March 19, 2024

బాల్యం… ఓ అద్భుతలోకం, ఓ సుందర స్వప్నం

రచన: శ్రీధర్ చౌడారపు

 

ఆ కళ్ళు నిష్కల్మషాలు

ఆ పెదాలపై అనుక్షణం

నవ్వు తాండవిస్తూంటుంది

అది బోసినవ్వో? భళ్ళుమన్న నవ్వో

అక్కడ సిగ్గు

బుగ్గల్లో ఎరుపుతో తలదాచుకుంటూంది

అక్కడ ఉక్రోషం

కాళ్ళను నేలకు బలంగా తాటిస్తుంటూంది

అక్కడ కోపం

“గీ”మంటూ “గయ్యి”మంటూ అరుస్తూంటుంది

అక్కడ ఆశ

కళ్ళను పెద్దవి చేసుకుని

పెదాలు తడుపుకుంటూంటుంది

అక్కడ నిరాశ

సర్వం కోల్పోయి దిగాలుగా కూర్చుంటుంది

అక్కడ గెలుపు

దిగంతాలకెగురుతుంటుంది

అక్కడ ఓటమి

భోరుమని ఏడుస్తూంటుంది

అక్కడ ఆనందం

అంతులేని సంతోషంతో అరుస్తూంటుంది

అక్కడ దుఃఖం

కళ్ళమ్మట కన్నీరై బుగ్గల్ని తడిపేస్తుంటుంది

అక్కడ ధైర్యం

అయినవాళ్ళు చెంతనుంటే బోరవిరుచుకుంటుంది

అక్కడ భయం

అమ్మ ఒళ్ళోకి దూకేయిస్తుంటుంది

ఆ వేషాలన్నీ తాత్కాలికాలే

ఆ ఆవేశాలన్నీ క్షణికాలే

ఆడిపాడి అలసి సొలసిన శరీరం

అమ్మఒడిచేరి నిద్దురపోతే

అన్నీ చేరిపోయేది మరుపు మజిలీకే

మెలుకువస్తే మరోకొత్తలోకం కళ్ళముందే

అదే అదే బాల్యం….

మనందరం దాటివచ్చిన అద్భుతలోకం

కని మరిచేసిన సుందరస్వప్నం
 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *