April 27, 2024

ప్రె’ వేటు’టీచర్

రచన: రమ కుమార్ గుతుల

ఐదు సెప్టెంబర్ వస్తోంది
ఐతే ఇంకేం మొదలు పెట్టండి
వచ్చిన శుభాకాంక్షల పోస్టులు
వరుసగా పంపేయండి ఇతరులకు గుడ్డిగా
దయచేసి జూమ్ చేసి చూడొద్దు
దాయలేని తడి ఉండొచ్చు
రాధాకృష్ణన్ కళ్ళలో
రాతిగా మారిన నేటి గురువు గుండెల్లో

తన కోసమో,తన వారి కోసం
ఉద్దరిద్దామనే ఉద్దేశ్యంతోనో
చేరినప్పుడు తెలియదు
చేసే వృత్తి విక్రమార్క పాలన అని
ఆరు నెలలే తరగతి గదిలో
అడ్మిషన్లుకై రోడ్డెక్కె మిగతా అర్ధం
వీధిన పడి,పిల్లని చేరిస్తేనే నాకు జీతం
విధి కనికరిస్తేనే నాకు జీవితం

తలంటించుకునే మీటింగ్లతో పాటు
తరగతులు మొదలైయ్యాయి
నలుపుతోపాటు తెలుపు చూసేది
సుద్ద ముక్కలోనే, జీవితంలో కాదు
క్యాలెండర్లో కంటే ఎక్కువ పని రోజులు
కాదనలేని భద్రత లేని బ్రతుకులు

కాలం,ఖర్మ కాటేసి
కరోనా కాటికాపరి అయినవేళ
వాటిని మరిచిపోయి చేద్దాము
వాడవాడలా సన్మానాలు
శాలువ అయితే కప్పండి
చిరిగిన చొక్కా దాచుకోవచ్చు
పోస్టులు ఫార్వర్డ్ చేసే బదులు
కాసిని పండ్లు ఇవ్వండి
ఆరోగ్యమో, సంప్రదాయమో కాదు
అవి తిని ఎన్నాళయ్యిందో

వెళ్లే త్రోవలో తలెత్తి చూడొద్దు
రోడ్డు ప్రక్కన కూరలు,
చెప్పులు అమ్మేవాళ్లను,
ఇంటి పనులు చేస్తున్న కూలీలను
అతను మీకో, మీ పిల్లలకో
చదువు చెప్పిన టీచర్ అవొచ్చు

1 thought on “ప్రె’ వేటు’టీచర్

Leave a Reply to మాలిక పత్రిక అక్టోబర్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *