March 19, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 29

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

“అర్ధము పురుషార్ధములలో నుత్తమము. అర్ధవంతుడు న్యాయము దప్పక మరియే ఉపాయము చేతనైనను ద్రవ్యము సంపాదించవచ్చును” అంటాడు పరవస్తు చిన్నయసూరి తన నీతిచంద్రికలో. అలాగే అన్నమయ్య ఆ ధనాన్ని గురించి మరొక విషయం చెప్తున్నాడు. ఆపదలలో ఉపయోగపడకుండా వున్న ధనం ఎవరికోసం? అని ప్రశ్నిస్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య. ఆ వివరాలేమిటో ఈ కీర్తనలో చూద్దాం.

కీర్తన:
పల్లవి: అక్కర కొదగని యట్టి అర్ధము
లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే

చ.1. దండితో దనకు గాని ధరణీసు రాజ్యంబు
యెండె నేమియది పండే నేమిరే
బెండు పడ గేశవుని బేరుకొనని నాలికె
వుండనేమి వుండకుండ నేమిరే ॥ అక్కర ॥

చ.2. యెదిరి దన్ను గానని యడపుల గుడ్డికన్ను
మొదల దెరచెనేమి మూసెనేమిరే
వెదకి శ్రీపతి సేవ వేడుక జేయని వాడు
చదివెనేమి చదువు చాలించె నేమిరే ॥ అక్కర ॥

చ.3. ఆవల నెవ్వరు లేని అడవిలోని వెన్నెల
కావిరి గాసెనేమి కాయకున్న నేమిరే
శ్రీవేంకటేశ్వరుని జేరని ధర్మములెల్ల
తోవల నుండెనేమి తొలగిన నేమిరే ॥ అక్కర ॥
(రాగము: ముఖారి; ఆ.సం.రేకు: 92; సం.1, కీ.456)

పల్లవి: అక్కర కొదగని యట్టి అర్ధము
లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే
మానవులారా! వినండి మనదగ్గర ఎంత ధనం ఉన్నప్పటికీ మనకు అవసరమైనప్పుడు అది మనకు అక్కరకు రావాలి కదా! అలా కానప్పుడు ధనం ఎంతవున్నా ఉపయోగశూన్యమే కదా! అసలు లేకపోయినప్పటికీ ఉపయోగం ఏమీ ఉండదు అని అర్ధాన్ని గూర్చిన గొప్ప సత్యాన్ని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.

చ.1. దండితో దనకు గాని ధరణీసు రాజ్యంబు
యెండె నేమియది పండే నేమిరే
బెండు పడ గేశవుని బేరుకొనని నాలికె
వుండనేమి వుండకుండ నేమిరే
దేశాన్ని పరిపాలించే చక్రవర్తికి లేక మహారాజుకు ధనం దండిగా ఉండాలి. అలా కాకపోతే ఆ రాజుగారికి ఏమి ఉపయోగం ఉండదు కదా! బలహీనుడైన మానవుడు కేశవుని నామం జపించి రక్షణ పొందాలి అలా కాని నాడు ఆ నాలుక ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? చెప్పండి అంటున్నాడు.

చ.2. యెదిరి దన్ను గానని యడపుల గుడ్డికన్ను
మొదల దెరచెనేమి మూసెనేమిరే
వెదకి శ్రీపతి సేవ వేడుక జేయని వాడు
చదివెనేమి చదువు చాలించె నేమిరే
విరోధులను ఎదిరించడానికి కండ్లు కావాలి. దానికి ఉపయోగించనటువంటి కన్నులు ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? అలాగే శ్రీపతిని కన్నులతో వెదకి వెదకి పట్టుకుని సేవించగలగాలి. అలా చేయని వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఉపయోగం ఏమిటి? చెప్పండి అంటున్నాడు అన్నమయ్య.

చ.3. ఆవల నెవ్వరు లేని అడవిలోని వెన్నెల
కావిరి గాసెనేమి కాయకున్న నేమిరే
శ్రీవేంకటేశ్వరుని జేరని ధర్మములెల్ల
తోవల నుండెనేమి తొలగిన నేమిరే
ఎటువంటి మనుష్య సంచారంలేని అడవిలో ఎంత పున్నమి వెన్నెలలు కాస్తే మాత్రం ఉపయోగం ఏమిటి? ఎవరికి ఉపయోగం? ఆ వెన్నెల చీకటిని తొలగించినా ఏమీ ఎవరికీ ఉపయోగం ఉండదు కదా! మానవుడు ఏ ధర్మ శాస్త్రాలు చదివినా పురాణాలు చదివినా దానికి పరమార్ధం ఏమిటి? చదివినది ఏ చదువైనప్పటికీ అది శ్రీవేంకటేశ్వరుని దరికి జేరే మార్గం నేర్పాలి. అలా కానప్పుడు మన జీవనంలో ఎన్ని వేదాలు, ధర్మాలు, శాస్త్రాలు పురాణాలు చదివితే నేమిటి? చదవకపోతే నేమిటి? అన్నీ వృధానే కదా! అని ఉద్బోధిస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు: అక్కరకొదగని = అవసరార్ధం ఉపయోగ పడని; అర్ధము = ధనము; ధరణీశుడు = రాజు; దండి = ఎక్కువగా; యెండెనేమి = లేకపోవడం; పండెనేమి = ఉంటే ఏమిటి?; బెండుపడు = ఏ ఆధారంలేనటువంటి; బేరుకొను = పేరు స్మరించడం; అడపుల = కన్నుపెట్టి చూడడం; కావిరి = నలుపు, చీకటి అన్న అర్ధంతో వాడబడినది; తోవల = మానవుని జీవన రహదారిలో.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *