March 19, 2024

మనోవేదికపై నర్తించిన అక్షరరవళి


రచన: సి.ఉమాదేవి

ఆంగికం భువనం యశ్య
వాచికం సర్వవాఙ్మయమ్
ఆహార్యం చంద్రతారాది
తం వందే సాత్త్వికం శివమ్
అభినయ దర్పణములో ప్రారంభ శ్లోకంతో కోసూరి ఉమాభారతి రచించిన వేదిక నవలపై సమీక్ష ప్రారంభించడానికి కారణం నవల నడిచిన కాదు నర్తించిన తీరు. భరతముని రచించిన నాట్య శాస్త్రమును నాట్యవేదమంటారు. వేదిక నవల నాట్యశాస్త్రాన్ని గుర్తు చేయడం కాకతాళీయమే కాని విభిన్న నృత్యాంశాలకు చక్కటి మార్గదర్శినిగా నిలిచిన నాట్యశాస్త్రం నృత్యాభిలాష ఉన్నవారికి కరదీపిక అని పునశ్చరణ చేసుకోవడం నవలలో అగ్రభాగాన్ని ఆక్రమించుకున్న నృత్యాంశాల నేపథ్యంలో సమున్నతమేననిపించింది. ఈ నవల చక్కటి నృత్యగీతాలను మనోవీధిలో మరొక్కమారు విహరింపచేసింది. కోసూరి ఉమాభారతి జగమెరిగిన రచయిత్రేకాదు అలరించే నర్తకి కూడా. వేదిక నవల ద్వారా నృత్యప్రాధాన్యమైన నవలాంశాన్ని తీసుకుని పాఠకరంజకంగా రచించి మనకందించడం ముదావహం. నృత్యాంశంతోపాటు సమాంతరంగా ఒక కుటుంబం, దాని చుట్టూ అల్లుకున్న స్నేహబాంధవ్యాలు, తొంగి చూచే అసూయలు, పెనవేసుకునే ఆత్మీయతలు. ఇవన్నీ మన ప్రక్కనే కూర్చుని కష్టసుఖాలు పంచుకునే స్నేహితురాలిలా మొత్తం నవలను మనకు చంద్రకళ పాత్ర ద్వారా వినిపిస్తారు.
చంద్రకళ తల్లి శారద సంగీతం నేర్పే గురువేకాదు నృత్యం పట్ల అవగాహనగల వ్యక్తి. నాట్యమనగానే పదనర్తనం గావించే చంద్రకళ నృత్యాభిరుచిని గ్రహించి కూతురికి నృత్యం నేర్పడమేకాదు చక్కని వేదికలపై విభిన్న గీతాలకు చక్కని నృత్యాలను సమకూరుస్తుంది. ఇక మలేషియా, కౌలాలంపూర్, లండన్, పారిస్, ఇటలీవంటి దేశాలలో ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లను చేసేందుకు తండ్రి సత్యదేవ్, అతని స్నేహితుడు భూషణ్ పాత్రలు కూడా అత్యంత సహజంగా సాధకబాధకాలను చర్చిస్తూ నవలలో ఒదిగిన తీరు ప్రశంసనీయం. తన కూతురి నృత్య ప్రదర్శనకు ముందు చక్కని పరిచయాన్ని వినిపించే సత్యదేవ్ మాటలు వేదికను హరివిల్లుగా మలచడంలో శ్రీకారమవుతాయి. ఒక కళాకారిణి ఎదుగుదలకు తల్లిదండ్రులు పోషించే పాత్ర ఎనలేనిది అనే నిజాన్ని ఈ నవల మరింత స్పష్టం చేసింది. తాళ, లయ జ్ఞానాన్ని ఔపోసన పట్టి పాదరసంలా పదనర్తనం గావించే చంద్రకళ అభినయం వెనుక మరొక ముఖ్యమైన వ్యక్తి ఆమెకు శాస్త్రీయంగా నృత్యం నేర్పిన గురువు పాత్రను మలచినతీరుకు గురుభ్యోన్నమ: అనిపిస్తుంది. యువకళాకార్ అవార్డ్ తో మొదలైన బహుమతుల పర్వం అనేకానేక అవార్డులను, రివార్డులను ప్రసాదించడమేకాక ప్రపంచనర్తకిగా గుర్తింపు పొందుతుంది చంద్రకళ. నృత్యభాష అంటే లయజ్ఞానమే కదా. మరి ఆ నృత్య భాషకు చక్కని భాష్యం పలికిన చంద్రకళకు కుటుంబ బాంధవ్యాలపైనా మెండైన అభిమానమే. చదువు, నృత్యం నడుమ ఆమ్మమ్మ, నానమ్మల ఊరికి ప్రయాణం, వారు ప్రేమను కూరి వండిపెట్టే విభిన్న వంటకాలు, వారి ముద్దుముచ్చటలు చదివే పాఠకుల మనసులు తమ ప్రమేయం లేకుండానే వారి బాల్యపు అనుభూతులను నెమరువేసుకునేలా చేస్తుంది.
వేదికకు నమస్కారంతో ప్రారంభమైన నృత్యలహరి మంగళంతో ముగుస్తుంది. వేదికపై నర్తించే వారే కాక నృత్యాన్ని తిలకించే వారి మనసును కూడా నర్తింపచేసిన వేదికకు ప్రణామాలు పలకాలనిపిస్తుంది. శ్రీకృష్ణావతారం, , కాళీయమర్ధనం, బ్రహ్మమొక్కటే, చిరుతనవ్వులవాడు…. ఇలా ఎన్నో! బ్రహ్మమొక్కటే దర్శించే తీరువేరు, నృత్యమొక్కటే నర్తించే రీతులు వేరు. జతులు, సంగతులు మేళవించిన నృత్యవేదిక సాహితీ సంస్కృతుల మేలు కలయిక. ఈ అందమైన వేదికపై అలరించే ఆహార్యం అందించే క్రమంలో ముత్యాలు, మువ్వలు అమర్చిన నృత్య వస్త్రాలు అద్భుత: అనిపిస్తాయి. నృత్యానికి చక్కటి వస్త్రాలను క్రిష్ణ సమకూర్చడంతో వేదికపై నాట్యం మరింత సొబగునందుతుంది. వేదిక ఒకసారి సరస్వతీ ప్రాంగణంలా, మరొకసారి కైలాసంలా, దేవాలయంలా భాసిల్లినట్లు చంద్రకళ ము:ఖత వింటుంటే నృత్యాన్ని మనోనేత్రంతో దర్శించగలం. చక్కని రహదారిలో సునాయాసంగా చేస్తున్న ప్రయాణంలో ఎదురయ్యే మలుపులు , స్పీడు బ్రేకర్లు ఎలా నిలువరిస్తాయో అలా నవలలో అందరి మనసులను తన వింత, మొండి ప్రవర్తనతో స్థంభింప చేసే పాత్ర భూషణ్ కూతురు రాణి. అయితే ఆమె మంచి గాయని. చంద్రకళ నర్తించే వేదిక పైనే తన గానామృతంతో అలరించి మొమెంటోలు పొందిన వ్యక్తి. చంద్రకళకు కావలసిన సహాయాన్ని ఎంతో నిబద్ధతతో చేసే వ్యక్తి భూషణ్. ఇదే రాణిలో చంద్రకళపట్ల అసూయకు కారణమవుతుంది. తన బావ జగదీష్ తో రాణి తీసుకునే అతి చనువు చంద్రకళకు ఇబ్బందిగా అనిపించినా ఆమెలోని సర్దుకుపోయే మనస్తత్వం మరే విధమైన అవాంఛిత సంఘటనలకు తెరలేపదు. కాని జగదీష్ నే పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం మనసులో బలంగా ముద్రించుకుంటుంది రాణి. ఈమె సరదాగా ‘ సినీహీరోనిచ్చి పెళ్లి చేయగలవా?’ అన్న మాటను నిజమనుకుని సినీహీరోతోనే పెళ్లి చేస్తానంటాడు భూషణ్. అయితే విచక్షణాలేమితో రాణి తనను తాను గాయపరచుకోవడంతో ఈ ముక్కోణపు ప్రేమకథలోని ప్రేమ మథనంలో కళ్యాణవేదికపై ఎవరు దంపతులవుతారో అనే ఆదుర్దా పొటమరిస్తుంది. రాణిని ఆత్మీయంగా స్నేహధర్మంతో పలకరించినా చంద్రకళతో వివాహానికి పెద్దల అనుమతి తీసుకున్న జగదీష్ పాత్ర మనోనిబ్బరానికి, మంచితనానికి ప్రతీక.
అకస్మాత్తుగా సత్యదేవ్ అనారోగ్యానికి గురవడం చంద్రకళను ఆందోళనకు గురి చేస్తుంది. తన కూతురు రాణికి జగదీష్ తో పెళ్లికై చంద్రకళ త్యాగాన్ని అర్థిస్తాడు భూషణ్. అతడు చేసిన సహాయానికి ప్రతిఫలంగా జగదీష్ కు దూరం కావాలనుకుంటుంది చంద్రకళ. నృత్యకారిణి తేజస్విని అమెరికానుండి అందించిన ఆహ్వానంతో తన గమ్యానికది మలుపు కాగలదని భావించి అమెరికా చేరుకుంటుంది. ఇక రాణి ప్రవర్తన అసూయ, ఆవేశాలకు ఆలవాలమై చివరకు ఆమెను పతనంవైపు నడిపిస్తుంది. నవల ముగింపు సంతరించుకునే వేళ పాఠకుల ఊహలకు విరామం పడుతుంది. భూషణ్ గుండెపోటుకు గురవడంతో దాదాపు మూడు సంవత్సరాలుగా మాతృదేశానికి దూరమైన చంద్రకళ తిరిగి వస్తుంది. అప్పటికి రాణికి జరగాల్సిన నష్టం జరగనే జరుగుతుంది. అయితే జగదీష్ కు దూరమై రంజిత్ కు దగ్గరైన రాణికి అతడితోనే వివాహం జరిపిస్తారు. జగదీష్ , చంద్రకళల వివాహవేదికతో నవల ముగుస్తుంది. కళకైనా, కలలకైనా జీవితమే వేదిక అనే వివరణతో వేదిక అనే శీర్షికకు అందమైన అర్థాన్ని తాపడం చేసి, ముఖచిత్రంగా నర్తకిని చిత్రించడం సముచితంగా ఉంది. ఇక నవల మధ్య మధ్యలో పలకరించే నృత్యభంగిమలు ఆహ్లాదపరుస్తాయి. వేదికపై ప్రదర్శించే అద్భుత నృత్యానికి ప్రేక్షకుల చప్పట్లు అభినందనసుమాలు. నవలకు చక్కని శీర్షికనొసగి వేదికకున్న ప్రాముఖ్యాన్ని మరింత ఉన్నతీకరించి చక్కని భాష, సున్నిత భావప్రకటనతో నవల ఆసాంతం చక్కని పట్టాలపై పరుగులు తీయించి మనల్ని వేదిక దగ్గరకు చేర్చిన కోసూరి ఉమాభారతికి అభినందన చప్పట్లు.

1 thought on “మనోవేదికపై నర్తించిన అక్షరరవళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *