June 28, 2022

‘నేను వడ్డించిన రుచులు – చెప్పిన కథలు’ (సమీక్ష)

రచన: శ్రీమతి నండూరి సుందరీ నాగమణి

‘నేను వడ్డించిన రుచులు , చెప్పిన కథలు’ రుచి చూసారా? కథలు విన్నారా? ఈ కమ్మని పుస్తకమును వండిన పాక శాస్త్రవేత్త శ్రీమతి సంధ్య యల్లాప్రగడ గారు. ఇవి వంటలు మాత్రమేనా? కాదు… కాదు… వంటలతో పాటు, రుచులతో పాటుగా కమ్మని కథలు, కబుర్లూ…
రచయిత్రి సంధ్య గురించి కొత్తగా చెప్పవలసినదేమీ లేదు. పాఠకులందరికీ తాను పరిచయమే. గద్వాలలో పుట్టి, కొల్లాపూర్ లో పెరిగి, హైదారాబాద్ వచ్చి, వివాహానంతరము అమెరికా పయనమై అక్కడే స్థిరపడ్డారీ రచయిత్రి. ఎన్నో పట్టాలను పొందిన ఈ చదువుల సరస్వతి ఎన్నో రచనలు చేసారు, చేస్తున్నారు. చక్కని పద్యాలను కూడా రచించే ఈ రచయిత్రిది, సేవా కార్యక్రమాలలో కూడా అందె వేసిన చేయి.
ఈ పుస్తకములో ‘బుట్టోపాఖ్యానము’ నుంచి, ‘టమాటో స్ప్రింగ్ రోల్సు’ వరకూ మొత్తం నలభై రెండు రుచుల కథలు ఉన్నాయి. మొదలు పెట్టటమే ఆలస్యం… ఆపకుండా తుదివరకూ చదివించే శైలి సంధ్య గారి స్వంతం.
‘సుబ్బయ్య గారి బుట్ట భోజనము’ రుచి నోరూరిస్తుంది. సంధ్య గారి శ్రీవారు బుట్ట కొరకై పడిన ఆరాటం, ఆపై ఆ బుట్ట కోసం సంధ్య పడిన పాట్లు, ఇంచుమించుగా నాలుగు గంటల ఆలస్యంతో బుట్ట తెరచి, పడిన భంగపాటు, మనలను నవ్వులలో ముంచి తేల్చుతాయి. ‘వంకాయోపాఖ్యానము – మెంతి కారము’ కథ, గుత్తి వంకాయ మెంతికారం పెట్టి తయారు చేసే విధానంతో పాటుగా, గుప్పెడు గుప్పెడు నవ్వులలో దొర్లిస్తుంది.
‘ఆవడలు – ఊడిన పళ్ళు’ కథలో తమ్ముడి స్నేహితుడి కొత్త భార్య చేసిన ఆవడల గురించి చదివితే నవ్వు ఆగదు… ‘గుమ్మడి పులుసు, వివాహంలో విరహాలు’ కథలో సంధ్యగారు పెళ్ళి సమయంలో తనను పెళ్ళికొడుకు గారు కలవాలని ఆరాటపడటం, ఆ పెళ్ళిలో తిన్న పులుసులో గుమ్మడి ఉందో లేదో కానీ అంటూనే ఈ ఆరాటాలు, పెద్దల ఆగ్రహాలు అన్నీ చక్కగా వివరించి, చివరాఖరున మనకు గుమ్మడి పులుసు వడ్డిస్తారు. అదేనండీ… ఎలా తయారుచేయాలో వివరంగా చక్కగా చెప్పారన్న మాట! ‘ఒక పెసరట్టు’, ‘అమెరికాలో ఆవకాయ’ చిన్నవే అయినా చక్కని మినీ కథలు.
‘రవ్వదోశ పెళ్ల పెళ్ల – తింటే కరకర’లో రవ్వదోశ ఎలా తయారు చేయాలో వివరంగా, సులువుగా వివరించారు సంధ్య, ‘చంటబ్బాయ్’ చిత్రంలోని శ్రీలక్ష్మిని మనసారా తలచుకొంటూ… ‘రోటిమ్యాటిక్ మ్యాజిక్’ కథ ఒక్క క్షణం అమెరికా వాళ్ళను తలచుకొని అసూయ పడేలా చేస్తుంది, ఎందుకంటే, ఇక్కడ ఇండియాలో అలాంటి పూటకూళ్ళమ్మ ఊహూ, కాదు… ‘రోటి కూళ్ళమ్మ’ దొరకదుగా… అందుకని… చాలా చక్కగా అది పనిచేసే విధానాన్ని, ప్రతీరోజూ రొట్టెలు తినే విలాసాన్ని అందంగా వివరించారు, దాన్ని తన నెచ్చెలిగా, వంటలక్కగా, అన్నపూర్ణమ్మగా అభివర్ణిస్తూ…
‘శనగ దోశ నా అజ్ఞానము’ కథలో సంధ్య దోశను ఏ పిండితో వేసారో తెలుసుకోవాలంటే మరి మీరే చదవాలి… నవ్వీ నవ్వీ కడుపు చెక్కలైపోయింది నాకు. ఆ తరువాత అసలైన శనగ దోశ ఎలా చేసుకోవాలో విపులీకరించారు. ఇలాంటి కథే ‘వంటగది – ఒక ప్రయోగశాల’ కూడా… అలాగే ‘ఈరోజు మా శ్రీవారి పుట్టినరోజు’ కథలో కూడా నవ్విస్తూనే, పెసరపప్పు పూర్ణాలు ఎలా చేయాలో చెప్పేసారు… ‘దిబ్బరొట్టె దోశగా మారిన వైనం’ కథలో ఇంటింటి కథను చెప్పారు. ఎవరింట్లోనైనా చిరగని దోశ ఉంటుందా మరి? బామ్మ ‘ఎల్లో స్పాంజీ’ కథ తెలుసా మీకు? మరి చదివేసి, దానితో పాటు గుజరాతీ ధోక్లా ఎలా చేయాలో కూడా తెలుసుకోండి. ‘అక్షయపాత్ర – ముద్దపప్పు’ కథలో అమెరికాలో దొరికే అక్షయపాత్ర (ఇన్స్టెంట్ పాట్) గురించి చెబుతూ, దానిలో వీజీగా చేసుకోగలిగే వంకాయ కూర గురించి వివరించారు సంధ్య. ఈ కథ లోనే ముద్దపప్పు గురించి, బాల్యంలో జరిగిన రామరావణ యుద్ధాలు కూడా స్మరించుకుంటారు రచయిత్రి. మనకి చిరునగవులు లీలగా, పెదవులపై కదలుతుండగా, చదువుతూ ఆ రుచిని ఆస్వాదిస్తాము.
‘ముత్తైదువ’గా మామిడికాయను ఇంటికి పిలిచి సలక్షణంగా సత్కరించి, ముక్కలపచ్చడిగా మలచటం సంధ్యగారికే చెల్లింది. అమ్మ ‘పోపుల డబ్బా’ ఆత్మీయతానురాగాల జ్ఞాపకాల మిశ్రమంగా మెరిస్తే, ‘అనుకోని అతిథి’ (లో) మన ఇంటికి ఏతెంచినపుడు, అత్యల్పకాలంలో వండి వడ్డించే రెసిపీలు ‘జీరా రైస్,’ ‘మిర్చి కా సాలన్’, ‘దాల్ తడకా’ నిమిషాల్లో చేసేసి, ఇల్లాలి తడాఖా చూపించాలంటూ చెప్పారు. ఇక ‘వాంగీ బాత్ తో బాదటము’ అనే అధ్యాయంలో వాంగీ బాత్ కథను, అనుభవాలను చక్కగా చెబుతూనే, అది ఎలా చేయాలో అలవోకగా చెప్పేసారు సంధ్య. ‘అతిథులనలరించే వంటలు’లో చేదెక్కిన వంకాయ చేసిన గడబిడ చెబుతూనే, ‘సాబూదానా కిచిడీ’ తయారీని కూడా చూపించారు.
‘వంటలు ఆ గదిలో ప్రమాదాలంటూ’ హెచ్చరిస్తున్నారు, తన పోలికే వచ్చిన తన అక్క కొడుకు, అన్నంతో తినటానికి తయారు చేసిన ‘పెసరపప్పు’ను తలచుకొంటూ… ‘క్యాప్సికమ్ రైస్ తో జీవిత పాఠాలు’ నేర్పిస్తున్నారు, ఆ వంటకం ఎలా తయారు చేసి, వారి శ్రీవారిని మెప్పించారో వివరంగా తెలియజేస్తూ… ‘ఔరా, ఎవరి వారైనా ఇంతేనా?’ అని ముక్కున వేలు వేసుకోక తప్పదు, చదువరులెవరైనా…
‘డ్రై ఫ్రూట్స్ తో స్వీటు’, ‘సమోసా నూనె లేకుండా’ ఈ రెండూ ఆరోగ్యప్రదమైన వంటలు, విశదంగా వ్రాసారు ఎలా చేసుకోవాలో… చాలా బాగున్నాయి రెండూ కూడా… ‘ఇడ్లీతో చెడుగుడు’ పైన చెప్పిన ఆవడల కతనే గుర్తు చేస్తుంది… బాగా నవ్వించారు.
‘కెవ్వు కాయ – కాకర కాయ’ లో ఆ కాయతో పులుసు చేసుకునే విధానం భలే చెప్పారు ‘మన వంటగది ఒక ప్రయోగశాల’లో కొబ్బరి మహిమను తెలుపుతూ, రకరకాల కొబ్బరి వంటలు, కొబ్బరి రైస్, కొబ్బరికాయ మామిడికాయతో పచ్చడి, కొబ్బరి కేక్ ల తయారీ నేర్పించారు. ‘ఇదే పుస్తకములోని మరొక చోట కూడా ‘కొబ్బరి అన్నము – స్వర్గానికి జానెడు దూరము’ అంటూ కేశ సంపదకు కొబ్బరి తల్లి చేసే సేవ వివరించి, చక్కని కొబ్బరి అన్నపు తయారీని తెలియజేసారు.
‘వంటకు సాయం’ అనే అధ్యాయంలో వంటకు సహాయపడే వివిధ అధునాతన సామాగ్రి – కుక్కర్, మిక్సీ గ్రైండర్, రిఫ్రిజిరేటర్, ఇన్స్టెంట్ పాట్, మైక్రో వేవ్ ల ఉపయోగాల గురించి మధురంగా ప్రసంగించారు. ‘గుడి పులిహోర రహస్యాన్ని’ చెవిలో చెప్పిన సంధ్య, ‘అమ్మలాంటి ఊరగాయ’ అంటూ ఆవకాయ తొక్కును పరిచయం చేసేశారు.
రాబోయేది, ధనుర్మాసం… కమ్మటి వేడి వేడి పొంగలి గుర్తు వస్తోంది, అవునా? ‘చిటికెలో పొంగలి’ ఆ జ్ఞాపకాలను వెలికి తెస్తూ, త్వరలోనే మనం చేసుకుంటామని, ఆ రెసిపీని తెలియజేస్తోంది. ‘బొంత కాకర పులుసు – వింతలు’ ఆకాకరకాయ పులుసును ఎలా చేసుకోవాలో వివరిస్తోంది. ‘టమాటో చెట్నీ’ ప్రకరణంలో టమాటోలతో నిల్వ పచ్చడి తయారీ విధానం చెప్పిన తీరు అమోఘం. ‘హిట్టా… ఫట్టా…’ సంధ్య గోధుమపిండి హల్వాతో, కొండల్ గారు పడిన తిప్పలు… వహవ్వా అంటూ పొట్ట కదిలేలా నవ్విస్తాయి.
‘వంటా వార్పు’ ప్రకరణంలో అమ్మవారికి సంధ్య చేసిన రకరకాల నైవేద్యాలను తన శ్రీవారు ఫలహారాలుగా స్వీకరించిన విధానము చెప్పిన పద్ధతి చదువుతూ ఉంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది పాఠకులకు. ఇంకా ‘ఆలుగడ్డతో అగచాట్లు’ లో ఆలూ, మెంతికూర వంటకం, ‘టమాటో స్ప్రింగ్ రోల్సు’ తయారీ విధానం బహు చక్కగా ఉన్నాయి.
ఇంకా ఈ పుస్తకంలో ఆసక్తిదాయకమైన అంశాలు ‘వంటగది – గుండెకాయ’, ‘ఊరగాయలు’, ‘కాకరకాయ-క్యావ్ క్యావ్, తింటే వావ్ వావ్’ (స్టఫ్డ్ కరేలా), ‘ఎగ్ లెస్ – స్పాంజ్ కేక్’, ‘జంతికలా కారప్పూసా’ మొదలైనవి చదివే కొద్దీ ఎంతో వివరణాత్మకంగా, వినోదాత్మకంగా ఉన్నాయ్.
ఇంత చక్కని పుస్తకాన్ని మనకందించిన రచయిత్రి సంధ్యా యల్లాప్రగడ గారు అభినందనీయులని అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. రచయిత్రి కలం నుంచి మరిన్ని మంచి గ్రంథాలను ఒక పాఠకురాలిగా ఆశిస్తున్నాను.
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *