May 26, 2024

సర్దుబాటు

రచన-డా. లక్ష్మీ రాఘవ

“శారదా అయ్యిందా ?? కారు వచ్చేస్తుంది” శ్రీహరి తాళంచెవి తీసుకుంటూ..
“ఒక్క నిముషం…జానీ కి అన్నం వేసి, నీళ్ళు పెట్టాలి అంతే ..”అంటూ జానీ అనే తమ కుక్కకి కావాల్సినవి ముందు వరెండా లో ఒక మూల పెట్టి వెళ్లి చేతులు కడుక్కుని, టిఫిన్ డబ్బా పట్టుకుని బయటకు వచ్చింది శారద. శ్రీహరి వెంటనే తలుపులు మోసి లాక్ చేశాడు. ఇద్దరూ గేట్ వరకూ నడవగానే కాబ్ వచ్చింది. జానీ కి ‘టా…టా” చెబుతూ కూర్చున్నారు కారులో. అడ్రెస్ తెలిసిన వాడు కాబట్టి ఏమీ అడగకుండానే బయలుదేరాడు డ్రైవర్. ఒక అరగంటలో కూతురు మాధురి ఇల్లు చేరుకున్నారు.
ఇంటి బయటే పాపను ఎత్తుకుని నుంచుంది మాధురి.
కాబ్ దిగగానే నవ్వుతూ అమ్మమ్మ వైపు వాలింది పాప.
పాపను ఇస్తూ “ఇవ్వాళ ఒక అరగంట ముందుగా వెళ్ళాల్సింది. ముందుగా చెప్పడం మరచిపోయాను. వెళ్ళొస్తా…బై ..”అంటూ హెల్మెట్ పెట్టుకుని స్కూటీ స్టార్ట్ చేసింది మాధురి.
పాపతో శారద, చేతిలో టిఫిన్ డబ్బా పట్టుకుని శ్రీహరి ఇంట్లోకి వచ్చి వీధి తలుపు వేశారు.
పాపకు కప్ లో రెడీ గా పెట్టి వున్న ఫుడ్ స్పూనుతో పెడుతూ వుంటే పాప ఇల్లంతా తిరుగుతూ వుంది.
శ్రీహరి టిఫిన్ డబ్బాలో నుండీ టిఫిన్ తిన్నాడు. పాప తిన్నాక కొంచెం సేపు ఆడుకుని నిద్దర పోయింది.
శ్రీహరి న్యూస్ పేపర్ చూస్తూ వుంటే, శారదమ్మ వంటింట్లో వెళ్లి ఆ రోజు వంటకోసం మాధురి తీసి ఉంచిన కూరగాయలు చూసుకుని దానిని బట్టి కుక్కర్ పెట్టి వంట మొదలు పెట్టింది.
వంట పూర్తి అవగానే పాప లేచింది. పాపకు పప్పు అన్నం కలిపి తిని పించడానికి ముందు వరండాలోకి తీసుకెళ్ళింది..
శ్రీహరి కాస్త నడుం వాల్చి లేచి డైనింగ్ టేబల్ మీద వంట సర్ది తనకూ, శారదకూ ప్లేట్స్ పెట్టాడు.
పాప భోజనం అయ్యాక ఆడుకోవటం, మళ్ళీ పడుకోబెట్టడం అయ్యాక వచ్చి ప్లేట్స్ లో అన్నీ వడ్డించి శ్రీహరిని పిలిచింది.
ఇద్దరి భోజనాలూ అయ్యాక శారదమ్మ పాప పక్కనే పడుకుంటే, శ్రీహరి కాస్సేపు టి.వి. చూస్తూ కూర్చున్నాడు.
తరువాత కాస్సేపటికి ఇద్దరూ కాఫీ తాగి కూర్చునే సరికి పాప లేచింది.
5 గంటలకు తను ముఖం కడుక్కుని, పాపను రెడీ చేసి మాధురి కోసం చూస్తూ కూర్చున్నారు. ఒక అరగంటలో మాధురి వచ్చేసరికి పాప నవ్వుతూ వాళ్ళమ్మ చేతుల్లో వాలి పోయింది…
పాపను ముద్దు చేస్తూ మాధురి ఇంట్లోకి రాగానే “దొండకాయ వేపుడు, ముల్లంగి సాంబారు, రసం చేసాను మాధురీ. ఫ్రిజ్ లో పెట్టాను. పాప అన్నం సరిగా తినలేదు, పీడియస్యూర్ ఇస్తావేమో చూడు..”అని చెప్పి రూములోకి చూసింది..
శ్రీహరి తయారై బయటకు వచ్చాడు.
మాధురి “అమ్మా , మీకు ఇలా రోజూ రావటం కష్టంగా ఉందేమో కానీ నాకు మనసులో సగం పాప గురించిన దిగులు పోయింది. నాన్న గారు ఒప్పుకోవటం లేదు కానీ అందరూ కలిసి ఇక్కడే ఉండచ్చు..’అంది
‘మీ నాన్నగారు ఎప్పుడూ కూతురు ఇంట్లో వుండిపోవడానికి ఇష్టపడరు..నీకు తెలుసు కదా…” అంది
ఇంతలో శ్రీహరి “ఇక బయలుదేరుతామమ్మా మాధురీ “ అనగానే కాబ్ కు ఫోను చేసింది మాధురి. మాధురికీ, పాపకూ చెయ్యి ఊపుతూ కాబ్ లో కూర్చున్నారు.
కారు పోతూ వుంటే ఆలోచనలు సాగుతూ వున్నాయి…
మాధురి దంపతులకు పాప పుట్టాక ట్రాన్స్ఫర్ అయి ఈ వూరికే వచ్చారు. కన్నకూతురు కంటికెదురుగా ఉంటుందని చాలా సంతోషం వేసినా పాపను చూసుకోవడానికి సరి అయిన ఏర్పాటు జరగక శారదా, శ్రీహరీ ఇలా వస్తే బాగుంటుందని అనిపించి అడిగారు. మొదట శ్రీహరి ఒప్పుకోలేదు. శారదమ్మ కొద్ది రోజులు చూద్దాం అని ఒప్పించింది. ఇది రెండు నెలలుగా జరుగుతున్న వ్యవహారం…
సాయంకాలం ఇల్లు చేరాక రాత్రికి చపాతీలకు పిండి కలిపి కూర చేయడానికి ఆలుగడ్డ కుక్కర్ లో పెట్టింది అన్నంతో బాటూ… జానీ కోసమైనా అన్నం వండక తప్పదు. ఇంట్లో పగలంతా కాపలా కాసేది జానీనే. ఇంటి దరిదాపులకు కూడా ఎవరినీ రానీయదు జానీ . అది ఉందన్న భరోసా తోనే ఈ ఒప్పందం పరవాలేదు అనుకున్నారు. లేకపోతే ఇల్లు తాళం వేయగానే దొంగతనాలు జరిగే కాలం ఇది.
రాత్రికి కొడుకు రాహుల్ ఫోను కోసం కాచుకుంటారు. రాహుల్ ఢిల్లీ లో పని చేస్తాడు. కోడలు రాధిక కూడా ఉద్యోగం చేస్తుంది. వారి అబ్బాయి పదేళ్ళ శరత్ ను రెసిడేన్షియల్ స్కూల్ లో వేశారు. ఇద్దరూ ఉద్యోగానికి వెడితే ఇదే బాగుంటుందని.
ఫోను రింగ్ అయ్యింది.
“హలో నాన్నా బాగున్నారా ? ఏమిటి కబుర్లు?” రాహుల్ గొంతు వినగానే ఒక సంతోషం!
“బాగున్నాము రాహుల్, రోజూ చెప్పడానికి విశేషాలేముంటాయి??”
“మాధురి వాళ్ళు బాగున్నారా? పాప ఈ రోజు బాగా ఆడుకుందా ??.”
“ఇదిగో మీ అమ్మను అడుగు” అంటూ శారదమ్మకు ఫోను ఇచ్చాడు.
“హలోఅమ్మా, బాగున్నావా??”
“బాగున్నాను నాన్నా, రాధిక, శరత్ ఎలా వున్నారు?
“బాగున్నారు అమ్మా. మీరు మాధురి ఇంటికి వెళ్ళడం చూస్తూ వుంటే నాకు కూడా మీకు దగ్గరగా వచ్చెయ్యాలని వుంది. శరత్ కు నాన్నమ్మ, తాతలతో ఆ విధంగానైనా చనువు ప్రేమా ఎక్కువ అవుతాయి…” స్పీకర్ ఫోనులో వుండడంతో ఆ మాటలు విన్న శ్రీహరి శారదకు చెయ్యి ఊపి ఫోను ఇమ్మని సైగ చేశాడు.
“ఒక్క నిముషం రాహుల్, మీ నాన్నతో మాట్లాడు..”అని ఫోను శ్రీహరి చేతికి ఇచ్చింది.
“రాహుల్, నిజమే మాకు కూడా మీరు దగ్గరగా వుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మా అభిప్రాయం కూడా మీరు తెలుసుకుంటే బాగుంటుంది..”
“చెప్పండి నాన్నా “
“ఈ మధ్య రోజూ మాధురి ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టాక నా మనసులో మాట నీకు చెప్పాలి అనిపించింది. పాప కోసం మేము వెళ్ళడంలో అభ్యంతరం లేదు. కానీ మాకూ కొన్ని సమస్యలు వుంటాయి… నేను రిటైర్ అయి ఐదేళ్ళు అయ్యింది. మీ అమ్మకూ అరవై ఏళ్ళు వచ్చాయి. పొద్దున్న ఇంట్లో టిఫెన్ చేసుకుని డబ్బాలో పెట్టుకుని పోయి పాపను చూసుకుంటూ అక్కడ వంట చేసి తిని, పాపకు టైముకు సరిగ్గా పెట్టుకుంటూ ఆడించుకుంటూ…మాధురి ఇంటికి రాగానే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రాత్రికి వండుకుని …ఇలా నడుస్తూంది మా జీవితం…చెయ్యడానికి సంతోషమే కానీ మీరు ఆలోచించ వలసినది మా వయసు, మాకు అయ్యే ఇబ్బందులు. చిన్న పాపను చూసుకోవడానికి చాలా ఓపిక వుండాలి…మీ అమ్మ అలసిపోతూ వుంది. ఈ మధ్య కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి…పోనీ మేము రాలేము అనడానికి మనసు ఒప్పడం లేదు… మాకూ ఈ వయసులో ఒక రిటైర్డ్ లైఫ్ కావాలి. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా వుండే జీవితం కావాలి… భాద్యతలు తీరాయి కాబట్టి కృష్ణా..రామా అనుకోవడానికి అవకాశామో, తీర్థయాత్రలు చెయ్యడానికి వీలూ… కావాలనుకోవడం తప్పు కాదు కదా
ఉద్యోగాలలో మీ తెలివితో ఎంతో పైకి ఎదుగుతున్న మీరు మా గురించి ఆలోచించలేరా?
బాల్యం, యవ్వనం, వార్థక్యం లాగే ప్రతిదీ పద్దతిగా జరుగుతుంది కదా…మేము మీమీద డిపెండ్ అవకూడదు అని అనుకున్నాము. ఇలా కాదనలేని సందర్భం వస్తూంటే ఎలా చెప్పగలం?
పిల్లలకు దూరంగా , ఒంటరిగా వుండాలని మేము కోరుకోము. మీరు దగ్గరగా వుండి మాకు కావాల్సినంత తీరిక ఇవ్వగలిగితే ఎలా వుంటు౦దో ఆలోచించు …” అంటూంటే శారదమ్మ ఆశ్చర్యంగా చూస్తూవుంది భర్తని.
ఏ విషయమైనా విడమర్చి తన భావాలను చెప్పే శ్రీహరి తత్వం తెలియనిది కాదు . కానీ కొడుకుతో ఇంత స్పష్టంగా చెబుతాడని ఊహించలేదు. ఇంకా నయం మాదురితో నేరుగా మాట్లాడలేదు…రాహుల్ ఒక క్షణం తరువాత
“తప్పకుండా నాన్నా…ఇందులో తప్పేమీ లేదు మేము కూడా ఆలోచించాల్సిందే…మంచిదయింది మీరు ఇలా చెప్పడం. మీరు కొన్ని రోజులు మా దగ్గరకు రండి. ఇక్కడినుండి కాశీ, ప్రయాగ వెళ్ళే ఏర్పాటు చేస్తాను…మాధురితో మాట్లాడతాను. పాపకోసం ఎవరినైనా చూడమని చెబుతాను. నాన్నా తప్పకుండా మీరు మాకిచ్చిన జీవితం లాగా మీ జీవితం గడిచేలా చూస్తాను…వుంటాను నాన్నా మళ్ళీ రేపు మాట్లాడుతాను..”అని ఫోను పెట్టేశాడు.
ఏ విషయమైనా కూర్చుని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవచ్చు అని నమ్మిన మనిషి శ్రీహరి…కాకపోతే కూతురి తో ఇలా మాట్లాడ్డం కొంచెం ఇబ్బంది అంతే.

******

8 thoughts on “సర్దుబాటు

  1. చాలా ఆలోచించాల్సిన విషయం గురించి చెప్పారు.. ప్రతీ విషయానికీ తల్లిదండ్రుల మీద ఆధారపడితే, ఇక వీరికి బాధ్యతలు ఎప్పటికీ తెలిసేదెలా.. పిల్లల బాధ్యతను గుర్తు చేస్తూ, తల్లిదండ్రులకు బాధ్యతల నుండి వెసులుబాటు కలిగిస్తూ, విశ్రాంతి జీవితానికి సహకరించాలని చాలా చక్కగా రాశారు.. జీవితానికి సంబంధించిన పాఠాలు వెతుక్కోవచ్చు మీ రచనలలో.. ధన్యవాదాలు

    1. కథమీద స్పందన ఎలావుంటుందో తెలిసాక రచయితకు సంతృప్తి కలుగుతుంది. ధన్యవాదాలు radhika

  2. అరవై లు దాటాక కావాల్సింది పిల్లలతో ప్రశాంతంగా జీవించటంగానీ మళ్ళీ బాధ్యతలు మొత్తం కాదు

  3. చాలా బాగా రాశారు.. సర్దుబాటు తప్పనిసరి మధ్యతరగతి జీవితాల్లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *