April 26, 2024

నేను నిత్యాన్వేషిని!

రచన: వసంతరావు నాగులవంచ

గుళ్ళు గోపురాలు దండిగా దర్శించాను
మసీదులు చర్చ్ లలో ప్రార్థనలు చేశాను
తీర్థ యాత్రలు చేసి తిప్పలెన్నో పడ్డాను
నాకు దేవుడెక్కడా మచ్చుకు కన్పించలేదు!

నోములు వ్రతాలు చాన్నాళ్ళుగా ఆచరించాను
ముడుపులెన్నో కట్టి మొక్కు చెల్లించాను
నిలువు దోపిడీ యిచ్చి నిండా మునిగాను
దేవుడెందుకో నాకు కన్పించనేలేదు!

గుట్టలు పుట్టలు పిచ్చిగా వెదికాను
కొండ గుహల్లోకి అత్యాశగా తొంగిచూశాను
హిమాలయాలలో మౌనంగా ధ్యానం చేశాను
మరెందుకో దైవం జాడ నాకు తెలియనేలేదు!

గురువులు బాబాలకు సేవలెన్నో చేశాను
మహాత్ముల మహర్షుల సందేశాలు చదివాను
యోగుల సిద్ధ పురుషుల సందర్శించాను
నేను దైవత్వమెక్కడా అనుభూతి చెందలేదు!

హేతుబద్ధంగా దేవునిగూర్చి చర్చించాను
దార్శనికుల అనుభవాలెన్నో విన్నాను
అన్ని మత గ్రంథాలను అవపోసన పట్టాను
అయినా దైవ సందేహం పూర్తిగా తీరనేలేదు!

చేసిన ప్రయత్నాలు వ్యర్థంగా తోచాయి
వ్యర్థంలోనే అర్థముందని అంతరాత్మ ఘోషించింది
దిశ మారిస్తే దశ మారుతుందనే సంకేతమొచ్చింది
సాటి మనుషులపై నిండు మనసుతో దృష్టి సారించమని!

ఆకలి కడుపుకు అన్నం వడ్డిస్తే చెమర్చిన
కళ్ళలోని కృతజ్ఞతా భావాన్ని చూసినప్పుడు
నోరెండిన గొంతులో గుక్కెడు నీళ్లు పోసినప్పుడు
పై చదువులకు పైసల్లేక దిగాలుగా నిట్టూర్చే
ప్రతిభగల పేద విద్యార్థికి ఆర్ధిక సాయం చేసినప్పుడు

దీర్ఘ రోగంతో చావు బతుకుల మధ్య
కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రి బిల్లు చెల్లించలేక
సాయం కోసం ఎదురుచూసే బడుగు జీవికి
సాటి మనిషిగా చేయూత నిచ్చినప్పుడు
ఎక్కడో లేడు నేనింతకాలం వెదకిన దేవుడు
మానవ రూపంలో మన మధ్యలోనే ఉంటాడని
జ్ఞానమెక్కడో లేదు కాసింత ఇంగిత జ్ఞానమున్న
సామాన్యుని హృదయ కుహరంలో దాగుందని
అర్థమైంది ఆ పర:బ్రహ్మ సాటి మానవుడని!

ప్రార్థించే పెదవులకన్నా సాయంచేసే చేతులు మిన్నయని
దయగల హృదయమే సాక్షాత్తు దైవ మందిరమని
మంచి మనసున్న హృదయంలోనే మాధవుడున్నాడని
ఈ క్షణమే తెలుసుకున్నాను ఆ దైవాన్ని కలుసుకున్నాను!

+++

2 thoughts on “నేను నిత్యాన్వేషిని!

  1. దైవం మానుష రూపేనా అని పెద్దలు ఊరికే అనలేదు. మానవతా దృక్పదంతో చూస్తె
    దేముడెక్కడయినా ఉంటాడు చక్కని కవిత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *