April 27, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 25

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఊరకనే ఉన్న శాస్త్ర గ్రంధాలన్నీ చదవడం ఎందుకు అందులో ఉన్నదంతా బుర్రలోకి ఎక్కించుకుని బాధపడడం ఎందుకు అని వ్యంగ్యంగా బోధిస్తున్నాడు అన్నమయ్య ఈ గీతంలో. ఇక్కడ మనం ఒక సంఘటనను గుర్తుచేసుకోవ్చ్చు. ఆదిశంకరులు ఓ రోజు దారిలో నడచి వెళ్తూ ఉండగా ఒక పండితుడు “డుకృంకరణే” అంటూ సంస్కృత వ్యాకరణం వల్లె వేస్తూ కనిపించాడు. మహాత్ములకున్న సహజమైన కనికరం వల్ల శంకర భగవత్పాదులు అతడ్ని సమీపించి ఇలా అన్నారు.”భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే! సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే!” ఇదే మాటలు మనం రామాయణంలో కూడా వినవచ్చు. మారీచుడు రావణుడితో చెప్పినట్లు ’కాలం కలిసిరాకపోతే పనికొచ్చే మాటలు ఎవరైనా చెప్పినప్పుడు మనకి నచ్చదు. నచ్చినా మనం వినలేం.’ అయితే ఈ పండితుడి పూర్వ జన్మ సుకృతం వల్లో, మరింకే కారణం చేతో శంకరులు చెప్పింది విని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అక్కడే ఉన్న ఓ చదునైన బండరాయి మీద కూర్చుని శ్రీ శంకరులు ఆతనికి మంత్రం, జ్ఞానమార్గం ఉపదేశించి ముందుకి సాగిపోయాడు. కాబట్టి ఎన్ని శాస్త్రాలు చదివామనే విషయం ముఖ్యం కాదు. అరిషడ్వర్గాలను అరికట్టగలిగామా? భగవంతుని సన్నిధి చేరడానికి మనం చేశే ప్రయత్నం ఏమిటనేది ముఖ్యం అంటాడు అన్నమయ్య ఈ గీతంలో.

కీర్తన:
పల్లవి: ఊరకే వెదకనేల వున్నవి చదువనేల
చేరువనె ఉన్నదిదె చెప్పరాని ఫలము

చ.1. కోపము విడిచితేనె పాపము దానే పోవు
దీపింప సుజ్ఞానము తెరు విదివో
లోపల మనిలుడై లోకము మెచ్చు కొరకు
పైపై గడిగితేను పావనుడౌనా ॥ ఊరకే ॥

చ.2. ముందరి కోరికవోతే ముంచిన బంధాలు వీడు
కందువ నాశ మానితే కైవల్యము
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు
చిందువందు చిత్తమైతే చేరునా వైకుంఠము ॥ ఊరకే ॥

చ.3. కాంతల పొందొల్లకుంటే ఘన దు:ఖమే లేదు
అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుడు
అంతట మాటలె యాడి హరిశరణనకుంటే
దొంతినున్న భవములు తొలగునా వివేకికి॥ ఊరకే ॥
(రాగం: సామంతం; రేకు సం: 334, కీర్తన; 4-196)

విశ్లేషణ:
పల్లవి: ఊరకే వెదకనేల వున్నవి చదువనేల
చేరువనె ఉన్నదిదె చెప్పరాని ఫలము

ఓ భక్తులరా వినండి. ఊరకే ఎన్నెన్నో గ్రంధాలను చదవడం వాటిని ఒంటపట్టించుకోవడం బాధపడడం ఇవన్నీ ఎందుకు? మీకు చెంతనే ఉన్న గొప్ప విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. చూడండి. శ్రీవేంకటేశ్వరుని ప్రార్ధించండి. కైవల్యమును పొందండి అని చెప్తున్నాడు.

చ.1. కోపము విడిచితేనె పాపము దానే పోవు
దీపింప సుజ్ఞానము తెరు విదివో
లోపల మనిలుడై లోకము మెచ్చు కొరకు
పైపై గడిగితేను పావనుడౌనా

కోపమును విడవండి. అరిషడ్వర్గాలను జయించే మార్గం ఆలోచించండి. కోపము విడినట్లైతే అన్ని పాపాలు తొలగిపోతాయి కదా! అప్పుడు గొప్పదైన జ్ఞానం దనతట అదే ప్రకాశిస్తుంది. మనసులో ఎన్నో కషలు, కార్పణ్యాలు, అసూయాద్వేషాలు అనే మలినాలను పెట్టుకుని వూరకే పైపైన కడుక్కుంటే పాపాలు సమసిపోతాయా? పావనుడివైపోతావా? లోపలి మలినాలు తొలగాలంటే శ్రీనివాసుని పాదాలు పట్టుకోండి అదే మీకు ముక్తి దోవ అని చెప్తున్నాడు అన్నమయ్య.

చ.2. ముందరి కోరికవోతే ముంచిన బంధాలు వీడు
కందువ నాశ మానితే కైవల్యము
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు
చిందువందు చిత్తమైతే చేరునా వైకుంఠము

ముందరి కోరికలు పోగొట్టుకొనండి. రాబోయే కాలంలో అలా ఉండాలి ఇలా ఉండాలి అంతులేని ధనం సంపాదించాలి అనే ధ్యాసను విడనాడండి. నరకానికి దారి తీసే మీ మీ బంధాలను వదలించుకోండి. అలాంటి ఆశలు నాశనమైతే తప్ప మీకు కైవల్యం లభించడు. మొదట ఈ లోకంలో ఉన్న కాంక్షలను విడిచిపెట్టేయండి. మనసులో ఒకటి ఉంటుంది. లోకం కోసం ఒకటి మాట్లాడుతూ ఉంటాము. ఇలాంటి చెదరిపోయిన మనస్సుతో మనం ఎప్పటికైనా వైకుంఠం చేరగలమా? ఆలోచించండి. త్రికరణశుద్ధిగా ఉండమని ప్రబోధన.

చ.3. కాంతల పొందొల్లకుంటే ఘన దు:ఖమే లేదు
అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుడు
అంతట మాటలె యాడి హరిశరణనకుంటే
దొంతినున్న భవములు తొలగునా వివేకికి

స్త్రీ వ్యసనమే సర్వ దు:ఖాలకు కారణము. అదే ముఖ్యమైన దు:ఖకారణ హేతువు. మొదట దానిని విడనాడండి. అంతరాత్మలో శ్రీనివాసుని ప్రతిష్టించుకోండి. అన్ని విషయాలు ఆయన గురించి చెప్పుకుంటూ చివరకు ఆయనను శరణు పొందకపోతే ఒక కుండపై ఒక కుండ బోర్లించినట్ట్లున్న ఈ జన్మ పరంపరలు మనుష్యులకు తొలిగిపోతాయా? వివేకులై ఆలోచించండి. శ్రీవేంకటేశ్వరుని శరణని జన్మ రాహిత్యాన్ని పొందండి అని వినూతనంగా పిలుపునిస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు: చేరువ = చెంత, సమీపంలో; దీపించు = ప్రకాశించు, ప్రసిద్ధమై యుండు; సుజ్ఞానము = మంచి జ్ఞానము, అవసరమైన విద్య; మనిలుడై = కల్మషము గల అన్న అర్ధం తో చెప్పబడినదని నా భావన. పావనుడు = పాపము బొందని వాడు; ముందరి కోరిక = భవిష్యత్తుకు సంబంధించిన కోరికలు; ముంచిన = పాపకర్మలతో నిండిన; కందువ = మాలిన్యముగల, పాపపూరితములైన; బొంది = మనిషి లోపల; చిందువందు = చెల్లచెదురుగా ఉండు; ఒల్లకుంటే = వదలిపెట్టకపోతే; దొంతినున్న భవములు = మనకు సంప్రాప్తించబోయే జన్మలను కుండలు ఒకదానిపై ఒకటి బోర్లించి ఉన్న స్థితో పోల్చి చెప్పడం.
విశేషము: అన్నమయ్య ఈ కీర్తనలో “మనిలుడై” అన్న పదాన్ని ఉపయోగించాడు. మనిలుడు అనే పదానికి నిఘంటువులలో అర్ధం కనబడలేదు. బహుశ: మలినుడు అనే అర్ధంలో వాడి ఉండవచ్చు. ఇంకాస్తా లోతుగా చూస్తే మనికుడు అనే పదానికి రూపాంతరమా అనిపిస్తూ ఉన్నది. జి.యన్.రెడ్డి గారి

నిఘంటువులో పరవశుడు, పరవశ్యుడు, పరాధీనుడు అనే అర్ధాలు ఉన్నై. అన్నమయ్య “మనికుడై” అనేదానికి “మనిలుడై” అని కూడా అని వుండవచ్చు. అంటే పరాధీనుడైన మనసుగల వాడిని లోకము మెచ్చదు అని చెప్పడం అన్నముని భావన అయిఉండవచ్చునని కూడా అనిపిస్తూ ఉన్నది.

-0o0-

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *