March 19, 2024

ఒద్దిరాజు అపూర్వ సోదరులు

రచన: శారదాప్రసాద్

‘ఒద్దిరాజు అపూర్వ సోదరులు’ గా ప్రసిద్ధులైన సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గార్లు సంస్కృతాంధ్ర పండితులు మరియు ప్రచురణ కర్తలు. ఒద్దిరాజు సీతారామచంద్రరావుగారు ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారు ఒద్దిరాజు సోదరులలో చిన్నవాడు. వీరికి సుమారు పది భాషలలో పాండిత్యం ఉంది. వీరి తల్లిదండ్రులు వెంకట రామారావు మరియు రంగనాయకమ్మలు. వీరు వరంగల్లు మండలం మానుకోట తాలూకా, ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు. ఈ గ్రామం నుండే వీరు తెనుగు అనే పత్రికను నడిపారు. ఈ పత్రిక 1922 ఆగస్టులో 500 ప్రతులతో ఆరంభమై ఐదు సంవత్సరాలు తెలంగాణ ప్రజా చైతన్యానికి దోహదం చేసింది.
వీరు 1918లో విజ్ఞానప్రచారిణీ గ్రంథమాలను స్థాపించి విజ్ఞానదాయకమైన పుస్తకాలను ప్రచురించి తెలంగాణాలో విజ్ఞానవ్యాప్తికి తోడ్పడ్డారు. వీరు నిజాం కాలంలో తెలంగాణా ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవానికి దోహదం చేశారు. వీరు ఇంగ్లీషు, ఉర్ధూ, పారసీక, సంస్కృత భాషలు నేర్చారు. సంగీత సాహిత్యాలలో నైపుణ్యం సాధించారు. చరిత, విజ్ఞానశాస్త్రం, వైద్యం మొదలైన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన ఎన్నో వ్యాసాలను వ్రాశారు. తెనుగు పత్రిక మొత్తము 12 పేజీలను వీరు తమ రచనలతోనే నింపేవారు. నిజానికి వారు పరిశోధకులు, సంఘసంస్కర్తలు, రచయితలు, కవులు, విమర్శకులు, చిత్రకారులు, ప్రచురణకర్తలు, ముద్రాపకులు, సంపాదకులు, చర్మకారులు, కుట్టుపనివారు, సూట్‌ కేసులను తయారీ చేసినవారు, గృహనిర్మాతలు , వాస్తునిపుణులు, జ్యోతిష్కులు, ఆయుర్వేదం, హోమియోపతీ, అల్లోపతీలలో వైద్యులు, నూతన ఔషదాలను తయారు చేసినవారు, ఫార్మసీలను స్థాపించినవారు, శస్త్రచికిత్స జరిపినవారు. బియ్యం మిల్లు, నూనె మిల్లు, పిండిమరలు స్థాపించి నడిపినవారు. సబ్బులు, ఇంకులు, రకరకాల నూనెలు, రొట్టెలు తయారు చేసినవారు, పుస్తకాల బైండింగులు చేసినవారు, తాపీపని, వడ్రంగిపని చేసినవారు, పశువైద్యం తెలిసినవారు.
ఇన్నిరంగాలలో కృషి చేసినవారు ఇప్పటికీ లేరంటే అతిశయోక్తి కాదు. విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను ప్రారంభించి వందకుపైగా పుస్తకాలను ప్రచురించారు. ఒద్దిరాజు జంటకవులు రచించిన ప్రసిద్ధ కావ్యాలు కొన్ని–రుద్రమదేవి, తపోభంగం, శశ విషాణం, సౌదామినీ పరిణయం, సంధ్యారాగం, భక్తిసార చరితం, మిఠాయిచెట్టు, గ్రీకు పురాణ కథలు మొదలైనవే కాకుండా పౌఢ ప్రబంధం, నవలలు, భ్రమర, బ్రాహ్మణ సాహసము, స్త్రీ సాహసము, ప్రేమ ప్రవాహము, అవిగాక రవీంద్రుని ‘రెక్‌’ నవల అనువాదము, నౌకాభంగము, నిస్వార్ధ దరిద్రులు, నిరసనోపాఖ్యానం వంటి లఘు కావ్యాలు, నాటికలు ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఆశువుగా సంస్కృతంలో కవిత్వం చెప్పగల దిట్టలు వారు . వారు సంస్కృత, ద్రావిడ, ఆంధ్ర, హిందీ భాషలలో 1200 పైగా గ్రంథాలు రచించారట. ఫోటోగ్రఫీ, విద్యుత్తు చేతిపనులకు సంబంధించిన రచనలు సోదరకవుల బహుముఖ ప్రజ్ఞను చాటుతాయి. త్యాగరాజ ఉత్సవాలను జరిపేవారు. స్వయంగా వీణ, వయొలిన్‌, వేణువు నేర్చుకున్నారు. ఆయా వాయిద్యాల్ని వారే తయారు చేసుకునేవారట!ఒద్దిరాజు సోదరులు కలిసి ‘ఉపదేశ రత్నమాల, తిరుప్పల్లాండు, భక్తిసార చరిత్ర, సంస్కృత వ్యాకరణము రచించారు. వారు ‘తెనుగు’ పత్రిక నడిపే సమయంలో పత్రిక పైభాగాన ఇలా ప్రచురించేవారు.
తే. గీ. వార్తయందు జగము వర్థిల్లు తున్నది
యదియు లేనినాడ యఖిలజనులు
నంధకార మగ్నులగుదురు గావున
వార్త నిర్వహింప వలయు బతికి’

అది వారి ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తోంది. బహుముఖ ప్రతిభావంతులు, తెనుగు పత్రికా సంపాదకులు ఒద్దిరాజు సోదరులు తమ పత్రికలో చాలా చక్కని వ్యాసాలు రచించారు. ఆ రోజుల్లో వారు తెనుగు పత్రిక కోసం రచించిన సంపాదకీయాలలో తేట తెనుగు తీయదనం తొణికిసలాడేది. ఎక్కడా కఠిన పదాలు లేకుండా సామాన్యమైన పత్రికా పాఠకుడికి సైతం అర్థమయ్యే వచన రచన ఈ సోదరుల ప్రత్యేకత. ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారు 2. 4. 1887న జన్మించి తమ 75వ సంవత్సరం 28. 1. 1956న పరమపదించారు. వారి అనుజులు ఒద్దిరాజు రాఘవ రంగారావు గారు 4. 4. 1894న జన్మించి 17. 5. 1973న తమ ఎనభైవ యేట దివంగతులైనారు.
ఈ బహుముఖ ప్రజ్ఞావంతులకు నా స్మృత్యంజలులు!

15 thoughts on “ఒద్దిరాజు అపూర్వ సోదరులు

  1. i want to purchase certain books of ODDIRAJU SODARLU.. please guide me on, where and how i can get the required books. please help

  2. ఒద్దిరాజుసీతారామచంద్రరావుగారి మనుమడు శ్రీ దయాకరరావుగారు నాకు అనుంగుమిత్రులు. వారు మంచిసాహితీప్రియులు.వ్యవసాయమువారికి ప్రీతిపాత్రమైన విషయము. గొప్ప భూస్వాములు వారు. దయార్ద్రహ్రుదయులు వారికోడలు నావిద్యార్ధిని. నామిత్రుడుశారదాప్రసాద్ వ్రాశిన ఒద్దిరాజుసోదరుల పరిచయవ్యాసము చాలా బాగుంది. మంచి సేకరణ . ఈతరం వారికి ఒద్దిరాజుసోదరులగురించి తెలియదు .వారి గ్రంధాలు లభ్యమగుటలేదు. ఎవరివద్దనైనా ఉంటే తెలుపగలరు. పరిశొధనకు ఉపకరిస్తాయి.మామిత్రుడు శారదాప్రసాద్ కు ధన్యవాదములు..
    ….వి.యస్.కె.హెచ్.బాబురావు.

  3. ‘ఒద్దిరాజు అపూర్వ సోదరులు’ గా ప్రసిద్ధులైన సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గార్ల గురించి చాలా విషయాలు తెలియ చేసినందులకు ధన్యవాదాలు శారదా ప్రసాద్ గారు.
    నాగయ్య

  4. చక్కని విషయములు తెలియ చేయు చున్నారు.

  5. ఒద్దిరాజు సోదరులు గురించి చక్కగా వివరించారు.అభినందనలు.

  6. ఒద్దిరాజు సోదరులు గురించి చక్కగా వివరించారు.అభినందనలు.

  7. ఒద్దిరాజు సోదరుల పేరు వినడమే గాని, విపులంగా ఇప్పుడే తెలిసింది. మంచి వ్యాసాన్ని అందించిన మీకు అభినందనలు.

  8. నేటి యువతరానికి తెలియని ఈ అపూర్వ సోదరులను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు!

  9. ఇటువంటి రచనలు మరెన్నో మీనుండి రావాలని ఆశిస్తున్నాను!

  10. ఒద్దిరాజు సోదరులను గురించి వివరంగా తెలియచేసినందుకు అభినందనలు!

  11. చరిత్రలో మరుగున పడిన విశిష్ట వ్యక్తులను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *