September 23, 2023

యాత్రా మాలిక – మలేషియా (కెమరున్ హైలెండ్స్ )

విదేశవిహారం చేద్దాం నాతోరండి-

రచన: నాగలక్ష్మి కర్రా

పినాంగ్ లో ప్రొద్దుట బయలుదేరి సాయంత్రానికి వచ్చేటట్టుగా వుండే ప్రదేశాలు పూర్తి చేసుకున్నాక శనివారం ప్రొద్దుటే బయలుదేరి వెళ్లి ఆదివారం రాత్రికి తిరిగి వచ్చేటట్టుగా వుండే ప్రదేశాలు చూడడానికి వెళ్లేవాళ్లం
అలాంటి ప్రయాణం పెట్టుకొనేటప్పుడు ముందుగా రూము బుక్ చేసుకోవలసి వచ్చేది. ముందుగా బుక్ చేసుకోకుండా వెళ్లి రూము దొరకక తిరిగి వెనక్కి రావలసి వచ్చింది. అప్పటినుండి బుద్దిగా ముందుగా రూము బుక్ చేసుకొని వెళ్లేవాళ్లం.
మలేషియా లో హోటల్స్ తో పాటు సర్వీస్డ్ అపార్ట్ మెంట్స్ కూడా వుంటాయి. సర్వీస్డ్ అపార్ట్ మెంట్స్ అయితే హోటల్ రూమ్స్ కన్నా చవుకగా వుండి కిచెన్ కూడా వుంటుంది, కిచెన్ లో గేస్ స్టౌ, ఫ్రిడ్జ్, మైక్రొవేవ్, ప్లేట్లు, గిన్నెలు లాంటివన్నీ వుంటాయి. అంటే వంటసామగ్రి తీసుకు వెళితే చాలు మనం వండుకోవచ్చు. వండుకోడానికి వెళ్తున్నామా? ఓ రోజైనా హోటల్ లో తిని హాయిగా వుండొచ్చుకదా? అంటే నా దగ్గర సమాధానం లేదుగాని, ముఖ్యంగా విదేశాలలో మనకి కావలసిన తిండి ఒకటి రెండు చోట్ల తప్ప దొరకవు. వాటిని వెతకడం లో సమయం వృధా చేసుకొనే బదులు రైస్ కుక్కర్ లో అన్నం పడేసుకుంటే డబ్బు, సమయం, ఆరోగ్యం మూడూ కాపాడుకున్న వాళ్లమవుతాం. చాలా సార్లు మనం తినగలిగే భోజనం వెదుకులాటలోనే సమయం గడిచిపోయి, కొన్ని చోట్ల తిండే దొరకక అభోజనం వుండవలసి వచ్చేది, అలా చాలా సార్లు జరిగేక మా వంట సామగ్రితో బయలుదేరడం మొదలు పెట్టేం.
మలేషియాలో ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం తో చాలా స్నేహంగా వుండేవాళ్లం. వారికి ఇద్దరు చిన్నపిల్లలు. మా రెండు కుటుంబాలూ బయలుదేరి చుట్టుపక్కల ప్రదేశాలు చూడ్డానికి వెళ్లే వాళ్లం. రెండు బెడ్రూముల అపార్ట్మెంటు బుక్ చేసుకునేవాళ్లం.
ఎప్పటిలాగే మేం కెమరూన్ హైలెండ్స్ లో అపార్ట్ మెంటు బుక్ చేసుకున్నాం. ప్రొద్దుటే బయలుదేరేం. పినాంగ్ నుంచి సముద్రం మీద వున్న వంతెన దాటుకొని మైన్ లాండు చేరి ఉత్తరం వైపు వెళ్లే హైవే మీద ప్రయాణం హాయిగా సాగుతోంది. సుమారు 170 కిలోమీటర్ల ప్రయాణం తరువాత ‘ ఐఫొ ‘ నగరం దగ్గర హైవే నుంచి దారి మళ్లి కొండలమీద సాగుతుంది . కొండలమీద ప్రయాణం అంటే మెలికలు తిరిగి వుండే సన్నని రోడ్డని అనుకుంటే పొరపాటే, కొండమీదకి వెళుతున్నట్లే తెలియలేదు. సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత కెమరూన్ హైలెండ్స్ చేరేం.
మలేషియ దేశంలో ‘పహాంగ్‘ రాష్ట్రానికి చెందినవి ఈ హైలేండ్స్. ఇవి సుమారు 713 చదరపు కిలోమీటర్లలో వ్యాపించివున్నాయి. కెమరూన్ హైలేండ్స్ కి ఉత్తరాన ‘కలంతాన్‘ రాష్ట్రం, పశ్చిమాన ‘పెరక్‘ రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి వుంది. మలేషియా దేశంలో వున్న ముఖ్యమైన వేసవివిడుదలలో ఇదొకటి. ఇక్కడ గరిష్ఠ వుష్ణోగ్రతలు 25c డిగ్రీలు కనిష్ఠ వుష్ణోగ్రతలు 10c డిగ్రీలుగా వుంటాయి .
1885 లో బ్రిటిష్ రాజ్ లో అప్పటి సర్వేయరు సర్ విలియమ్స్ కెమరూన్ ఈప్రాంతాన్ని సర్వే చేసి ఇక్కడవున్న కొండలను, జలపాతాలను చూసి ముగ్ధుడై ఈప్రాంతాన్ని ఆరోగ్య కేంద్రంగా తీర్చి దిద్దాలనే ఆలోచన చేసేడు. అప్పటినుంచి ఆప్రాంతాన్ని అతని పేరు మీదుగా కెమరూన్ హౌలెండ్స్ గా పిలువబడసాగేరు. దట్టమైన అడవిగా వున్న ఈ ప్రాంతం ఆంగ్లేయ ఆఫీసర్లకు నచ్చలేదు. ఔత్సాహిక ఆంగ్లేయులు వేసవిలో ఇక్కడ గడపసాగేరు. కాని కెమెరూన్ కోరిక నెరవేర లేదు. అతని తరవాత వచ్చిన ఆంగ్లేయులు తగినంత శ్రద్ద తీసుకోలేదు. 40 సంవత్సరాల తరువాత వచ్చిన మేక్స్ వెల్ అనే సర్వేయరు ఈప్రాంతాలలో 9 రోజులు పర్యటించి దీనిని వేసవి విడిదిగా తీర్చి దిద్దేడు. 1925 లో ఇక్కడ అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంట్ స్టేషన్ స్ధాపించి దాల్చిని, టీ, కాఫి, పళ్లు, కూరలు పండించ సాగేరు. రెండు ప్రపంచ యుధ్దాలు రావడం రెండవ ప్రపంచయుధ్దంలో మలేషియా జపాను వారు గెలుచుకోడం వీటితో ఈప్రాంతం తిరిగి మరుగున పడిపోయింది.
మలేషియా స్వాతంత్రం పొందిన తరువాత దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేరు. ఈ హైలేండ్స్ లో అడుగు పెట్టిన దగ్గరనుంచి మనకు దూరంగా కొండలమీద దగ్గరగా వున్న కొండచరయలలో టీ ప్లాంటేషను కనువిందు చేస్తూ వుంటుంది. ఈ హైలేండ్స్ లో చాలా ప్రదేశాలు దట్టమైన మేఘాలతో కప్పబడి వుంటాయి. కొన్ని చోట్ల వెహికల్ లోంచి దిగి నడవడానికి వీలుని కల్పించేరు అక్కడ నడుస్తూ వుంటే మేఘాలు మనని తాకుతూ శరీరాలను తడిపి వెళ్లి పోవడం గమ్మత్తుగానూ కొత్తగానూ వుంటుంది. కొండపై నుంచి చూస్తే క్రింద నేల కనబడకుండా కప్పేసిన మేఘాలను చూడడం కూడా గమ్మత్తుగా వుంటుంది. టీ తోటలో సన్నని బాట మీదుగా నడుస్తూ తేయాకు ఘుమఘుమలను ఆశ్వాదించడం, కాఫీ తోటలలో కాఫీ కాయలను పండ్లను చూడ్డంకూడా మొదటిమారు కావడంతో అదో వింతైన అనుభూతినిచ్చింది.
కెమరూన్ లో వివిధ ప్రాంతాలలో ‘స్ట్రాబెర్రీ ఫార్మ్‘, ఆర్కిడ్ ఫార్మ్, దాల్చిని ఫార్మ్ ముఖ్యంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. దాల్చిని మొక్కలు గుబురుగా నాలుగయిదు అడుగుల ఎత్తులో వున్నాయి. మలేషియా వెళ్లిన వాళ్లు ముఖ్యంగా దాల్చిని, లవంగాలు,ఏలకులు (మంచిరకంవి దొరుకుతాయి) కొనుక్కోడం మరచిపోకండి.
స్ట్రాబెరీ ఫార్మ్ లో స్ట్రాబెరీలను అంతస్థులుగా కట్టిన కర్ర బల్లలపై కొబ్బరిపీచు వేసి మొక్కలు పెంచి పండ్లను పండిస్తున్నారు. మన దేశంలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ స్ట్రాబెరీ ఫార్మ్స్ కి ప్రసిధ్ది. అక్కడ నేలమీద అంటే మట్టిలోనే పండించడం అదీ కొన్ని వందల యెకరాలలో పండించడం చూసేం కాని ఇక్కడ యిలా అంతస్థులలో మన్ను లేకుండా పెంచడం ఆశ్చర్యాన్ని కలుగ జేసింది .
కాయగూరలు పండించే ఫార్మ్ చూడ్డానికి బాగున్నాయి. పందిరినుంచి వ్రేలాడుతున్న ఆనపకాయలు, పొట్లకాయలు కనువిందు చేస్తాయి.
ఆర్కిడ్ ఫార్మ్ లో కొన్ని వందల ఆర్కిడ్స్ పూత చూసి కళ్లు తిప్పుకోలేకపోయేం. 40, 50 రకాల ఆర్కిడ్స్ ని పెంచుతున్నారు. ఈ ఆర్కిడ్స్ చాలా సున్నితమైన జాతి పూలమొక్క. చాలా జాగ్రత్తగా పెంచాలి. చాలా జలపాతాలను చూసేం . ఇక్కడ వున్న గోల్ఫ్ కోర్సు 18 కన్నాలు వున్నది. గోల్ఫ్ మైదానాన్ని అందులో వున్న కన్నాలను బట్టి పెద్దదో చిన్నదో నిర్ణయిస్తారు. టీ మొక్కలతో నిండిన కొండలు, అడవుల మధ్య పెద్ద గల్ఫ్ కోర్స్ అహ్లాదకరంగా వుంటుంది.
తేనెటీగల ఫార్మ్, బటర్ఫై పార్క్ చూసేం. ఇవన్నీ చూడ్డానికి ఒకరోజు చాలు. మరునాడు కొండల మీద వున్న టీ తోటలకు వెళ్లి ఓ పూట గడిపేం. ఎక్కడా పొల్యూషన్ లేని గాలి, మబ్బులు శరీరాన్ని తాకుతూ వెళుతుంటే యెంతో హాయిగా వుంటుంది.
కౌలాలంపూర్ నుంచి కెమరున్ హైలేండ్స్ రావాలంటే సుమారు 206 కిలోమీటర్లు ప్రయాణించ వలసి వుంటుంది.


ఐపొహ్ —-
పెరక్ రాష్ట్ర రాజధాని ‘ఐపొహ్‘. ఈ నగరం పినాంగ్ కౌలాలంపూర్ హైవే మీద వుంది . కౌలాలంపూర్ నుంచి సుమారు 180 కిలో మీటర్ల దూరంలోనూ , పినాంగ్ కి 120 కిలోమీటర్ల దూరం లోనూ వుంది.
‘సుంగై కింత ( కింత నది )‘ తీరాన నిర్మింపబడ్డ నగరం. ఈ నగరం విద్య, వాణిజ్య, పర్యాటక పరంగా ప్రాముఖ్యతను సంతరించుకున్న పట్టణం. ఈ నగరం లో కూడా చైనా, భారత దేశానికి చెందిన వారు ఎక్కువగా కనిపిస్తూ వుంటారు. భారతదేశ వంటలతో పాటు చైనీస్, మలయ వంటకాలను అందించే అనేక రెష్టారెంట్స్ వున్నాయి.
పినాంగ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు హైవే నుంచి కొన్ని గుహలు కనిపిస్తూ వుండేవి. అక్కడకి చేరే దారి మాత్రం కనిపించేది కాదు. రెండుమూడు సార్లు ప్రయత్నించినా చేరలేక
పోయేం. ఓ సారి యెలాగైనా చేరాలని నిశ్చయించుకొని ప్రత్నించి చేరలేక అక్కడవున్న ఓ మలేషియన్ తమిళ ఇంటి తలుపు కొట్టి వచ్చీరాని తమిళంలో గుహలకు దారి అడిగితే ఆ యింటివాళ్లు చాలా సంతోషించి అథిధి మర్యాదలు చేసి మమ్మలని గుహలవరకు తీసుకువెళ్లి వెనుకకి వెళ్లిపోయేరు. ఇవి చైనీస్ వారిచే నిర్మింపబడ్డ బౌద్ద గుహలు. ఐపొహ్ కి ఉత్తర దక్షిణాలుగా 20 కిలోమీటర్లు సున్నపు రాతి కొండలువ్యాపించి వున్నాయి. నిరంతరంగా యీ సున్నపు రాతి కొండలలో పడే నీటివల్ల ఈగుహలు యేర్పడ్డాయి. అయితే ఈ గుహలన్నీ దట్టమైన అడవులలో కొండలమీద వుండడంతో అక్కడకు చేరడం కష్టం. ప్రస్తుతం సుమారు మూడు కిలోమీటర్లమేర నడవడానికి వీలుగా కట్టి పర్యాటకుల కోసం తెరచేరు. మిగతావాటిని పర్యాటకులు సులువుగా చేరేటట్లు యేర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూడు కిలోమీటర్ల గుహలలో లైట్లు, జారిపోకుండా పట్టుకు నడవడానికి రైలింగు యేర్పాట్లు చెయ్యబడ్డాయి. ఇక్కడ ప్రాకృతికంగా యేర్పడ్డ ఆకృతులే కాక చైనీస్ బౌద్ద విగ్రహాలను కూడా పెట్టేరు. వీటిని ‘లింగ్ సేన్ తొంగ్‘, ‘నాన్ తియన్ తొంగ్‘, ‘క్వాన్ యిన్ తొంగ్‘, ‘ పెరక్ తొంగ్‘ అనే మందిరాలుగా పిలుస్తారు.
ఈ గుహలలో అక్కడక్కడ నీరు కారుతూ వుండడంతో లోపలంతా జారుడుగా వుంటుంది.
ఈ ప్రయాణం లో మాకెదురైన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను అదేమిటంటే ఏ దారిలో వెళ్లాలో మీకు తెలీకపోతే స్థానికులను గాని, భారతీయ సంతతికి చెందిన వారిని గాని అడగండి గాని పొరపాటున యే చైనీయులనీ అడగకూడదు, యెందుకంటే చాలాసార్లు అలా దారి అడిగితే అక్కడున్న చైనీయులు ఒకొక్కరు వ్యతిరేక దిశలను చూపిస్తూ యెవేవో చెప్పేవారు, అలా చెప్పేటప్పుడు వారిలో వారికే వాదన వచ్చేది, వారు పోట్లాడుకోవడంతోనే సరిపోయేది గాని అరగంటయినా వారి వాదన ముగింపుకి రాకపోవడం, ముగింపుకి వచ్చేక మాలో మాకు తగవులు పెడతార్రా అని మమ్మలని కొట్టడానికి వస్తారేమో అని భయమేసి అక్కడనుంచి వెళ్లిపోయేవారం. అలా చాలా సార్లు జరిగేక మేము చైనీయులతో మాట కలపాలనే ఆలోచన విరమించుకున్నాం.
ఇలా ఓ సారి మేం దారి వెతుక్కుంటూ వెళుతూ వుంటే ఓ బోర్డు మా దృష్టిలో పడింది , దాని మీద పురాతనమైన హిందూ మందిర సముదాయం అని వుంది. అది ఏ నగరానికి దగ్గరగా వుందో వివరాలు గుర్తులేవు, అలా గుర్తులను పట్టుకొని అక్కడకు వెళ్లేం. ప్రస్తుతం మందిరం లాంటిదేమీ లేదు. శిధిలాలు మాత్రం వున్నాయి. శిధిలాలు అంటే పునాదులు మాత్రమే వున్నాయి, విరిగి పడిపోయిన రాళ్లు మాత్రమే వున్నాయి, కాని వాటిని చాలా జాగ్రత్తగా పేర్చి అక్కడ ఓ ఛండీ మాత మందిరం వుండేదని, ఆ మందిరం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన హిందూ రాజులు కట్టించేరని, ప్రకృతి వైపరీత్యాలవల్ల, మతోన్మాదుల కోపానికి గురై పాడుపడిందని రాసి వుంది. అమ్మవారు వున్న ప్రదేశం కూడా గుర్తించేరు, ఆ ప్రదేశం ఆర్కియాలజీ వారి సంరక్షణ లో వుంది. ఒక ముస్లిం దేశం నిజాయితీగా మందిరం గురించిన వివరాలను తెలియజెయ్యడం ఆ దేశం మీద మరింత గౌరవాన్ని కలిగించింది.
పినాంగ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లేటప్పుడు ఐపొహ్ దాటేక ఓ పెద్ద రాయి యేనుగు ఆకారంలో కనిపిస్తుంది సుమారు 20,25 అడుగుల యెత్తు వుండొచ్చు. దానిని ‘బతు గజ‘ అంటారు, దానికి దగ్గరగావున్న నగరాన్ని బతుగజ అని అంటారు. బతుగజ అంటే యేనుగాకారంలో వున్న రాయి అని అర్దం. గజ అంటే యేనుగు, గజం కొలత అని నానార్దాలు వున్నాయి, మలయా వాళ్లకి కూడా. ఏనుగులా చెక్కి కాదు ఓ పక్క నుంచి చూస్తే యేనుగులా కనిపించే రాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *