June 19, 2024

కౌండిన్య కథలు – కిరణ్ కొట్టు

రచన: రమేశ్ కలవల

“కిరణ్” అంటే మీరేనా? అని అడిగాడు నారాయణ.

“కాదు” అంటూ ఆ షాపులో సర్దుతున్న వాడల్లా వెనక్కి తిరిగి “ఇక్కడ ఆ పేరుతో ఎవరూ లేరు” అన్నాడాయన.

“మరీ ‘కిరణ్ కొట్టు’ అని రాసి ఉంది?” అని అడిగాడు సంశయిస్తూ.

“ఇదిగో ఈ రాజు చేసిన పనే ఇది..” అంటూ ఆ షాపులో పనిచేసే కుర్రాడిలా ఉన్న వాడిని చూపిస్తూ.

“చిదంబరం కిరాణా కొట్టు అని రాయడానికి పేయింటర్ పిలుచుకు రారా అంటే… అబ్బే ఆ మాత్రం పని నేను చేయలేనా? అంటూ వీడు చేసిన ఘనకార్యం అది..”.

“మొదలు పెట్టి అన్ని అక్షరాలు బోర్డు మీద సరిపోవు అంటూ, ఉత్తి కిరాణా కొట్టు అని రాయబోయి, అదీ కూడా తప్పుల తడకలతో ‘కిరణ్ కొట్టు’ అని రాసి తగలడ్డాడు. అందరి ప్రశ్నలకు జవాబు చెప్పలేక నా పని అవుతోంది” అన్నాడు.

“ఇంతకీ మీకేంకావాలి?” అడిగాడు ఆ షాపు యాభై ఏళ్ళ యజమాని చిదంబరం మళ్ళీ తన చేస్తున్న పనిలో నిమగ్నమవుతూ.

ఆ కుర్రాడు రాజు వైపుకు ఒకసారి చూసాడు నారాయణ, పదిహేను పదహారేళ్ళ వయసు ఉండవచ్చు అనుకున్నాడు మనసులో, వాడు సిగ్గుతో తలవొంచుకొని షాపులోపలకు వెళ్ళాడు.

“ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఒక గది అద్దెకోసం చూస్తున్నాను. ఆ పక్క వీధిలో అడిగితే ఇక్కడకు వెళ్ళమన్నారు.” అన్నాడు చిదంబరంతో నారాయణ.

ఆ సర్ధడం ఆపి తన కౌంటర్ దగ్గరకు వచ్చి, వొంగి కిందనుండి ఓ పుస్తకం తీసాడు.

ఈలోగా ఓ కస్టమరు ఆ షాపుకు వచ్చి “ఓ రెండు కిలోల బియ్యం’ కావాలి అనడంతో, చిదంబరం రాజుకు వినపడేలా బియ్యం తెమ్మని కేక వేసాడు.

చిదంబరం కిరాణా కొట్టుకు అసలు బోర్డు కూడా అవసరం లేదు. ఎన్నో ఏళ్ళగా ఆ ఊరిలో పాతుకుబోయిన కొట్టు అది. ఆ చుట్టు పక్కల ఇళ్ళ వాళ్ళందరికి చిదంబరం బాగా పరిచయం కూడాను.

ఓ పదేళ్ళ క్రితం రాజు ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు. ఆకలి కడుపుతో ఉన్న వాడిలా కొట్టు ముందర కారాడటం చూసి కొట్టులోవి తినడానికి ఇచ్చాడు చిదంబరం. ఎన్ని రోజులైనా కొట్టు దగ్గర నుండి కదలక పోవడం చూసి, వాడికి తన లానే ఎవరూ లేరని తెలుసుకొని తన కొట్టు లోనే పనికి పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు తోడు.

సరుకుల అమ్మకంలో చిదంబరం దిట్ట, నెల మధ్యలో ఇవ్వలేని వారి దగ్గర డబ్బు ప్రస్తావన తీసుకురాడు. కొనే వారికి కావలసిన వస్తువు తన దగ్గర లేకపోయినా మంచిమాటలతో ఉన్న సరుకును అమ్మగల నేర్పరి.

ఆ కిరాణా కొట్టు చిన్నదైనా అక్కడ వస్తువులు అమర్చిన విధానం చూస్తే అన్నీ దిక్కులలో నిండుగా ఉంది. ఎక్కువ అమ్ముడుబోయే చిన్న వస్తువులన్నీ చేతికి అందేలా, కొన్ని వేలాడుతూ అమర్చి ఉన్నాయి.

ఆ కొట్టులో అమర్చిన వస్తువులన్నింటి వైపు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు నారాయణ. అక్కడ ఉన్నవన్నీ గమనించిన తరువాత ఇక్కడ దొరకని సరుకు ఉండదన్న ఓ అభిప్రాయానికి వచ్చాడు.

కొంతసేపటికి రాజు లోపలనుండి బియ్యం తెచ్చి చిదంబరానికి అందజేసాడు, చిదంబరం ఆ కౌంటర్ మీద ఉన్న పేపర్, దారంతో పొట్లం కట్టి ఆ కస్టమరు చేతిలో పెట్టాడు. అతను అది తీసుకొని డబ్బులు అందించాడు.

చిదంబరం ఆ డబ్బులు డబ్బాలో వేసి, పక్కనే ఉన్న డబ్బాలోంచి ఓ మూడు విక్స్ గోలీలు తీసి చేతిలో పెట్టాడు. చిల్లర కాకుండా ఆ గోలీలు ఇచ్చినందుకు ఇబ్బందిగా మొహం పెట్టి, ఆ బియ్యం పొట్లంతో బయలు దేరాడు.

ఇంతలో రాజు భుజాన ఓ పెద్ద సంచితో వేసుకొని బయటకు నడిచాడు. ప్రతీ ఇంటికి సరుకులు డెలివరీలకు పనంతా రాజుదే.

రాజు సరుకుల డెలివరీకి వెళ్ళినపుడు దారిలో ఏ రోడ్డు మీద క్రికెట్ లాంటి ఆటలు తన వయసు పిల్లలు ఆడుతుంటే ఆగి చూసి, వాళ్ళ లానే నేనూ ఆడుకోకుండా షాపులో పనిచేస్తున్నాను అంటూ మనసులో వాపోయి, వారి ఆట చూసి తీరిగ్గా డెలివరీ చేసి షాపుకు చేరతాడు. ఆ సంగతి చిదంబరానకి తెలుసు. మరీ ఆలస్యం చేస్తేగానీ మందలించడు. రాజు ఎక్కువ సమయం కనిపించక పోతే చిదంబరానికి ససేమీర తోచదు.

నారాయణ మళ్ళీ ఒక్కసారి అద్దె గది సంగతి చిదంబరానికి గుర్తు చేయడంతో ఆ పుస్తకంలో ఒక నెంబరు వెతికి, ఆ పక్కనే ఉన్న టెలీఫోను బూత్ లో ఓ రూపాయి వేసి, ఫోనులో అవతల వారిని అర్జంటుగా రమ్మని చెప్పి పెట్టేసాడు.

తను అక్కడ ఉన్న కొద్ది సమయంలో అక్కడకు కొనడానికి వస్తున్నవారు, ఆ దారిలో వెడుతూ ఆగి పలకరించే వాళ్ళు, అక్కడ ఆగి కబుర్లు చెప్పే వారు, సరుకులు కొని పద్దులు రాయించేవాళ్ళు, లెక్కలు చూసి డబ్బులిచ్చేవాళ్ళు, ఊరి రాజకీయం మాట్లాడేవారు, సామ్రాణి వేసి వెళ్ళేవాళ్ళతో సందడిగా అనిపించింది.

కొంతసేపటికి ఒక అమ్మాయి ఆ కొట్టులోకి నడిచింది. చిదంబరం ఆమెను పలకరిస్తూ “రా అమ్మ.. ఇదిగో ఇతనికే ఓ గది కావాలిట. నువ్వు చూపించు, సాయంత్రం నాన్నగారు రాగానే అద్దె సంగతి మాట్లాడతారు” అంటూ తన పనిలో పడ్డాడు.

“సరే బాబాయ్” అంటూ నారాయణ వైపుకు చూసి వెనక రమ్మని సైగలు చేసింది. అతను ఆమె వెనుక నడిచాడు. కొంత దూరం వెళ్ళాక “మీ బాబాయి గారి కొట్టు బాగా సందడిగా ఉంది” అని మాట కలిపాడు.

“వరుసకు అలా పిలుస్తానంతే” అంది ఆమె.

“మీరు ఈ ఊళ్ళో ఎంత కాలం ఉంటారు?” అని అడిగింది.

“తెలీయదండి, నా బోటి ఉద్యోగస్తులకు కనీసం ఓ మూడేళ్ళ వరకూ ట్రాన్స్ఫర్ చేయరు” అన్నాడు.

“ప్రతీ నెల అద్దె ఇవ్వగలరు కదా? మా నానగారు ఇలాంటి విషయాలలో..” అంటుండగా

“ఆ విషయంలో మీకేం భయం లేదు. బ్యాంకు క్యాషియర్ ను కదా కౌంటర్ లోనూ, ఇంట్లోనూ, జేబులోను సరిపడినంత క్యాష్ ఎప్పుడూ ఉంచుకుంటాను” అన్నాడు తన పర్సు తీయబోయాడు.

ఆమె నివారిస్తూ, అతను పనిచేసే ఆ బ్యాంకు గురించి మాట్లాడుతూ ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు.

నారాయణ బయట వరండాలో నించుని ఉండగా ఆమె లోపలికి వెళ్ళి తాళాలు తీసుకొచ్చి “పదండి ఆ పోర్షన్ లో ఉన్న మీ గది చూపిస్తాను” అంటూ

అప్పుడే మీ గది అని సంభోదిస్తుంటే నేను నచ్చినట్లే, గది అద్దెకు ఖాయం అనుకున్నాడు. ఆ గది చూసి ఆమె దగ్గర సెలవు తీసుకొని “ ఇంతకీ మీ పేరు?” అని అడిగాడు ఆమెను.

“కిరణ్మయి” అంది. ఫక్కున నవ్వాడు నారాయణ.

“మీకు నా పేరంటే అంత నవ్వులాటగా ఉందా?” అంది చిరుకోపంతో.

“మీరు ఏమనుకోవద్దు. ఇందాకా వెళ్ళిన మీ బాబాయ్ గారి కొట్టు బోర్డు గుర్తుకువచ్చి నవ్వొచ్చింది అంతే” అన్నాడు. మళ్ళీ సాయంత్రం వాళ్ళ నానగారిని కలిసి ఆ పోర్షన్ లో చేరాడు.

త్వరలోనే నారాయణ ఆ ఊరిలో స్థిర పడ్డాడు. చిదంబరం కూడా బాగా పరిచయం అయ్యాడు. ఆ ఊరికి సంబంధించిన ఏ సలహా కావాలన్న చిదంబరాన్ని అడిగేవాడు. వీలున్నపుడల్లా కొట్టు దగ్గరకు నించొని చిదంబరం తో కబుర్లతో కాలక్షేపం కూడా అలవాటు అయ్యింది. నారాయణ సగటు జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకున్నాడు అక్కడ.

ఓ రోజు రాజు ప్రస్తావన రావడంతో ఎలా కొట్టుదగ్గరకు వచ్చాడో అన్ని విషయాలు చెప్పాడు. రాజు కూడా పెద్దవాడు అవుతున్నాడు, సొంత కొడుకు కంటే ఎక్కువ తీర్చి దిద్దుతున్నాడు.

మూడేళ్ళు గిర్రున తిరిగాయి, తనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడంతో నారాయణ ఆ ఊరు విడిచి వెడిపోయాడు.

——————-

నారాయణ బస్సులో ప్రయాణిస్తూ బడలికతో కునుకుపాట్లు పడుతున్నాడు.

బస్సు బస్టాండులో ఆగింది. కండక్టర్ అరుపులతో కొంత నిద్ర భంగం అయ్యింది పైగా తెలిసిన ఊరు పేరు చెప్పడంతో పూర్తిగా నిద్ర మత్తు వదిలింది.

నారాయణ తన బ్యాగు తీసుకొని భోజనం కోసం బయటకు నడవబోతు “ఎంత సేపు ఆగుతుంది?” అని అడిగాడు. “ఇరవై నిమిషాలలో రావాలి” అనడంతో హడావుడిగా క్రిందకి దిగాడు.

దిగిన తరువాత ఆ ఊరు బోర్డు పేరు చూడగానే ముందుగా నారాయణకు గుర్తుకు వచ్చినది చిదంబరం కిరాణా కొట్టు. పదేళ్ళ పైగా అయిపోయిందేమో అని అనికుంటున్నాడు మనసులో.

తనకు తెలిసి ఆ కిరాణా కొట్టు బస్సు స్టాండ్ కు పెద్దగా దూరం కాదు. ఉన్న కొద్ది సమయంలో ఒకసారి చిదంబరం ను పలకరించి వద్దామని కుతూహలంతో ఉన్నాడు, ఆలస్యం చేయకుండా బయలుదేరాడు.

వడివడిగా అక్కడికి నడుస్తూ ఆ వీధులలో వచ్చిన మార్పులను చూస్తూ చిదంబరం కిరాణా కొట్టు ఉండే వీధికి చేరుకున్నాడు. ముందుకు నడిచి ఆ కొట్టుకోసం అంతా గాలించాడు.

సరిగ్గా ఇదే ప్రదేశంలో ఉండేది అనుకుంటూనే ఆ ప్రదేశంలో కట్టిన ఇల్లు తలుపు గడియ కొట్టాడు. కొంతసేపటికి నిరుత్సాహంతో వెనుతిరగబోయి మళ్ళీ చిదంబరం మదిలో మెదలగానే తను అద్దెకు ఉన్న ఇంటి దగ్గరకు వెళితే కిరణ్మయి ద్వారా సంగతులు తెలుసుకోవచ్చేమో అనుకుంటుండగా తన బస్సు సంగతి గుర్తుకు వచ్చింది. పైగా ఇన్నేళ్ళ తరువాత తను అక్కడే ఉంటుందని ఊహించడం ఎలా? అని ఆలోచనలో పడి కనీసం ఆ చిదంబరం ఎలా ఉన్నారో ఆ సంగతి తెలిస్తే చాలు, తను పరిగెడుతూనైనా బస్టాండుకు చేరుకోగలనన్న ధైర్యంతో ఒక్క నిమిషంలో తను అద్దెకు ఉన్న ఇంటికి చేరుకున్నాడు,

హడావుడిగా తలుపు కొట్టాడు. కిరణ్మయి తండ్రి తలుపు తీసాడు. రొప్పుతూ “గుర్తు పట్టారా?” అంటూ అడిగాడు. లోపలకు రమ్మంటూ సైగలు చేసాడు ఆయన. సమయం తక్కువ ఉంది అన్నట్లుగా సర్ది చెప్పి కిరాణా కొట్టు సంగతి అడిగాడు.

“ఇంకెక్కడ చిదంబరం కొట్టు” అంటూ లోపలకు నడవబోతుండగా పెద్దమనిషిని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేక “ఒక్కసారి కిరణ్మయి ని పిలుస్తారా?” అని అడిగాడు.

“పెళ్ళైన తరువాత ఇపుడు ఇక్కడ ఉండటం లేదు” అన్నాడు వెనక్కు తిరిగి.

“మరి?” అన్నాడు ఓ సారి సమయం చూసుకుంటూ. “అమ్మాయి ఫలానా చోట ఉంటోంది” అన్నాడు.

“నేను కొంచెం హడావుడిలో ఉన్నాను. చిదంబరం గారి గురించి ఏమైనా వివరాలు తెలుసా ? ఎలా ఉన్నరు , ఎక్కడ ఉంటున్నారు?..” అనేలోగా ఆయన సరిగా వినలేదు కాబోలు నారాయణ కొట్టు గురించి మళ్ళీ అడిగాడనుకొని “ఇంకెక్కడ చిదంబరం కొట్టు” అంటూ మళ్ళీ అదే సమాధానం చెప్పాడు.

“పోనీ కిరణ్మయి ఏ ఊరులో ఉంటుందో వివరాలు చెప్పగలరా?” అవి అడిగాడు. తన జేబులో పేపరు తీసి ఆయన చెబుతుండగా రాసుకొని బస్టాండుకు పరుగు తీసాడు. సరగ్గా బస్టాండు బయట బయలుదేరిన బస్సుకు సైగలు చేస్తూ ఆపి మరీ ఎక్కాడు.

తన సీటులో కూర్చొన్న కొంత సేపటికి గాని ఆయాసం నుండి కోల్కోలేకపోయాడు. ఒక వైపు కడుపులో ఆకలి, పైగా మళ్ళీ బస్సు ఎంతసేపటికి ఆగుతుందో తెలీదు అనుకుంటున్నాడు నారాయణ.

చల్లటి గాలి తగులుతూ బస్సు కిటికీ లోంచి బయటకు చూస్తూ తను జేబులోంచి ఇందాకా రాసుకున్న అడ్రసు తీసాడు. మళ్ళీ గాలికి ఎక్కడ ఎగురుతుందేమోనని గట్టిగా పట్టుకొని ఆ ఊరి పేరు పదే పదే చూసాడు.

అక్కడి వెళ్ళి చిదంబరం విషయాలు తెలుసుకుంటే గానీ నిద్ర పట్టేలా లేదు నారాయణకు. చిదంబరం కిరాణా కొట్టు ఉండే వీధిలో గత పదేళ్ళుగా వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తూ ఆకలి కడుపుతో కునుకు పట్టేసింది. ప్రయాణం ముగించుకొని ఇంటికి చేరాడు.

ఒకటి రెండు సార్లు పట్టుదలగా కిరణ్మయి ఉంటున్న ఊరు వెడదామని అనుకున్న పరిస్తితులు కలిసిరాక పోవడం ఒక కారణం, మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత పెళ్ళై వెడిపోయిన కిరణ్మయి ని కలలవడం సబబు కాదేమోనన్న కారణంతో ఆలోచనను వెనక్కి నెట్టాడు. రోజూవారీ ఆఫీసు పనులలో పడి మళ్ళీ చిదంబరం సంగతి గుర్తుకురానే లేదు. అలానే మళ్ళీ ఏడేళ్ళు గడిచిపోయాయి.

ఓ రోజు ఆఫీస్ లో తన పై ఆఫీసర్ పిలిచి ఓ శుభవార్త వినిపించాడు. నారాయణ కు ఆ సంవత్సరం ప్రమోషన్ తో పాటు ఒక ఊరిలో బ్రాంచ్ మానేజర్ వేసారని వార్తని తెలియజేసాడు. ఓ నెల రోజులలో వెళ్ళి జాయిన్ అవ్వమనడంతో సంతోష పడ్డాడు నారాయణ. తనకు ట్రాన్స్ఫర్లు కొత్తేమి కాదు. వేరే ప్రదేశానికి వెళ్ళడానికి సౌకర్యంగా అన్నీ ఆఫీసు వారిదే కాబట్టి అంతగా ఆందోళన పడకున్నా మనసులో ఆ వెళ్ళబోయే ఊరిపేరు ఎక్కడో విన్న ప్రదేశం లాగా అనిపించింది.

నెల తిరిగే లోగా అక్కడికి చేరుకున్నాడు. ఆఫీసు వారు ఇచ్చిన ఇంట్లో స్థిరపడ్డాడు.

——————

నారాయణ బ్యాంకు మేనేజరుగా ఆ కొత్తగా వచ్చిన ఊరిలో మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఓ రోజ ఆఫీసులో పని హడావుడిలో మునిగితేలుతూ తన గదిలోనుండి బయటకు వచ్చాడు.

ఆ బ్యాంకులో కౌంటరు ఎదురుగా నించొని ఒకావిడ అచ్చంగా కిరణ్మయి లాగానే అనిపించడంతో అవాక్కయి తన దగ్గరకు నడవబోయాడు.

తను నడిచేలోగా ఒక్క క్షణంలో, ఎదురుగా ఎవరో పలకిరించటం, తిరిగి చేసేలోగా మళ్ళీ ఆమె జాడ కనపడనే లేదు.

సాయంత్రం ఇంటికి చేరిన తరువాత బాగా ఆలోచించిన తరువాత గుర్తుకువచ్చింది ఆ రోజు కిరణ్మయి తండ్రి రాసి ఇచ్చిన అడ్రసు లో ఉన్న ఊరు ప్రస్తుతం తను ఉంటున్న ఊరేనని.

తరువాత రోజు ఆఫీసులో పలువురి తోటి ఉద్యోగులను తనకు గుర్తున్న వరకు వివరాలు అడిగి ఆ రోజు సాయంత్రం కుతూహలంతో ఆ వీధికి బయలుదేరాడు నారాయణ.

ఆ వీధిలోకి ప్రవేశించి పరిశీలుస్తూ నడుస్తున్నాడు. కొంతసేపటికి అక్కడ తటస్థించిన షాపు చూసి ఒక్కసారిగా ఆగాడు.

‘కిరణ్ కొట్టు’ అని రాసి ఉంది, అచ్చంగా అదే బోర్డు ఏమాత్రం మార్పలేదు, కాలంచెల్లి కొంత పాత బడింది అంతే.

తనకళ్ళకి కనిపించినది వాస్తవమేనని తెలియడానికి కొంత సమయం పట్టింది. తేరుకొని ఆ షాపు దగ్గరకు నడిచాడు. తన కళ్ళు సహజంగా చిదంబరం కోసం గాలిస్తున్నాయి కానీ ఎక్కడా కనపడటం లేదు.

ఆ షాపు కౌంటర్ దగ్గరకు చేరుకొన్నాడు. ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉందని తెలుస్తోంది కానీ అడగటానికి జంకుతూ నారాయణ “ఈ కొట్టు?” అని అడిగాడు.

“నాదే” అని జవాబు ఇచ్చాడు.

“ఇక్కడ కిరణ్ ఎవరు?” అని అడిగాడు.

“అది మా బాబు పేరు, మీరు ఏళ్ళ క్రితం పరిచయం ఉన్న వ్యక్తి లాగా ఉన్నాడు?” అని అడిగాడు.

“నేను ఈ ఊరికి వచ్చి కొన్ని నెలలయ్యింది” అంటూ తన విషయాలు చెప్పాడు. అతను ఒక వైపు నారాయణ మాటలు వింటూ మరొక వైపు ఆ షాపుకు వచ్చిన వారితో తన పని తను చేస్తూ ఉన్నాడు.

నారాయణ ఓ పక్కగా నించొని అంతా గమనిస్తున్నాడు. తన పాత జ్ఞాపకాలు అన్నీ మెదులుతున్నాయి.

కొంతసేపటికి అరవై ఐదేళ్ళ పైచిలుకు పడిన వ్యక్తి పెద్ద బ్యాగుతో లోపలకు నడిచాడు.

ఒక్కసారిగా “చిదంబరం గారు” అంటూ అరిచాడు నారాయణ. ఆయన వెనక్కి తిరిగి గుర్తుపట్టి పట్టలేని సంతోషంతో నారాయణ దగ్గరకు వచ్చాడు.

“ఏమిటి మీరు ఇక్కడ ఇలా ? “ అన్నాడు నారాయణ.

“ఈ షాపులో పని చేస్తుంటాను” అన్నాడు చిదంబరం.

“సరుకులు డెలివరీ చేస్తుంటాను”

తనకు తెలిసిన పాత చిదంబరం మదిలో మెదిలాడు.

ఇంతలో చిదంబరం నారాయణతో “ఆ షాపులో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా?” అని అడిగాడు చిదంబరం.

నారాయణ “రాజు కాదు కదా?”” అన్నాడు. అవుననడంతో నారాయణ అలా చూస్తూ నిలబడి పోయాడు, చాలా మారాడని అనుకున్నాడు.

“ఇక్కడ కూర్చొని అన్నీ విషయాలు మాట్లాడుతుందాం” అంటూ ఇద్దరూ ఆ ప్రక్కన చేరారు.

నారాయణ కొన్నేళ్ళ క్రితం చిదంబరం కిరాణా కొట్టు వెతుకుతూ వెళ్ళినట్లు అక్కడ కిరణ్మయి తండ్రి “ఇంకెక్కడ కొట్టు” అనడంతో అది మూసేసి ఉంటారని అభిప్రాయానికి వచ్చానని తెలిపాడు.

ఇంతలో చిదంబరం “మీరు ఊహించినది కరెక్టే” అన్నాడు నారాయణతో.

“మీరు ఆ ఊరి నుండి వెడిపోయిన తరువాత కొన్ని సంవత్సరాలకు కొట్టు మూత పడే పరిస్తితికి వచ్చింది” అన్నాడు.

“నేను పెద్దవాడి అయ్యాను కదా నా బాధ్యత రాజుకు అప్పచెప్పాను” అన్నాడు.

“కానీ రాజు కు కొత్త ప్రదేశంలో తన గుర్తింపు ఏర్పచుకోవాలని వేరే ఊరు వద్దామని పట్టు పట్టాడు. అక్కడైకే చిదంబరం కొట్టుగానే చూస్తారు తప్ప .. నేను పెద్ద వాడిని అవుతున్నాను .. నేను సరేనన్నాను” అన్నాడు.

“మరి మీరు ఈ వయసులో ఆ డెలివరీలు” అనేలోగా

“తప్పేముంది చిన్నపుడు నాకు తోడుగా రాజు చేసేవాడు ఇపుడు వాడికి తోడుగా నేను ప్రతి ఇంటికి డెలివెరి చేస్తుంటాను, బోలెడు కాలక్షేపం కూడానూ” అన్నాడు.

నారాయణ చెయ్యి పట్టుకొని ఆ కొట్టు పక్కనే ఉన్న ఇంటి లోపలకు తీసుకెళ్ళాడు. వరండాలో కూర్చున్నాడు.

కొంతసేపటికి లోపలనుండి కిరణ్మయి నీళ్ళ గ్లాసుతో నడుచుకు రావడంతో లేచి ఆశ్చర్యపోయాడు. ఆ రోజూ బ్యాంక్ లో చూసినది నిజమేనని నిర్థారణకు వచ్చాడు.
తను వాళ్ళింట్లో అద్దెకు ఉన్న రోజులు గిర్రున తిరిగాయి. నారాయణ పలకరించాడు. కానీ ఆమె అక్కడ ఉండటానికి కారణం తెలియక మనసులో తర్జన బర్జన అవుతున్నాడు.

అది గమనించి “రాజు కిరణ్మయిని ఇష్టపడ్డాడు, నేనే దగ్గరుండి ఒప్పించి పెళ్ళి చేసాను” అన్నాడు చిదంబరం. కిరణ్మయి అంటే నారయణకు ఇష్టం ఉండేదని చిదంబరం అప్పట్లో గమనించక పోలేదు, కానీ కొందరి ఆలోచనలు ఊహలకు, మనసుకే పరిమితం అవుతాయి.

చిన్నగా కనిపించినా చిదంబరం కిరాణా కొట్టు లాంటివి ఎంతోమంది రోజూవారి జీవితాలతో ముడిపడిఉంటుంది, నాది కూడా అంతే అనుకుంటున్నాడు నారాయణ మనసులో.

కొంత సేపటికి రాజు ఇంటి లోపలకు వచ్చాడు. కుశల ప్రశ్నలు వేసిన తరువాత మళ్ళీ “కిరణ్ కొట్టు” బోర్డు ప్రస్తావన వచ్చి పాత సంగతులు తలుచుకొని అందరూ నవ్వుకొన్నారు.

“మా మనవడు పేరు కూడా కిరణ్ అని పెట్టాను , కాబట్టి ఆ బోర్డు ఇంకో తరం వరకు మార్చనక్కర్లేదు” అన్నాడు చిదంబరం రాజు కిరణ్మయి ల కొడుకు గురించి ప్రస్తావిస్తూ..”

ఎన్నో రోజులాగా చిదంబరంను కలవాలనుకున్న తన కోరిక తీరినందుకు సంతోషంతో ఇంటికి బయలుదేరాడు నారాయణ. చాలా ఏళ్ళ తరువాతా తన మనసులో పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన చిగురించింది.

శుభం భూయాత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *