August 17, 2022

మాటే మంత్రము

రచన: ప్రభాప్రసాద్

“రేపే మనం వూరు వెళుతున్నమ్మోయ్” ఆఫీస్ నుండి వస్తూనే అరిచినట్టుగా చెపుతూ చిన్నపిల్లాడిలా సంతోషపడిపోతు సురేంద్ర సోఫా లో కూర్చుండిపోయాడు. భర్త సంతోషం చూసి తను కూడా ఆనంద పడుతూ కాఫీ చేతికి ఇచ్చి “ఇంత సంతోషం గా వున్నారు. శంకరం మాస్టారిగారి గురించి ఏమైనా తెలిసిందా “అడుగుతూ సోఫా లో కూర్చుంది . “అవును సుధా! ఈ రోజు నా చిన్ననాటి స్నేహితుడు గిరీశం కలిసాడు. శంకరం మాస్టారు ఈ నెలాఖరున అంటే ఎల్లుండే పదవీవిరమణ చేస్తున్నారట మేము చదువుకొన్నస్కూల్ లోనే మళ్ళీగత రెండు ఏళ్లుగా పనిచేస్తున్నారుట. ఆ స్కూలునుంచి రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయనకి ఆ రోజు సన్మాన కార్యక్రమం వున్నదిట. ఆయన దగ్గర చదువు నేర్చుకొన్నవారందరు కూడా ఆ రోజుకి అక్కడికి వస్తున్నారట. ఈ రోజు గిరీశం ని కలవక పోయి ఉంటే ఈ విషయాలన్నీ తెలిసేవుకావు. “అని వూరు వస్తున్న విషయం ఊరిలోని తల్లితండ్రులకి ఫోన్ చేసి చెప్పి వూరు ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లలలో నిమగ్నమయ్యాడు.
తన పెళ్లి అయినప్పటినుంచి చాలా సందర్భాలలో శంకరం మాస్టారి గురించి చెపుతువుండేవాడు సురేంద్ర. తాను తన స్నేహితులందరూ ఈ రోజు ఉద్యోగాల్లోనూ జీవితాలల్లోను ఇంత ఉన్నతంగా స్థిరపడడానికి చిన్నప్పుడు శంకరం మాస్టారిగారు వేసిన పునాది కారణం అని ఎన్నోసార్లు అంటూ ఉండేవాడు. పెళ్ళిచూపులనాడు
సురేంద్ర రూపం కన్నా అతని మాట తీరు తనని ఎక్కువగా ఆకర్షించింది. దానికి కూడా కారణం చిన్నప్పుడు మాస్టారుగారు తమలో నాటిన భావాలే అని అంటూవుంటాడు . అటువంటి విద్యాబుద్దులు మంచి నడవడిక నేర్పిన మాస్టారుగారిని చూడాలని ఎన్నో సార్లుఅనుకొన్నది. కానీ ఏవో కారణాలవల్ల కుదరలేదు సురేంద్ర మాత్రం తాము అమెరికా వెళ్ళక ముందు చాలాసార్లు ఆయన ఎక్కడ పని చేస్తున్నవెళ్లి కలిసేవాడు. అక్కడికి వెళ్లి పదియేళ్లు పనిచేసి ఇండియా వచ్చినప్పటి నుంచి ఆయనని కలవడం కుదరలేదు మళ్ళీ ఇన్నాళ్ళకి ఆయనగురించి తెలిసింది .
కారు పచ్చని పొలాల మధ్య దూసుకొని వెళుతోంది. సురేంద్ర మనసు అంతకన్నా వేగంగా శంకరం మాస్టారి జ్ఞాపకాల్లోకి పరుగు తీసింది . శంకరం మాస్టారు ఎనిమిదవ తరగతి లో వున్నప్పుడు మొదటిసారి తమ తెలుగు క్లాస్ టీచరుగావచ్చారు చూడటానికి సన్నగా పంచెకట్టుతో సినిమా యాక్టర్ సాక్షి రంగారావుగారిలా వుంటారు. కొద్దిరోజులకే అందరి హృదయాలలో మంచి స్థానం సంపాదించుకొన్నారు చదువు చాలా మంది టీచర్లు నేర్పారు కానీ చదువుతో పాటు సంస్కారం మంచి మాటతీరు జీవితం లో ఎదగడానికి కావలసినంత జ్ఞానం మంచి ఆలోచన దృక్పధం మాత్రం శంకరం మాస్టారే అంత చిన్నవయసులోనే మా అందరి మస్తిష్కం లో నాటుకొని పోయేలా చేసారు. మా అందరికి జీవితంలో ఎదగడానికి అవి చాల దోహదం చేసాయి. ఈ మాట ఎన్నోసార్లు ఆయనతో అంటే అది మీ అభిమానం లేరా అంటూ చిన్నగా భుజం తట్టి నవ్వేసేవారు. మాష్టారు ఎప్పుడు పెద్దగా ఉపన్యాసాలు ఇచ్చి నేర్పించలేదు కానీ చిన్న చిన్న తప్పులు సరిచేసి భాషనీ భావ వ్యక్తీకరణాన్ని మెరుగుపరుస్తూ ఉండేవారు అది ఆయన ప్రత్యేకత.
అనుకొన్నరోజు రానే వచ్చేసింది. స్కూలంతా పాత కొత్త విద్యార్థులతో కళకలాడుతోంది సమయానికి ముందే పెద్దలందరూ వేదికని అలంకరించారు. శంకరం మాష్టారుగారిని శాంతమ్మ గారి ని వేదిక మీదకి ఆహ్వానించారు. అదే మొదటిసారి అందరు శాంతమ్మగారిని చూడటం . శాంతమ్మగారు ఎర్ర అంచు ఆకుపచ్చని గద్వాల్ చీరలో తలనిండ పూలతో చిరునవ్వుతో ప్రశాంత వదనంతో పేరుకి తగట్టుగా వున్నారు. శంకరం మాస్టారుగారిని ఆయన సతీమణి శాంతమ్మగారిని పూలమాలలతో సత్కరించారు. అందరు తమ తమ అనుభవాలు మాస్టారుగారితో తమకున్న అనుబంధాన్నిగుర్తు చేసుకొంటూ ప్రసింగిస్తున్నారు. ఆఖరుగా శంకరం మాస్టారుగారిని మాట్లడమన్నారు. అందరు శంకరం మాస్టారుగారు ఏమి మాట్లాడుతారో తన ఎదుగుదలకి ఎవరు కారణమని చెపుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మైకు సరిచేసుకొని గొంతు సవరించుకొని నెమ్మదిగా మాట్లాడటం మొదలు పెట్టారు “వేదిక మీద పెద్దలకి నమస్కారం . నన్ను అభిమానించి నా మీద ఇంత ఆదరం చూపిస్తున్న విద్యార్ధులకి వాళ్ళతల్లితండ్రులకి కృతజ్నతాభివందనాలు. నేను మీరందరు చూపిస్తున్నఇంత ప్రేమాభిమానాలకు పూర్తి అరుహుడ్నికానేమో. మీరు మీ పిల్లల ప్రవర్తనలో భాష లో భావ వ్యక్తీకరణం లో నా పాత్ర చాలా ఉందని అంటున్నారు. నిజానికి నన్ను ఈ స్థాయి లో నిలబెట్టిన వ్యక్తి ని మీ అందరికి పరిచయం చేయాలి. సభా ముఖం గా ఆ వ్యక్తికీ కృతజ్ఞతలు తెలపాలి. “గొంతు జీర పోవటం తో కొద్దిసేపు మౌనం దాల్చారు.
అందరు ఆసక్తి గా ఆ వ్యక్తి ఎవరై వుంటారా అని ఎదురుచూస్తున్నారు . మాస్టారుగారు మంచి వ్యక్తిగా అధ్యాపకుని గా అందరికి పరిచయమే గాని అయన వ్యక్తిగత విషయాలు ఎవరికీ పెద్దగా తెలియవు . అందరిని తన మాటలతో తన ప్రవర్తనతో ప్రభావితం చేయగలిగిన మాస్టారుగారిని ఈ స్థాయికి తీసుకువచ్చిన ఆవ్యక్తి ఎవరా
అన్న ఉత్కంఠ అందరికి కలిగింది.
ఆ వ్యక్తి ని పరిచయం చేసే ముందు కొంచెం నా వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పాలి . నాకు 3 లేదా 4 ఏళ్ళ వయసున్నప్పుడు మా తల్లిగారు జబ్బుచేసి చనిపోయారు. మా తండ్రిగారు తన తల్లి చెల్లెళ్ళ సాయంతో నన్ను పెంచి పెద్దచేశారు . నా బాల్యం తల్లి ఆలనాపాలనా లేక తండ్రి ఆదరణ లేక అంత సజావుగా జరగలేదు. మేనత్తల ఈసడింపులు నా పసిమనసును గాయ పరిచేవి. ఎదిగే వయసులో ఇలాంటి వాతావరణం వలన నా మానసిక ఎదుగుదల మీద చాల దుష్ప్రభావం పడింది. యుక్త వయసు వచ్చేసరికి నా నడవడిక పూర్తిగా చెడిపోయింది. ప్రతివాళ్ళని ఈసడిస్తూ మాట్లడటం ఎవ్వరిని లెక్కచేయకపోవటం నోటికివచ్చినట్లు మాట్లాడటం ఇలా మారిపోయింది. చదువు ఐతే వచ్చింది కానీ సంస్కారం అబ్బలేదు. పేరుకి టీచర్ గా స్కూల్ లో చేరాను కానీ వృత్తిపట్ల గౌరవం లేదు. అప్పుడే నాజీవితం లోకిపెళ్లి తో శాంతి నా జీవితభాగస్వామిలా వచ్చింది. అదిమొదలు నా జీవితం లో పెద్ద పెనుమార్పు ప్రారంభం అయ్యింది.
శాంత పేరుకి తగ్గట్టు శాంతస్వభావురాలు. ఆమె సాంగత్యం నాలో మార్పు తీసుకు వచ్చింది. మొదలు నా భాష ని మెరుగుపరిచింది మాటల్లో సరళత్వం తొంగిచూసేలా మాట్లాడటం నేర్పింది. . ఇక్కడ తన లోని ప్రత్యేకతని మీ అందరికి పరిచయం చేయాలి. భావ వ్యక్తీకరణం లో భాషాది ప్రధమ స్థానం. దానిని సజావుగా వాడితేనే దాని లోని మాధుర్యం ప్రాధాన్యత బోధ పడుతుంది అని తన గట్టి నమ్మకం. మనం మాములుగా మాట్లాడేటప్పుడు నీకు చేతకాదు నువ్వు చెయ్యలేవు నీకు ఏమితెలియదు ఇలా మాట్లాడతాము తప్ప నువ్వు ఇలా చేస్తే ఫలితము వస్తుంది నువ్వు ఈ విషయము ఇంకా పరిశీలిస్తేమంచిది ఇలా ప్రయత్నిస్తే విజయము సమకూరుతుంది అని ప్రోత్సహకరంగామాట్లడము. కానీ ఆలా మాట్లాడితే దాని ప్రభావము మనిషి లో ఆత్మ స్ధిర్యం పెరిగేలా చేస్తుందిఅని బలంగా నమ్మింది . అది ఆచరించి చూపించింది మనవాడుక భాషలో నిత్యకృత్యాలలో కూడా కూరలో ఉప్పులేదా అని అడుగుతాము కానీ కూరలో ఉప్పు తగ్గింది అని చెప్పవచ్చు తాగడానికి మజ్జిగ లేదా అనే బదులు తాగడానికి మజ్జిగ ఇవ్వు అని అడగవచ్చు ఇలా చెప్పుకొంటూ పొతే అడుగడుగునా నాభాష భావ వ్యక్తీకరణాన్ని చిన్న చిన్న పదాలతో సరిచేసింది. అంతేకాదు అనుకోకుండాఅతి తేలికగా నిత్యం నేను ప్రయోగించే పదాలు ” లేదు కాదు అవ్వదు కుదరదు” ఇల్లాంటి పదాల వాడుక చాల తగ్గేలా మాట్లాడమని సూచించింది.

మాటే మనిషి మనసుని బుద్ధిని ఇతరులకి తెలపగలిగే బలమైన పరికరం లాంటిది. మాటే మనిషిని మిగిలిన అన్ని జీవరాసులకన్నా వున్తత స్థానం లోనిలబెడుతుంది ఆ సత్యాన్ని తను పాటించి నేను కూడా అనుసరించేలాచేసి జీవనయానంలో మార్గదర్శకురాలిగా నిలిచింది. ఆ చిన్న చిన్న సవరింపు లే నా మాటతీరు ను మార్చి నన్నో పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదిగేలా తీర్చిదిద్దాయి. మనిషి జీవితం లో భాష ఎంత ప్రధానమో అది సరిగా ప్రయోగించటం వలన నా జీవితం తో పాటు ఎందరిని ప్రభావితం చేసిందో అనడానికి మీరందరు ఈ రోజు ఇలానన్ను అభినందించటానికి విచ్చేయడమే. తన వద్ద నేను నేర్చుకొన్నది మీ అందరికి అందచేసాను అంతే. నిజానికి నేను పొందుతున్న ఈ సత్కకారాలకి సరిఅయిన అర్హురాలు నా భార్య శాంత. ” గొంతు గద్గదమై మాట్లాడటం ఆపి వేదిక మీద ఆసీనురాలైవున్న భార్య ని పొదివి పట్టుకొని ముందుకు తీసుకొని వచ్చారు.
హాలంతా కరతాళధ్వనులతో హర్షద్వానాలతో మార్మోగిపోయింది. వేదిక మీదవున్నపెద్దలు అందరుముందుగా తేరుకొని మాస్టారుగారికి శాంతమ్మగారికి కలిపి శాలువా కప్పి పూలదండలతోసత్కరించి. మాస్టారుగారికి ఉత్తమ ఉపాద్యాయుడు అన్న బిరుదు ఇచ్చారు. శాంతమ్మగారిని ఉత్తమ ఇల్లాలు అని ముక్తకంఠం తో పలికారు. శాంతమ్మగారి గొప్పతనాన్ని నలుగురి లో ప్రకటించి మాస్టారుగారు తన గొప్పతనాన్ని మంచి మనసుని మరిఒక సారి తెలియచేసారు. అందరికి అభినందనలు తెలుపుతూ వేదిక దిగి అందరిని పేరుపేరునా పలకరించి భారమైన మనసుతో అందరిదగ్గర సెలవు తీసుకొని మాస్టారుగారు నిష్క్రమించారు.
సెలవు లేని కారణం గా ఫంక్షన్ అయిపోగానే తల్లితండ్రుల దగ్గర అనుమతి తీసుకొని కారులో తిరుగు ప్రయాణానికి బయలుదేరదీసాడు సురేంద్ర. ఇన్నాళ్ళ తర్వాత మాస్టారుగారిని శాంతమ్మ గారిని కలిసినందుకు ఆయన ప్రసంగం విన్నందుకు ఆయన ఫంక్షన్లో పాలుపంచుకొన్నందుకు చాల సంతోషంగా వున్నాడు. నిజానికి సురేంద్ర ప్రవర్తనలో మాస్టారుగారి ప్రభావం కనపడుతూనే ఉంటుంది. సురేంద్ర ఏ విషయమైనా చక్కని మాటలతో పక్కవారికి తనమనసులోని భావం తెలిసేలా వ్యక్తపరచడం సుధని మరింత ఎక్కువ ఇష్టపడేలా చేసింది. తమ పెళ్లి అయినప్పటి నుంచి సుధ కూడా మాస్టారుగారి గొప్పతనం గురించి విన్నది గాని శాంతమ్మగారి గురించి మాట యొక్క మహత్యం గురించి ఈ రోజూ తెలిసుకొన్నాను అని అనుకొన్నది . రేడియోలోనుండి వస్తున్న ” మాటే మంత్రము మనసే బంధము “పాట వింటూ మాస్టారు గార్కి మనసులోనే శతకోటి వందనాలు సమర్పించింది. చీకటిని చీల్చుకొంటూ కారు తన గమ్యం వైపు పరుగులు తీసింది.

1 thought on “మాటే మంత్రము

  1. “మాటలు నేర్వకున్న అవమానము,మానము,ప్రాణభంగమున్ ” అన్న పద్యానికి ఈ కధ ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మంచి గురువుల ప్రభావం ఓ తరం మీద కాదు,తరతరాలుగా సాగిపోతుంది అన్నది నిజం. కమ్యూనికేషన్ అన్నది వృత్తి పరంగానే కాదు వ్యక్తిత్వం పరంగా కూడా చాలా ముఖ్యం. మందలో ఒకరిగా కాక, వందలలో ఒకరిగా నిలబెట్టేది…మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *