February 27, 2024

ఇక్కడ జాతకాలు చెప్పబడును.

రచన: గిరిజారాణి కలవల

అమ్మ దగ్గరకి వెళ్లి ఈ దసరాకి రెండేళ్లు పైనే అయింది. ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. చెల్లి అమెరికా లో వుంది కాబట్టి మాటి మాటికి అది రాలేదు.. ఇండియాలో వున్న నువ్వూ అలాగే చేస్తే ఎలాగే? దసరాకి బొమ్మలకొలువు పెట్టడం మీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను.. మీరు రాకపోవడంతో.. మరీ మానేయకూడదని ఏవో నాలుగు బొమ్మలు పెట్టి హారతి ఇచ్చేస్తున్నా… పిల్లలు చిన్నపుడు ప్రతీఏడూ దసరాకి వచ్చేదానివి… ఇప్పుడు వాళ్ళ కి ఏవో క్లాసులూ, కోచింగులూ అంటూ రెండేళ్లుగా రావడం లేదు. ఈ దసరాకి రాకపోతే ఊరుకోను.. అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి.. ఇక తప్పదని నాకూ, పిల్లలకీ టిక్కెట్లు బుక్ చేయించాను శ్రీవారితో.. ఆయన పండగ ముందు రోజు వచ్చేటట్లు ప్లాన్ చేసుకున్నాము. అదే మాట అమ్మ కి ఫోన్ చేసి చెప్పాను.
ఈయన ఉద్యోగ రీత్యా ఏడేళ్ల నుంచి ఇండోర్ లో వుంటున్నాము. పిల్లలు ఇద్దరూ హైస్కూల్ చదువుకి వచ్చారు.. ఏవో ఒక ట్యూషన్ లూ, ఇతర ఏక్టివిటీస్.. వీటితోనే సరిపోతోంది. రెండేళ్ల క్రితం చెల్లి అమెరికా నుంచి వచ్చిందని, అప్పుడు వెళ్ళాను అమ్మానాన్న గార్ల దగ్గరకి.. అంతే మళ్లీ కుదరలేదు బాపట్ల వెళ్ళడానికి.. ఇదిగో ఇప్పుడు అమ్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి.. దసరాకి పదిహేను రోజుల ముందే పిల్లల ని తీసుకుని బయలుదేరాను.
హైదరాబాద్ లో ఫ్లైట్ దిగేసరికి.. అక్కడకి నాన్న వచ్చారు. అక్కడి నుంచి డైరక్ట్ గా బాపట్ల కి కారులో తీసుకెళ్లారు. ప్రయాణం చేస్తున్నంతసేపూ బన్నీ నాన్న తో కబుర్లే.. తాతయ్యా! అక్కడ క్రికెట్ గ్రౌండ్ వుందా? మీ ఇంట్లో ఇంటర్నెట్ వుందా? ఇలా ఏవో ఒకటి వాగుతూనే వున్నాడు. తెల్లారేసరికల్లా ఇంటికి చేరాము. గుమ్మంలోనే అమ్మ ఎర్రనీళ్ళతో రెడీగా వుంది. మా ముగ్గురికీ దిష్టి తీసి
ఆ నీళ్లు బయట పారబోసింది. లోపలకి రావడం ఆలస్యం.. పిల్లలు.. అమ్మమ్మ ని వదిలిపెట్టలేదు. సుమ అయితే మరీను.. రోజూ ఫోన్ లో, వీడియో కాల్ లో మాట్లాడుతున్నా కూడా.. ఏంటో మొహం వాచినట్లనిపించింది నాక్కూడా.. అమ్మని చూసేసరికి.
నేనూ పిల్లలు స్నానాలు ముగించుకుని వచ్చేసరికి, వేడి వేడిగా పెసరట్టూ, ఉప్మా.. పొగలు కక్కుతూ ఇడ్లీలు.. రెండు చట్నీలు.. అమ్మా, నాన్నా ఇద్దరూ టేబుల్ మీద రెడీ చేస్తున్నారు. ” ఎందుకమ్మా! ఇంత హైరానా పడతావు? నేనొచ్చి సాయం చేస్తా కదా!” అన్నాను.
” ప్రయాణం చేసొచ్చి అలిసిపోయావు, అయినా, ఎంత సేపు పడుతుందీ.. వీటికి.. అమ్మ చిటికెలో చేసెయ్యగలదు.. రండి.. ముందు నువ్వు, పిల్లలు కూర్చోండి.” అన్నారు నాన్న.
టిఫిన్లు అయ్యాక.. నేను కూరలు తరిగి ఇస్తే అమ్మ కబుర్లు చెపుతూ వంట చేసేసింది. ఏవేవో పాత కబుర్లు.. ఈ మధ్య కాలంలో నేను రాలేదు కదా.. ఊళ్ళో సంగతులన్నీ చెప్పసాగింది.
” అమ్మా ! అనసూయ పిన్ని ఎలా వుంది? ఈ మధ్య ఫోన్ లో కూడా తన గురించి చెప్పలేదు.. తన వంట్లో బానే వుందా?” అని అడిగాను.
అమ్మ సమాధానం చెప్పకుండా మాట దాటేసేసింది. తర్వాత అడుగుదాంలే అని వూరుకున్నా..
అనసూయ పిన్ని అమ్మకి వరసకి చెల్లెలు అవుతుంది. దూరపు చుట్టం. ఈ ఊళ్లో నే వుండడం మూలాన, చుట్టరికం కూడా వుండేసరికి వస్తూ, పోతూ వుండేది. అనసూయ పిన్ని ఇంటికి తరచూ వెడుతూ వుండేవాళ్ళం నేనూ, అమ్మా.
ఎప్పుడూ ఏవో పూజలూ, నోములూ, వ్రతాలూ అంటూ అందరినీ పిలుస్తూ వుండేది. ఇంట్లో దేముడి మందిరం కూడా ఓ చిన్న సైజు గుడిలా వుండేది. ఎప్పుడూ చూడని, వినని దేముళ్ళ ఫోటోలు పిన్ని మందిరంలో వుండేవి. ఒక్కో దేముడికి ఒక్కో ప్రసాదం నైవేద్యాలు చేసేది. గుమ్మానికి కూడా ఏవేవో జాకెట్టు మూటలు, కొబ్బరి కాయలు, గుమ్మడి కాయలు ఇలా చాలా వరసగా కట్టేది.
నేను వచ్చినపుడల్లా.. ఆ పూజ చెయ్యి, ఈ పూజ చెయ్యి, ఫలానా వూళ్లో ఫలానా దేముడికి మొక్కుకో.. ఇలా ఏవో ఒకటి చెప్పేది. నేను తేలిగ్గా తీసేసేదాన్ని.. ఇవన్నీ నాకు కుదరవులే పిన్నీ! పిల్లల తోనే నా టైమంతా సరిపోతుంది.. ఏదో పొద్దున్నే స్నానం చేసి దేముడి దగ్గర దీపం వరకు పెట్టి, పాలో.. పండో చూపించేస్తాను. ఇంతకి మించి నా వల్ల కాదు.. నన్ను వదిలెయ్.. ” అనేదాన్ని.
వాళ్ళ పక్కింట్లో వుండే సురేఖ ఆంటీ కూడా బాగా పరిచయం అయింది.. నేను ఎప్పుడు వెళ్లినా అనసూయ పిన్ని ఇంట్లో కనపడేది. తనకి పిన్ని చెప్పే ఈ కబుర్లు చాలా ఇష్టం.. ప్రతీ డౌటూ అడుగుతూవుండేది పిన్ని ని.. ఆ దేముడికి ఏం నైవేద్యం పెట్టాలీ, ఈ పూజ ఏరోజు చెయ్యాలీ, ఎన్ని ప్రదక్షిణలు చేయాలీ, ఏ దేముడి పూజకి ఏ రంగు చీర కట్టుకోవాలీ? ఇలాంటి ప్రశ్నలు వేయడం.. వాటికి పిన్ని పెద్ద ప్రవచనకర్తలాగా సమాధానాలు చెప్పడం.. ఇంకా చుట్టుపక్కల వారు కూడా ఏదో ఒకటి అడుగుతూ వుండేవారు. అందరికీ పిన్ని ఓ పెద్ద గురువులా తోచేది. నాకు ఇవన్నీ సరదాగా వుండేది.

ఈ మధ్య బాపట్ల రాకపోయేసరికి పిన్ని సంగతులు ఏవీ తెలీలేదు. అమ్మ కూడా ఫోనులో పిన్ని కబుర్లు పెద్దగా చెప్పేదికాదు. ఇప్పుడు కూడా పిన్ని గురించి అడిగినా మాట మార్చేసింది.. ఏమయివుంటుందబ్బా! అనుకున్నా..
మధ్యాహ్నం అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించాం.. చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట తిన్నానేమో.. నిద్రదేవి ఆవహించేసింది.
మంచి నిద్ర లో వున్న నాకు ఏవో మాటలు వినపడి, మెలకువ వచ్చి, ఎవరో వచ్చినట్లున్నారు.. అనుకుని హాల్లోకి వచ్చాను. అనసూయ పిన్ని వాళ్ళ పక్కింట్లో వుండే సురేఖ.. అమ్మ మాట్లాడుకుంటున్నారు.
సురేఖ ని చూసి పలకరింపుగా నవ్వాను. ” ఎలా వున్నారు? బావున్నారా ఆంటీ? అని పలకరించాను.
” బావున్నానమ్మా! నువ్వు వచ్చావని తెలిసి చూసి వెడదామని వచ్చాను. బాగా చిక్కిపోయావు.. ” అంటూ తిరిగి నన్ను కుశలప్రశ్నలు వేసింది సురేఖాంటీ.
” బానే వున్నాను ఆంటీ! పిల్లలతో బిజీ అయింది.. అంతే.. ఔనూ! అనసూయ పిన్ని కి తెలీదా? నేను వచ్చినట్లు.. తనూ రావల్సింది మీతో.. ” అన్నాను.
నా మాటలకి సురేఖ అమ్మ మొహం కేసి ప్రశ్నార్థకంగా చూసింది..
” పొద్దున్నే గా అమ్మాయి వచ్చింది.. ఇంకా ఏం చెప్పలేదు అనసూయ గురించి.. నువ్వే చెప్పు.. తన పక్కింట్లో వుండేదానివి.. నాకంటే నీకే బాగా తెలుసు.. మీరు మాట్లాడుతూ వుండండి. కాఫీ తీసుకొస్తాను.” అని అమ్మ వంటింటిలోకి వెళ్ళింది.
ఏంటో.. వీళ్ళ మాటలు ఏమీ అర్థం కాలేదు నాకు… కానీ అనసూయ పిన్ని గురించి మాత్రం ఏదో వుందని అనిపించింది.
” ఏమైంది ఆంటీ! అనసూయ పిన్ని కి.. అమ్మ కూడా చెప్పలేదు.. అడిగితే మాట దాటేసేసింది. మీరైనా చెప్పండి ” అంటూ అక్కడే వున్న కుర్చీ లో కూర్చున్నాను.
దానికి సురేఖాంటీ.. ” ఏం చెప్పమంటావు? తను ఓ పెద్ద భాగోతమే ఆడేసింది. తన పేరు ఎత్తితే.. అందరూ తిట్టి పోస్తున్నారు. ఏదో దేవుళ్ళ గురించి, పూజల గురించి చెపుతోందని ఒకొక్కరూ తన దగ్గరకు రావడం మొదలెట్టేసరికి.. ఇదేదో బావుందే అనుకుని, తనని నమ్మిన వారందరికీ కొత్త కధలు చెప్పడం మొదలెట్టింది. తనకి ఓ గురువుగారు మంత్రోపదేశం చేసారనీ.. ఆ మంత్రం జపించి ధ్యానం లో కూర్చుంటే అమ్మవారు తనతో మాట్లాడుతున్నారనీ అందరికీ చెప్పింది.
ఇహ అందరూ నమ్మేసారు.. వరస పెట్టి జనాలు రావడం మొదలెట్టారు. మేం ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామని ఒకరూ, మా అమ్మాయి కి పెళ్ళి ఎప్పుడు కుదురుతుందని ఒకరూ, మా అబ్బాయి కి ఉద్యోగం ఎప్పుడు వస్తుందని ఒకరూ.. ఇలా అడిగేవారు. అడిగినవారందరికీ ఏదో ఒకటి చెప్పేది… ఆంజనేయస్వామి కి రోజూ నూటపదకొండు ప్రదక్షిణలు చేయాలని ఒకరికీ, వినాయకుడి గుడిలో ఇరవై ఒక్క బుధవారాలు ఇరవై ఒక్క లడ్డూలు పంచమని మరొకరికీ… ఇలా ఆ సమయానికి ఏది తోస్తే అది చెప్పేది. జాతకం వచ్చని చెప్పి చేతులు చూసి నోటికి వచ్చేది చెప్పేది. డబ్బులు ఇవ్వబోతే.. చేతితో తీసుకోకూడదు.. మీరేది ఇచ్చినా అమ్మవారికే అంటూ.. దేముడి మందిరంలో పెట్టమనేది. వాళ్ళ అమాయకత్వం తో తెగ ఆడుకునేది.
ఒకావిడ వాళ్ళాయన ఆరోగ్య పరిస్థితి బావుండకపోతే.. అనసూయ దగ్గర కి వచ్చి, ఏం చేస్తే ఆయనకి తగ్గుతుందీ అని అడిగింది. ఇంకేం వుందీ.. ఆయన ఇంక ఆఖరి ఘడియ దగ్గరకి వచ్చింది.. నేను అడ్డం వేస్తాను.. మృత్యుంజయహోమం చేయిస్తాను, విభూతి పెడితే.. మర్నాటికల్లా లేచి కూర్చుంటాడు.. ఏదో కొద్ది ఖర్చు అయితే నేనే చేయించేదాన్ని.. నీ పసుపు కుంకుమ ల కోసం.. కానీ పాతికవేలవుతుంది అని చెపితే… పాపం ఆ అమాయకురాలు ఎక్కడో అప్పు చేసి ఆ పాతికవేలు తెచ్చి ఇచ్చింది. ఈ అనసూయ ఏ హోమమూ చేయించకుండానే.. సాయిబాబు గుళ్ళో విభూతి పొట్లం కట్టి ఆవిడకి ఇచ్చింది. వారం రోజులకే ఆవిడ భర్త పోయాడు. తర్వాత ఆవిడ కొడుకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు.. పాతికవేలు తిరిగి ఇమ్మని… తనకి సంబంధం లేదని తెగేసి చెప్పింది . ఏమనలేక పాపం ఆ అబ్బాయి వెళ్లి పోయాడు.
ఒకటి కాదు రెండు కాదు.. ఇలా అందరినీ మోసం చేయడం మరిగింది. అందరి దగ్గరా డబ్బులు ఒక ప్రణాలిక ప్రకారం లాగేది. తెలీకుండానే అనసూయ బుట్టలో ఎంతమంది పడిపోయారో.. ” అంది సురేఖాంటీ.
ఆశ్చర్యపోయాను.. ” అనసూయ పిన్ని ఇలా మారిపోయిందా? ఇదివరకు ఎప్పుడూ లేదుగా ఇలా? ” అన్నాను.
” అబ్బో.. ఇదేంటీ.. ఇంకా చాలా చేసింది. పాపం ఆ రాజ్యం అయితే మరీనూ.. నిలువునా మోసపోయింది. అసలే మూఢనమ్మకాలు ఎక్కువ ఆ రాజ్యానికి.. ఈవిడ దగ్గరకి ఏదో ఒక డౌట్ తో రావడం.. ఈవిడగారు వాటికి పరిష్కారం చెప్పేది.. ఆ కొబ్బరి కాయలూ, నిమ్మ కాయలూ, దీపారాధన నూనే.. ఇలా రోజుకో మూడొందలు వదిలేది.
ఓ సారి.. కలలో లో రోజూ పాము కనపడుతోంది.. ఎందుకిలా? అని అడిగింది రాజ్యం. ఇదే అదను అనుకుని… మీ వంటింటిలో భూమిలో లంకెబిందెలు వున్నాయి. వాటికి ఆ పాము కాపలాగా వుంది. ఆ సొత్తు నీకు దక్కేరోజులు దగ్గర పడ్డాయి అందుకే.. ఆ పాము రోజూ నీ కలలో కనపడుతోందని చెప్పింద. పాపం ఆ రాజ్యం అది నిజమే అని నమ్మేసింది. అది తవ్వాలన్నా, మామూలు వాళ్ళు తవ్వకూడదు.. దీనికి మంత్రంతో తగిన పూజలతో తవ్వే వారున్నారు.. నీకు ఇష్టమయితే పిలిపిస్తాను.. నాకయితే పైసా అక్కర్లేదు.. కానీ వాళ్ళ కి మాత్రం లక్షరూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది చాలా రహస్యంగా జరగాలి.. ఎవరికీ తెలీకూడదు. లంకెబిందెలు నీ చేతికొస్తే.. ఈ లక్ష నీకు లెక్కలోకి రాదు. నువ్వు.. ఊ.. అంటే పిలిపిస్తాను రాజ్యాన్ని అని తెగ కంగారు పెట్టేసింది. రాజ్యం ఇదంతా నమ్మేసింది. సరే అంది. గొలుసు, గాజులు తాకట్టు పెట్టి లక్ష రూపాయలు అనసూయ చేతిలో పోసింది.
అనసూయ ఎవరో ఇద్దరు గడ్డం సాధువులకి చెరో అయిదు వేలిచ్చి, మిగిలిన డబ్బు తను ఉంచేసుకుంది. రాత్రిళ్లు రాజ్యం వంటింటిలో తవ్వించింది. రాజ్యం మొగుడు ఎక్కడో సౌదీఅరేబియాలో వుంటాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే.. రాజ్యాన్ని, అనసూయ ని తన్ని తగలేసేవాడు. లంకెబిందెలు నిధి రాగానే మళ్లీ వంటగది బాగుచేయించొచ్చు అనుకుంది రాజ్యం. ఆ వచ్చిన గడ్డం సాధువులు.. ఇష్టమొచ్చినట్లు గోతులు తవ్వి పారేసి, రెండు రోజులు పోయాక..ఎవరూ చూడకుండా ఓ చచ్చిన పాముని తీసుకొచ్చి.. ఆ గోతిలో పారేసి.. పాము చచ్చిపోయింది కాబట్టి లంకెబిందెలు మాయమయి పోయాయి.. ఇక లాభం లేదని చక్కా పోయారు.
రాజ్యం లబోదిబో మన అనసూయ దగ్గరకి వెళ్లి అడిగితే.. నాకేం సంబంధం లేదూ.. అదంతా వాళ్లకే తెలుసు.. పాము చచ్చిపోయింది అని చెప్పారుగా.. ఇక నీ కలలోకి కూడా పాము రాదు.. అని చెప్పింది. కల సంగతి కాదు.. ముందు నా లక్ష సంగతి చెప్పు.. మా ఆయనకి తెలిస్తే చంపేస్తాడు.. ఇప్పుడు ఆ తవ్విన గోతుల రిపేరుకే లక్ష పైనవుతుంది. బంగారం కూడా తాకట్టు లో పెట్టాను.. నీకు ఇవ్వడానికి.. లంకెబిందెలు దొరకలేదు గా.. నా లక్ష నాకు తిరిగి ఇమ్మని మొత్తుకుంది. అనసూయ లొంగితే కదూ… అందులో ఒక్క పైసా నేను తీసుకోలేదు.. మొత్తం ఆ సాధువులకే ఇచ్చేసాను.. ఇప్పుడు నేను ఎక్కడ నుంచి తేవాలి? అయినా నీకు ఇష్టమైతేనే ఒప్పుకోమని చెప్పాను… ఇప్పుడు నన్నంటే నేనేం చేయగలను… నువ్వు అరిచి మొత్తుకున్నా.. నేనేమీ ఇవ్వలేను. అని మొండి చేయి చూపించింది.
ఈ విషయం ఈ నోటా.. ఆ నోటా తెలిసి వాళ్ళాయన సౌదీ నుంచి వచ్చి… పెళ్ళాం మీద చెయ్యి చేసుకుని, అనసూయ మీదకి గొడవకి వెళ్ళాడు. అనసూయ ఏమాత్రం జంకు గొంకు లేకుండా అతనితో సమానంగా దెబ్బలాడింది. తనకేం సంబంధం లేదనే వాదించింది. ఇలా కాదని అతను పోలీస్ కేసు పెట్టాడు. మీ నాన్నగారు ఆదుకోబట్టి ఎలాగో బయటపడింది. ఇదిగో ఇలాంటివి చేసి చేసి పరువు మొత్తం పోగొట్టకుంది. ఎదుటపడితే అందరూ తిట్టడమే.. ” అంటూ చెప్పుకొచ్చింది సురేఖాంటీ…
నాకు అసలు నమ్మశక్యం కాలేదు…. ఏదో చిన్న చిన్న పూజలూ, నోములూ చెప్పే అనసూయ పిన్ని ఇలా చేసిందేంటి? అనుకున్నా.
ఇంతలో కాఫీ తో అక్కడకి వచ్చిన అమ్మ…
.” అంతేకాదు… ఆ మధ్య నీకేదో ప్రాణం మీద కొచ్చిందనీ, అత్యవసరంగా పాతికవేలు పంపించమని తనని అడిగావనీ.. సురేఖకి చెప్పిందట. నాకు చెప్పొద్దు అని కూడా చెప్పావట అంది. తన దగ్గర ఐదువేలే వుని, సురేఖనో ఇరవై వేలు సర్దమందట. సురేఖ నిజమే అనుకుని ఇరవై వేలు అనసూయ కిచ్చి నీకు పంపమని చెప్పిందట. ఎన్నాళ్లు అయినా అనసూయ తిరిగి ఇవ్వకపోవడంతో సురేఖకి అనుమానం వచ్చి నన్ను అడిగింది. నేను నిర్ఘాంతపోయాను… నాకు తెలీకుండా నువ్వు అనసూయ ని డబ్బు అడగడమేమిటని. ఇదిగో ఈరోజు నువ్వు వస్తున్నావనీ, వచ్చి నిన్నే అడిగి నిజం తెలుసుకోమనీ.. సురేఖని రమ్మన్నాను. నీకు డబ్బు అవసరమైనది నిజమా? అబధ్ధమా? ” అని అమ్మ అడిగింది.
నేను నిర్ఘాంతపోయాను.” నాకు పాతిక వేలు అవసరమవడమేమిటీ, అంతగా అవసరమైతే.. మా ఆయన ఫ్రెండ్స్ బోలెడు మంది వున్నారు సర్దడానికి.. పోనీ నాన్న నైనా అడుగుతాను కదా, అనసూయ పిన్ని ని నీకు తెలీకుండా పంపమని ఎందుకు అడుగుతాను…. ఛీ.. ఛీ.. ” అన్నాను.
” చూసావా, సురేఖా! అనసూయ ఎంతటి తెలివైందో… మా పేరు చెప్పి నీ దగ్గర డబ్బు కొట్టేసింది.. అయినా మధ్య లో నీకెందుకు నష్టం.. నీ ఇరవై వేలు నీకు ఇచ్చేస్తా వుండు.. ” అంటూ అమ్మ లోపలకి వెళ్లి ఇరవైవేలు తెచ్చి సురేఖ చేతిలో పెట్టింది.
” అయ్యో.. తీసుకున్నది అనసూయ ఐతే మీరివ్వడమేమిటి? ” అని సురేఖ మొహమాట పడింది.
” అనసూయ పిన్ని ఇంతలా చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.. నువ్వోసారి అడిగి నాలుగు చివాట్లు వేయకపోయావా అమ్మా.. ” అన్నాను.
” ఛీ.. ఛీ.. దానికెంత దూరంగా వుంటే అంత మంచిది.. ఇక దాని మాట కూడా తలవకూడదు ” అంది అమ్మ చాలా కోపంగా..
“డబ్బు కోసం ఇదోరకం వేషాలు… మోసం చేసి ఎన్నాళ్ళు మనగలరు? ఏదో ఒక రోజు బండారం బయట పడక తప్పదు. . ఇప్పుడు అందరికీ అనసూయ సంగతి తెలిసిపోయింది.. ఎవ్వరూ కూడా మాట్లాడడం లేదు.” అంది సురేఖాంటీ.
ఆరోజంతా నేను అనసూయ పిన్ని గురించే ఆలోచిస్తూవుండిపోయాను.
పండగ రోజు అమ్మా, నేనూ.. అమ్మవారి గుడికి వెడితే.. అక్కడ చెట్టుకింద.. చేయి చూసి జాతకం చెప్పే కోయదొర దగ్గర తన చేయి చూపించుకుంటూ కనపడింది అనసూయ పిన్ని. తను మమ్మల్ని చూడలేదు. నేను తనని చూసి.. పాపం అందరికీ జాతకాలు చెప్పే పిన్నికే జాతకం తిరగపడింది.. అనుకుంటూ.. బయటకి వచ్చేసాను.

సమాప్తం.

1 thought on “ఇక్కడ జాతకాలు చెప్పబడును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *