May 25, 2024

జలజం.. కరోనా – “కరో”నా.. క”రోనా”

రచన: గిరిజారాణి కలవల

” జలజం.. ఏమోయ్. జలజం.. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయే. వంటింట్లోంచి చుయ్ చుయ్ లు వినపడ్డం లేదూ! ఇంకా వంట మొదలెట్టలేదా?” జలజాపతి పొట్ట నిమురుకుంటూ హాల్లో నుంచి బెడ్ రూమ్ లోకి వచ్చాడు.
బెడ్ షీట్లు మారుస్తున్న జలజం. దుప్పటి అక్కడ విసిరికొట్టి ఒక్కసారిగా గయ్ మంది.” చుయ్ చుయ్ లు వినపడ్డం లేదా? ఇప్పుడు టైమింకా పదయిందంతే.. గంట కితమేగా పొట్ట నిండుగా కట్టుపొంగలి లాగించారు.. అప్పుడే ఎలకలు పరిగెడుతున్నాయా? ఓ పిల్లి ని మింగండి. సరిపోతుంది..” అంది.
” అదికాదు.. జలజం. ఎండలు ముదురుతున్నాయి కదా! కాస్త పెందరాళే వండేసుకుంటే. ఏసీ లో కూర్చుంటావని. నీ గురించే అడిగాను అంతే. ” పరిస్థితి గమనించి మెల్లిగా జారుకున్నాడు.
” అబ్బో. పేమ కారిపోతోంది. బిందె పట్టుకొస్తా ఉండండి. నిండుతుందేమో..పొద్దస్తమానం.. ఆ టీవీ ముందు కూర్చుని. ఏ వూళ్ళో ఎంతమందికి కరోనా వచ్చిందో. లెక్కలు వేసే బదులు.. వంటింట్లో తగలడి కాస్త బెండకాయ ముక్కలు తరగొచ్చుగా. అసలే పనిమనిషి కూడా లేదే. ఒంటిచేత్తో ఎన్నని చేసుకుంటుందే అనే ఆలోచనే లేదు. ఖర్మ.. ఖర్మ. మిమ్మల్ని అంటగట్టిన మా నాన్నని అనాలి.. మిమ్మల్ని ఇలా పెంచిన మీ అమ్మని అనాలి.. ” అంటూ జలజం అటేడు తరాలకీ ఇటేడు తరాలకీ. వెళ్లి పోతోంది.
” అబ్బా! టీవీ న్యూస్ మధ్య లో బ్రేక్ వచ్చేసరికి.. నోరు మూసుకుని ఉండలేక నోరు జారాను.. ఇక ఈ పూటకి దీని నోటికి బ్రేక్ పడదు ” అంటూ మనసులోనే లెంపలేసుకున్నాడు జ. ప.
అసలే మండుతున్న అగ్ని హోత్రంలోకి ఆజ్యం పోయడానికి అప్పుడే. అంటే పదింటికి లేచిన సుపుత్రుడు. హుదు హూద్ తుఫానులా దూసుకొచ్చాడు..
టేబుల్ మీద టిఫిన్ కట్టుపొంగలి.. చూసి అంగలి అల్లాడేలా కేక పెట్టాడు.
” వాటీజ్ దిస్. పొంగలా? ఏంటమ్మా? మొన్న దద్దోజనం, నిన్న పులిహోర, ఈరోజు ఈ పొంగలి.. ఏదో గుళ్ళో ప్రసాదాలు చేసినట్టు ఈ టిఫినీలు ఏంటమ్మా? ఎంచక్కా.. పూరీ.. కూరా చేయొచ్చుగా” అంటూ ఓండ్ర పెట్టేసరికి.
అసలే మండుతున్న జలజం మరింత మండింది.
” ఓరీ. క్రూరా! మళ్ళీ మాట్లాడితే క్రూరాతిక్రూరా !
ఏంటి నాయనా. పూరీ కూర కావాలా? నా తండ్రే. ఒకటొకటీ వత్తుకుంటూ.. వేయించుకుంటూ చేసి పెడితే.. తీరిగ్గా పదింటికి లేచి ఉఫ్ ఉఫ్ ఊదుకుంటూ తింటావా? తీరి కూర్చుని సాయంత్రాలు నానా యాగీ చేసి మేగీలు చేయించుకుని మెక్కుతున్నారు. ఆకల్లేదంటూ రాత్రికి సరిగ్గా తినకపోతూంటే మిగిలిన చద్దన్నం ఏం చేయమంటావూ? తలంటు పోయమంటావా నీకు.. చేసిందేదో నోరు మూసుకుని మింగు. పూరీ కావాలట పూరీ.. పోరగాడికి ” .
వాడు మళ్లీ నోరెత్తితే ఒట్టు.. కట్టుపొంగలి ప్లేటులో పడేసుకుని.. వచ్చే ఉక్రోషం తోపాటుగా గుటుకు గుటుకు మింగేసాడు.
ఇంతట్లో వచ్చింది. హెచ్చరిక క లేని సునామీలా .. సుపుత్రిక. ఓ చేత్తో కళ్ళు నులుముకుంటూ. మరో చేత్తో నెత్తి గోక్కుంటూ..
” అమ్మా.! కాఫీ..” అంటూ గుండమ్మకధలో జమున లా గావుకేక పెట్టింది.
” రావమ్మా! గజ్జెలమహాలక్ష్మీ రావమ్మా! ఇంకా రాలేదేమా అనుకుంటున్నాను.. పెళ్లి కావలసిన ఆడపిల్ల వి పదిగంటలకి లేచి పాచిమొహంతో కాఫీ అంటావా! సిగ్గు లేకపోతే సరి.. టక్కులాడిలా.. రాత్రంతా మేలుకుని ఆ టిక్కు నొక్కు వీడియోలు. ముక్కు తిప్పుకుంటూ.. మూతి తిప్పుకుంటూ చేయడం. బారెడు పొద్దెక్కాక లేవడం. అసలు ఇప్పుడు ఈ నిద్ర మొహాన్ని వీడియో తీసిపెట్టాలి. జనాలు దడిసూరుకుంటారు.. ముందా పళ్ళు తోమితగలడు. పాచికంపుతో చస్తున్నా ముక్కు మూసుకోలేక. ఇంట్లో కూడా మాస్కులు తగిలించుకోవాలో ఏంటో ఖర్మ.. ”
” అమ్మా! నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను తీసేవి టిక్కు నొక్కు వీడియో లు కావు.. టిక్ టాక్ వీడియో లు. నాకు ఎంత మంది ఫాలోయర్లు ఉన్నారో తెలుసా నీకు? పడిచస్తారు నా వీడియోలంటే. నీకేం తెలీదు. హు. ” అంటూ.. తన మాటలతో తనకే పాచి కంపు కొట్టింది కాబోలు పళ్ళు తోమడానికి బాత్ రూమ్ లోకి వెళ్ళింది సుపుత్రిక.
” చెల్లాయ్! ఈరోజు భలే టిఫిన్ చేసింది అమ్మ. త్వరగా రా. చల్లారిపోతోంది.. ” అంటున్న అన్నగారి మాటలతో.. బగబగా మొహం కడిగేసి.. టేబుల్ మీద డిష్ లో కట్టుపొంగలి చూడగానే మొహం మాడిపోయింది సుపుత్రిక కి.
” అమ్మా!” అని ఏదో అనబోయి.. తమాయించుకుని. ఓ రెండు గరిట్లు మాట్లాడకుండా లాగించేసింది.
” అమ్మా! ఓ రెండు గుడ్లయినా బాయిల్ చేయక పోయావా ?” అన్న సుపుత్రిక మాటకి. గుడ్లురిమి చూసింది జలజం. వెంటనే గుడ్ గర్ల్ లా తలొంచేసిందా కూతురు.
” ఈ మాయదారి కరోనా కాదు కానీ. ఇదే సందని.. ఆ మాయలమారి పనిమనిషి శూర్పణఖ రావడం మానేసింది. పొద్దున్నే. ఆ పంకజం ఫోన్ చేసి మరీ సకిలిస్తోంది. తన పనిమనిషి వస్తోందట. అబ్బో.. ఒకటే ఇక ఇకలు, పకపకలు తనతో ఫోను మాట్లాడి పెట్టేసరికి గంట వేస్టు. ఆ తర్వాత వరసగా కిట్టీ ఫ్రెండూ ఆ తర్వాత నా మేనమామ కూతురూ ఇలా ఫోన్లు, ముచ్చట్లు అయేసరికి ఇదిగో ఈ టైమయింది.. ఏదో మధ్యలో ఆ టిఫిన్ అయినా చేయగలిగాను సంతోషించండి.. సింకు నిండా అంట్లూ, మిషన్ నిండా బట్టలూ, తుడవాల్సిన గదులూ ఉన్నాయి. మీరు ముగ్గురూ వర్క్ ఫ్రమ్ హోమే కదా! ఈ మూడు వర్కులలో మీకేది కావాలో మీరే సెలక్ట్ చేసుకోండి. అలా అయితేనే. ఒంటిగంటకల్లా. మీ అందరికీ ఇష్టం అయిన ఐటమ్స్ తో లంచ్ రెడీ అవుతుంది. లేకపోతే ఈ పూటకి నో వంట. ” అని తేల్చి చెప్పేసింది జలజం.
మామూలుగా అయితే ముగ్గురు రౌండ్ అప్ చేసుకుని ఓ నిర్ణయానికి వచ్చేవారే కానీ. ఇప్పుడు డిస్టెన్స్ పాటించాలి కదా! ఇంట్లో తూర్పు పశ్చిమ దక్షిణ గోడలకి చారబడి కూర్చున్న ముగ్గురూ ఒకరి మొహం ఒకరు చూసుకుని కళ్ళతోనే మూగ సైగలు చేసుకుని. ముక్తకంఠంతో.. ఉత్తరం వాల్ దగ్గర కూర్చుని తన ఫేస్బుక్ వాల్ చూసుకుంటున్న జలజంతో ..
” నో. నెవర్. నహీ. ”
మా వల్ల కాదంటే కాదు. మేము చేయమంటే చేయమని డిసైడ్ చేసి చెప్పేసారు. ..
ఫేస్బుక్ లోనుండి ఫేస్ ని పైకెత్తిన జలజం. ” ఓ. అలాగా! సరే అయితే.. ఇప్పుడే వస్తా ఉండండి..” అంటూ లేచింది.
” కొంపతీసి లోపలకి వెళ్లి అప్పడాల కర్ర కానీ తెస్తావేంటీ.. ” అన్న జలజాపతికి సమాధానంగా..
” అబ్బే. లేదండీ.. వెనక వీధిలో ఎవరో ఫారిన్ నుంచి వచ్చారట.. వెళ్లి వాళ్ళకి ఓ నాలుగు షేక్ హ్యాండ్ లు ఇచ్చి పలకరించి వస్తా! ఆ తర్వాత మీరందరూ తీసుకున్న నిర్ణయానికి ఆనందంతో ఆప్యాయంగా మిమ్మల్నందరినీ కావలించుకుంటా ” అంటూ గుమ్మం దాటపోయేసరికి…
” అబ్బే. ఊరికే జోక్ చేసాం జలజం. నువ్వలా కూర్చో. మేం ముగ్గురం. చిటికెలో చేసేస్తాం. ఎంతసేపూ… ఒరేయ్. నువ్వు గదులు తుడిచేయరా.. అమ్మాయ్. ఆ అంట్ల పని చూసుకో తల్లీ.. మిషన్ లో వేయడమేగా ఆ బట్టల పని నేను చూసుకుంటా!” అంటూ లేచాడు.
” మిషన్ లో వేయడమేగా అనుకుంటున్నారేమో. తర్వాత ఆరేయడం, ఆరాక మడతలు పెట్టడం, ఇస్త్రీ చేయడం కూడా మీ వంతే.. గుర్తుంచుకోండి.. ” అంటూ.. వంటపనిలోకి వెళ్ళింది.
” నాన్నా! కరోనా కాదు కానీ. అమ్మ రోజూ చేసే కరాళ నృత్యం భరించలేకపోతున్నాము.. ఇలా ఎన్నాళ్లు భరించాలో ఏంటో? ” అంటూ వాపోతున్న పిల్లలకి.
” ఫస్ట్రేషన్ రా! పాపం.. అమ్మే కాదు.. ఈ లాక్ డౌన్ సందర్భంగా శతకోటి ఇల్లాళ్ళ బాధలలో అమ్మ బాధ కూడా ఒకటి. కాకపోతే కాస్త ఎక్కువ బాధ అంతే. ” అంటూ తను ఊరడిల్లి.. పిల్లలని ఊరడించాడు.
” ఔనూ ! మీ ముగ్గురికీ.. ఏ ఏ వడియాలంటే ఇష్టం?” అంటూ చేతిలో చిల్లుల గరిట పట్టుకుని వంటింట్లో నుంచి బయటకి వచ్చి అడిగేసరికి .
అబ్బో. ఈ రోజు సాంబారు పెట్టినట్టుంది.. వడియాల మాట వింటూంటేనే నోరూరిపోతోంది అనుకుంటూ.
” నాకు గుమ్మడి కాయ వడియాలు”.. జలజాపతి..
” అమ్మోయ్! సగ్గుబియ్యం వడియాలంటే నాకిష్టం”. సుపుత్రిక..
” మమ్మీ! అవేంటో బియ్యంపిండో, మైదాపిండో. ఏవో గుల్లగా.. కరకరలాడుతూ. పప్పులుసులోకి.. బావుంటాయి కదే. అవంటే నాకు చాలా ఇష్టం..” సుపుత్రుడు. కోరస్ లాగా వడియాల పాట పాడారు.
” సరే అయితే. అన్నీ రెడీ చేస్తాను. రేపు పొద్దున్నే పెందరాళే లేచి.. డాబా మీద ఎవరికి కావలసిన వడియాలు వాళ్లు పెట్టేయండి. ఎండ ఊరికే వేస్ట్ అయిపోతోంది. నాలుగు రోజులు ఎండబెడితే చాలు.. కరోనా కాలంలో కరకరా వేయించుకుని తిందురుగాని” అంటూ వడియోపదేశం చేసేసి వంటింట్లోకి మాయమైంది.

*****

1 thought on “జలజం.. కరోనా – “కరో”నా.. క”రోనా”

  1. ఇంత చక్కటి ఇంటింటి రామాయణం కధ రాసారు ధన్యవాదాలు. ప్రతి గృహిణి కి ఇప్పుడు తెలుసివస్తోంది నిజంగా కరోనా వాలన ఎన్ని అనర్ధాలు జరిగినయ్యో.మోడీ గారు మళ్ళీ 19 రోజులు పెంచారు ఈ లొక్డౌన్ కూడా. పూర్వంలాగా ఇల్లు తన సామ్రాజ్యంలాగా ఆడుతూ పడుతూ పని చేసుకుంటూ ఏమి హాయి లే హల అనుకొనే రోజులు లేవే అని బాధ. ఇంట్లో ఉన్న శ్రీవారికి భద్దకలతో పనిపంగు లేకుండా ఇంట్లో ఉన్న పిల్లలకి చీటికి మాటికీ ఫార్మయుషులు వీటితో సగటు ఆడది పడే ఆవేదన బాగా రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *