March 19, 2024

విశ్వపుత్రిక వీక్షణం .. “ప్రేమ రేఖలు”

రచన: డా. విజయలక్ష్మి పండిట్

 

 
మెరిసే మేఘల తివాసీపై
నడిచి వస్తూందా హిరణ్యతార,
ఆమె పాదాలు సోకి అడుగు అడుగుకు రాలుతున్నాయి నక్షత్రాలు ముత్యాల్లా ..,
రాలుతున్న ప్రతినక్షత్ర విస్పోటనం
కురిపిస్తూంది బంగారు రజినివర్షం..,
ధారగా జలజలా రాలుతున్న కాంచనచినుకులు..,
ఆ హిరణ్యతార బంగారు చేలాంచలమై
సముద్రుని ఒంటిపై జీరాడుతూ ..,
భూమ్యాకాశాన్ని కలిపే బంగారు జలతారు వంతెనయింది ..,
ఆ బంగారువారధి రజనిసోపానాలపై
క్రిందుకి దిగితూ వచ్హాడు అందమయిన ఆ పురుషుడు..శశాంకుడు,
సముద్రతలానికి దిగివచ్చి అలలపై మెరుస్తూవయ్యారంగా కదలే బంగారు
హంసనావ నధిరో హించాడు..
అంతలో….ఒక్కక్షణంలో
శశాంకుని ప్రక్కన చేరింది హిరణ్యతార..,
ఇంకేముంది..!
వెండి బంగారు కిరణాలు పరస్పరం ఢీకొని కలిసిపోయి కరిగిపోయి సముద్రునిలో ప్రతిఫలించి
వెలసిందచట ఒక నిర్మల నిచ్చల వెలుగుసంద్రం..!
భూనభోంతరాళాన్ని అల్లుకున్నాయి
ఆ అద్వైత వెలుగుప్రేమరేఖలు …,
ఆకారవికారాలు లేని కేవల అఖండ చైతన్యజ్యోతియై
వెలిగిపోతోంది అంతరిక్షం..,
సమస్తవిశ్వం అలముకుంది ఆదినిశ్శబ్దం..,
లోకాలనలరిస్తూంది ఉప్పొంగే ఓం’కారం,
ఆపాతమధురం ఆ..దివ్యమంగళ నాధం..,

నేకన్న ఆ…కల ఎంతో మధురం
ధన్యం నా జన్మం ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *