March 19, 2024

ఆచరణ కావాలి.

రచన: గిరిజరాణి కలవల

రాత్రి తొమ్మిది అవస్తోంది. కోడలు హోటల్లో నుంచి తెప్పించిన టిఫిన్ తినేసి తన రూమ్ లోకి వెళ్ళబోతూ.. మనవడిని పిలిచారు రామారావు గారు.
” చిన్నూ ! ఇక రా, బజ్జుందువుగాని, తొమ్మిదవుతోంది, మంచి కధ చెపుతాను విందువుగాని..” అని పిలిచారు.
” ఉండండి.. తాతయ్యా ! ఈ గేమ్ సగంలో వుంది అయ్యాక వస్తాను. మీరు పడుకోండి.” టాబ్ లోనుంచి తల పైకెత్తకుండానే, ముక్కు మీదకి జారిపోతున్న కళ్ళజోడుని పైకి లాక్కుంటూ, అన్నాడు మనవడు చిన్నూ.
చేసేది లేక రామారావుగారు రూమ్ లోకి వెళ్ళి మంచం ఎక్కారు. ఇదివరకు ఎప్పుడైనా వచ్చినప్పుడు.. ఇంట్లో అందరూ కలిసే భోంచేసేవాళ్ళం.. కబుర్లు చెప్పుకునేవాళ్ళం.. మనవడు తనని వదిలి
పెట్టేవాడు కాదు. ప్రతీరోజూ కధ చెప్పించుకోనిదే నిద్రపోయేవాడు కాదు. కోడలు రమ్య కూడా అత్తగారి వెనకాలే తిరుగుతూ.. కొత్త రకం వంటలు నేర్చుకుంటూ, పూజలూ, నోములూ అంటూ ఏదో ఒకటి చేస్తూనే వుండేది. ఏడాదికోసారో, రెండుసార్లో వచ్చి తిరిగి వెళ్ళపోయేవారు తామిద్దరం. రిటైర్ అయ్యాక కొడుకు ఇక్కడకి వచ్చెయ్యమన్నా కూడా, సొంతవూరి మమకారంతో వున్న వూళ్లో నే వుండిపోయారు రామారావు దంపతులు. నాలుగు నెలల క్రితం రామారావుగారి భార్య కాలం చేయడంతో, కొడుకు, కోడలు బలవంతం పెట్టి ఇక్కడకి తీసుకువచ్చేసారు. ఆయన కూడా వంటరిగా వుండలేక, చేయి కాల్చుకోవడం చేతకాక, మనవడితో కాలక్షేపం అయిపోతుందన్న భ్రమతో ఇక్కడకి వచ్చేసారు. అయితే..
వచ్చినప్పటి నుండీ గమనిస్తున్నారు ఆయన ఇంట్లో వచ్చిన మార్పులు. కొడుకు, కోడలు, మనవడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వున్నారు. ఆఫీసు నుంచి రాగానే కొడుకు వాసు , స్కూల్ నుంచి రాగానే మనవడు, వీళ్ళిద్దరూ వెళ్ళిపోగానే కోడలు రాధ, ఈ ఫోను, టాబ్ లతోనే గడిపేస్తున్నారు. ఎవరో తరుముకు వస్తున్నట్టు హడావుడిగా పని ముగించుకుని రాధ.. ఇక దీనితోనే గడపడం రామారావుగారికి నచ్చలేదు. ఇంట్లో మరో మనిషి ఉన్నాడన్న ఆలోచనే లేదు వీళ్ళకి. మధ్యలో ఇద్దరూ కలిసి అప్పడప్పుడు పిల్లాడిని మాత్రం దెబ్బలాడతారు. ‘అస్తమానూ ఆ టాబ్ తో ఆటలేంటీ? చదువు వద్దా?’ అని, అన్న ఆ కాసేపు పుస్తకాలు ముందేసుకుని వీడు కూర్చుంటాడు. వాళ్ళ లోకం లోకి వాళ్ళు మునిగిపోగానే వీడు మళ్లీ మామూలే. రామారావుగారికి మాత్రం ఆ న్యూస్ పేపరూ, టివీ ఎంతసేపని కాలక్షేపం ఇస్తాయి. ఆ టివీ లో వచ్చే పనికిరాని వాదోపవాదాలూ, చర్చలూ చూడాలంటే విసుగు ఆయనకి. కాస్త న్యూస్ బులెటిన్ చూసేసి ఆపేస్తారాయన. ఉదయం, సాయంత్రం అలా రోడ్డు మీదకి వాకింగ్ వెళ్లి దగ్గర్లో వున్న పార్కులో కాసేపు కూర్చుంటారు. అక్కడా అందరూ ఇదే తంతు. పది మంది వుంటే పదిమంది చేతిలోనూ ఇదే నాట్యమాడుతూ వుంటుంది. మనుషులు దగ్గరగానే వుంటున్నారు కానీ వాళ్ళ మధ్య మాటలే కరువైపోతున్నాయి. ఏ ఇంట్లో చూసినా ఇలాంటి నిశ్శబ్దమే చోటు చేసుకుంటోంది. మార్పు వచ్చే సూచనలే కనపడ్డం లేదని, రామారావు గారు నిట్టూరుస్తూ, నిద్ర కి ఉపక్రమించారు.
ఇంతలో ఆ టాబ్ కి చార్జింగ్ అయిపోయినట్టుంది దాన్ని పక్కన పడేసి మనవడు చిన్నగా తాతగారి పక్కలో దూరాడు.
” తాతయ్యా! పడుకున్నారా?”
” లేదు. చిన్నూ! ఏంటి సంగతి?” అని అడిగారు.
” కధ చెప్పండి తాతయ్యా!” అన్నాడు చిన్నూ. ఇన్నాళ్ళకి కధ అడిగాడని ఆనందంతో వాడిని దగ్గరకి తీసుకుని,
” ఈ రోజు ఓ మంచి నీతి కధ చెపుతాను విను.
ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు ఒక స్త్రీ తన కొడుకును తీసుకుని వచ్చింది. స్వామీ! నా కొడుకూ ప్రతిరోజూ బెల్లం ఎక్కువగా తింటాడు. అలా తింటే మంచిది కాదని చెప్పినా వినిపించుకోవడం లేదు. మీరు నాలుగు మంచి మాటలు చెప్పి, వాడికి ఆ పాడు అలవాటు మానిపించండి. అని మొర పెట్టుకుంది. దానికి పరమహంస… నాలుగు రోజులాగి నీ కొడుకుని తీసుకు లసినదిగా చెప్పి పంపేసారు. ఆవిడ అలాగే అని చెప్పి, నాలుగు రోజుల తర్వాత మళ్లీ వచ్చింది. అప్పుడు పరమహంస ఆ పిల్లవాడికి, బెల్లం తింటూ వుంటే కలిగే అనర్ధాలు వివరించి చెప్పి, ఆ పిల్లవాడికి మనసు మార్చి, ఇకపై బెల్లం తిననని మాట తీసుకుని, పంపారు. ఇదంతా చూస్తున్న శిష్యుడొకరు, స్వామీ! ఇంత చిన్న విషయం చెప్పడానికి తమరు నాలుగు రోజుల వ్యవధి తీసుకున్నారెందుకు? మొదటి రోజే ఈ మాటలు చెప్పకపోయా రా? అని అడిగాడు. దానికి సమాధానంగా స్వామి.. ఏం చెప్పారో.. తెలుసా? మనము ఇతరులకి చెప్పే మంచికానీ, సలహా కానీ, ఏదైనా సరే.. ఏదో ఊరికే నోటికి వచ్చినట్టు చెప్పడం కాదు.. దానిని మనం ఆచరించి చెప్పాలి. అప్పుడే మనం ఒకరికి చెప్పదగ్గ అర్హులమవుతాము. ఈ పిల్లవాడి విషయంలో ముందు రోజే నేనెందుకు చెప్పలేదంటే…. నేనూ బెల్లం, తీపి పదార్థాలు ఎంతో మక్కువ గా తింటూ వుంటాను. అటువంటప్పుడు అది తప్పని ఎలా చెప్పగలను? అందుకే ఈ నాలుగు రోజుల్లో నేను ఆ తీపి మీద ఇష్టం పోగొట్టుకుని, ఆ అలవాటు మానుకుని, ఇప్పుడు అతనికి అది వద్దు, కూడదని చెప్పగలిగాను. అందుకే నాలుగు రోజులాగి రమ్మని చెప్పాను అని వివరించారు. ఈ కధలో నీకు తెలిసిన నీతి ఏంటి చిన్నూ? ” అని మనవడిని అడిగారు.
” ఎదుటివారికి మంచి చెప్పేటపుడు.. ఆ మంచిని మనము ఆచరించాలి, అని కదూ తాతయ్యా! ” అన్నాడు. ” ఔను, చిన్నూ! చక్కగా గ్రహించావు.. పడుకో.. రేపు మరో కధ చెపుతాను. ” అంటూ రామారావు గారు వాడిని చిన్నగా జోకొట్టసాగారు.
మరునాటి ఉదయం.. మోర్నింగ్ వాకింగ్ వెళ్ళడానికి రామారావుగారు సిధ్ధమవుతున్నారు. ఇంతలో చిన్నూ కూడా లేచి హాల్లోకి రాగానే” గుడ్ మార్నింగ్ చిన్నూ! ” అని విష్ చేసారు. వాడు కూడా” గుడ్ మార్నింగ్ తాతయ్యా! ” అని జవాబు చెప్పి, ఆ టాబ్ పట్టుకుని కూర్చున్నాడు. అప్పటికే ఫోన్ లు పట్టుకుని అందులో మునిగిపోయిన తల్లిని తండ్రిని పట్టించుకోనే లేదు వీడు. చిన్ను మాటలు విని రమ్య లోపల నుంచి బయటకి వచ్చి..” పొద్దున్నే టాబ్ పట్టుకుని కూర్చున్నావా? లేచి బ్రష్ చేసుకో.. పాలు తాగడం, స్నానం చేయడం లేకుండా, పొద్దస్తమానూ ఆ టాబ్ తోనే గడుపుతావు.. అస్సలు మాట వినడం లేదు నువ్వు.” అని ఓ అరుపు అరిచి, తానేదో వాట్స్ఆప్ మెసేజ్ లు చూడడంలో మునిగి పోయింది.
వాసు కూడా రమ్య మాటలు విని..” ఔను.. చిన్నూ.. నీకు ఈమధ్య చదువు మీద శ్రద్ధ తగ్గుతోందనీ.. సరిగ్గా చదవడం లేదనీ మీ స్కూల్ నుంచి నాకు మెసేజ్ లు వస్తున్నాయి. ప్రతీ సబ్జెక్టులోను తక్కువ మార్కులు వస్తున్నాయి. ఈ టాబ్ తో ఆటలు ఎక్కవ అయిపోయాయి నీకు.. దాని మీద పెట్టే శ్రద్ధ చదువు మీద పెట్టు..” అని తన వంతుగా చిన్నూ మీద విరుచుకుపడ్డాడు.
తల్లితండ్రుల కోపం చూసి వాడు కించిత్ కూడా తొణకకుండా, ” నాన్నా! లెక్కల సబ్జెక్టు మార్కులు తగ్గాయని ట్యూటర్ ని పెట్టించారు. ఆయన ఫోను చూసుకుంటూ కూర్చుంటున్నాడు, సరిగ్గా చెప్పడం లేదని, మీరే తీసేసారు. ఇదివరకు ఆఫీసు నుంచి వచ్చాక మీరు నా దగ్గర కూర్చుని హోమ్ వర్క్ చేయించేవారు. చదివించేవారు. అమ్మ కూడా, నేను స్కూల్ నుంచి రాగానే, ఏం చెప్పారు క్లాస్ లో అని అడిగేది. చక్కగా ఏదో ఒక చిరుతిండి, బామ్మ దగ్గర నేర్చుకున్నవి జంతికలో, చేగోడీలో, కజ్జికాయలో పెట్టేది. ఇప్పుడేమో.. బయట ఆర్డర్ ఇచ్చేసి పిజ్జాలు, బర్గర్ లూ తెప్పిస్తోంది.
ప్రతీ ఆదివారం పార్కుకో, జూకో, ఎక్కడకో అక్కడికి తీసుకువెళ్ళేవారు. ఇప్పుడు మీరిద్దరూ ఆ ఫోనులలో మునిగిపోయి నన్ను పట్టించుకోవడం మానేసారు. నేనేమైనా అడిగానా…మిమ్మల్ని టాబ్ కొనిపెట్టమనీ.. నేను సైకిల్ అడిగితే కాదని.. ఇది నాకు బర్త్ డే గిఫ్ట్ అని కొనిపెట్టారు. నేనేం చెయ్యాలి చెప్పండి. ఇది మీరే నాకు అలవాటు చేసారు. ఇప్పుడు నేను దీన్ని వదలలేక పోతున్నాను. అయినా… మీరు నాకు చెప్పే ముందు.. మీరు పాటించి చూపండి. మీరైతే అస్తమానూ చూడొచ్చు.. నేను చూడకూడదా? అవి మానేసి నా దగ్గర, నాతో గడపండి. అంతవరకూ నేనూ మీ దోవలోనే నడుస్తాను. ” అని జంకు గొంకు లేకుండా తండ్రితో చెప్పాడు చిన్నూ..
అంతే.. వాడి మాటలకి వాట్స్ఆప్ చూసుకుంటున్న రమ్యా…. ఫేస్బుక్ చూసుకుంటున్న వాసూ.. చిన్నూ ఫేస్ లోకి తలెత్తి చూడలేకపోయారు.
ప్రభాత సూర్యోదయవేళ.. మనవడు వాళ్ళమ్మ, నాన్నలకి చేసిన ఙ్ఙానోదయానికి వస్తున్న నవ్వు ఆపుకుంటూ, మనసులో శ్రీ రామకృష్ణులవారికి ప్రణామం సమర్పించి, రామారావుగారు వాకింగ్ కి బయలుదేరారు. తాను వాకింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి తాను కోరుకున్న విధంగా, ఇదివరకటి రోజులలాగే వుంటుందన్న పూర్తి నమ్మకం ఆయనకు కలిగింది. మనవడు మాటలపై పూర్తి భరోసా వచ్చేసింది రామారావు గారికి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *