June 24, 2024

కరోనా సరేనా. .

రచన: షమీర్ జానకిదేవి

ఉదయం నిద్ర లేవక ముందే ఫోన్ మ్రోగింది. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తరువాత ఎప్పుడు మాట్లాడలనుకుంటే అప్పుడే. దీని వలన మంచి ఉందీ, అలాగే చెడుకూ దారి తీస్తుంది. భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నాము. పాతరోజుల్లో ఐతే ఎదైనా సమస్య వచ్చినప్ఫుడు ఉత్తరాలు వ్రాసుకునేవారు. . అలా రాయటంలొ సగం పరిష్కారం దొరికేది. ఆవేశం కూడా తగ్గేది.
ప్రొద్దునే ఫోను కూతురు దగ్గర నుండి. మళ్ళీ ఏ సమస్య వచ్చిందా అనుకుంటూ ఫోన్ ఎత్తింది అపర్ణ.
“మమ్మీ నా ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ఉంటుంన్నారు”. కూతురు తనకేదో కష్టం వచ్చినట్లుగా చెప్తున్నది.
“అవును కరోనా కదా, అందరూ ఇంట్లోనేగా ఉంటారు. ఇందులో నీకొచ్చిన కష్టం ఏమిటి?” అసలు ఆమె బాధ ఏమిటో తనకర్థం కానట్లుగా అడిగింది అపర్ణ.
మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లుగా “అవునూ, నీకు ఇద్దరు పిల్లలే కదా! మరి ముగ్గురంటావేమిటి?” అని అడిగింది.
“అదికాదు మమ్మీ ముగ్గురంటే నా ఉద్దేశం మా ఆయన మరియు పిల్లలిద్దరని. మా ఆయనేమో వర్క్ ఫ్రమ్ హోమ్. పిల్లలిద్దరికీ ఆన్ లైన్ క్లాసులు. పైగా ఒకరికి శలవలు ఇంకొకరికి పరీక్షలు. అవి కూడా ఆన్ లైన్ లోనే ఉంటాయిట. వీళ్ళందరికీ నేనొక కుక్ కమ్ కేర్ టేకర్ కమ్ సర్వెంట్ ని. ఇక నాకు టైమ్ ఎక్కడ వుంది. నా గురించి నేనెప్పుడు ఆలోచించుకోవాలి?. . అదేదో అంతర్జాతీయ సమస్యలా. దానికి పరిష్కారం ఏమిటి అన్నట్లు అడుగుతోంది వైష్ణవి.
ఈ కరోనా వలన మానవ జీవితాలన్నీ ఒక గాడిన పడుతున్నట్లుగా అనిపించింది. కుటుంబ విలువలు పెరుగుతున్నాయనిపిస్తోంది.
అపర్ణకి ఇద్దరు కూతుర్లు. పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్దమ్మాయి వైష్ణవికి ఇద్దరు పిల్లలు, అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి పదవ తరగతి, అబ్బాయి ఆరవ తరగతి చదువుతున్నారు. ఆమె భర్త ఒక ఎమ్ ఎన్ సి లో మంచి పోస్ట్ లో ఉన్నాడు.
తన లాగా ఉద్యోగం చేసే పని లేదు. హాయిగా ఇంట్లో ఉండి పిల్లల బాగోగులు చూసుకోవచ్చని అనుకుంది అపర్ణ.
రెండో కూతురు శాంభవి ఆస్ట్రేలియాలో ఉంటుంది. తనకీమధ్యనే పెళ్ళయింది. తమ రిటైర్ మెంట్ తరువాత మంచి మాచ్ చూసి పెళ్ళి చేసారు. అబ్బాయి పేరు శంకర్. చాలా మంచివాడు కూడా. ఇద్దరు ప్రస్తుతం సిడ్నీలో ఉన్నారు. అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. .
అపర్ణ ఒక ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసరుగా పని చేసి రిటైర్ అయింది. భర్త రమణ కూడా ఒక ప్రైవేటు కంపెనీలో చేసి రిటైర్ అయ్యాడు. ఇద్దరూ ఉద్యోగాలు, ఆడ పిల్లల పెళ్ళిళ్ళు ముగించుకుని కొంచెం సేద తీరుదామనుకుంటున్న సమయంలో ఈ కరోనా వచ్చింది. మళ్ళీ జీవితంలో తెలియని భయం.
వైష్ణవికి ఏదో ఓదార్పు ఇవ్వాలి అనుకుంటూ “మంచిదే కదా వైష్ణవి!. . కరోనా మన కుటుంబ విలువలు పెంచుతోంది కదా. చక్కగా అందరూ ఒక చోట ఉండవచ్చు. నీకు పరుగులు పెట్టే అవసరం ఉండదు కదా. ‘’తన అనుభవాలు దృష్టిలో పెట్టుకుని కూతురుకి సలహా ఇచ్చింది.
వాళ్ళు ఈ మధ్యనే గేటెడ్ కమ్యూనిటిలో అన్ని రకాల సౌకర్యాలతో భూతల స్వర్గంలా ఉన్న ఇంట్లోకి మారారు.
“మమ్మీ! ఆడుకోవటం కూడా ఇంట్లోనే. బయటికి వెళ్ళే వీలు లేదు. స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌజ్ లు మూసేసారు. బయటికి రానివ్వటంలేదు. బయట ఫుడ్ తినటానికి లేదు. ఇంట్లో జైల్లో వున్నట్లు వుండాల్సి వచ్చింది”. నేటి మహిళ ఆవేదనకు ప్రతీకగా ఉంది తన గొంతు.
ఇది వింటూ వుంటే తన ఉద్యోగ జీవితం గుర్తుకొచ్చింది.
ఒక బ్యాంక్ ఆఫీసరుగా ఇంట్లో వుండే అవకాశం చాలా తక్కువ. అవసరమైనప్పుడు శలవలు దొరికేవి కావు. ఆ రోజుల్లో ఉద్యోగ జీవితం అలా వుండేది. పని ఒత్తిడి బాగా వుండేది. ఒంట్లో బాగా లేదని సిక్ చేయడం తనకు ఇష్టముండేది కాదు. ఏదో అబద్దం చెప్పి లీవ్ పెడితే నిజంగా సిక్ అవుతామేమో, ఇలా ఆలోచించేది అపర్ణ. రిటైరయినప్పుడు సిక్ లీవంతా లాప్సయింది. అయినా ఇప్పుడనుకుని ఏమి లాభం?. . పిల్లల సెలవుల్లో వాళ్ళతో గడపాలని ఎంతగానో ఉండేది తనకు, కానీ పని ఒత్తిడి వలన అవకాశముండేది కాదు. పిల్లలిద్దరూ చీటికిమాటికి తగవులతో పోట్లాడుతూ వుండే వారు. ఇంటికొచ్చేసరికి రణరంగంలా వుండేది ఇల్లు. ఒకరికి టి వి, మరొకరికి వీడియో గేమ్. అయినా తను టెన్షన్ తో భయపడుతూ వుండేది. దేవుడి దయ వలన చక్కగా చదువుకున్నారు. ఇలా అనుకునే అపర్ణ హౌజ్ వైఫ్ గా వుండలేకపోయానని ఎంతో బాధ పడుతూ వుండేది ఆ రోజుల్లో.
ఇప్పుడు హౌజ్ వైఫ్ గా ఉన్న వైష్ణవి ఎందుకు చేసుకోలేక పోతున్నది?. . పిల్లల్లో విధేయత లోపించిందా?. . లేక వాళ్ళకు ఆప్షన్స్ ఎక్కువయ్యాయా?. . ప్రపంచమంతా ఇంట్లోనే వుంది. అయినా ఎక్కడో తెలియని భయం, అసంతృప్తి. ఇదంతా పాశ్చాత్య సంస్కృతుల ప్రభావమా?. . అంత సేపు మాట్లాడిన తరువాత అపర్ణకు అర్థమయిందేమంటే. షుమారు 4000 ఫ్లాట్స్ వున్న గేటెడ్ కమ్యూనిటి అది. అన్ని రకాల సౌకర్యాలు వున్నాయి. పెద్ద క్లబ్ హౌజ్, అన్ని రకాల ఆటలు ఆడటానికి ఆట స్థలాలు, కావల్సిన సినిమా చూడటానికి హోమ్ థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్. లేదు అనే మాట వుండదు అక్కడ.
అమెరికాలో వుండేవారు పిల్లల చదువులకోసం ఇలాంటి ఫ్లాట్స్ ల్లో వుంటారు. అటు అమెరికన్ కల్చర్ ఇటు భారతీయ సంస్కృతి పిల్లల్ని ముందుకు పోనివ్వడం లేదు. ఇక ఇంటికి రాగానే ఇంట్లో కూడా ఆంగ్ల భాష రాజ్యమేలుతుంటుంది.
“అడుగడుగునా పతి దేవుడికి ఏదోకటి చేసి పెట్టాలి. ఇద్దరు పిల్లలు రిమోట్ కోసం కొట్టుకుంటారు. ఒకరు చూసే చానల్ ఇంకొకరికి నచ్చదు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుంటే క్షణం పడదు. మొదటి ప్రపంచ యుద్ధం నయమేమో అనిపిస్తుంది. వంట ఇంట్లోకి ఒక్కరు కూడా రారు, సహయం చేయరు. ఇది చాలదన్నట్లు పని మనిషిని రానివ్వడం లేదు”. కూతురు తన బాధలు చెప్తుంటే, ఒక తల్లిగా ఏమి సలహా ఇవ్వగలదు. అన్నీ వినటం తప్ప. ఇలా చెప్పుకోవటం ద్వారా తనలోని ఫ్రస్ట్రేషన్ కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయటం. అంతేగా. వినేవాళ్ళకు ఇవన్నీ తామరాకు మీద నీటి బొట్టులా అనిపిస్తాయి. కానీ అనుభవించేవాళ్ళకు సుడిగుండంలో వున్నట్లుగా వుంటుంది.
కరోనా ఎంతలా కరుస్తున్నావమ్మా. ఈ మార్పు మంచికా. చెడుకా. మంచే అనుకుంటే సరిపోతుందేమో. మనశ్శాంతిగా వుంటుంది. పెరిగిన వేగానికి భగవంతుడు వేసిన సంకెళ్ళు.

******

1 thought on “కరోనా సరేనా. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *