May 25, 2024

“స్వచ్ఛ” తరం

రచన: జ్యోతి వలబోజు

“విజయా!! విజయా!” గట్టిగా అరుస్తూ ఇంట్లోకొచ్చాడు నరహరి.
భర్త కోసం ఎదురుచూస్తూ టీవీ సీరియల్ చూస్తున్న విజయ గభాల్న లేచి వచ్చింది.
“ఏంటీ పెద్దమనిషి? ఎప్పుడు లేనిది ఇవాళ చాలా కోపంగా ఉన్నట్టున్నాడు” అనుకుంది.
గట్టిగా చప్పుడొచ్చేలా అడుగులేస్తూ హాల్లోకి వచ్చి కోపంగా చూసాడు భార్యను.
“ఏమైందండి? ఎందుకలా కోపంగా ఉన్నారు? మీ స్నేహితులతో పార్టీ అని వెళ్లారుగా? అక్కడ ఏదైనా గొడవ జరిగిందా?”
“ఫ్రెండ్స్ కాదు నీ పిల్లలే .. వాళ్లకు ఎంత ధైర్యం? నాకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా? ఇక్కడి వ్యవహారాలన్నీ చూసుకుంటున్న నాకే ఏ సంగతి చెప్పకుండా అమెరికానుండే నిర్ణయాలు తీసేసుకునేంత పెద్దవాళ్లైపోయారా?” ఆవేశం, కోపంతో రొప్పసాగాడు నరహరి.
“ముందు మీరు స్తిమితంగా కూర్చోండి. ఈ నీళ్ళు తాగండి. తర్వాత మాట్లాడదాం” అంటూ మంచినీళ్ల గ్లాసు అందించింది విజయ.
నీళ్లు తాగినా కోపం చల్లారలేదు. మౌనంగానే ఉన్నా ఆవేశం తగ్గడం లేదు.
పది నిమిషాల తర్వాత “ఏవండి.. అసలేం జరిగింది. బయటకెళ్లేవరకు బానే ఉన్నారు కదా. మన వ్యాపారంలో ఏదైనా గొడవ జరిగిందా. ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చిందా. అమెరికాలో ఉన్న పిల్లలేం చేసారసలు?” విజయ మెల్లిగా అడిగింది.
పదినిమిషాలు మౌనంగా కూర్చున్నారిద్దరూ. నరహరి కోపం కూడ చాలావరకు తగ్గినట్టుగానే ఉన్నాడు.
“ఏం జరిగిందండి? ఎందుకలా పిల్లలమీద కోపంగా ఉన్నారు?” అడిగింది విజయ.
“మన ఊర్లో ఆ రమణయ్య పొలం, అతని చుట్టుపక్కలవారి పొలాలన్నీ కొందామని మార్కెట్ ధర కంటే తక్కువకు బేరం చేసి, పిల్లలు రాగానే డబ్బులిచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఆ స్థలంలో డిల్లీ నుండి వచ్చిన ఒక కంపెనీ వారితో కలిసి ఫాక్టరీ కట్టాలని నిర్ణయం జరిగింది కదా. దీనికి పిల్లలు కూడా ఒప్పుకున్నారు. కాని ఇప్పుడు నాకు చెప్పకుండా ఆ పొలాలను కొనడం లేదని ఆ రైతులందరికీ చెప్పాడంట నీ సుపుత్రుడు.” ఆవేశంగా అన్నాడు నరహరి.
“అవునా! ఇంత పెద్ద నిర్ణయం మీకు చెప్పకుండా తీసుకున్నారా? అసలు వాళ్లు ఇలా ఎందుకు చేసారు? అది కనుక్కున్నారా? రేపు ఆదివారం కదా కాల్ చేసి మాట్లాడండి అబ్బాయితో” అనునయిస్తూ చెప్పింది విజయ.

******
తెల్లారి ఆదివారం తొమ్మిదిగంటల సమయంలో నరహరి, విజయలు టిఫిన్ చేసి కాపీ తాగుతుండగా అమెరికా నుండి వాళ్లబ్బాయి శ్రీనివాస్ కాల్ చేసాడు.
కొడుకే కాల్ చేస్తాడని తెలిసిన నరహరి ఫోన్ తీసుకోలేదు. తల్లి తీసుకుని మాట్లాడింది.
“అమ్మా! ఫోన్ స్పీకర్ లో పెట్టు. నాన్నకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.”అన్నాడు శ్రీనివాస్.
“నాన్నా! కోపం తెచ్చుకోకుండా నా మాట విను. పొలాలు కొనడం లేదని నువ్వు కోపంగా ఉన్నావని తెలుసు. కాని దానికి కారణం కూడా చాలా ముఖ్యమైనది. మేము ఇక్కడ కష్టపడి సంపాదించింది మన ఊర్లోనే పెట్టుబడి పెట్టాలని నువ్వంటే సరే అని ఒప్పుకున్నాం. కాని వారం క్రితం జరిగిన సంఘటన మా ఆలోచన పూర్తిగా మార్చేసింది”.
“ఏం జరిగింది వాసూ” ఆత్రుతగా అడిగింది విజయ. నరహరి కూడా ఏం జరిగిందో అని వినడానికి రెడీ అయ్యాడు.
******
శ్రీనివాస్ ఆఫీసులో చాలా బిజీగా ఉన్నాడు. ఇయర్ ఎండింగ్ కావడంత తను పని చేస్తున్న ప్రాజెక్టు చివరి దశకు వచ్చింది. చాలా జాగ్రత్తగా టీమ్ ని నడిపించాలి. ఏమాత్రం తేడా వచ్చినా కోట్లలో నష్టం వస్తుంది. అందుకే టెన్షన్ గా కూడా ఉన్నాడు.
ఇంతలో అతని మొబైల్ మ్రోగింది. ఇండియా నుండి కాల్..
“హలో!” కంప్యూటర్ మీద పని చేస్తూ అన్నాడు శ్రీనివాస్.
“ఒరేయ్ వాసూ! నేను శ్యామ్ ని. మన ఊరినుండి మాట్లాడుతున్నాను. చాలా దారుణం జరిగిపోయిందిరా!” చాలా ఆందోళనగా మాట్లాడుతున్నాడు.
“అయ్యో! ఏమైందిరా? అంతా బానే కదా. మనం పొలాలు కొందామని బేరం పెట్టాం. రైతులేదన్నా గొడవ పెడుతున్నారా? డబ్బులు ఎక్కువ అడుగుతున్నారా లేక సర్పంచ్ ఏదైనా లిటిగేషన్ పెట్టాడా?? ఊరి పొలాలు వాడికి దక్కకుండా మన యువకులం కలిసి సేకరిస్తున్నామని మండిపోతున్నాడు కదా..” అన్నాడు వాసు.
“అది కాదురా? ఇటీవల కురిసిన వానలకు మన ఊళ్లోని బడి కూలిపోయింది. ఇద్దరు పిల్లలు చనిపోయారు. మరో పదిమందికి బాగా దెబ్బలు తాకాయిరా. ఆసుపత్రి కూడా అప్పుడో ఇప్పుడో కూలిపోతుందన్నట్టుగా ఉంది. లోపలికి వెళ్లాలంటే అందరూ భయపడుతున్నారు. ఇదే భయంతో ఆసుపత్రికి డాక్టరు రావడం ఎప్పుడో మానేసాడు. కాంపౌండరే చిన్న చిన్న సుస్తీలకు ఆదుకుంటున్నాడు.”
“అయ్యో! ఇంత ఘోరమా? ఊర్లో ఇంతమంది ఉన్నారు. బడిగురించి, ఆసుపత్రి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదా? సరే ఇప్పుడేం చేద్దామంటావ్ శ్యామ్?” బాధగా అడిగాడు వాసు.
“నాది, మన ఫ్రెంఢ్స్ ఆలోచించిన తర్వాత అనుకున్న ఆలోచన ఇది. నువ్వు, అక్క కూడా ఆలోచించంఢి. మీరు అమెరికాలో సంపాదించింది ఊర్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకున్నారు. దానివల్ల ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. కాని మీరు సంపాదించింది మొత్తం కాకున్నా కొంచెమైనా వ్యాపారం బదులు సాయం చేయగలరా? ఈ బడి, ఆసుపత్రి బాగోగులు మనమే చూసుకుంటే మంచిది కదా. ప్రతీదానికి ప్రభుత్వం అని కూర్చుంటే ఎప్పటికయ్యేను? ఆలోచించి ఏ సంగతి చెప్పండి. మన ఫ్రెంఢ్స్ అందరం ఎదురు చూస్తుంటాం.” అని ఫోన్ పెట్టేసాడు .
*****
“అదీ నాన్నా జరిగింది. మాకోసం నువ్వు బానే సంపాదించావు. నేను అక్క కూడా మంచి ఉద్యోగాలలో ఉన్నాము. అంతా మాకోసం , మా కుటుంబం కోసమే అనుకోకుండా మన పల్లెటూరికి కూడా కాస్త సాయం, సేవ చేయాలనుకున్నాం. వ్యాపారం పెట్టి దాన్ని అభివృద్ధి చేసేబదులు గ్రామంలో కావలసిన సదుపాయాలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనిపించింది. దీనివల్ల మాకు లాభం డబ్బు రూపేనా అందదు కాని ఎందరికో సాయం అందుతుంది. ఉపాధి కూడా లభిస్తుంది. ఏమంటావు?” అన్నాడు శ్రీనివాస్.
అంతలో వాళ్ల కూతురు స్వప్న కూడా గ్రూప్ కాలింగ్ లో వచ్చింది.
“నాన్నా! రెండు వారాల్లో నేను, తమ్ముడు ఇండియా వస్తున్నాం. అందరం మన ఊరెళదాం. రెడీగా ఉండండి.” అని చెప్పింది.
నరహరి కోపమంతా పోయి ఆలోచనలో పడ్డాడు. ఈ పిల్లలు చేస్తున్నది ఎంతవరకు కరెక్టు. కష్టపడి సంపాదించినదంతా ఇలా ధారపోయడం అవసరమా?? అనుకున్నాడు.

*****

నెల రోజుల తర్వాత రామాపురంలో కోలాహలంగా ఉంది. కూలిపోయిన బడి దగ్గర పెద్ద షామియానా వేసారు. కుర్చీలు వేసారు. గ్రామ యువత చాలా హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఊరిపెద్దలంతా అక్కడే ఉన్నారు.
ఇంతలో ఆ జిల్లా కలెక్టర్ వంశీమోహన్ ని తీసుకుని నరహరి, విజయ దంపతులు, వాళ్ల పిల్లలు తమ కుటుంబాలతో, మరి కొందరు స్నేహితులందరూ నాలుగైదు కార్లలో వచ్చారు.
గ్రామప్రజలంతా కలెక్టరుగారికి, యువతకు స్వాగతం పలికారు.
ముఖ్యులైన వారు స్టేజ్ మీద కూర్చున్నారు. మిగతావారు స్టేజ్ ముందు షామియానాలో కూర్చున్నారు.
శ్రీనివాస్ లేచి అందరికీ నమస్కరించాడు. “నేను పుట్టింది ఇక్కడే అయినా, పెరిగింది, చదువుకుని ఎదిగింది అంతా పట్టణంలోనే. కాని నా మూలాలు ఇక్కడే అని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. కొంతకాలంగా నేను , మా అక్క, కొందరు అమెరికాలోని స్నేహితులు, ఇక్కడి మిత్రులం కలిసి మన ఊరికి ఏదైనా చేయాలనే కోరికతో మా డబ్బులను ఇక్కడ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి ఉపాధి కల్పిద్దామనుకున్నాము. కాని దానికంటే ముఖ్యమైనవి చాలా ఉన్నయని అర్ధమయ్యాక మా ఆలోచనను కాస్త మార్చుకున్నాము. మా ఆలోచనలు, ప్రణాళికలను కలెక్టర్ గారు మీకు వివరిస్తారు” అని కూర్చున్నాడు.
కలెక్టర్ వంశీమోహన్ లేచి ప్రజలందిరికీ నమస్కరించాడు. “ సాంకేతికత పెరుగుతన్నది. సంపాదన పెరుగుతున్నది. సంపాదించాలనే కోరిక కూడా ఈనాటి యువతలో చాలా హెచ్చుగా ఉన్నది. చదువులన్నీ సంపాదనకొరకే.. వారికి తమ పల్లెటూరు, మాతృభూమి మీద మమకారం అంతగా లేదు. విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్నారు అని చాలామంది అనుకుంటారు. ఇది నిజమే కావొచ్చు కాని నేటి తరం మారుతున్నది. వారి ఆలోచనలు మారుతున్నాయి. డబ్బే వారి సర్వస్వం కాదు. ఏదైనా సాధించాలి. కష్టపడాలి. సంపాదించాలి. తమ కుటుంబం కోసమే కాక సమాజం కోసం కూడా తమ వంతు సేవ, సాయం చేయాలనే యువత ముందుకొస్తున్నది. వీరు విదేశాలలో ఉన్నా తమ మాతృభూమిలో ఎటువంటి అవసరం అయినా చేయడానికి ముందుకొస్తున్నారు. కొందరు తమ ఉద్యోగాలను, వ్యాపారాలను కూడా వదిలి తమ స్వస్థలానికి వచ్చి తమతో పాటు ఇతరులకు కూడా ఉపయోగపడే పనులను చేస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకం.
మన గ్రామ యువత కూడా తమవంతు సాయంగా కాదు ఒక బాధ్యతగా ఈ ఊరి అభివృద్ధి కోసం ఒక్కటై పని చేయాలని నిర్ణయించుకున్నారు. వారినందరినీ అభినందిస్తున్నాను. ముందుగా బడిని, ఆసుపత్రిని బాగు చేయాలని. పాత బిల్డింగులను తీసేసి కొత్తగా నిర్మించాలని ఆలోచన. దీనికి కావలసిన సొమ్ము అమెరికానుండి పంపిస్తే ఇక్కడి యువత దాన్ని ఈ కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఇదంతా నిస్వార్ధ సేవ. ఇందులో ఎవరి జోక్యము, ఆటంకము ఉండకూడదు. ప్రభుత్వం తరఫున మా పూర్తి సహకారం ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను” అని కూర్చున్నారు.
స్వప్న ముందుకు వచ్చి మైకు అందుకుని “ఈ ఊరిలో గర్భవతులకు, బాలింతలకు, పసిపిల్లలకు సరైనసదుపాయాలు లేవని తెలిసింది. నేను , నాకు తెలిసిన మిత్రులం కలిసి ఈ విషయంలో అతి త్వరలో ఒక బృహత్తరమైన ఆలోచన చేస్తున్నాము. గ్రామంలోని మహిళలకు సరైన వైద్య సదుపాయం అందేలా మావంతు కృషి మేము చేస్తాము. దీనికి ఇక్కడి యువత మాకు అండదండగా ఉన్నారు.”
ఈ మాటలు విన్న రామాపురం యువత మేమున్నాం అంటూ గట్టిగా అరిచారు.
“చూసారా! నిన్నటి మనకంటే నేటి తరం ఎంత స్వచ్ఛమైనదో.. “అంటూ సంతోషంగా భర్త చేతులు పట్టుకుంది విజయ. అవునంటూ చెమర్చిన కళ్లను తుడుచుకున్నాడు నరహరి..

******

6 thoughts on ““స్వచ్ఛ” తరం

  1. ఆశల రెక్కలు కట్టుకుని ఎంత దూరం వెళ్ళినా.. మూలాలను మరచిపోకూడదన్న సంకేతం చాలా చక్కగా కథలో వ్యక్తీకరించారు జ్యోతి గారూ.! Good one.

  2. కర్తవ్యాన్ని గుర్తుచేసారు మళ్ళి ఒకసారి ..విద్య మీద పిల్లల పౌష్టికాహారం మీద వున్న మా ఫోకస్ వైద్యం వైపుకి కూడా మరలుస్తాము త్వర లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *