వుందా? దాన్నే ఒకచేత్తో పట్టుకుని మాట్లాడుతున్నావ్‌? అసలా కన్నుకేమైంది?” అన్నాడు.
ఆమె కలవరపడి ”నా కంటికేమైంది… ఏం కాలేదు” అంది గంభీరంగా. ఆమె గత కొద్దిరోజులుగా కంటి పక్కన రెండు మచ్చ లున్నాయని అవి కన్పించకుండా ఒక చేత్తో ఒక కంటిని మూసుకునే తిరుగుతోంది. మోక్ష కన్పించినప్పుడు నువ్విచ్చిన వెదవ సలహా వల్ల, నువ్వు చేసిన దిక్కుమాలిన ఫేస్‌ప్యాక్‌ల వల్ల నా ముఖానికి మచ్చలొచ్చాయని తిడుతూనే వుంది. అది సతీష్‌ దగ్గర దాచింది.
”నువ్వేదో దాస్తున్నట్లున్నావు. ఏమైనా ప్రాబ్లమ్‌ వుంటే చెప్పమ్మా! నిన్ను మా మిలటరీ హాస్పిటల్‌కి తీసికెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అలాంటి ఫెసిలిటీ కూడా వుంటుంది మాకు” అన్నాడు.
”మీకు లేని ఫెసిలిటీస్‌ లేనట్లున్నాయిగా” అంది చులనకనగా చూస్తూ.
సతీష్‌ అది గమనించి ”అమ్మా! నాన్నగారు లేరా? ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చెయ్యటం లేదు” అన్నాడు.
”నీకంటే పనీపాటా లేక ఫోన్లు చేసుకుంటూ కూర్చుంటావ్‌! నాన్నకి అన్నయ్యకి అంత తీరిక ఎక్కడిది. వాళ్లేదో ముఖ్యమైన వ్యవహారం గురించి మాట్లాడుకుంటూ లోపల వున్నారు. వెళ్తావా? ఎందుకులే కూర్చో. నువ్వెళ్లి వాళ్లనెందుకు కదిలిస్తావు. పిల్లాడు పుట్టాడని చెప్పానికేగా. వాళ్లు బయటకొచ్చాక చెప్పొచ్చులే. తొందరేముంది” అంది.
అమె అలా అంటున్నప్పుడే అంకిరెడ్డి, ఆనంద్‌ గదిలోంచి బయటకొచ్చారు. అంకిరెడ్డి సతీష్‌చంద్రను చూసి ”సతీష్‌! నేను, అన్నయ్య వేరే పనిమీద బయటికి వెళ్తున్నాం. నీతో తర్వాత మాట్లాడతాను” అంటూ ఆగకుండా వెళ్లిపోయాడు. ఆయన వెంట ఆనంద్‌ వెళ్లాడు.
సతీష్‌చంద్ర ఆశ్చర్యపోయి
”ఎక్కడికి వెళ్తున్నారమ్మా వాళ్లు? ఎందుకంత టెన్షన్‌ టెన్షన్‌గా వెళ్తున్నారు. కనీసం నాతో ఒక్క మాటయినా మాట్లాడలేదు” అన్నాడు.
”చెప్పానుగా వాళ్ల వ్యవహారాలు పెద్దవని. వాళ్లను చూస్తూ కూడా అడుగుతావేం! కన్పించటం లేదా ఎంత హడావుడిగా వెళ్లారో! లక్ష్యాలు పెద్దవైనప్పుడు టెన్షన్‌ వుంటుంది. వాళ్లు కూడా ఏ టెన్షన్‌ లేకుండా నీలాగ వుంటే ఈ కాలనీలో తలెత్తుకుని తిరగనవసరం లేదు” అంది.
సతీష్‌చంద్ర వెంటనే లేచి ”వెళ్తున్నానమ్మా!” అంటూ నేరుగా హాస్పిటల్‌కి వెళ్లాడు.
రాత్రికి మోక్ష ఆఫీసు నుండి రాగానే మాధవీలతకు నచ్చజెప్పి కారులో ఎక్కించుకొని అంకిరెడ్డి ఆనంద్‌ హాస్పిటల్‌కి వెళ్లారు. దృతిని, బాబుని చూసి వచ్చారు.
*****

వారం రోజులు గడిచాక రాత్రి పదిగంటలయినా మోక్ష ఆఫీసు నుండి ఇంటికి రాలేదు. అంతవరకు మామూలుగానే వున్న ఆనంద్‌ మోక్షకి ఫోన్‌ చేశాడు. ఆమె లిఫ్ట్‌ చెయ్యలేదు. ఆఫీసులో ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పటం లేదు. మోక్ష ఎక్కడికెళ్లింది మాకు తెలియదన్నారు.
డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఒకప్పుడు వున్న సందడి ఇప్పుడు లేదు. వెలితిగా వుంది అంకిరెడ్డికి… మాధవీలత మౌనంగా వుంది.
”కొలీగ్స్‌తో ఏదైనా టూర్‌ వేసుకుని వెళ్లిందేమో రేపొకసారి బాగా ఎంక్వయిరీ చెయ్యి ఆనంద్‌” అంటూ అంకిరెడ్డి తన గదిలోకి వెళ్లిపోయాడు.
తల్లికి, మోక్షకు ఈ మధ్యన మాటలు సరిగా లేవని ఆనంద్‌కి తెలుసు కాబట్టి తల్లి దగ్గర మోక్ష ఇంటికి రాని విషయం ఎత్తకుండా అతను కూడా తన గదిలోకి వెళ్లాడు.
*****

మోక్ష ఎటూ వెళ్లలేదు. ఆఫీసు నుండి నేరుగా బస్టాండ్‌కెళ్లి బస్సెక్కి తన ఊరు వెళ్లింది. రాత్రికి భోజనాల సమయంలో అందరూ వినేలా ”నేను రేపటి నుండి ఆఫీసుకి ఇక్కడి నుండే వెళ్తానమ్మా!” అంది.
అది విని మోక్ష తల్లిదండ్రులు కాని, అన్నయ్య, వదిన కాని ఏమీ అనలేదు. ‘ఆనంద్‌, నువ్వు గొడవ పడ్డారా?’ అని అడగలేదు. ‘గొడవలేమైనా వుంటే సర్దుకుపోండి’ అని చెప్పలేదు. మోక్ష అన్నయ్య మాత్రం ‘ఉదయాన్నే మోక్షకి బాక్స్‌లో అన్నం పెట్టివ్వమ్మా! బస్‌లో వెళ్తుంది. డ్రైవర్‌ నాకు తెలిసినవాడే! రాత్రికి మోక్ష వచ్చే టైంకు బస్‌స్టాండ్‌కి నేను వెళ్లి తీసుకువస్తాను” అన్నాడు.
మోక్ష తల్లి ‘సరే!’ అంది.
ఆ రాత్రికి పూర్వి పక్కన పడుకొని హాయిగా నిద్రపోయింది మోక్ష.
తెల్లవారి స్నానం చేసి ఆఫీసుకెళ్లాలని రెడీ అవుతున్న మోక్షకు తల దువ్వుతూ ”ఎందుకొచ్చావు మోక్షా? ఆనంద్‌ కాని, మీ అత్తగారు కాని ఏమైనా అన్నారా?” అడిగింది మోక్ష తల్లి.
”వాళ్లేమీ అనలేదమ్మా! నాకే ఆ ఇంట్లో వుండాలనిపించలేదు. నువ్వు, పూర్వి గుర్తొస్తున్నారు. ఇక్కడికొచ్చాక నాన్నను, అన్నయ్యను, వదినను చూసుకున్నాక బాగుంది. అంతే!” అంది.
”ఇంకేమైనా వుంటే నాతో చెప్పు మోక్షా! మనసులో పెట్టుకోకు!”
”ఏమీ లేదమ్మా! వుంటే చెబుతాను” అంది.
”మోక్షా! నువ్వొక్కసారి అన్నావ్‌ గుర్తుందా?”
”ఏంటమ్మా అది?”
”దృతి నీ డ్రెస్‌ గురించి కామెంట్ చేసిందని…”
”ఓ అదా! అవును చేసిందట! ఆనంద్‌ చెప్పాడు”
”కానీ నాకెందుకో అది నమ్మబుద్ది కావటంలేదమ్మా! నాకు తెలిసి దృతి అలా అనే మనిషి కాదు”
”నాక్కూడా ఇప్పుడిప్పుడే నీకొచ్చిన డౌటే వస్తోందమ్మా! పాపం అనవసరంగా దృతిని బాధ పెట్టాను. అసలు ఇదంతా ఆనంద్‌ వల్లనే జరిగింది”
”అందుకే చెప్పుడు మాటల్ని వినకూడదు మోక్షా! విన్నా నమ్మకూడదు. ఇది ఎంత వరకు నిజం అన్నది కూడా గమనించుకోవాలి”
”తప్పయిపోయిందమ్మా! దృతి విషయంలో ఆనంద్‌ వల్ల నేను చాలా తప్పు చేశాను. ఆనంద్‌ కన్పిస్తే అడుగుతాను. దృతికి ఫోన్‌ చేసి సారీ చెబుతాను” అంటూ జుట్టుకు చకచక రబ్బర్‌బాండ్‌ తగిలించుకొని, పూర్వికి ముద్దు పెట్టి వదిన ఇచ్చిన లంచ్‌బాక్స్‌ను బ్యాగ్‌లో పెట్టుకుని అన్నయ్య బైక్‌మీద బస్టాండ్‌కి వెళ్లి బస్సెక్కి వెళ్లిపోయింది.
ఆమె వెళ్లేటప్పటికే ఆఫీసులో కూర్చుని వున్నాడు ఆనంద్‌.
ఆనంద్‌ని చూసి ఆశ్చర్యపోలేదు. ”ఏమిటీ ఇలా వచ్చారు?” అని అడగలేదు. నిశ్శబ్దంగా వెళ్లి తన సీట్లో కూర్చుని హ్యాండ్‌బ్యాగ్‌లో వున్న లంచ్‌బాక్స్‌ని డెస్క్‌లో పెట్టింది. హాండ్‌బ్యాగ్‌ని టేబుల్‌పై పెట్టుకొంది. లోపలకెళ్లి ఏర్‌టెల్‌ ఆఫీసువాళ్లు ఇచ్చిన డ్రస్‌కోడ్‌ వేసుకొని వచ్చి తన సీట్లో కూర్చుంది.
ఆనంద్‌లో ఒకప్పటి ఆవేశం, కోపం లేవు. అలా అని ప్రశాంతంగా కూడా లేడు. ఏదో బాధతో కూడిన మౌనం. మోక్షను పలకరించలేకపోతున్నాడు.
మోక్ష పక్కసీట్లో వుండే కొలీగ్‌ వచ్చింది. మోక్షకి ఎదురుగా కూర్చుని వున్న ఆనంద్‌ వైపు చూసి ఆమెకూడా లోపలకి వెళ్లి డ్రస్‌ మార్చుకుని వచ్చింది. రాగానే ఆనంద్‌ని పలకరించింది.
”ఏం ఆనంద్‌ గారు అలా వున్నారు? మొన్నలా లేరే!” అంది కొలీగ్‌.
”కష్టాలొచ్చాయండి! అందుకే మొన్నలా లేను!”
”కష్టాలా?”
”అవును. కమల్‌నాథ్‌ హ్యాండిచ్చాడు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఒకరోజు గోవాలో వున్నాడంటారు. ఒకరోజు మధురైలో వున్నాడంటారు. ఒకరోజు మన పక్క విలేజ్‌లో వున్నాడంటారు. ఎవరికీ కన్పించకుండా తిరుగుతున్నాడు. ఫోన్లో కూడా దొరకడం లేదు. నేను అతనికి చాలా డబ్బు ఇచ్చానండీ! దీనివల్ల నాకు, మా నాన్నగారికి మూడు రోజుల నుండి తిండిలేదు…. నిద్రలేదు”
”అతన్నెలా నమ్మారు సర్‌!”
”అతను నాకు, నా స్నేహితునికి చాలాకాలంగా పరిచయం. రోజూ ఫోన్లో మాట్లాడేవాడు మేడమ్‌! అతని భావాలు, యాటీట్యూడ్‌ నాకు నచ్చాయి. లేకుంటే అంత డబ్బు ఎలా ఇస్తాను”
”ఎంత నచ్చినా, ఎంత తెలిసినా, ఎంత స్నేహితుడైనా ఫోన్లో మాట్లాడగానే అంత డబ్బును ఇచ్చేస్తారా సర్‌! రోజూ కన్పించే భార్య పుట్టిన రోజంటేనే ఒక డ్రస్‌ కొనివ్వాలంటే అంతగా ఆలోచిస్తారే అతనెవరో నాలుగు మాటలు నమ్మకంగా మ్లాడగానే అంత డబ్బు ఎలా ఇచ్చారు?”
”ఇచ్చానండీ! ఇచ్చేవరకు నన్ను అతను ఊపిరి తీసుకోనివ్వలేదు. ‘ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి ఆనంద్‌! లాభాలు వస్తున్నప్పుడే పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు నేను తీసుకున్న కాంట్లాక్ట్‌ వర్క్‌ సామాన్యమైనది కాదు’ అంటూ ఫోన్లో అదేపనిగా వెంటబడ్డాడు. వున్న డబ్బులన్నీ ఓ చోటకి చేర్చి అతని అకౌంటుకి పంపాను. అలా చెయ్యడం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడనిపిస్తోంది ఎంత దిక్కుమాలిన పని చేశానా అని… అతనిక దొరకడేమోనని భయంగా వుంది” అన్నాడు.
”ఇదంతా మోక్షకు చెప్పకుండా చెయ్యటమే మీరు చేసిన పొరపాటు సర్‌! తనకి మీరు చెప్పి వుంటే నా సలహా తీసుకునేది. నేను ఇవ్వొద్దనే చెప్పేదాన్ని. ఎందుకంటే అతను మా వారికి చిన్ననాటి స్నేహితుడు!”
ప్రపంచం ఇంత చిన్నదా అన్నట్లు అదిరిపడి చూశాడు ఆనంద్‌. ఇంతవరకు ఆనంద్‌ కమల్‌నాథ్‌ని పొడిచొచ్చే సూర్యుడే అనుకున్నాడు. అలాగే అందరితో చెప్పాడు.
”మోక్ష నిన్న నాకు చెప్పగానే ‘అయ్యో! వీళ్లు కమల్‌నాథ్‌ చేతిలో అనవసరంగా దెబ్బతిన్నారే అనుకున్నాను. మనిషికి స్వార్థం వుండొచ్చు, మోసం వుండొచ్చు, దుర్మార్గం వుండకూడదు. కమల్‌నాథ్‌ దుర్మార్గుడు ఆనంద్‌గారు!”
”అలాగా! నాకు తెలిసి అతను చాలా మంచివాడిలా అన్పించేవాడు మేడమ్‌! రోజూ ఫోన్లో స్నేహంగా మాట్లాడటమే కాకుండా నాలో ఏ చిన్న అసంతృప్తి వున్నా మాటలతో దాన్ని తుడిచేసేవాడు. నాపట్ల చాలా శ్రద్ధగా వుండేవాడు. ఆరోగ్యానికి మంచిది ఆవునెయ్యి వాడమనేవాడు. ఆయుర్వేదం గురించి, అశ్వనీ దేవతల గురించీ చెప్పేవాడు. అతనికి తెలియని విషయం లేదు. డబ్బును ఎలా సంపాయించాలో, ఎంత నిజాయితీగా ఖర్చు పెట్టాలో చెప్పేవాడు. ఆదివారాలు ఎక్కువగా నేను అతనితోనే వుండేవాడిని…” అన్నాడు.
”అంత బాగా అడిక్ట్‌ అయ్యారన్నమాట అతని మాటలకి…” అంది కొలీగ్‌.
”అలా ఏం కాదు మేడమ్‌! అతని మాటల్లో ఒక రోల్‌మోడల్‌ కన్పించేది. ఉదయాన్నే యోగా చెయ్యమనడం, టీవీలో ప్రవచనాలు వినమనడం, ఏది పాపమో, ఏది పుణ్యమో చెప్పటం, గరుడ పురాణం చదవమనడం, భారత, రామాయణాలను ఇంట్లో పెట్టుకోమనడం, భగవద్గీతను ఒకరోజు కొరియర్లో పంపటం, ఎవరు చేస్తారు మేడమ్‌ ఇలాటివి? అతను చేశాడు… అతనికి పసిపిల్లలు, ముసలివాళ్లు, మూగజీవాలు, పకక్షులు అంటే ప్రేమ. మొక్కలంటే ప్రాణం. ఇంటిపక్కన పండించే కూరగాయల్ని దారినపోయే వాళ్లకి, గుడిలో పూజారులకి, అనాధ పిల్లలు వుండే ఆశ్రమాలకు ఉచితంగా ఇచ్చేస్తాడట… అలా ఎవరు ఇస్తారు? పావురాళ్లకు ప్రతిరోజు గింజలు పెట్టి నీళ్లు పోస్తాడట. ఇదెంత మంచిపని. అతన్ని మంచివాడు కాదని ఎలా అనుకుంటాం?” అన్నాడు.
”ఊ… ఇంకా ఏమనేవాడు?”
”పైరసీ సిడిలలో సినిమాలు చూడటం నేరమనేవాడు. దేశాన్ని దోచుకునేవాళ్లను చూస్తుంటే నా మనసెందుకో క్షోభిస్తుంది ఆనంద్‌ అనేవాడు. అన్యాయాన్ని తట్టుకోలేనట్లు విలవిల్లాడుతూ మ్లాడేవాడు. కసి, కోపం, పట్టుదల లేనివాడు పైకి రాలేడని చెప్పేవాడు. ఇవన్నీ వింటుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది మేడమ్‌?” అన్నాడు ఆనంద్‌.
”పక్కా దొంగవెదవ అన్పిస్తుంది. ఇలాటి మాటలు ఎవరు మాట్లాడినా నమ్మకూడదు. డబ్బులు అవసరమైనప్పుడే, అవతలవాళ్లను ప్లాట్ చెయ్యాలనుకున్నప్పుడే ఎక్కువ శాతం ఇలాటి నీతి కబుర్లు చెబుతుంటారట. మొన్నొక సైకాలజీ సర్వేలో తేలింది. ఎలాగూ అతన్ని నమ్మారు. డబ్బులిచ్చేశారు. ఇక దాని గురించి ఎందుకులెండి ఎంత మాట్లాడుకున్నా వేస్ట్‌!” అంది కొలీగ్‌.
మోక్ష తలవంచుకొని ఏదో పని చేసుకుంటున్నట్లు నటిస్తూ వాళ్లిద్దరి మాటల్ని వింటూ వుంది. ఆనంద్‌ కొలీగ్‌ వైపు చూడకుండా కొద్దిగా తలవంచుకొని ఆలోచిస్తున్నాడు.
”అతను లక్షలే కాదు ఆనంద్‌ గారూ! వందలు, వేలు ఇచ్చినా తీసుకుంటాడట. మళ్లీ తిరిగి ఇవ్వడట! నీలాటివాళ్లు మాకు తెలిసి వందల్లో వుంటారు. వాళ్ల బాధలు చెప్పుకోబోయినా అతను వినడట. ”మీ బాధలు నాకెందుకు చెబుతారు. వినే ఓపిక నాకెక్కడిది” అంటూ కాల్‌ కట్ చేస్తాడట… అతను మిమ్మల్నే కాదు, సొంత బావమరుదుల్నే ముప్పు తిప్పలు పెట్టాడట”
సొంత బావమరుదుల్నా!!! అదెప్పుడూ అతను తనతో చెప్పలేదే! తనుకూడా తన బావమరిదిని కట్నం డబ్బు కోసం బాగానే బాధ పెట్టాడు. తన స్టోరీ వేరు. కమల్‌నాథ్‌ స్టోరీ ఏంటో?
”ఎలా బాధపెట్టాడు మేడమ్‌?” అడిగాడు ఆనంద్‌. ఆనంద్‌కి తన డబ్బులు ఇక రావేమోనన్న బెంగతో నీరసం వస్తోంది.
”చాలా కాలం క్రితం వాళ్ల బావమరుదులతో డబ్బులిస్తాను, స్థలం కొనమన్నాడట. వాళ్లు కొని వాళ్ల పేరుతో పెట్టుకున్నారట. ఇతను కొద్దిరోజులయ్యాక డబ్బులు ఇవ్వకుండానే ‘ఆ స్థలం నాది, అన్యాయంగా మీ పేరుతో పెట్టుకున్నారు. గుడిలోకొచ్చి ప్రమాణం చెయ్యండి’ అంటూ గోలచేసి వాళ్ల వెంటపడ్డాడట… ఇదీ కమల్‌నాథ్‌ బ్యాగ్రౌండ్‌, కమల్‌నాథ్‌ క్యారెక్టర్‌!” అంది కొలీగ్‌.
”ఇదంతా నాకు తెలియదు మేడమ్‌! అతనితో అంత క్లోజ్‌గా వుండి కూడా అతని మనసులో వున్నది తెలుసుకోలేకపోయాను” ఆనంద్‌కి చెమటలు పడుతున్నాయి.
”ఎలా తెలుస్తుంది ఆనంద్‌గారు. అందుకే ఎంత తెలిసినా, ఎంత చూసినా, ఎంత స్నేహితుడైనా పరాయివాళ్లను నమ్మకూడదు. లక్షలకు లక్షలు వాళ్ల అకౌంట్లకు పంపకూడదు. డబ్బు ఇచ్చే వరకే మనం తెలివిగలవాళ్లం. ఆ తర్వాత వాళ్లు తెలివిగల వాళ్లవుతారు. నువ్వే కాదు ఈరోజుల్లో చాలామంది మీలాటి వాళ్లు తాము సంపాయించుకున్న డబ్బుల్ని తమ అకౌంట్లో కన్నా వేరేవాళ్ల అకౌంట్లలో వేసి తృప్తి పడుతుంటారు. అవి ఎప్పటికైనా పెరిగి తిరిగి తమ అకౌంట్లలో వచ్చి పడతాయనుకుంటారు. అదంతా భ్రమ… కష్టపడి సంపాయించుకుంటున్న ప్రతి పైసాను ఫ్యామిలీకి పెట్టుకోవాలి. ఆ తర్వాత అంతో ఇంతో మిగిలితే వృద్దాప్యానికి దాచుకోవాలి. అంతేకాని ఇలాటి ఆశబోతు పనులు చెయ్యకూడదు. జీవితాలు నరకప్రాయం అవుతాయి. కమల్‌నాథ్‌ లాంటివాళ్లు ఎవరితో స్నేహం చేసినా వాళ్లకి భూలోక నరకాన్ని చూపిస్తారు” అంది కొలీగ్‌.
”మీరు చెప్పేది కరక్టే మేడమ్‌! నేను మూడు రోజులుగా పడుతున్న బాధ మామూలుగా లేదు. నేను అతనికి పంపిన డబ్బులన్నీ ఒక్కో రూపాయి నా కళ్ల ముందు మెదులుతుంటే ఏడుపొస్తోంది. అయినా నేను అతన్ని వదలను మేడమ్‌! అందర్నీ వెంటేసుకుని అతను ఎక్కడున్నా వెళ్తాను” అన్నాడు.
”మీరు వెళ్లగలరు. ఆడవాళ్లు వెళ్లగలరా?”
”ఆడవాళ్లా!! ఆడవాళ్లేంటి మేడమ్‌?”
”నేనిలా అనొచ్చో లేదో తెలియదు కాని కొంతమంది అమాయకులైన ఆడవాళ్లకి కమల్‌నాథ్‌ లాంటివాళ్లు పరిచయం అయ్యాక వాళ్లకు వాళ్ల భర్తలు మామూలు పురుషుల్లాగా కమల్‌నాథ్‌ ఒక్కడే యుగపురుషుడులాగా అన్పిస్తాడట. భర్తలు చూపించే ప్రేమ సరిపోక కమల్‌నాథ్‌ చెప్పే దొంగమాటలు, దొంగ ప్రేమ తృప్తిగా అన్పిస్తాయట. అందుకే తమ భర్తల దగ్గర తామేదో నష్టపోతున్నట్లు ఏడ్చుకుంటూ అతనేదో రక్షిస్తాడని అనుకుంటూ అతను ఏమడిగినా (బంగారం, డబ్బు) ఎంత అడిగినా ఇచ్చేస్తుంటారట. మళ్లీ తిరిగి ఇమ్మని అడిగితే ‘మీకెందుకు డబ్బులు? అంతగా బ్రతకలేమనుకుంటే చెప్పండి ‘సైనైడ్‌’ పంపిస్తా. అది చాలా చిన్నగా వుంటుంది. అది తీసుకుంటే వెంటనే ప్రాణం పోతుంది. బ్రతికి ఏం సాధిస్తారు?’ అంటాడట. ఇలా అనే హక్కు అతనికి ఎవరిచ్చారండీ! ఇది దుర్మార్గం కాదా! తన వారసులకి ఆస్తులివ్వడం కోసం ఇంత అన్యాయంగా ప్రవర్తించాలా? అదేం అంటే నేను చేస్తున్న ఏ పని అయినా మోసంతో దుర్మార్గంతో కూడుకున్నదే అయితే ఆ పనిని దేవుడెందుకు చెయ్యనిస్తాడు అంటూ దేవుడి మీదకు నెట్టేస్తాడట. నాకు తెలిసి జీవితం చివర్లో కష్టపడుతూ బ్రతికే ఆడవాళ్లు కొందరికి ఎప్పుడో ఒకప్పుడు కమల్‌నాథ్‌ లాంటి వ్యక్తులతో పరిచయం వుండి వుంటుంది. లేకుంటే అన్ని కష్టాలు రావు” అంది.
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరన్నట్లు ”ఇందులో మీ ఆడవాళ్ల తప్పేమి లేదంటారా మేడమ్‌?” అన్నాడు ఆనంద్‌.
”వుంది ఆనంద్‌ గారు! ప్రతి తప్పు వెనక ఏదో కొంత ఆశ వుంటుంది. ఆశ వేరు, అత్యాశ వేరు. అత్యాశకు లొంగినవాళ్లు చావుదెబ్బలు తింటున్నా అదే ప్రపంచం అనుకుంటారు. ఇంకో ప్రపంచంలోకి వెళ్లలేరు. మా ఆడవాళ్లలో కూడా కొన్ని బలహీనతలు వున్నాయి. వాళ్లకి తమ మాటల్ని శ్రద్ధగా వినేవాళ్లు కావాలి. పంచుకునే వాళ్లు కావాలి. ఆ పంచుకునే వెలితి ఏదో ఆడవాళ్లతోనే పంచుకుంటే ఇలా మోసపోయే అవకాశం వుండదు. నేనూ, మావారు కమల్‌నాథ్‌ గురించి మ్లాడుకునే ప్రతిసారి ఇదే అనుకుంటాం” అంది.
ఆనంద్‌ పిడికిళ్లు బిగుసుకున్నాయ్‌ ”ఏది ఏమైనా కమల్‌నాథ్‌ని నేను వదలను మేడమ్‌!” అన్నాడు.
కొలీగ్‌ మాట్లాడలేదు. మోక్ష తల ఎత్తి చూడటం లేదు.
అతను మోక్షవైపు తిరిగి ”మోక్షా! నువ్వు రాత్రి ఇంటికి రాకపోతే టెన్షన్‌ పడ్డాను. ఒక్క రాత్రి నువ్వు లేకపోతేనే నీ విలువ తెలిసింది. ఇవాళ మీ ఊరు వెళ్లొద్దు. మన ఇంటికి రా!” అన్నాడు.
మోక్ష వస్తాననలేదు, రాననలేదు. సూటిగా అతన్నే చూస్తూ ”ధృతి నా డ్రెస్‌లని కామెంట్ చేసిందన్నారుగా? నిజం చెప్పండి చేసిందా?” అంది.
అతను ఉలిక్కిపడి ”అదిప్పుడెందుకు? ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మాట్లాడుకోవటం అవసరమా?”
”అవసరమే! అబద్దాలను సృష్టించి మా ఇద్దరి మధ్యన గొడవ పెట్టి మాకు మనశ్శాంతి లేకుండా చేశారు”
”అయితే ఇప్పుడేంటి? మన సమస్యను పక్కకి నెట్టి అదెందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నేనా విషయం ఎప్పుడో మరచిపోయాను. మీరైనా చెప్పండి మేడమ్‌! గతంలో జరిగిపోయిన వాటిని గెలకొద్దని…”
”గెలకను. ధృతి నన్ను కామెంట్ చేసిందా లేదా? అది చెప్పండి?”
”చెయ్యలేదు. నేనే కావాలని చెప్పాను”
ఇక ఆనంద్‌ వైపు చూడబుద్ది కాక తల పక్కకి తిప్పుకుంది మోక్ష.
”ప్లీజ్‌! మీరైనా చెప్పండి మేడమ్‌! తను లేకుంటే నేనుండలేను!”
”ఇలాంటివి నేనెలా చెప్పగలను ఆనంద్‌ గారు! ఎవరి ఇన్నర్‌ ఫీలింగ్స్‌ వాళ్ళవి… అయినా తను కూడా వింటుందిగా రావాలనిపిస్తే వస్తుంది. లేదంటే ఆలోచించుకుని మాట్లాడుకోండి” అంది.
కస్టమర్స్‌ రాగానే ఇక మాట్లాడలేదు కొలీగ్‌.
ఆనంద్‌ లేచి తన ఆఫీసు వైపు వెళ్లాడు.
*****

ఇంకా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *