March 19, 2024

ఎన్నెన్నో జన్మల బంధం

రచన: కొప్పరపు సుబ్బలక్ష్మి

అయ్యగారు, స్నానం చేయించి బట్టలు మార్చాను. చిన్న గ్లాసు పాలు కూడా పట్టాను. సాగరంగారు కారేజి ఇచ్చి వెళ్ళారు.
నేను వెళ్తానండయ్యా.
సాయంత్రం రా రాములమ్మా, స్నానం చేయించి వెళుదువుగాని.
సరేనయ్యా.
రామచంద్రంగారు అనుష్టానం పూర్తి చేసుకుని గావంచాలోనుండి అడ్డపంచలోకి మారి, సుశీల గదిలోకి వచ్చారు, తను నిద్రపోతోంది.
అలికిడికి కళ్ళు తెరిచింది. పెదాలమీద సన్నని చిరునవ్వు.
లేచేశావా. ఫారెక్స్ బేబికి టిఫిన్ పెడతానుండు అంటూ కారేజి తెరిచి ఒక ఇడ్లీ పాలల్లో వేసి మెత్తగా కలిపి తీసుకొని వచ్చారు.
నెమ్మదిగా లే.
నేను పెడతాగా. గబగబా తింటే గొంతుకడ్డం పడుతుంది. బాగా మెత్తగా చేసాను నిదానంగా తిను.
చేయడ్డం పెడుతున్నావు, అప్పుడే చాలా. మొత్తం తినేదాక నేను కదలను.
అదీ అలా తినాలి. మీదపడకుండా బాగా తిన్నావు, గుడ్. నేను తుడుస్తానుండు.
అమ్మయ్య ఈపూటకీ ప్రహసనం అయింది. నేను కూడా రెండిడ్లీలు తిని వస్తాను అనుకుంటూ సాగరం తెచ్చిన ఇడ్లీలు కొబ్బరి చట్నీ నెయ్యి తో కానించేసారు.
*****
మొబైల్ లో అమ్మవారి సహస్రనామం పెట్టి, తలదువ్వి చెదరిన బొట్టు సరి చేస్తూ అద్దం ఇవ్వనా అన్నారు.
.
.
నేను ఎదురుగావుండగా అద్దం ఎందుకా.
అహ ఏం చెప్పావే.
ఎంత కళగా వున్నావో.
అవును నా దిష్టే తగులుతుందేమో.
నీకు తెలుసా సుశీలా, సాగరం డిగ్రీ చేసి ఆడిటర్ దగ్గర చేసేవాడట. పొద్దున్నుండి రాత్రి వరకు చేయించుకుని ఆరువేలు చేతిలో పెట్టేవాడట. వాళ్ళావిడ చాలతెలివైనది. గొట్టుచాకిరి జానాబెత్తెడు జీతంతో బ్రతుకుబండి
లాగలేమని మనలాంటి వాళ్ళకు పదిమందికి కారేజీ భోజనాలు ఇస్తున్నారు , యాభైవేలు సంపాదిసున్నారు. మనకేమయినా మసాలాలు, వేపుళ్ళు కావాలాయేమన్నానా.
ఉద్యోగమంటావా. వదిలేశాడు. ఇద్దరూ ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. రోజు మొత్తంమీద నాలుగైదు గంటలు పని.
తిరగాలిగా అంటావా
ఏముంది వాయిదాలమీద బండి కొన్నాడట. సాగరం వాళ్ళావిడ సాయంత్రంపూట చిన్న తరగతి పిల్లలకు ట్యూషన్ చెప్పి పదోపరకో సంపాదిస్తుందిట. చూస్తుండగానే నాలుగురాళ్ళు వెనకేసుకుని నాలుగయిదేళ్ళలో చిన్న ఇల్లు కొనుక్కుంటారు చూడు.
*****
మందుబిళ్ళలు ఇస్తాను వేసుకో.
నీళ్ళు పడతాను.
నువ్వు గబగబా తాగేస్తావు రైలు వెళ్ళి పొతుందేమో అన్నట్లు.
వద్దంటావేమిటి. ఈ జ్యూస్ తాగితే గుర్రంలా పరుగెడతావు. ఓ చెంచా తేనే కూడా వేసాను చిలకలా పలకాలిగా.
అ,….ఆ.,.
ఏమిటి పెద్దవాడినుంచి ఫోనా
చేసాడు. అంతా కుశలమే. బొంబాయి ఉద్యోగం. థానేలో కాపురం. ఉరుకులు పరుగుల జీవితాలు.
క ,,,,. కో
కోడలుకూడా కష్టపడుతోంది అంటావా
ఎవరి పిల్లలకోసంవాళ్ళు కష్ట పడతారు. అది సహజం. నువ్వు మాత్రం నీ ఉద్యోగం, పిల్లలు. చాదస్తపు మొగుడు, వృధ్ధులయిన అత్తమామలు ,అన్నీ చూసుకోలేదా.
అందుకే రిటైరయిన తరువాత ఎవరిదగ్గరకూ వెళ్ళకుండా ఇక్కడే వున్నది. వాళ్ళమీద ప్రేమ లేక కాదుకదా.
చిన్నవాడా …పై నెలలో వస్తాడుట. పిల్లలకు ఈస్టరు శెలవులున్నాయిట.
అప్పుడే వాణి, అల్లుడు, మనుమరాలు కూడా వస్తున్నారు.
అయినా నాలుగునెలలేగా అయింది వాళ్ళందరూ వచ్చి వెళ్ళి. శులవులు చూసుకోవాలిగా, అన్ని తుమ్మితే వూడే ముక్కులే.
ఆకలేస్తోందా. అరగ్లాసు బత్తాయిరసం కడుపు నిండేనా. పన్నెండయిందిగా అన్నం పెడతాలే.

మెత్తగా వండిన అన్నం, మిరపకాయ లేకుండా చేసిన బీరకాయకూర, చారుపొడి తక్కువగా వేసిన చారు, పలుచగా ఆకుకూర పప్పు, గోరు ముద్దలుగా అన్నం తినిపించారు రామచంద్రంగారు.
రోజు సాగరం పప్పు కూరలు తెస్తే ఆయన రెండు గ్లాసుల బియ్యం విద్యుత్ కుక్కర్ లో వండుకుంటారు.
సాయత్రం రామచంద్రంగారికి రెండు చపాతీలు కూర, సుశీలమ్మగారికి పలుచని బియ్యపు జావ తెచ్చి ఇస్తాడు.
కళ్ళుమూతలు పడుతున్నాయిలా వుంది. అన్నం తినంగానే పడుకోవద్దు. వైకుంఠపాళి ఆడుదాము.
నువ్వప్పుడే గట్టెక్కేసావా. నేను ఒప్పుకోను, నువ్వు తొండి చేస్తున్నావు.
నాకు కూడా నిద్ర వస్తోంది. ఓ కునుకు తీయాలి.
*****
నాలుగింటికల్లా ఫిజియోథెరపిస్ట్ వచ్చి కేరళ నూనెలు రాసి మసాజ్ చేసి చిన్న చిన్న ఎక్సరసైజులు చేయించింది.
కుర్చీలోనే కూర్చోబెట్టి స్నానం చేయించింది రాములమ్మ.
ఇట్లాంటప్పుడయినా నైటీ వేసుకోమని కోడళ్ళు చెబితే ససేమిరా అన్నారు సుశీలమ్మగారు. డబ్బాలోవున్నట్టుందంటూ.
లక్షణంగా చీరే కట్టమన్నారు.
నూనె మరకలంటిన పక్కబట్టలు మార్చి పడుకోబెట్టంగానే నిద్రలోకి జారుకున్నారు.
పొద్దున్నుండి తీయని పేపరు పట్టుకుని వరండాలో వాలుకుర్చీలో చేరారు రామచంద్రంగారు కళ్ళద్దాలు సవరించుకొంటూ.
నీ గోళ్ళు బాగా పెరిగాయి తీస్తా అంటూ ఆమె పాదం తన చేతిలో పట్టుకొని నెయిల్ కట్టర్ తో తీయసాగారు.
సుశీలమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
అరెరె అదేమిటి. మనం పిల్లలకు ఇలాగే గోళ్ళు తీసేవాళ్ళం కదా. కత్తిరించిన గోళ్ళకు గోరింటాకు ఎంత అందమిస్తుందో. పిల్లలతో పాటు నా చేతికి కూడా గోరింటాకు పెట్టి మురిసిపోయేదానివి.
లేడికి లేచిందే పరుగన్నట్టు పెరట్లో గోరింటాకు కోసి పిసరంత చింతపండు వేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి తెచ్చారు.
ఏమిటి ఎవరు పెడతారనా. నేను వున్నానుగా,
ఆవిడ చేయి తన చేతిలోకి తీసుకుని మధ్యలో నిండు చందమామని చుట్టూ ఆరు నక్షత్రాలను, వేళ్ళకు టోపీలు దిద్దారు.
అవును సుశీ
ఎందుకా కోపం. ఓహ్ సుశీ అన్నాననా.
మన పెళ్ళయి మూణ్ణిద్దర్లకని మా ఇంటికి వచ్చినప్పపుడు మా అక్కయ్యలు పేర్లు చెప్పందే లోపలికి రానివ్వమన్నారు.
నువ్వేమో రామచంద్రంగారు నేను వచ్చాము అన్నావు.
నేనేమో ఏదో మురిపంగా సుశీ నేనూ వచ్చాము అన్నాను.
అంతే చివ్వున నా పేరు సుశీల సుశీ కాదన్నావు. సుశి ఏమిటి మశి లాగా అనేదానివి.
నీకు సంగీతమంటే ఇష్టం కదా. బాలమురళి కీర్తనలు పెట్టనా,
నీకు గుర్తుందా పెద్దవాడి విషయంలో నేను వాడిని కోప్పడ్డానని వంటింట్లో” శాంతము లేక సౌఖ్యము గలదా” అని పాడుతున్నావు. అంతే నా కోపమంతా గాల్లోకి పోయింది.
అంతగా నవ్వద్దు. దగ్గొస్తుంది.
అయ్యగారు అమ్మగారి తల జిడ్డుగావుంది. రేపు తొందరగా వచ్చి తలస్నానం చేయిస్తానండి.
సుశీలకు ఎంత పెద్ద జడ వుండేది. ఈ మాయదారి జబ్బుతో అంతా పోయి పిడచకొచ్చింది.
జడ అంటే గుర్తుకొస్తోంది. నేను ఓరియంటల్ కాలేజి రాజమండ్రిలో పూర్తి చేసుకుని విజయవాడ వచ్చాను. చల్లపల్లి వారి స్థలంలో చిన్మయానందస్వామి వారి భగవద్గీత వుపన్యాసాలు జరుగుతున్నాయి. ఒడిలో జడ పెట్టుకుని నువ్వు ఆయన చెప్పేది రాసుకుంటున్నావు. మా అమ్మ నీది అసలు జుట్టేనా సవరమా అని పట్టుక చూసింది. అలా మాటలు కలిపి మీకు మాకు ఏదో బీరకాయ సంబంధం వుందని తేల్చింది. అలా ఈ ఇంటికి ఆ ఇంటికి రాకపోకలు పెళ్ళి దాక వచ్చింది. మనది జడ బంధం. లేత ఆకుపచ్చ రంగు చీరలో ఎంతబాగున్నావో.
అంత గుర్తుందా అనా
మనసు తీసిన వీడియోలు చెరిగి పోవు చెదరిపోవు.
ఇంత పెద్ద జడకు ఎన్ని డబ్బాల కొబ్బరినూనె ఎన్ని శేర్ల కుంకుడు కొనాలో అనుకున్నా.
మాటలు రాకపొవడం బాధగావుందా. నేత్రావధానం చేస్తున్నావుగా.
“మూగవైననేమిలే నగుమోమె చాలు-లే”
“మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే, మాటలురాని కోయిలమ్మ పాడునులే”
గోరింటాకు ఆరిపొయింది కడుగుతానుండు.
బేసిన్లో నీళ్ళతో చేతులుకడుగుతూ గాజులు సవరించి
ఈ బంగారుగాజులు నీ చేతులమీదకన్నా బాంకులోనే ఎక్కువ కాలం వుండేవి. పిల్లలు సంపాదనపరులయిన తరువాత కదా స్ధిరంగా వున్నాయి. బాంకిలో పెడుతున్నప్పుడల్లా “ నిధి సుఖమా” అని పాడేదానివి.
తుండుతో చేతులు తుడిచి దూమెరుగ్గా కొబ్బరినూనె రాశారు,
అన్నీ గతించిన రోజులంటావా, చేదు తీపి అన్నీ గుర్తుంటాయి,కదా.
రాములమ్మ రాలేదింకా, నీ పని కానిచ్చి నేను స్నానంచేసి సంధ్య వార్చుకుంటాను.
రాములమ్మ వస్తుందిలే అంటావా. చిరాగ్గా వుండదూ
అ,…అ
అయ్యో లేదు కుయ్యో లేదు అంటూ డయపర్లు మార్చి పళ్ళు తోముతుండగా కంగారుపడుతూ రాములమ్మ వచ్చింది.
అయ్యగారు ఆలీసమయింది, మావోడు తాగొచ్చి రాత్రి నన్ను చితక బాదేశాడండి, ఆడ్ని బయటకు తోలేసానండి. సచ్చినోడు పొద్దునే పనికొస్తుంటే వంద రూపాయలిమ్మని గొడవేసుకున్నాడండి, ఏం చేత్తానండి ఓ యాభై రూపాయలిచ్చుకున్నానండి. అమ్మగారిపని నేనొచ్చి చేస్తాగదండి.
తాగడానికి డబ్బులిచ్చి మరీ చెడగొడుతున్నావు కదా,
ఇయ్యకపోతే యాగీ చేత్తాడండి తాగుడే లేకపోతే ఆడు రాములోరంత మంచోడండి,
సరేలే ….. ఆ డయపర్లు అయిపోయినట్టున్నాయి, ముందుగా చెబితే తెస్తాగా,
ఏటమ్మా కల్లనీల్లెట్టుకుంటన్నారు.
భార్య భర్తకు సేసినప్పుడు భర్త భార్యకు సేత్తే తప్పేంటమ్మా. కళ్ళు తుడుత్తా నుండండి.
అలా చెప్పు రాములమ్మా
ఏమిటి వెళ్ళి పోవాలనుందా, “ఎక్కడికి పోతావు చిన్నదానా”
“నన్ను వదలి నీవు పోలేవులే,
అదీ నిజములే”
అయ్యగారు బలే నవ్విత్తారమ్మా
మారాజులాంటారమ్మా. అట్టా అనుకోమాకండమ్మా. సిన్నప్పటికన్నా వయసొయినప్పుడే ఒకరికొకరు కావాల.ఆరికి మనం మనకారూనూ. బగమంతుడెట్టిన బంధం.
ఇవ్వాళ స్పీచ్ ధెరపిస్ట్ వచ్చేరోజు. సుశీలకు స్నానం తొందరగా చేయించు రాములమ్మా.
సరేనండయ్యా
స్నానం చేసిన ఆవిడ నుదుట కుంకుమ దిద్ది అమ్మవారికి చేసిన అభిషేక జలం కొంచెం తాగించి ఆ జలమే కాళ్ళకు చేతులకు రాశారు.
తలస్నానం చేసావుగా నిద్ర వస్తోందిలావుంది ఓ అరగంట పడుకో.
*****
ఓ సుందరమా రా రా.
ఆదివారం పేపరు పట్టుకుని వరండాలోకి చేరారు మిత్రులిద్దరూ
సుశీల ఎలా వుందిరా,
కాళ్ళు చేతులు కదల్చగలుగుతోంది. ఇంకా మాటే రావడంలేదు. అయిదారు నెలలు పడుతుందంటున్నారు.
వైద్యం జరుగుతోందికదా, ఏదయినా వచ్చినంత తొందరగా పోదుకదా.
ఇదిగో సాగరం వచ్చాడు. ఈనెల డబ్బులు ఇంతవరకు తీసుకోలేదు, కూర్చో తెచ్చిస్తాను
రామచంద్రంగారు లోపల ఆవిడతో ఏదో ఒకటి మాట్లాడుతునే వుంటారు. బయట చాల తక్కువ మాట్లాడతారులా వుంది.
అవునయ్యా సాగరం ఆవిడ మాట్లాడినన్నాళ్ళు ఈయన వినేవాడు, ఇప్పుడు వీడు మాట్లాడుతున్నాడు ఆవిడ వింటోంది.
ఆవిడను ఎంత అపురూపంగా చిన్నపిల్లను చూసినట్టు చూస్తారు.
అవును. చెప్పడం వీడికి ఇష్టం వుండదు గాని, రిటైరయిన తరువాత పిల్లలను ఇబ్బందిపెట్టడం ఆధారపడడం వీళ్ళకు రుచించక , వచ్చిన డబ్బుతో సూర్యచంద్రులు కాపురముండే పెంకుటింటిని డాబా చేసారు. ఇద్దరికి సరిపడా పెన్షన్ వస్తోంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఏ సాహిత్య సభ అనో సంగీత కార్యక్రమం అనో వెళ్ళేవాళ్ళు.
ట్యూషన్ చెప్పేవారని ఆరుగంటలవరకు ఇల్లంతా సందడిగా వుండేదని రాములమ్మ చెప్పిందండి.
అవును ఆయన తెలుగు ఆమె లెక్కలు చెప్పేవారు, పిల్లల తల్లితండ్రులు అడిగితే కాలక్షేపం గాను వుంటుందని , ధనమాశించికాదు. వాళ్ళు బలవంతంచేస్తే అదిగో ఆ మూలవున్న హుండిలో తోచినంత వేయమనేవారు.
ఏడాదికొకసారి నేనే వాళ్ళిద్దరి పేర యకవుంటులో వేసేవాడిని. ఎంత వుందని ఏనాడు అడిగేవాడు కాదు. ఆర్ధికంగా వెనకబడిన ఇద్దరు పిల్లలకు అందులో నుండి జీతాలు కట్టించేవాడు. యకవుంటు వాడిది నిర్వహణ నాది.
అలా దాచిన ఆ డబ్బే సుశీలమ్మ వైద్యానికి అక్కరకొచ్చింది, ఇప్పుడయితే పంతుళ్ళ జీతాలు బాగున్నాయి , బతకలేక బడిపంతులుగా చేసినవాళ్ళమే.
ఏదోలేరా, గడిచిన రోజులుకాదు. ముందుముందెలా అని ఆలోచించాలి.
*****
నాన్న మేమున్నన్ని రోజులు అమ్మను మేం చూసుకుంటాం, మీరు కొంచెం విశ్రాంతిగా వుండండి.
అవును మామయ్యగారికి విశ్రాంతి అవసరం.
అమ్మమ్మా నువ్వు కుట్టించిన పట్టులంగా జాకెట్ అంటూ స్రవంతి బామ్మా నాకు తాతయ్య కొత్త బూట్లు కొన్నారంటూ అంటూ-రాఘవ సుశీలమ్మ పక్కన చేరారు.
ఆవిడను ఎక్కువగా విసిగించకండి అంటూ కూతురు కోడలు అంటుంటే
లేదర్రా వాళ్ళ అల్లరే ఆవిడకు బలం అంటూ నవ్వారు రామచంద్రంగారు.
మామయ్యా ఇన్ని రోజులు ఆరోగ్యంగా వున్నారు కనుక మీరు ఇక్కడే వుంటామంటే మిమ్మల్ని నొప్పించకూడదని సరే అన్నాము. మీరొక్కరే అత్తయ్యకు చేయడం మాఅందరికీ బాధ కలిగిస్తోంది. ఇకనైనా మీరిద్దరూ మాలో ఎవరి దగ్గరైనా వుంటే బాగుంటుంది. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాము.
ఉండండి బెండముక్కలు వేసిన మజ్జిగ పులుసు వాణి చేసింది. వేస్తాను, కొబ్బరి పచ్చడితో నంజుకుని తినండి. ఆ గుప్పెడు అన్నం కూడా పులుసులో కలుపుకోండి.
నాన్నా మేం చెప్పేది కూడా వినండి, అమ్మకు చాలామటుకు నయమయింది కదా. ఇదే వైద్యం అక్కడే చేయిద్దాం. మీకు కూడా వయసు పైన బడిపోతోంది, ఈ నాలుగు నెలల్లో మీరు బాగా నీరసపడిపోయారు. మిమ్మల్నిలా వదలి మేమెలా వుండగలం.
మీరు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా పెంచారో మేము మిమ్మల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటాము.
అయ్యో మీరు చూడరనే శంక లేదమ్మా.
“తాతయ్యా నీకో సర్ప్రైజ్ రావాలి”
రామచంద్రంగారిని చేతులు పట్టుకొని తీసికెళ్ళారు పిల్లలిద్దరూ. ఫిజియోథెరపిస్ట్ సాయంతో అడుగులేస్తున్నారు సుశీలమ్మ.
నిలబడ్డమే కాకుండా పది అడుగులు తడబడకుండా వేసారు ఈ రోజు అంది సంతోషంగా ఫిజియోథెరపిస్ట్.
అయితే అడుగులకు అరిసెలు వేయించాల్సిందే, వాణి రేపు అరిసెలు చేద్దాం అంది కోడలు మాలతి సంబరంగా
ఉ,,ఉ అంటోందిగా వెండి వుగ్గిన్నెలు తెండి నాన్నా.
ఆ పలుకులకు పంచదార చిలకలు కూడా తెద్దామమ్మా.
*****
నాన్నా అమ్మ ఇంకా నిద్ర లేవలేదు చూడండి.
మాసివ్ కార్డియాక్ యటాక్, నిద్రలోనే ప్రాణం పోయిందన్నారు డాక్టర్లు. నెపంలేనిదే ప్రాణంపోదుకదా. ఆవిడ లో చలనం లేదు, ఆయన నోట మాటలేదు.
*****
ఎవరెరరో వస్తున్నారు, పోతున్నారు .రామచంద్రంగారికి ఇవేవీ పట్టలేదు.
పెద్దాడు చిన్నాడు దుఃఖం మింగుతూ తల్లి అంతిమయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు.
వాణి, అత్తయ్య గోధుమ రంగు ఉప్పాడ జరీ కొనుక్కున్నారు, కట్టనేలేదు. అదే కడదాం తీసుకురా.
నాన్నా అమ్మకు నుదుటన బొట్టు మీరే పెట్టండి అని తండ్రిని నెమ్మదిగా ఆవిడ దగ్గరకు తీసుకెళ్ళారు కొడుకులు .
గోధుమరంగు ఎఱ్ఱంచు జరీ చీరలో మధుపర్కాలలోవున్న సుశీల కనిపించింది రామచంద్రంగారికి.
కుంకుమ అద్దిన చెయ్యి, శరీరం పెద్దాడి చేతిలో వాలిపోయింది.
సహచరిని వెదుకుతూ ఆయనలో జీవం వెళ్ళిపోయింది.

*****

1 thought on “ఎన్నెన్నో జన్మల బంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *