April 26, 2024

అమ్మమ్మ – 11

రచన: గిరిజ పీసపాటి

దొంగవెల్లి సంబరానికి సిధ్ధం కమ్మని మగపెళ్ళివారి నుండి కబురు రాగానే అదేదో పేరంటం అనుకుని పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, అక్షింతలు మొదలైనవన్నీ సిధ్ధం చేసి, నాగను పల్లకిలో తీసుకెళ్ళి దొంగవెల్లి కార్యక్రమానికి తరలి రమ్మని ఆహ్వానించారు తెనాలి తాతయ్య అమ్మమ్మ.
దొంగవెల్లి కార్యక్రమం అంటే పేరంటం కాదనీ, అదో వేడుక అనీ, అందుకు నాగ ఉండనవసరం లేదనీ, పెళ్ళికూతురి అన్నదమ్ముడు వుంటే చాలని చెప్పారు మగపెళ్ళివారు. నాగను తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోయి పెద్దన్నయ్యను తీసుకుని విడిదింటికి వచ్చారు ఆడపెళ్ళివారు. అప్పుడు దొంగవెల్లి కార్యక్రమం ఎలా ఉంటుందో వివరించారు మగపెళ్ళివారు.
అది విన్న ఆడపెళ్ళివారు నోట మాట రాక అలా ఉండిపోయారు. అసలు ఇలాంటి కార్యక్రమం ఒకటి పెళ్ళిలో ఉంటుందనే విషయమే వారికి తెలియదు. చేసేది లేక నవ్వాపుకుంటూ సరేనన్నారు. అప్పుడు మొదలైంది దొంగవెల్లి కార్యక్రమం.
తాడు కట్టిన ఒక చేదను (నూతిలోంచి నీళ్ళు తోడే చిన్న బకెట్) పట్టుకుని వీధిలో ముందు పెళ్ళికొడుకు పరిగెడుతుంటే, వెనకాల పెళ్ళికొడుకుని పట్టుకోవడానికి పెద్దన్నయ్య పరుగుపెట్టసాగాడు. ఈ వేడుక విషయం తెలియని వీధిలోని వారు పెళ్ళికొడుకు జారిపోతున్న పంచెను, కండువాను సర్దుకుంటూ రోడ్డు మీద ఎందుకు పరుగు పెడుతున్నాడో అర్ధం కాలేదు.
ఇదో వేడుక అని తెలుసాక అందరూ ఒకటే నవ్వు. ఆఖరికి పెద్దన్నయ్య అలా రోడ్డు మీద పరిగెట్టడానికి సిగ్గుపడి, ఆగిపోయి, ఓడిపోయానని ఒప్పుకోవడంతో వేడుక ముగిసింది. అలాగే ఆడపెళ్ళివారు రకరకాల షేప్స్ లో వియ్యపురాలికి, ఆడపడుచులకి అప్పడాలు తయారు చేసి అందించడం మగపెళ్ళివారికి వింతగా అనిపించింది.
ఆడపెళ్ళివారు జరిపిన మరో ముఖ్యమైన వేడుక బూజంబంతిని (బువ్వ పంక్తి) కార్యక్రమం. ఆ వేడుకలో అందరికీ పంక్తి భోజనాలు ఏర్పాటు చేసి ఒకరినొకరు సరదాగా ఆట పట్టించుకుంటారు. ఆ కార్యక్రమం గురించి అసలేమీ తెలియని మగపెళ్ళివారికి చాలా విడ్డూరంగా అనిపించింది.
‘పువ్వుబోణులార ఇట బువ్వము బంతి… రవ్వలడ్లు చేసినారు రారె పోదము… నెల్లూరు బియ్యపు నిర్మలన్నమే… కొల్లగాను గో ఘృతమ్ము కుమ్మరింతురే’ అంటూ రకరకాల వంటకాలను వర్ణిస్తూ సాగే పాటను పాడుతూ జరిపిన ఈ వేడుక అర్ధరాత్రి వరకు సాగింది.
ఐదురోజుల పెళ్ళిలో మొదటి రోజు ప్రముఖ సంగీత విద్వాంసుడు అయిన మహావాది వెంకటప్పయ్య గారి (ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి గారికి సంగీతం నేర్పిన గురువు గారు) గాత్ర కచేరీ, రెండవ రోజు ప్రముఖ హరికధా కధకులైన ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికధ, మూడవ రోజు ప్రముఖ నటులచే కురుక్షేత్రం పౌరాణిక నాటకం, నాలుగో రోజు బుర్రకథ, ఐదవ రోజు భరతనాట్యం బంధుమిత్రులను అలరించాయి.
ఐదవ రోజున ముహూర్త సమయానికి నాగ పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. అప్పగింతల సమయంలో అమ్మమ్మ దుఃఖం ఆపుకోలేకపోయింది. సారెతో నాగ అత్తవారింటికి రాముడువలస బయలుదేరింది.
అమ్మమ్మ చిన్న చట్నీల జాడీల దగ్గరనుండి పెద్ద పెద్ద ఆవకాయ పెట్టునే జాడీల వరకు, స్టీల్ కప్పు-సాసర్ల సెట్, అన్ని సైజుల్లో జగ్గులు, గిన్నెలు, బకెట్లు, ఇత్తడి సామాను, మంచాలు, కుర్చీలు, పీటలు, పరుపులు, దిళ్ళు, తిరగలి, రోలు, రోకలి ఇలా కాపురానికి అవసరమైన ప్రతీ ఒక్కటి సమకూర్చి రెండు లారీల సారె సామాను నాగకు పెట్టింది.
అందరూ గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం జరిపించడానికి రాముడువలస బయలుదేరి అక్కడి మూడు నిద్రలు పూర్తయ్యాక మళ్లీ నాగను, అల్లుడిని తీసుకుని తెనాలి వచ్చారు. కొన్ని రోజులు వాళ్ళు తెనాలిలో గడిపి తిరిగి రాముడువలస వెళ్ళిపోయారు. అప్పటివరకు లేని ఒంటరితనంతో బాధపడసాగింది అమ్మమ్మ.
పెళ్ళైన కొన్ని నెలలకే నాగ గర్భవతి అయ్యిందనే శుభవార్త విని చాలా సంతోషించారు అమ్మమ్మ, తాతయ్యలు. తాతయ్య వెంటనే రాముడువలస వెళ్ళి నాగను తెనాలి తీసుకువచ్చారు. అమ్మమ్మ నాగను దగ్గరకు తీసుకుని, నుదుటిపై ముద్దు పెట్టుకుని, “నువ్వే చిన్న పిల్లవి. అప్పుడే అమ్మవి అవుతున్నావా నాగులూ!” అంటూ ఒకపక్క సంతోషం, మరోపక్క బాధను వ్యక్తం చేసింది.
డాక్టర్ రాజేశ్వరమ్మగారికి నాగను చూపించి, ఆవిడ ఇచ్చిన మందులు వాడుతూ, బలవర్ధకమైన భోజనం పెడుతూ అపురూపంగా చూసుకోసాగారు. నాగకు ఆరవ నెల రావడంతో, ఏడవ నెలలో చెయ్యాల్సిన గాజులు వేయించే కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అమ్మమ్మ, తాతయ్య.
ఒకరోజు వియ్యపురాలి పెద్ద మేనత్త చనిపోయిందని టెలిగ్రామ్ రావడంతో ఎలాగూ విశాఖపట్నంలో పీసపాటి తాతయ్య నాటకం కూడా ఉండడం వలన ఆ నాటకం అయ్యాక అటునుండి రాముడువలస కూడా వెళ్ళి వియ్యపురాలిని పలకరించి వస్తాననీ, రావడానికి నాలుగైదు రోజులు పడుతుంది కనుక నాగను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మధ్యాహ్నం భోజనం చేసి హౌరా ఎక్స్‌ప్రెస్‌ కి బయలుదేరారు తెనాలి తాతయ్య.
ఆయన సహజంగానే భోజన ప్రియుడు కావడంతో అన్ని రకాల వంటలు రుచి చూసి, అనంతరం ఉడికించిన వేరుశెనగ కాయలు కూడా తిని ఆలస్యంగా రైల్వేస్టేషన్ కి చేరుకోవడం వల్ల హౌరా ఎక్స్‌ప్రెస్‌ అప్పటికే ప్లాట్‌ఫారమ్ మీద బయలుదేరింది. ఇది గమనించిన తెనాలి తాతయ్య ట్రైన్ ని అందుకోవడానికి పరుగందుకున్నారు.
అప్పటికే ట్రైన్ లో వీరి కోసం కేటాయించిన రిజర్వుడు బెర్త్ మీద కూర్చుని ఉన్న నటుడు (దుర్యోధనున పాత్రధారి), తెనాలి తాతయ్యకు ఆప్తుడు అయిన శ్రీ పాతూరి రామకృష్ణ మూర్తి గారు తాతయ్యను గమనించి చేయి చాచి “బావా త్వరగా రా!” అంటూ కేకెయ్యడంతో మరింత వేగంగా పరుగు పెట్టి ఆయన చేయందుకుని ట్రైన్ ఎక్కారు.
అసలే హైబిపి పేషెంట్ కావడం వల్ల అంత వేగంగా పరుగు పెట్టడం తట్టుకోలేక ట్రైన్ ఎక్కగానే బర్త్ మీద కూలబడి కాసేపు బాగా ఆయాసపడి, తరువాత భళ్ళున పెద్ద వాంతి చేసుకున్నారు. తరువాత పాతూరి గారు అందించిన నీటితో చేతులు, మూతి కడుక్కుని, బట్టలు కూడా శుభ్రపరుచుకునే లోపు మరో వాంతి చేసుకుని బర్త్ మీద ఉలుకు పలుకు లేకుండా నిశ్శబ్దంగా ఒరిగిపోయారు.
దాంతో భయపడిన పాతూరి గారు దుగ్గిరాల స్టేషన్ లో తాతయ్యను ట్రైన్ నుండి కిందకు దింపి వెనక్కి తెనాలి తీసుకొచ్చేద్దామని ప్రయత్నించినా అక్కడ రెండు నిముషాలకు మించి ట్రైన్ ఆగకపోవడంతో విజయవాడ చేరేవరకు ఆగి అక్కడ ఆయనను జాగ్రత్తగా కిందకు దింపి, టాక్సీ మాట్లాడి తెనాలి తీసుకొచ్చేసారు.

******* సశేషం ********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *