May 26, 2024

ఆమె

రచన: డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం

ఆ రోజు గురువారం . సాయిబాబా గుడిలో రోజుకన్నా భక్తుల సంఖ్య ఎక్కువగా వుంది . అందులోనూ ఆడవాళ్ళే
అధికంగా వున్నారు. సాయంకాలం హారతి జరుగుతోంది . అందరూ నిలబడి భక్తి శ్రద్ధలతో సామూహిక భజనలో గొంతు కలిపారు.
హారతి పూర్తి కాగానే కళ్ళకు అద్దుకుని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది ఆమె .
“ ఇదిగో ప్రసాదం తీసుకోండి.” అంటూ తను తెచ్చిన పాలకోవాల డబ్బాను ఆవిడ ముందు వుంచింది సావిత్రి.
చిన్న ముక్క తీసుకుని నోట్లో వేసుకుని, సావిత్రి అందించిన పువ్వు సిగలో ముడుచుకుని , మౌనం గా అడుగు ముందుకు వేసింది ఆమె .
ఎంతో సందడిగా వుండే గుడిలో ఆమె ఆ పరిసరాలకు అతీతంగా , మర బొమ్మలాగా అభావం గా వుండడం గమనించిన సావిత్రి ఆ రోజు ఎలాగైనా ఆమెను పలుకరించాలని ప్రయత్నం చేసింది.
“నా పేరు సావిత్రి. ఈ వీధి చివరలో వుంటున్నాము. బాబా గుడికి, వేంకటేశ్వర స్వామి గుడికీ వస్తూంటాను. ఈ రోజు తొందరగా బయలుదేరుతున్నారే “ చిరునవ్వుతో అడిగింది సావిత్రి.
ఇంచుమించుగా ఇద్దరూ అరవైకి దగ్గర వయసు వారే కావడం వలన చొరవగా పలుకరించింది సావిత్రి .
“ ఈ రోజు ఆయన పొద్దున్ననుండి ఏమి తినరు . వుపవాసం వుంటారు. వచ్చేసరికి కాస్త ఫలహారం చేసి పెడదామని.” అని మిగిలిన పాలకోవా ముక్కను చిన్న కాగితంలో చుట్టి భద్రంగా పట్టుకుని “ ఇది మా వారికి. ఆయనకు పాలకోవ చాలా ఇష్టం. “ అనేసి గుడి బయటకు వచ్చింది ఆమె .
చకచకా నడుస్తున్న ఆమెను చూస్తూ “ అదృష్టవంతురాలు నాలాగా కీళ్ళ నొప్పులు లేవు“అనుకుంది సావిత్రి.
ఆమె వెళ్ళిపోయాక ప్రసాదం మరి కొందరికి ఇచ్చి ఇంటికి బయలుదేరింది సావిత్రి .
తలలో వెండి వెంట్రుకలు మెరుస్తున్నా ఆ వయసులోనూ నాజూకుగా కనబడుతూ, ముఖాన అరుణోదయ సూర్యుడిలా వెలిగే కుంకుమ బొట్టుతో , నేతచీరలో ప్రత్యేకంగా కనిపించే ఆమె తన చుట్టూ జరిగే దేనితోనూ సంబంధం లేనట్టు ముభావంగా ఎందుకు వుంటుందో సావిత్రి వూహకు అందలేదు.
“మీకు నేత చీరలంటే ఇష్టమా ఎప్పుడూ అవే కడతారు .”అని సావిత్రి ఆ మరునాడు ఆమెను అడిగేసింది.
“ మా వారికి ఇష్టం.” అందుకని అని వూరుకుంది ఆమె ..
——. —- —. —-
వుదయం ఏడు గంటల సమయంలో పార్క్ లోకి అడుగు పెట్టింది ఆమె .
“అమ్మా! ఈ మధ్యన నువ్వు బయటకు అడుగు పెట్టడం మానేసావు. ఇలా అయితే కుదరదు. మన ఇంటికి దగ్గరలో గుడి వుంది, పార్క్ వుంది. పొద్దున్న పూట అలా వెళ్ళి పార్క్ లో నాలుగు అడుగులు నడిచిరా. సాయంకాలం గుడికి వెళ్ళి దండం పెట్టుకునిరా. కొత్త చోటుకు వచ్చి మనుషులతో కలవక పోతే ఎలా ? అంటూ కూతురు వనజ రోజూ చెప్పగా, చెప్పగా ఈ నడుమనే కాస్త బయటకు వస్తూంది ఆమె .
ఆరోగ్యం మీద శ్రద్ధతో అక్కడికి వచ్చిన వాళ్ళు అప్పుడే నడక మొదలుపెట్టేసారు . అందులో ఎక్కువ భాగం వయసు మళ్ళిన వాళ్ళే. నడిచి అలిసి పోయినవాళ్ళు సేదతీరడానికి పచ్చి కూరగాయల రసం అమ్మేవాళ్ళు అక్కడ వేచివుంటారు.
ఆమె నడవడం మొదలు పెట్టిన పది నిముషాలలో రోజూ అక్కడికి వచ్చి ముఖపరిచయం ఏర్పడిన నలుగురు ఆడవాళ్ళు పలుకరించారు. వారితో మాటలు పెట్టుకోకుండా కళ్ళ తోనే సమాధానం
ఇచ్చి ముందుకు సాగిపోయింది. చుట్టు నాలుగు సార్లు తిరిగాక అలసిపోయి ఒక చెట్టు క్రింద వున్న సిమెంట్ బల్లమీద కూర్చుంది ఆమె.
“గోదావరి పుష్కరాలకు వెళ్ళడం లేదా మీరు? మేము ఎల్లుండి బయలుదేరుతున్నాము. “ఆవిడ పక్కనే వచ్చి కూర్చుంటూ అంది పారిజాతం. కొత్త పాత అని లేకుండా అందరితొ మాటలు కలపడం పారిజాతం స్వభావం . నాలుగు రోజుల పరిచయంతొ ఆమెని మాటల్లో పెట్టింది. .” ఈసారి వచ్చినవి మహా పుష్కరాలట. మళ్ళి ఎన్నో ఏళ్ళకు గానీ ఇటువంటి పుణ్యకాలం రాదట. అందుకే మా పెద్దవాడు మా ఇద్దరికీ రైలు టికెట్లు తీసాడు. “ఆమె ఏమీ పలుకక పోవడంతో మళ్ళీ అన్నది పారిజాతం .
“మంచిపని చేసాడు. క్షేమంగా వెళ్ళి రండి. మా వారూ రాజమండ్రికే వెళ్ళారు. పుష్కర స్నానం చేసి వస్తారేమో. “ సాలోచనగా అని లేచింది ఆమె .
మరునాడు వుదయం ఆరున్నరకే ఫోను మోగితే ఇంత పొద్దున్నే ఎవరో అనుకుంటూ తీసింది .
“నేనండీ పారిజాతం మాట్లాడుతున్నాను. మనతో బాటు పార్క్ కు వచ్చే శ్రీనాథ్ దంపతులకు మొన్న షష్టి పూర్తి అయిందట. ఈ రోజు వాళ్ళకు చిన్న సన్మానం చేద్దామని పార్క్ స్నేహితులు అన్నారు . మీరు తప్పక వస్తారు కదూ! “ అని ఫోను పెట్టేసింది.
“అమ్మా ఆలస్యమౌతోంది. తొందరగా బయల్దేరి వెళ్ళి పార్క్ లో నాలుగు అడుగులు నడిచిరా అంటూ కూతురు మరోసారి చెప్పడంతో అయిష్టంగానే ఇంటి గుమ్మం దాటింది ఆమె.
ఆ రోజు పార్క్ లో కోలాహలం గా వుంది. నడిచేవాళ్ళు నడుస్తుండగా నలుగురు ఒక సిమెంట్ బల్ల దగ్గర చేరి ఏవో ఏర్పాట్లు చేస్తున్నారు. పూల హారాలు , శాలువా, మిఠాయిలు వంటి సరంజామా అంతా సర్దుతున్నారు .
చుట్టుపక్కల ఎవ్వరినీ పట్టించుకోకుండా తన ప్రపంచం లో తాను వున్నట్టు కనిపించే ఆమెను దూరం నుండే గమనించిన పారిజాతం అక్కడికి రమ్మన్నట్టు చేయి వూపింది .
అన్యమనస్కం గా అటు నడిచింది ఆమె . అందరూ ఉత్సాహంగా ఆ దంపతులకు శుభకాంక్షలు చెప్పి, వారిద్దరి చేతికి పూలహారాలు అందించారు . కొత్త దంపతుల లాగా సిగ్గు పడుతు దండలు మార్చుకున్నారు శ్రీనాథ్ దంపతులు.
ఆ సంబరం లో తనకు సంబంధం లేనట్టు పక్క గా నిలబడిన ఆమె , అందరికీ మిఠాయిలు పంచుతుండగా నెమ్మదిగా బయట పడింది ఇంటికి రాగానే కూతురికి విషయం చెప్పింది .
“అవునే మీ నాన్నకు పై నెలలో అరవై నిండుతాయి. నువ్వూ, మీ అన్నా షష్టిపూర్తి గురించి ఏమన్నా అనుకుంటున్నారా? లేదా? “ అని అడిగింది .
“ అమ్మా ఇవాళ ఆఫీస్ లో నాకు ముఖ్యమైన మీటింగ్ వుంది. టిఫిన్ తినడానికి టైం లేదు గానీ, డబ్బాలో పెట్టి ఇస్తావా ? “ అనేసి తొందరగా అక్కడి నుండి వెళ్ళి పోయింది వనజ. హడావిడిగా ఆ పనిలో పడింది ఆమె .
——. ——- ——
ఆ శనివారం పక్క వీధిలోని వేంకటేశ్వరస్వామి వారి గుడికి వెళ్లింది ఆమె . అక్కడ ప్రతీ శనివారం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది .క్రింద కూర్చోలేని పెద్దవాళ్ళు కుర్చీలలో కూర్చుంటే, చిన్నవాళ్ళు క్రింద కూర్చుంటారు. బాబా గుడిలో పరిచయమైన సావిత్రి కూడా వచ్చింది. మోకాళ్ళు
వంగని సావిత్రి కుర్చీలోను, ఆమె నేల మీద పక్క పక్కనే కూచున్నారు.
అర్థగంట పైన సాగిన పారాయణం ముగింపుకు వచ్చింది. ఫలశ్రుతి చదువుతున్నారు.
“ రోగార్తో ముచ్యతే రోగాత్, బద్ధో ముచ్యేత బంధనాత్, భయాన్ ముచ్యేత భీతస్తు , ముచ్యేతాపన్న ఆపద ….అనన్యాశ్చింతయంతోమాం ఏ జనాహ్ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహం అని అందరూ ముక్త కంఠంతో పలుకుతుంటే ఆమె కి అటు పక్క కూర్చున్న సుందరమ్మ గొంతు విచారంతో వణికింది .
ఏమయ్యింది అన్నట్టు సుందరమ్మ చేతి మీద తట్టింది సావిత్రి .
“యోగక్షేమం చూసుకునే వాడే అయితే పది కాలాల పాటు బతకాల్సిన నా మనవడిని ఎందుకు తీసుకు పోవాలి. కావాలంటే ఈ ముసలి ప్రాణాన్ని తీసుకోవచ్చు కదా ! “ వణుకుతున్న గొంతుతో అంది సుందరమ్మ.
“ ఎవ్వరిని ఎప్పుడు పిలిపించుకుంటాడో ఆయనకే తెలుసు. అడగడానికి మనమెంతవారం .
దేవుడే మనిషి రూపంలో భూమి మీదకి వస్తే ఆయనా ఆ సమయం వచ్చినప్పుడు అవతారం చాలించి వెళ్ళి పోవాల్సిందే . “ ఓదార్పుగా ఆవిడ భుజం మీద చెయ్యి వేసింది సావిత్రి.
ఇంతసేపూ ఒక మాట కూడా పలుకకుండా కూర్చున్న ఆమె చరాలున లేచి వెళ్ళి పోబోయింది.
అంతలో ముందు వరుసలో కూర్చున్న పారిజాతం సావిత్రి ని చూసి దగ్గరకు వచ్చింది.
“ప్రసాదం తీసుకుని వెళ్ళ వచ్చు కదా. అన్నట్టు మేము పుష్కర స్నానానికి వెళ్ళడమూ రావడమూ కూడా అయ్యింది. మీ వారూ రాజమండ్రి నుండి వచ్చేసారా?” పారిజాతం ఆమెను చనువుగా అడిగింది .
ఆ మాటలు చెవిన పడనట్టే ముందుకు నడిచింది ఆమె .
—. — — —
ఆ తరువాత వరుసగా నాలుగు రోజులు ఆమె కనబడక పోవడంతో పార్క్ లో కలిసిన పారిజాతం ని అడిగింది సావిత్రి. ఇద్దరూ కలిసి ఎలాగో ఆమె ఇంటి ని కనుక్కుని వచ్చి , తటపటాఇస్తూనే తలుపు కొట్టారు.
తలుపు తీసింది వనజ.
“ నా పేరు పారిజాతం అమ్మాయ్. ఈవిడ సావిత్రి. “ అంటూ వుండగానే లోపలికి రండి. “ అంది .
“ అమ్మకు నాలుగు రోజుల నుండి కాస్త నలత గా వుంది. అందుకే బయటకు రాలేదు. “ పక్క గదిలో వున్న అమ్మకు వినబడకూడదు అన్నట్టు మెల్లిగా చెప్పింది.
“ అయ్యో. అలాగా? మరి మీ నాన్నగారు వూరినుండి వచ్చేసారా?” అడిగింది పారిజాతం.
“మా నాన్న మూడు నెలల క్రిందట రాజమండ్రి లో జరిగిన పడవ ప్రమాదంలో పోయారు ఆంటీ. “ గోడ మీద వున్న ఫోటో వైపు చూసి విచారంగా చెప్పింది వనజ.
ఒక సారి గా వులికిపడ్డారు పారిజాతం సావిత్రి.
వాళ్ళ ముఖాలలో కనబడుతున్న భయాశ్చర్యాలను గమనించి “ నాన్నగారు వూరికి వెళ్ళారనీ, వచ్చేస్తారనీ చెప్పిందా అమ్మ? “ విషాదం గా అడిగింది వనజ.
“ పోయిన గురువారం నాడు ఆయన వుపవాసం చేసారనీ , తొందరగా ఇంటికి వెళ్ళి ఫలహారం చేసి పెట్టాలని అన్నారు. పాలకోవా ఆయనకు ఇష్టం అని ప్రసాదం పట్టుకు వెళ్ళింది.” అంది సావిత్రి అపనమ్మకంగా ఆ ఫోటో కేసి చూస్తూ.
“రాజమండ్రి వెళ్ళారు పుష్కర స్నానం చేసి వస్తారు అంది పార్క్ లో కలిసినప్పుడు. “ పారిజాతం ముఖంలో సందేహం.
“ నాన్నగారు ఇక లేరు అన్న నిజాన్ని అమ్మ నమ్మలేకపోతొంది. ఆయన అవశేషాలని గుర్తించలేని పరిస్థితిలో అక్కడే కర్మ చేసి వచ్చాడు మా అన్న . వచ్చే వారం నాన్న రెండో మాసికం వస్తోంది. అమ్మ చూస్తే ఇలా… రోజూ ఆయన వస్తారు అని ఎదురు చూస్తూ… అమ్మను డాక్టర్ దగ్గరకు కూడ తీసుకు వెళ్ళాను. జరిగిన విషాదాన్ని తట్టుకోలేక కొంత మంది ఇలా డినయల్ మోడ్ లోకి వెళ్ళిపోతారుట . అది నిజం కాదు అని మనసును భ్రమలో వుంచుతారట. బయట ప్రపంచంలో పడి నలుగురితో మసలితే కొంత కాలానికి ఆ భ్రమ లో నుండి బయట పడుతుంది. అంది డాక్టర్. అందుకే బలవంతంగా అమ్మను గుడికి , పార్క్ కు పంపిస్తున్నాను. నాలుగు రోజుల క్రిందట గుడి నుండి రాగానే నాన్న ఫోటొ చూసి “ఆ సుందరమ్మ మనవడిని తీసుకు పోయినట్టు మీ నాన్నను కూడా దేవుడు తీసుకు పోయాడా ?” అంటూ ఏడ్చి ,ఏడ్చి జ్వరం తెచ్చుకుంది. “ కన్నీళ్ళు తుడుచుకుంది వనజ.
“ బాధ పడకమ్మా. అమ్మ మెల్లిగా దారిలో పడుతున్నట్టె వుంది. ఆమె బాధను ఎవ్వరూ తీర్చలేము గానీ మేము ఆమెకు తోడుగా వుంటాము. తొందరలోనే మామూలు మనిషి అవుతుంది. “ వనజకు ధైర్యం చెప్పి వెళ్ళడానికి లేచారు పారిజాతం, సావిత్రి.
——- ———. ————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *