రచన: డా. మీరా సుబ్రహ్మణ్యం తంగిరాల
” అత్తయ్యా భోజనం చేస్తారా పొద్దుపోతోంది.” గుమ్మం దగ్గర నిలబడి అలసటగా అడుగుతున్న కోడలు సంధ్యను చూసి ముఖం చిట్లించి, మంచం మీద నుండి లేచి కూర్చుంది సంధ్య అత్తగారు లీలావతి.
“ఆకలికి శోష వచ్చి ఈ పూటకు తిండి లేదేమో అని పడుకున్నా. మీ వదినగారికి చెప్పావా? ఇంత ఆలస్యమైతే దానికీ నీరసం వచ్చి వుంటుంది పాపం.” మెత్తగానే అత్తగారి అధికారం చూపించింది ఆమె.
” ఈ రోజు పనిమనిషి రాలేదండి. ఆ పనీ నేనే చేసుకోవలది వచ్చింది. అందుకే…”
” ఇంట్లో నలుగురికి వండిపెట్టడానికే పెద్ద ఉద్యోగం చేసి వుద్ధరిస్తున్నట్టు అస్సు వుస్సు అంటావు. ఒక్క పూట పనిమనిషి రాకపోతేనే సుకుమారం పడితే, చక్కగా డిగ్రీలు పాస్ అయి వుద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు ఇంటా బయటా పనులు ఎలా చక్కబెట్టుకుంటున్నారంటావు? ” లీలావతి ముక్తాయించింది.
అదే సమయానికి వచ్చిన పక్కింటి ఇల్లాలు ” పిన్నీ! నిజంగా మీరు అదృష్ట వంతులు. నిన్న పండుగనాడు మీ కోడలు చేసిన ఓళిగళు, వడలు మాకు నాలుగు ఇచ్చింది. ఆ చేతిలో ఏముందో గానీ అద్భుతంగా వున్నాయి.” అని చెప్పి స్టీలు డబ్బా వాపసు ఇచ్చింది.
“ అవునవును వంట చేయడమే నా కోడలు చేయగల గొప్ప ఉద్యోగం” అనేసింది అత్తగారు.
చిన్నబుచ్చుకున్న సంధ్య ముఖం చూసి నొచ్చుకుని వెళ్ళి పోయిందావిడ.
బదులు పలుకకండా వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించింది సంధ్య.
ఈ ఎత్తిపొడుపులు పడడం సంధ్యకు అలవాటే. అయినా ప్రతీసారీ మనసు చివుక్కు మంటుంది
సంధ్య పదో తరగతి వరకే చదువుకుంది. తండ్రి మధ్యతరగతి కుటుంబీకుడు. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళి చేసి పంపడం గగన మయ్యింది ఆయనకు.
సంధ్య భర్త పవన్ కరెంట్ ఆఫీస్ లో చిన్న వుద్యోగి. తలిదండ్రులకు ఒక్కడే కొడుకు కావడాన ముసలి వాళ్ళైన అమ్మా నాన్నలనే కాక విధవరాలైన అక్కను కూడా అతడే చూడాలి.
మామగారు రెటైర్ అయినా టంచన్ గా తొమ్మిది కల్లా కొడుకుతో బాటు టిఫిన్ తిని బయట పడతాడు ఆఫీస్ లో పేకాడుకోడానికి. మళ్ళీ ఆయన మధ్యాన్నం ఒంటిగంటకు వచ్చాక పప్పు, పులుసు వంటివి వేడి చేసి వడ్డించాలి. పవన్ ఆఫీస్ దగ్గరే గనుక రెండింటికి వచ్చి తిని పోతాడు.అతనితో కలిసి భొజనం చేస్తుంది సంధ్య.
ఇంట్లో వుంటే నానమ్మ, తాతల గారం వలన కొడుకు రవి చదువులో వెనక బడుతున్నాడని ఇంటర్మీడియేట్ నెల్లూరులో చేర్పించాడు పవన్. తలకు మించిన ఖర్చే అయినా, అప్పు చేసి అయినా కొడుకును మంచి చదువు చదివించి వున్నత స్థితిలో చూడాలని అతని ఆశ. వేడి నీళ్ళకు చన్నీళ్ళ సాయంగా సంధ్య ఏదైనా వుద్యోగం చేసే పరిస్థితి లేదని అతనికి మనసులో అసంతృప్తి. ఆర్థికబారం మోయలేక భార్యను విసుక్కుంటాడు పవన్.
వీళ్ళందరి నడుమ సంధ్య వూపిరి అందనట్టు వుక్కిరిబిక్కిరి అవుతుంటుంది.నలభై ఏళ్ళ నడి వయసుకే జీవితం పట్ల అనురక్తి లేకండా పోయింది ఆమెకు.
ఏదో చేయాలి, తనని తాను నిరూపించుకోవాలి అని అప్పుడప్పుడు అనిపించినా అదెలా ఆచరణలో పెట్టాలో తెలియడం లేదు సంధ్యకు.
ఈ పరిస్థితిలో వాళ్ళ కాలనీకి కొత్తగా వచ్చిన పరిమళ పరిచయం అయ్యింది.
పరిమళది కూడా సంధ్యలాగే వానాకాలం చదువే. దానికి తోడు పెళ్ళై పదేళ్ళు గడిచినా పిల్లలు కాలేదని భర్త విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకుని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. అమ్మా, నాన్న లేరు. అన్న వదిన ఎక్కడో భువనేశ్వర్లో వున్నారు. విడాకుల ఒప్పందంలో భాగంగా పరిమళకు ఈ కాలనీలో ఎప్పుడో తను కొన్న రెండు పడక గదుల ఇల్లు ఇచ్చాడట. గుడ్డిలో మెల్ల లాగా తలదాచుకోను గూడు వుంది.కొంత డబ్బు కూడా ఇచ్చాడట. ఒంటరిగా వుంటొంది. ఒంటరి ఆడదానికి ధైర్యం తోడుగా ఉంటుందేమో.
ఏదో ఒక వుపాధి వెతుక్కోవాలనే ఆరాటం వుంది ఆమెలో. “ ఏదో ఒక పని చేసి మనల్ని మనం పోషించుకోవాలి “ అంటూ సంధ్యతో తన ఆలోచనలు పంచుకుంది.
“నువ్వు ఏదైనా మొదలు పెడితే నేను నీతో కలుస్తాను” అంది సంధ్య ఉత్సాహంగా.
“జెరాక్స్ కాపీ సెంటర్ పెట్టాలంటే లక్ష పైన కావాలి. ఇంటర్నెట్ సెంటర్ అంటే మనకు కంప్యూటర్ జ్ఞానం లేదు. చీరెలు అమ్ముదామంటే కూడా పెట్టుబడి కావాలి.” పరిమళ ఆలోచిస్తోంది.
పరిమళ మాటలకు నిరుత్సాహ పడిన సంధ్య ” అప్పడాలు, వడియాలు చేసి అమ్మాల్సిందే. ఇంటింటికీ తిరిగి అమ్మినా కొనే వాళ్ళు వుండరు. మా అత్తగారు చెప్పినట్టు వంట చేయడమే నా ఉద్యోగం లాగా వుంది. అంది దిగులుగా.
ఆ మాటవిన్న పరిమళ ముఖం లోకి వెలుగు వచ్చింది.
———. ———— ———
నాలుగురోజుల తరువాత మళ్ళీ పరిమళను కలిసింది సంధ్య.
” ఈ ఒకటో తారీకు నుండి నువ్వు ఉద్యోగంలో చేరుతున్నట్టు మీ ఇంట్లో వాళ్ళకు చెప్పు. పొద్దున్న తొమ్మిది నుండి సాయంత్రం ఆరు దాకా వుండాలి. సెలవులు వుండవు. పనిని బట్టి జీతం అని చెప్పు.
“అమ్మో ఇంటి చాకిరీ ఎవరు చేస్తారు? ఒప్పుకోరేమో” అంది సంధ్య.
” డబ్బులు వస్తాయంటే మారాజులా వొప్పుకుంటారు. ఏం ఇద్దరు ఆడవాళ్ళున్నారు. వాళ్ళ నలుగురికి వుడకేసుకోలేరా? మీ అత్తగారు కాస్త వయసైన మనిషే అయినా, వదినగారికి ముసలితనం మీద పడలేదు కదా.
నీ భోజనం ఆఫీసులోనే అని చెప్పు. కోడలికి వండిపెట్టాలంటే సణుగుతారు గానీ వాళ్ళకోసం వండుకుంటారులే.” అన్నీ ఆలోచించి పెట్టుకున్నట్టు చెప్పింది పరిమళ.
సంధ్య ఉద్యోగం గురించి చెప్పగానే అత్త, ఆడబడుచు ముఖాలు మాడ్చుకున్నారు.
“ నువ్వు చేయగలిగే అంత గొప్ప పని ఏమిటో?” సాగదీసింది వదినగారు.
సంధ్య కాస్త తడబడింది. ” అవసరాన్ని బట్టి ఏ పని అయినా చేయాల్సిందే.” అంది.
“ మొత్తానికి తనకంటూ ఒక ఉద్యోగం సంపాదించుకుంది కదక్కా. మంచిదేగా” అన్నాడు పవన్.
” రవి చదువు అయ్యేదాకా కాస్త ఓపిక పట్టండి అమ్మా. పొద్దున్న కాఫీ, టిఫిన్ తనే చేసి వెడుతుంది. మీకు చేతనైనప్పుడు లేచి ఇంత పప్పు, చారు చేస్తే చాలు.” అని తల్లికి, అక్కకు నచ్చజెప్పాడు.
ఒకటో తారీఖు రానే వచ్చింది.సంధ్య పొదున్నే లేచి, స్నానం, పూజ ముగించుకుని,కాఫీ, టిఫిన్ సిద్ధం చేసి పెట్టి, ఉన్నవాటిల్లో కాస్త బాగున్న చీర కట్టుకుని తయారయ్యింది.
” వెళ్ళొస్తానండి”అంటే అత్త, ఆడబడుచు మూతి ముడుచుకున్నారు గానీ పవన్ ” శుభం. సంపాదనాపరురాలు అవుతున్నావు.” అన్నాడు ప్రసన్న వదనంతో.
సంధ్య చేసి పెట్టిన టిఫిన్ తిని, కాసేపు పడుకుని లేచాక, ‘ తప్పదు దేవుడా’ అనుకుంటూ చాలా రోజుల తరువాత వంట ఇంటిలోకి అడుగుపెట్టింది సంధ్య వదినగారు.
మొదటినెల కాగానే సంధ్య పదిహేనువేలు తెచ్చి మొగుడి చేతిలో పెట్టింది. అత్తగారు, వదినగారు సంధ్య వైపు గౌరవంగా చూసారు.
రెండువేలు భార్యకు ఇచ్చి బయటకు వెళ్ళడానికి మంచి చీరలు కొనుక్కోమన్నాడు పవన్. మిగతా ఇద్దరు ఆడవాళ్ళు నోరు మెదప లేదు.
“ ఉద్యోగం చేసి సంపాదిస్తున్నది కదా ఇంక నెత్తిమీద దేవతే” తల్లి చెవిలో గొణిగింది వదినగారు.
ఆ మాటలు సంధ్య చెవిన బడినా నొచ్చుకోలేదు సరికదా మనసులో కాస్త గర్వంగా అనిపించింది.
తిని కూర్చోవడం వలన శరీరం భారంగా తయారైన వదినగారు ఈ నెల రోజులలో బరువు తగ్గి, చురుకుగా తిరుగుతోంది.
ఎప్పుడు పడుకుని ఉండే అత్తగారు కూతురికి చిన్న పనులలో సాయం చేస్తోంది. ఇద్దరూ ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టరు.
*****. ********. ******
” వంట చేయడమే నా ఉద్యోగం” అన్న సంధ్య మాటలు పరిమళకు దారి చూపించాయి. ఇద్దరూ కలిసి కాలనీలో నాలుగు వీధులు తిరిగి ఎవరికి వంట విషయంగా సహాయం కావాలో వాకబు చేసారు.
పిల్లలు అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్ళిపోయి, ముసలి దంపతులు మిగిలి పోయిన వాళ్ళవి ఒక పది ఇళ్ళదాకా దాకా పట్టుకున్నారు. వాళ్ళకు శ్రమ లేకుండా కమ్మని, ఆరోగ్యకరమైన భోజనం వండి కారియర్ పంపుతానని తమ మాటకారితనంతో ఒప్పించారు
రాత్రికి సాయంత్రం వేడిగా చేసిన రొట్టెలు, కూర కూడా ఇస్తామన్నారు..
ఆరోగ్యం బాగులేక కొందరు, చేసుకునే ఓపిక లేక కొందరు, ఎలా వుంటుందో చూద్దామని కొందరు ఒప్పుకున్నారు.
సంధ్య తను ఎప్పటినుండో పోగుచేసుకున్న అయిదువేలు మదుపు పెట్టింది. పరిమళ అంతకన్న ఎక్కువేపెట్టింది.
ఇద్దరూ తమ పాకశాస్త్ర నైపుణ్యమంతా ఉపయోగించి రుచిగా, శుచిగా వండి వేళకు అందివ్వడంతో మరికొందరికి తెలిసి కూరలు మాత్రం కావాలని కొందరు, రొట్టెలు, కూర. చాలని కొందరు వచ్చారు.
కాలనీలో ఇలా రుచికరమైన భోజనం కారియర్ ఇంటికి పంపుతున్నారన్న వార్త ఆ నోటా ఈ నోటా విదేశాల్లో వుంటున్న పిల్లలకు తెలిసింది.
వాళ్ళు అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ” ఇంత డబ్బు సంపాదిస్తున్నాము. మీరెందుకు కష్టపడం మీరూ కారియర్ తెప్పించుకోండి ” అనడం వలన గిరాకీ పెరిగింది.
రుచి, శుభ్రత విషయం లోను, కూరగాయలు, బియ్యం, పప్పు వంటి వస్తువుల విషయం లోను రాజీ పడకండా నాణ్యత పాటించడం వలన తొందరలోనే పరిమళ, సంధ్య పెట్టిన మెస్ మంచి పేరు తెచ్చుకుంది.
ఉపాధి కోసం వెతుక్కున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఇప్పుడు మరో ఇద్దరికి ఉద్యోగం చూపించే స్థితికి వచ్చారు.
పెద్ద చదువులు చదివి, పైస్థాయి పదవుల్లో రాణించడం గొప్ప కాదు. అవరోధాలను  అవకాశాలుగా మలచుకుని మరికొందరికి దారి చూపిన వారు ఆదర్శంగా నిలుస్తారు.

—————. —————- ——————

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *