March 19, 2024

బ్రహ్మలిఖితం – 18

రచన: మన్నెం శారద

ఓంకారస్వామి కళ్ళు తెరచి ఒక కనుబొమ్మ సాధ్యమైనంత పైకెత్తి వెంకట్ వైపు చూశాడు సీరియస్ గా.
వెంకట్ అసహనంగా దిక్కులు చూస్తూ నిలబడ్డాడు.
వెంకట్ తనకు నమస్కరించకుండా చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వైనమర్ధమయింది ఓంకారస్వామి రూపంలో ఉన్న నారాయణకి.
“ఏంటి పెళ్లికొడకా? అత్తగారింట్లో తిన్న అరిసెలు, మినపసున్నుండలు ఇంకా అరిగినట్టు లేదు. ఇటువైపు సీత కన్నేసే వేంటి?” అన్నాడు తన ఏకాంత మందిరంలో బూరుగు దూది పరుపుల మీద పడుకుని భక్తులు భక్తిప్రపత్తులతో సమర్పించుకున్న పళ్లని ఏరేరి తింటూ.
అక్కడ ఆ గదిలో రాజు, సంపెంగి తప్ప మరెవరూ లేరు.
రిటైర్డ్ ప్రొఫెసర్ మల్లన్న చెడామడా ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ దొరికిన పేపర్లన్నింటిలో రాసిన ఆర్టికల్స్ చదివి ఓంకారస్వామి భక్తబృందం ఆంధ్రదేశమంతటా బాగా పెరిగిపోయింది. దాంతో పలుకుబడి, డబ్బు, సదుపాయాలూ కూడా పెరిగిపోయాయి. కూర్చున్న చోటనుండి కదలకుండా కూర్చుని బాగా తిని అతని చప్పి దవడలు పూడాయి. గుంట కళ్ళలో కాస్త మెరపొచ్చింది.
“ఏదో అర్జెంటుగా చేసుకోవాల్సొచ్చింది” అన్నాడు వెంకట్ నిర్లక్ష్యంగా.
“అర్జంటుగానయితే మాత్రం పెళ్లి మీద పెళ్ళెలా చేసుకున్నావు? ఆ పిల్ల సంగతేంటి?”
” ఏ పిల్ల సంగతి?”
ఓంకారస్వామి పకపకా నవ్వాడు. నవ్వుతూ రాజువైపు తిరిగి “వీడు మరీ మనతోటే పరాచికాలాడుతున్నాడు. ఆ పిల్లెవరో నువ్వు చెప్పు రాజూ!” అన్నాడు నవ్వుతూనే.
“తెలీనట్టు డ్రామాలాడతావేంటి? ఈశ్వరి. ఆ పిల్లకి సంగతి తెలిసి లబోదిబోమంటూ ఏడుస్తూ వచ్చింది. అహోబిళంలో దాన్ని పెళ్లి చేసుకుని మళ్లీ పెళ్లి చేసుకుంటావా?” అన్నాదు రాజు తను జోక్యం చేసుకుంటూ
“అది పెళ్లా, సింగినాదమా? ఏదో మీరు నాటకమాడమన్నారని ఆడేను. దానికి మొగుడు, పిల్లలున్నారు. దాంతో నాకు పెళ్ళేంటి? అసలు నేను మీ దగ్గరకొచ్చిన పని వేరు. లిఖితని లొంగదీసుకునే మార్గం చెప్పమని వచ్చేను. ఆ పని చెయ్యనే లేదు మీరు!” అన్నాడు వెంకట్ అక్కసుగా.
నారాయణ, రాజు మొహమొహాలు చూసుకున్నారు. వెంకట్ తమని స్వాములుగా గుర్తించి, గౌరవించడం లేదని గ్రహించేరు. అలా గ్రహింపుకి రాగానే నారాయణ కళ్ళలోకి పాకిన రక్తం ఎర్రజీరలుగా మారి అతనిలోని క్రౌర్యానికి దర్పణం పట్టింది.
అతను వెంకట్ వైపు తీవ్రంగా చూస్తూ”మమ్మల్నే ధిక్కరిస్తున్నావా?” అన్నాడు కోపంగా.
“లేకపోతే ఏంటండి, నన్ను ఆ ఈశ్వరి కోసం దోషిలా నిలబడతారేంటి?” అన్నాడు వెంకట్.
“సరే! ఈశ్వరి సంగతలా ఉంచు. నువ్వు నీ మావ దగ్గర కట్నమెంత తీసుకున్నావ్? ఆ సంగతి చెప్పు!”
“కట్నమా సింగినాదమా? ఏదో పెళ్లి కెదిగిన ఆడపిల్లలందరూ అలానే నిలబడిపోయేరని ఏడిస్తే…”
“మాకు కట్టుకథలు చెప్పి మా నోట్లో పొట్టు పోద్దామని చూస్తే గాల్లో ధూళిలా కలిసిపోతావు. ఆ పిల్ల పేరున పది లక్షల లాటరీ వచ్చింది. అందులో రెండు లక్షలు తెచ్చి మా హుండీలో వేస్తే సరేసరి. లేదంటే ఈశ్వరి నీ ఇంటికి కాపురాని కొస్తుంది. తర్వాత నీ పాట్లు కథలు కథలుగా చెప్పుకుంటారీ ఊరి జనం”అన్నాడు ఓంకారస్వామి.
“అంటే నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?”
“మెయిలూ లేదు. ఎక్స్‌ప్రెస్ లేదు. డబ్బట్టుకొచ్చేయ్. ఏ పేచీ ఉండదు. నువ్వెవరితో కాపురం చేస్తే మాకేటి?” అంది సంపెంగి సీరియస్‌గా.
“నేను పోలీస్ రిపోర్టిస్తాను” అన్నాడు వెంకట్ కోపంగా.
“ఏమని?” కూల్‌గా అడిగాడు ఓంకారస్వామి.
“మీరు దొంగస్వాములని!”
ఓంకారస్వామి కోపం తెచ్చుకోలేదు.
“రాజు!” అని పిలిచేడు మెత్తగా.
“చెప్పండి స్వామి!” అన్నాడు రాజు వినయంగా.
“రిసెప్షనుకి రింగు కొట్టి ఎస్పీని లైన్లో పెట్టు” అన్నాడు.
రాజు వెంటనే ఆ పని చేసేడు.
ఎస్పీ వెంకటస్వామి లైన్లోకి రాగానే రాజు “నమస్తే సార్! మా స్వామిగారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ” అన్నాడు. ఓంకారస్వామి రిసీవరందుకున్నాడు.
“వాడి చేతికా కార్డ్‌లెస్ ఇవ్వు” అన్నాడు.
వెంకట్ కార్డ్‌లెస్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు.
“నమస్కారం స్వామి! ఏమన్నా అర్జెంటు పనుందా చెప్పండి.నిముషంలో వచ్చేస్తాను” అన్నాడు ఎస్పీ వెంకటస్వామి.
“ఏం లేదు నీ యోగక్షేమం కనుక్కుందామని. మీ ఆవిడ అరోగ్యమెలా ఉంది? అమ్మాయి ప్రసవమయ్యిందా?”
“తమ దయవల్ల బాగానే ఉంది. అమ్మాయికి బాబు పుట్టేడు. మీ పేరే పెట్టుకోవాలనుకుంటున్నాం” అన్నాదు ఎస్పీ.
“అద్సరే! మీ హోం మినిస్టరుగారొస్తారన్నారు. ఎప్పుడూ రావడం?”
“ఈ నెల్లోనే. ఎంత తొందరగా మిమ్మల్ని చూడాలా అని ఆయన తెగ కంగారు పడుతున్నారు. పైకి నక్సలైట్ ఏరియా విజిటని పేరేగాని.. రావడం మీ దర్శనానికే..” అన్నాడు ఎస్పీ గుంభనంగా నవ్వుతూ.
ఓంకారస్వామి రిసీవర్ క్రెడిల్ చేసి వెంకట్ వైపు చూశాడు.
వెంకట్ నుదుటున చెమటలు బిందువులుగా పేరుకోవడం గమనించి మందహాసం చేస్తూ “ఇప్పుడు చెప్పు టాపు టు బాటం నా భక్తులయిన డిపార్టుమెంటులో ఎవరికిస్తావు రిపోర్టు.”అనడిగేడు మందహాసం చేస్తూ.
వెంకట్ తనలోని భయాని అణుచుకుంటూ “ఇప్పుడు నేనేం చేయాలి?”అనడిగేడు.
“చెప్పేనుగా. నీ పెళ్లాన్నడిగి రెండు లక్షలు తెమ్మని”
వెంకట్ తల పంకించి నిస్సహాయంగా చూస్తూ వెనుతిరిగి వెళ్లాదు.
వెళ్టున్న వెంకట్‌ని చూసి చేతిలోని ద్రాక్షపండుని పైకెగరేసి పట్టుకొని “దొంగముండాకొడుకు. నా దగ్గరా నాటకాలు” అంటూ పకపకా నవ్వాడు. అతని నవ్వుతో శృతి కలిపేరు రాజు, సంపెంగిలు.

*****

ఏనుగు ఇనుమడించిన ఉత్సాహంతో లిహితని, కాణ్హని ఎక్కించుకుని అడవిలో వడివడిగా పరిగెత్తినట్లుగా నడవసాగింది. దాని మెడలోని మువ్వలు లయబద్ధంగా సవ్వడి చేస్తూ ఆ నాదం కూడా ఏనుగుతో పాటు పరుగు తీస్తోంది. రెండు కిలోమీటర్లు నడకసాగి అడవిలో ఒక వాగుని ఏనుగు దాటుతుండగా “అక్కా, అక్కా ” అన్న పిలుపు విని అటు తిరిగి చూసింది లిఖిత. దూరంగా మున్నార్ హోటల్లో పరిచయమైన బేరర్ అలుపుగా పరిగెత్తుకొని వస్తూ “అక్కయ్యా ఆగు ఆగు!” అన్నట్టు చెయ్యి ఊపసాగేడు.
కాణ్హ ఏమిటన్నట్లుగా లిఖితవైపు చూశాడు. “ఆపండి ఆ అబ్బాయి నాకు తెలుసు” అంది లిఖిత.
కాణ్హ ఏనుగుని అంకుశంతో అదలిస్తూ “గణా ఆగు” అన్నాడు. ఏనుగు ఆగి మోకాళ్ల మీద వంగి కూర్చుంది. కాణ్హ క్రిందకి దిగి లిఖితకి చేయందించేడు. లిఖిత కాణ్హ భుజాల మీద చేతులానించి ఏనుగు దిగింది.
అప్పటికే బేరర్ కుర్రాడు వాళ్ల దగ్గరకొచ్చి “అక్కయ్యా, మీ నాన్నగారు కూడా మా హోటల్లోనే దిగేరు. నేనాయన్ని గుర్తుపట్టగలను”అన్నాదు వగరుస్తూ.
ఆ మాట వినగానే లిఖిత మొహం సంతోషంతో వికసించింది.
“ఇతనికి మా నాన్న తెలుసు. ఇతన్ని కూడా తీసికెల్దాం”అంది లిఖిత కాణ్హ వైపు తిరిగి.
కాణ్హ బేరర్ని ఏనుగెక్కించేడు. ఆ తర్వాత లిఖిత, కాణ్హ ఎక్కేరు.
ఏనుగు మరో ఇరవై నిమిషాల్లో మహామాయ ఉన్న గుహని చేరుకుంది. అప్పుడే మహామాయ మృతశరీరాన్ని వాగులోంచి తీసి గుహ బయట పడుకోబెట్టేరతని శిష్యులు.
ఏనుగుని ఆ పైన లిఖితని చూడగానే కకావికలై పక్కకి తప్పుకున్నారు.
ఏనుగు ఆ ప్రాంతం చేరగానే చిత్రంగా మారిపోయింది.
ఏదో శక్తి ఆవహించినట్లుగా ఊగిపోతూ తొండాన్ని అటూ ఇటూ వడివడిగా తిప్పుతూ, ఘీంకరిస్తూ గుహలోకి ప్రవేశించింది.
లోపల పూజలు చేస్తున్న కొంతమంది ఏనుగుని చూసి బెదరిపోయి లేచి నిలబడ్డారు.
ఏనుగు ఆ పూజా ప్రాంతాన్ని తన తొండంతో ఒక్కసారి చెల్లాచెదురు చేసింది. తన పాద తాడనంతో హోమగుండాన్ని మసి చేసేసింది.
దాని ఊపుకి అందరూ బెదరి గుహ గోడలకి అంటుకుపోయేరు.
ఏనుగు ఊపుగా దుష్టశక్తిని సమీపిస్తుండగా “విగ్రహాన్ని తాకారంటే నాశనమై పోతారు. వెంటనే వెళ్లకపోయేరా.. ఇదిగో మిమ్మల్నిప్పుడే ఎందుకూ గాకుండా చేస్తాను”అంటూ ముందుకొచ్చి బెదిరించేడొక వృద్ధుడు. అతను బస్సులో కలిసి తనతో ఆ గుహకి తీసుకొచ్చిన వ్యక్తిగా గుర్తుపట్టింది లిఖిత.
“వాడే.. నన్ను తీసుకొచ్చేడిక్కడికి” అంది లిఖిత కసిగా అతనివైపు చూస్తూ..
అంతే!
“గణ” ఏదో అర్ధమయినట్లుగా అతనివైపు తిరిగి తొండంతో అతన్ని చుట్టేసి గిరగిరా తిప్పి బలంకొద్దీ విసిరేసింది. అతను ఉండలా చుట్టుకుని గుహ రాతి గోడకి కొట్టుకొని క్రిందపడ్డాడు గాలి తీసిన బంతిలా.
అంతే! ఆ తర్వాత అతను కదలలేదు.
అతని తల క్రిందనుండి చిక్కగా జాలువారి, వాగులో ప్రవహించి వెలుగులో ఎర్రగా కనబడడం చూసి కళ్ళు మూసుకుని లిఖిత.
ఆ తర్వాత పనిగా ఏనుగు విగ్రహం మీద విరుచుకు పడింది. ఎన్నో సంవత్సరాలుగా అనేక బలుల్ని అందుకున్న ఆ క్షుద్ర దేవత ‘గణ’ మీద ఏ ప్రభావాన్నీ చూపించలేకపోయింది.
గణ కుంభస్థలంతో ఆ విగ్రహాన్ని బలంగా ఢీకొంది. ఆ దెబ్బకి విగ్రహం కుప్పకూలిపోయింది.
ఏనుగింకా కసి తీరనట్లుగా ఆ విగ్రహాన్ని కాళ్లతో తొక్కి పిండి పిండి చేసింది.
అప్పుడు కనిపించేయి. ఆ విగ్రహం కడుపులో ఉన్న యంత్రాలు. కొన్ని రాగిరేకుల మీద ఉన్న కొన్ని క్షుద్ర మంతాలు.
లిఖిత కళ్లు మాత్రం ఆ ప్రాంతమంతా వెతుకుతున్నాయి తన తండ్రి కోసం.
“అక్కా! అక్కా!” అంటూ ఆమెని గట్టిగా కుదిపేసేడు కంగారుగా.
లిఖిత “ఏంటి?” అంది వెనక్కు తిరిగి.
బదులుగా బేరర్ ఓ మూల కూర్చుని జరుగుతున్నదేమీ తనకి పట్టనట్లుగా కళ్లు మూసుకుని జపం చెస్తూ ఈతాకులతో ఉప్పు నీటిని పిండిబొమ్మకి అభిషేకం చేస్తున్న వ్యక్తి కనిపించేడు.
“ఎవరతను?” అనడిగింది లిఖిత.
“మీ నాన్న. కార్తికేయన్” అన్నాడు బేరర్.
ఆ జవాబు విని లిఖిత శరీరమంతా రక్తం ఉద్వేగానికి గురయి వేగంగా ప్రవహించడం వలన పులకించింది.
“కాణ్హ ఏనుగుని ఆపు” అనిద్ కంగారుగా.
కాణ్హ “గణా! ఆగు! శాంతించు!” అన్నాడు చేత్తో దువ్వుతూ.
ఏనుగు చెవులూపుతూ వినయంగా క్రింద కూర్చుంది.
కాణ్హ తను దిగి మిగిలిన ఇద్దర్నీ దింపేడు.
లిఖిత గబగబా తండ్రి దగ్గరికి రివ్వున పరిగెత్తి “డేడీ!డేడీ!” అని పిలిచింది ఆత్రుతగా.
అతను కళ్లు తెరవనే లేదు.
ఏదో మంత్రాన్ని నిశ్శబ్దంగా ఉచ్చరిస్తూ తన పూజ కొనసాగిస్తూనే ఉన్నాడు.
కాణ్హ ‘గణ’వైపు చూశాడు.
“గణ’ ఏదో అర్ధమయినట్లుగా వెళ్లి అతను పూజ చేస్తున్న పిండి బొమ్మని కాలితో తొక్కి విసిరేసింది
అయినా కార్తికేయన్‌లో చలనం లేదు.
లిఖిత అతన్ని పరిశీలించి చూసింది.
బట్టతల, వడలిన శరీరం, చిన్న పంచెతో ఉన్న ఇతను ఒక గొప్ప సైంటిస్టు కార్తికేయనయి ఉంటాడా? అయి ఉంటే అతనింత దిగజారి ఇలాంటి క్షుద్రపూజలు చేస్తాడా?
“తంబి ఇతను నిజంగా మా నాన్నేనా? నువ్వు సరిగ్గా గుర్తుపట్టే చెబుతున్నావా?” అనడిగింది.
“మీ నాన్నవునో కాదో నాకు తెలియదు. కాని అతను కార్తికేయనే. సైంటిస్టే. అలా రాసుంది మా రిజిస్టరులో.”అన్నాడు బేరర్.
వెంటనే లిఖిత హృదయం ఆర్ద్రమైంది. కన్నీరు పొంగుకొచ్చింది.
పుట్టి పెరిగేక, తనకు జన్మనిచ్చిన తండ్రిని అంత దీనావస్థలో చూడాల్సి రావడం వచ్చినందుకు ఆమె హృదయం బాధతో రెపరెపలాడింది.
“మా డేడీకేదో చేసేరు” అంది ఏడుస్తూ.
కాణ్హ లిఖితని పక్కకు తోసి కార్తికేయన్ దగ్గర కెళ్లి అతని భుజాలు పట్టుకొని కుదిపేడు. అయినా ప్రయోజనం కనిపించలేదు.
కాణ్హ ఒక్క ఉదుటున ఎత్తి అతన్ని ఏనుగు మీద కూర్చోబెట్టేడు.
ఏనుగు బలంగా అతన్ని క్రిందకి నెట్టేసింది.
కాణ్హ ‘గణ’ చేసిన ఆ చర్యకి మొదట తెల్లబోయి చూసేడు. తర్వాత ఏదో అర్ధమయినట్లుగా తల పరికించి “మీ నాన్నకి చేతబడి జరిగింది. చేతబడి జరిగిన వ్యక్తిని గణపతి సమానమైన ఏనుగు తన మీద ఎక్కించుకోదు” అన్నాడు.
లిఖిత ఆ మాట విని ఖిన్నురాలయి “మరెలా, మా నాన్నని తీసికెళ్ళడం!” అంది.
“గణా!” అని అరిచేడు కాణ్హ.
ఏనుగు మోకాళ్ల మీద కూర్చుంది.
“మీరిద్దరు దాని మీద పదండి. నేనాయన్ని తీసుకొస్తాను” అన్నాడు కాణ్హ కార్తికేయన్‌ని లేవదీసి తన భుజాల మీదెక్కించుకుని..
లిఖిత, బేరర్ ఏనుగు మీద వెళ్తుంటే వారిని అనుసరించేడు కాణ్హ కార్తికేయన్‌తో.
గణ వెళ్తూ వెళ్తూ మళ్లీ మహామాయ మృతకళేబరాన్ని మరోసారి తొక్కి ముందుకి నడిచింది ఆగ్రహావేశాలతో.

*****
“వెంటనే నాకు రెండు లక్షలివ్వు” అన్నాడు వెంకట్ భార్యతో.
“నా దగ్గరెక్కడివి?” అంది కనక మహాలక్ష్మి అమాయకంగా చూస్తూ.
“మరీ ఓవర్‌గా నటించేయకు. నీకు లాటరీలో పది లక్షలొచ్చింది అందులోంచివ్వు”
కనకమహాలక్ష్మి ఎన్నాళ్లగానో తిండిలేనట్లుగా కళ్లు తేలేసి “నాకు లాటరీ రావడమేంటి? ఎవరు చెప్పేరు బావా నీకు?” అంది.
“మీ నాన్న. అందుకే నిన్ను పెళ్లి చేస్కున్నాను”
కనకమహాలక్ష్మి మొహంలో కళ తప్పింది.
“అంటే డబ్బుకి ఆశపడి నన్ను పెళ్ళి చేసుకున్నావన్నమాట. నన్ను ప్రేమించనే లేదా అయితే?” అంటూ ముక్కు ఎగ చీదింది.
వెంకట్ పరిస్థితి ఇరకాటంలో పడింది.
ప్రేమించలేదంటే.. అసలే మొండిఘటమైన పెళ్లాం పైసా ఇవ్వకుండా పుట్టింటికి చెక్కేస్తుందన్న భయంతో అమాంతం ఆవిడ కాళ్లు పట్టుకున్నాడు. మంచం మీదనుండి క్రిందకి దూకి.
కనకమహాలక్ష్మి భర్త చేష్టలకి తెల్లబోతూ కాళ్ళు సర్రున వెనక్కు లాక్కుని “మీకు పిచ్చి ఉందని చెప్పలేదే మా నాన్న. కన్నెచెర తప్పించాలని పిచ్చోడికిచ్చి చేసి నా గొంతు కోసేడు!” అంది ఏడుస్తూ.
వెంకట్ అలానే నేలమీద కూలబడి భార్యకి రెండు చేతులు జోడించి నాకు పిచ్చి లేదు కనకం. నేను చాలా ఆపదలో ఉన్నాను. నా పీకమీద కత్తి ఉంది. వ్రేటు పడకుండా రక్షించు” అన్నాడు దాదాపు ఏడుస్తూ.
“అయ్యో . మీకు బాగా ముదిరిపోయినట్లుంది. మీ పీక మీద కత్తి కాదు కదా బ్లేడు ముక్క కూడా లేదు. అయ్యో రామచంద్రా. నాకిప్పుడెవరు దిక్కు!” అని ఏడవటం మొదలెట్టింది.
వెంకట్‌కి ఆవిడ ఏడుపు విని నిజంగానే మతి చలించినట్లయింది.
“కాస్సేపు నీ ఏడుపు ఆపవే దరిద్రపు మొహమా!” అన్నాడు కోపంగా జుట్టు పీక్కుంటూ.,
సరిగ్గా అప్పుడే ఆ ఇంటి తలుపులు ధనధనా మోగేయి. వెంకట్ ఏడుపు ఆపుకొని వెళ్లి తలుపు తీసేడు.
ఎదురుగా ఈశ్వరి నిలబడి వుంది సూట్‌కేస్ చేత్తో పట్టుకొని.

సశేషం..

2 thoughts on “బ్రహ్మలిఖితం – 18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *