April 16, 2024

మాయానగరం 50

రచన: భువనచంద్ర

“షీతల్” ఉద్వేగంతో వణికిపోయాడు కిషన్. రుషి షాక్ తిన్నాడు. ఠక్కున వెనక్కి తిరిగింది షీతల్. కిషన్‌ని చూసి సర్వం మర్చిపోయి అతని కౌగిట్లో ఒదిగిపోయింది. ఆమెని అలాగే పొదివి పట్టుకుని మండపం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. అతని గుండె ఎగసి పడుతోంది. కళ్లవెంట ధారగా నీరు కారుతోంది.
‘రుషి సైలెంటుగా, శబ్దం రాకుండా గుడిలో వున్న అవధానిగారి దగ్గరకు చేరాడు. బిళహరి అక్కడే వున్నది. జరిగిన విషయాన్ని లోగొంతుకతో బిళహరికీ, అవధానిగారికీ చెప్పాడు రుషి.
“మనంతట మనం ఏమీ అడగవద్దు. ఇద్దరూ హిందీ(గుజరాతీ)వాళ్ళే., అసలు వారిద్దరి మధ్య వున్న సంబంధం ఏమిటో మనకి తెలియదు గదా. ఏదో కష్టంలో వుండి ఇక్కడి కొచ్చింది షీతల్. ఆ కష్టాన్ని తీర్చి ఆయన ఆమెని తీసికెళ్ళొచ్చు. ఏదేమైనా వారంతట వారు చెప్పేవరకూ మనం సైలెంటుగా వుండటమే మంచిది” తనకి తోచింది చెప్పింది బిళహరి.
“మంచి ఆలోచన బిళహరిగారూ.. అలాగే చేద్దాం” సమ్మతించాడు రుషి. తల పంకించారు అవధానిగారు.
ఓ గంట సేపు బిళహరి, అవధానిగారూ, రుషి గుడిలోనే కూర్చున్నారు. బయటికి వస్తే ఆ అలికిడికి షీతల్, కిషన్ డిస్టర్బ్ అవుతారని. ఆ తరవాత ఎవరో భక్తులొచ్చి గంట కొట్టారు.
అప్పుడే స్పృహ వచ్చినట్టు విడివడ్డారు కిషన్.. షీతల్.
“సారీ, ఇన్నాళ్ల తర్వాత చూసిన ఆనందంలో మొదట మాకు మాటలు రాలేదు. ఆ తరవాత షీతల్‌ని అడిగాను. తను మీ గురించి చెబితే టైం గుర్తురాలేదు.రుషిజీ.. మిమ్మల్ని ఎలా గౌరవించాలో, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు నిజంగా తెలియడంలేదు. అసలు షీతల్ బ్రతికి వుంటుందనే ఆశే నాలో ఇంకిపోయింది. ఈమెకి నా వలన జరిగిన అన్యాయానికి మా యింట జరిగిన అవమానానికి నాలో నేనే కృశించిపోతున్నాను. ఇన్నాళ్లకి మళ్లీ చచ్చిపోయిన మనిషి ప్రాణం వచ్చినట్లయింది.” రుషి రెండు చేతులూ పట్టుకుని చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాడు కిషన్. “ఇందులో నాదేమీ లేదు కిషన్‌జీ. ఈ గుడికి మీరొచ్చారు. ఈమె మీకు కనిపించింది. నాదేం వుందీ. ఒక్క మాట సత్యం. షీతల్ నిజంగా ఓ అద్భుతమైన వ్యక్తి. అణకువ, అభిమానం,, అనురాగం మూర్తీభవించిన వ్యక్తి యీమె.” ఆమె మీది తన గౌరవాన్ని ప్రకటించాడు రుషి.
“అవును. ఆమె మీకు ఏమవుతుందో తెలీదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ఈమె చాలా సాత్వికురాలు.” చాలా అభిమానంగా షీతల్‌ని చూసి అన్నారు అవధానిగారు.
“పండిత్‌జీ.. యీమె నాకు ఏమవుతుందని అడిగితే నేనూ ఏమీ చెప్పలేను. అన్ని బంధాలకీ అతీతమైన బంధం అని మాత్రం చెప్పగలను. అయ్యా. నా విన్నపం ఒక్కటే. షీతల్ కొన్నాళ్లపాటు ఇక్కడే వుంటుంది. పరిస్థితుల్ని చక్కబెట్టి నేను నాతో తీసికెళ్లడానికి కొంతకాలం పడుతుంది. ఈ క్షణం నించీ ఆలయం తాలూకు సర్వవిషయాలు నేను చూసుకుంటాను. మీకేమి సమస్య వచ్చినా నాకొక్క కబురు అందిస్తే చాలు.” అంటూ జేబులోంచి చెక్ బుక్ తీశాడు కిషన్.
“అయ్యా.. డబ్బు అవసరం లేదు. మాకే కాదు.. షీతల్‌కి కూడా కేటరింగ్‌కి సహాయం చేసినందుకు రుషిగారు మా ఇద్దరికీ ఎప్పటికప్పుడు లెక్కకట్టి ఇస్తూనే వున్నారు. అవి మేము బేంకులో వేసుకున్నాం” వినయంగా అన్నది బిళహరి.
చెక్ బుక్ తియ్యగానే, షీతల్ బిళహరివంక ఇబ్బందిగా చూస్తూ కనుసైగ చెయ్యడమే బిళహరి మాట్లాడడానికి కారణం.
“అవును” అన్నది షీతల్.
చాలాసేపు కిషన్ అక్కడే వున్నాడు. వాళ్లిద్దరినీ వొదిలేసి మిగతావారు లోపలికెళ్లి వంట ప్రయత్నాలు చెయ్యసాగారు. ఇంట్లో జరిగిన విషయాలన్నీ వివరంగా షీతల్‌కి చెప్పాడు కిషన్.
“ఒక్క నిముషంలో వస్తాను”కిషన్‌కి చెప్పి వంటశాలలోకి పరిగెత్తింది షీతల్.
“అక్కా.. కొన్ని నే చేస్తాను”బిడియంగా అనంది షీతల్.
“అమ్మయ్యా.. హిందీ వంటలెలా చెయ్యాలా అని కంగారు పడుతున్నా. హాయిగా నువ్వే చెయ్యి” పీటమీంచి లేచింది బిళహరి.
“కడుపునిండా భోంచేసి కొన్ని నెలలైపోయింది.”తృప్తిగా తిని అన్నాడు కిషన్.
“ఇవి ఇంటికి” విస్తరిలో పేక్ చేసిన ఆలూ పరోటాలూ, కూరలు నీట్‌గా ఓ సంచీలో పెట్టి అందించింది షీతల్.
ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *