April 16, 2024

ఆఖరి కోరిక

రచన: లక్ష్మీ రాజశేఖరుని

తన బ్రతుకుకి మిగిలిన చివరి రాత్రి. తెల్లార కూడదని ప్రతిక్షణం తలచుకుంటూ బ్రతికిన రాత్రి. తెల్లారితే తన బ్రతుకు తెల్లారి పోయే రాత్రి. ఇంకా కొద్ది గంటలు మాత్రమే తనకు మిగిలి ఉన్నాయి. అమ్మ గుర్తొచ్చింది. పిచ్చిదానిలా ఎన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరిగింది. కనీసం జైల్లో అయినా ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంది. శిక్ష ఖరారు అయిన రోజు అందరి కాళ్ళు పట్టుకుని బతిమిలాడింది. ఛీ! ఎలాంటి అమ్మకి ఎటువంటి గతి పట్టించాను. తరువాత ఎన్నో ప్రయత్నాలు, ఉరిని వాయిదా వేస్తూ వచ్చారు కానీ, శిక్షనీతప్పించుకోలేక పోయారు. చేసిన నేరం అలాంటిది మరి. అమ్మ పోసిన ఆయుష్షు లో మిగిలిన ఆఖరి రోజుది. ఆఖరిసారిగా అమ్మకో ఉత్తరం రాయాలనిపించింది. నా చివరి జ్ఞాపకంగా. జైలు అధికారుల అనుమతి అడిగి రాయడం మొదలు పెట్టాడు.

అమ్మా !!

ఇదే ఆఖరిసారి అనుకుంటా అమ్మా నిన్ను ఇలా పిలవడం. ఓ అయోగ్యుడైన కొడుకుగా నీ కడుపులో చిచ్చుపెట్టి వెళ్ళిపోతున్నాను. ఈ ఏడేళ్ల జైలు జీవితం నాకు ఎంతో నేర్పింది. ఎన్నిసార్లో చేసిన తప్పుకు మానసికంగా చచ్చిపోయాను. ఓ అబలని అత్యంత పాశవికంగా హింసించి శరీరాన్ని కోసి పొందిన రాక్షసానందం గుర్తొస్తుంటే నన్ను నేనే క్షమించు కోలేక పోతున్నాను. ఆ పాపానికి ప్రక్షాళన లేదు. మరణం తప్ప. ఈ శిక్షణ నేను మనసారా అంగీకరిస్తున్నాను. కానీ శరీరానికి కొంచెం భయం. మరణ ఘడియ దగ్గర పడుతున్న కొద్దీ, చాలా భయంగా ఉంది అమ్మా. చిన్నప్పుడు భయమేస్తే నీ కొంగు చాటు దాక్కునే వాడిని కదా! ఇప్పుడు కూడా ఒక్కసారి నీ కొంగులో ముఖం దాచుకుని ఏడవాలి అనిపిస్తుంది.
జైలుగోడల తప్ప నన్ను ఓదార్చడానికి ఇక్కడ ఎవరూ లేరమ్మా. ఈ నిశ్శబ్దాన్ని భరించలేక పోతున్నాను. జీవితం విలువ తెలిసేసరికి, జీవితమే లేకుండా పోయింది. తన కుటుంబంతో కలిసి ఆనందంగా బతకాలనుంది. తప్పు సరిదిద్దుకోవాలి అని ఉంది. కానీ కుదరదు కదా. నాలో నేరస్తుడు ఎప్పుడో చచ్చిపోయాడు అమ్మ. ఇది నువ్వు నమ్మితే చాలు.
వీళ్ళు నన్ను ఆఖరి కోరిక ఏమిటి అని అడిగారు. నేను ఏమి అడిగానో తెలుసా అమ్మా ! ప్రభుత్వాన్ని మద్యాన్ని నిషేధించమనీ అడిగాను. అదే కదా నాలాంటి మృగాన్ని తయారుచేస్తుంది. ఓ నేరస్తుడి కోరిక కదా! అంగీకరిస్తారో ! లేదో! వాళ్లకి సంపాదన కావాలి, నాలాంటి వాళ్లకి ఆ మత్తులో ఉన్న గమ్మత్తు కావాలి, ఏ అమాయకురాలో బలి కావాలి, ఈ ఉరి కంబానికి ఇంకెన్ని తలలో వేలాడాలి. అదిగో తెల్లారబోతోంది ! నా బ్రతుకు కూడా! జీవితంలో ఈ కొద్ది దూరం నడక ఇంత భయంకరంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. సమయం దగ్గర పడుతోంది. ఈలోపే నా ప్రాణం పోతే ఎంత బాగుణ్ణు. నేను మరణించిన తర్వాత ఎంతమందో సంబరాలు చేసుకుంటారు. ఒక్క నువ్వు తప్ప! ఏడవకమ్మ! ఇన్నాళ్ళు ఏడ్చావు, చాలు. ఇప్పుడు నీ మీద ఒక బాధ్యత పెడుతున్నాను. ఇంకో నాలాంటి వెదవ, ఇలాంటి వెధవ పని చేయకుండా, నా కథని చరిత్రగా చెప్పు. ఇంకో ప్రాణం బలి కాకుండా, ఇంకెవరు ఉరి కంబానికి వేలాడకుండా, దేశం దద్దరిల్లేలా, నా దరిద్రపు చరిత్రని చెప్పు. కామాంధుల కళ్ళు తెరుచుకునెలా పదేపదే నా కథ చెప్పమ్మా! ఇందులో నా స్వార్థం ఏమిటంటే, కనీసం ఒక్క అమాయకురాలు బలికాకుండా కాపాడగలిగిన, నా పాపానికి కొంతైనా ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఒక్క అమ్మాయి బతికినా నీ కొడుకు బ్రతికి ఉన్నట్లే అమ్మ.
ఇంకొక్క ఆఖరి కోరిక. నా శరీరాన్ని నీకు అప్పగించిన తర్వాత, నీ ఒళ్లో ఒక్క రెండు నిమిషాలు నా తల నీ ఒళ్ళో పెట్టుకో అమ్మ. నీ ఒడిలోనే నా ఆఖరి యాత్ర ముగిసింది అనుకుంటాను. ఇంకా ఎన్నో చెప్పుకోవాలని ఉంది. కుదిరితే నీ కోసం అయినా బతకాలని ఉంది. మృత్యువు నన్ను పిలుస్తోంది అనుకుంటా! జైలు అధికారులు వస్తున్నారు.

ఇక సెలవు శాశ్వతంగా,

అయోగ్యుడైన,

నీ చిన్నా !
అధికారులకి ఉత్తరం అందించాడు. వారు అతనికి కొత్తబట్టలు ఇచ్చారు. స్నానం చేసి వచ్చి, ఆఖరిసారిగా దేవుణ్ణి ప్రార్థించాడు. ఆఖరి భోజనం తీసుకువచ్చారు. అమ్మ పంపించిందని చెప్పారు. అతను తినాలని ఎంత ప్రేమగా వండిందో పిచ్చి తల్లి! తినబుద్ధి కాకపోయినా, అంతా తిన్నాడు. అమ్మ ప్రేమ ని వదల బుద్ధి కాలేదు.
ఇక అతని అంతిమయాత్ర మొదలైంది. మృత్యు మార్గాల గుండా నడుస్తూ వెళ్తున్నారు. అంతా నిశ్శబ్దం. ఎవ్వరూ మాట్లాడరే! తనతో కాకపోయినా కనీసం వాళ్ళలో వాళ్ళు అయినా మాట్లాడుకోవచ్చు గా అనిపించింది. ఒక మనిషి ప్రాణం పోవడం అంటే వాళ్లకు బాధేగా ! వాళ్లు అతనిలా రాక్షసులు కారుగా! ఉరికంబం దగ్గర పడింది. నడక ఆగిపోయింది. తలెత్తి చూశాడు. అక్కడ….. అక్కడ….. ఆ అమ్మాయి…. అవును తనే…. తను ఉంది ఏంటి అక్కడా? అన్నా ! కాపాడు అన్నా ! వదిలేయ్ అన్నా! బతిమిలాడు తోంది. నీకు కాదమ్మా ఊరి నాకు అంటూ ముందుకు వెళుతున్నాడు. ఆమె బతిమిలాడు తూనే ఉంది. ఆరోజులాగే! వీళ్ళందరికీ వినబడడం లేదా! కాపాడాలి. ఆమెని రక్షించాలి. వస్తున్నా అమ్మా, నిన్ను నేను కాపాడతాను. ఉరికంబం వైపు వడివడిగా నడుస్తూ వెళుతున్న అతన్ని విస్తుపోతూ చూస్తున్నారు అధికారులు………..

కొన్ని రోజుల తర్వాత…….

ప్రతిరోజు కాలేజీల దగ్గర, బస్టాండ్ లో, తన కొడుకు రాసిన ఆఖరి ఉత్తరాన్ని పాంప్లెట్లుగా పంచుతోంది. కసాయివాన్ని కన్నతల్లిగా పేరుబడ్డ ఆ పిచ్చితల్లి.

1 thought on “ఆఖరి కోరిక

  1. కొన్ని మాటల్లోనే ఎన్నో భావాలను వ్యక్తపరిచారు.
    మీ కథతో నా కళ్ళు చెమ్మగిల్లాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *