April 16, 2024

చంద్రోదయం – 17

రచన: మన్నెం శారద

ఆ రోజు
శేఖర్‌కి కొడుకు పుట్టేడని, అంతేగాకుండా ఇసక తోటలో హౌసింగ్ బోర్డు ఫ్లాటొకటి అతనికి ఎలాటయిందని తెలియగానే ఎంతగానో సంతోషించేడు సారధి.
పదిహేను రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్నాడు. ఆ చేతులతోనే బాబుకి బారసాల కూడా చెయ్యాలనుకున్నాం. కాబట్టి అందరూ రావల్సిందని, అదీ నెలరోజులకి తక్కువ కాకూడదని ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉత్తరం రాసేడు శేఖర్.
ఆ ఉత్తరం చూసిన దగ్గరనుంచి సావిత్రమ్మ పోరు ఎక్కువయింది.
“సెలవు సంగతి చూడరా. అందరం వెళదాం. సునందని చూసి కూడా చాలారోజులయ్యింది” అంటూ,
“చూద్దాం” అన్నాడు సారధి.
ఆవిడకి కోపం ముంచుకొచ్చేసింది. “చూద్దాం ఏమిటో? వెళ్ళి తీరాల్సిందే. అతడంత ప్రేమగా రాస్తూ వుంటే ఆ నిర్లక్ష్యం ఏవిటి? పాత సంగతులు మరచిపోయింట్లున్నావు. అతనేం చెయ్యమంటే అది చేస్తేనే మన ఋణం కాస్త తీరేది!” అంది.
“ఇప్పుడు నేను కాదనటంలేదుగా!” సారధి నవ్వేసేడు.
నాల్గురోజుల తర్వాత తల్లిని, చెల్లెల్ని తీసుకుని ప్రయాణమయ్యేడు సారధి.
ట్రెయిన్ దిగిన సారధిని అక్కున జేర్చుకున్నాడు శేఖర్.
ఆ దృశ్యం చూసిన సారధి తల్లికి కళ్లు ఆనందంతో చెమర్చేయి.
సుహాసిని నవ్వుతూ నిలబడింది.
“రా.. చెల్లాయ్!” అంటూ ఆప్యాయంగా పిలిచేడు శేఖర్.
లగేజ్ తీసుకుని బయటకి వెళ్తుంటే సారధి శేఖర్‌ని గమనించి చూసేడు.
శేఖర్ చాలా చిక్కిపోయేడు. కళ్లు లోతుకు పోయేయి.
సారధి మనసదోలా అయిపోయింది. బాధతో విలవిలలాడింది అతని హృదయం.
“ఏరా! అలా చిక్కిపోయావేం?” అన్నాడు ఆటోలో.
“చిక్కిపోనని ఎలా అనుకున్నావు?”
“అంటే?” సారధి ఆశ్చర్యంగా అడిగేడు.
“సగం ప్రాణానివి నువ్వు నాకు దూరమైతే నేను బాగుంటానని ఎలా అనుకున్నావురా?” అన్నాడు శేఖర్ నవ్వుతూ.
“మాటలు నేర్చేవ్” సారధి ఆప్యాయంగా స్నేహితుణ్ణి చూస్తూ అన్నాడు.
మాటల్లోనే యిల్లు వచ్చేసింది.
స్వాతి నవ్వుతూ ఎదురొచ్చి సావిత్రమ్మని, సుహాసినిని ఆప్యాయంగా పలకరించి లోనికి తీసికెళ్ళింది.
సారధిని “బాగున్నారా?” అని పలకరించింది.
సారధి నవ్వి వూరుకున్నాడు.
లోపలికి వెళ్తోంటే స్వాతి వైపే చూసేడు. మరికాస్త తెల్లబడి, యింకొంచెం సన్నబడిన స్వాతి యింకా ఆకర్షణీయంగా కనిపించింది.
“ఈదిగోరా, మావాడు!” శేఖర్ బాబుని ఎత్తుకోడం చేతకాక అవస్థపడుతూ అలాగే బయటకి తీసుకొచ్చేడు.
స్వాతి వెనకాలే పరిగెత్తుకొచ్చి అందుకొంది.
“వాణ్ణి మీరు ఏదో ఒకటి చేసేస్తారు. ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి?”అంది నిష్టూరంగా.
ఆ వెంటనే సారధిని చూసి “చూడండి వాడెంతున్నాడని. ఏ కాలు విరిచేస్తారోనని నాకు భయంగా వుంది” అంది సంజాయిషీగా.
సారధి నవ్వుతూ “నాకివ్వండీ” అంటూ స్వాతి చేతిలోని బాబుని అందుకున్నాడు.
స్వాతి భయంగానే అందించింది.
సారధి జాగ్రత్తగా ఎత్తుకొని బాబుని ముద్దుపెట్టుకున్నాడు.
శేఖర్ సారధి వంక ఆశ్చర్యంగా చూచి “పిల్లల్నెత్తుకోవడం ఎప్పుడు ప్రాక్టీసు చేసేవోయ్” అన్నాడు.
“పెళ్ళి కాకపోయినా ఆయనే నయం” అంది స్వాతి నవ్వుతూ.
“నాకు నమ్మకం లేదు. వీడి తీరు చూస్తుంటే వీడెక్కడో బ్రాంచాఫీసు పెట్టాడనిపిస్తోంది” శేఖర్ కళ్లెర్రజేసి అంటుంటే అందరూ ఫక్కున నవేసేరు.
చాలా రోజుల తర్వాత ఆ యింట్లో కాలం సంతోషంగా, సందడిగా గడిచిపోయింది.
“శంకరం మాస్టారికి బాగుండలేదురా!” అన్నాడు శేఖర్ భోజనానంతరం.
“ఏం?” ఆదుర్దాగా అడిగేడు సారధి.
“ఆయనకి రెండు నెలల క్రితం పక్షవాతం వచ్చింది. ఎడం భాగం అంతా చచ్చుబడిపోయింది. మంచంలోనే వున్నారు”
శేఖర్ ఆ మాట చెబుతుంటే స్వాతి అదోలా అయిపోయింది.
కన్నీళ్లు కన్పించకుండా గిరుక్కున లోపలికి వెళ్లిపోయింది.
“మరి ఎవరు చూస్తున్నారు?”
“ఒక ఆయాని పెట్టేం. పిల్లలు వున్నారుగా. అన్నిటికి బాగుంటుందని యిక్కడికి రమ్మంటే యిల్లు చిన్నదని ఆయన వొప్పుకోలేదు. మేము మా ఎలాటెడ్ హౌస్‌కి వెళ్ళేక తీసికెళ్దామని నిర్ణయించుకున్నాం.
“అంటే, ఆయన మనుమడిని చూసుకోనే లేదా?” సావిత్రమ్మ అడిగింది.
“మేము తీసికెళ్లి చూపించేము” అన్నాడు శేఖర్.
ఆ సాయంత్రం బాబుని సుహాసినికి అప్పజెప్పి, అందరూ శంకరంగారిని చూసేందుకు వెళ్లేరు.
అందర్నీ చూచి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
“మిమ్మల్నందరినీ చూడగలిగేను బాబు. అది చాలు. నాకిక దేవుడు శెలవిప్పిస్తే బాగుండును” అన్నారు.
ఆ యింటి వాతావరణం చూడగానే అందరికీ బాధ కలిగింది. మిగిలిన యిద్దరూ ఆడపిల్లలే. పెళ్లికెదిగినవాళ్ళే. ఆయన పోతే వాళ్ల బాధ్యత ఎవరు తీసుకొంటారు? ఆ సంసారానికి దక్షత ఏది?
ఆయన బాధగా పిల్లలవంక చూసుకున్నారు.
అది చూసి శేఖర్ “నేనెంత చెప్పినా ఆయనకు ధైర్యం చాలటం లేదురా. మేముండి వాళ్లను గాలికి వదిలేస్తామా” అన్నాడు నిష్టూరంగా.
శంకరంగాఇ కళ్లు బాధతో రెపరెపలాడాయి.
“అందుకు కాదు బాబూ! ఇప్పటికే అతనిమీద తలకి మించిన భారం పెట్టేము. నా జబ్బు ఖర్చు అంతా అతనే భరిస్తున్నాడు. అవతల కొడుకు పుట్టేడు. ఎంతో ఖర్చు వుంది. అతను మాకోసం అన్నీ వదులుకున్నాడు. ఇంకా ఎంత బాధపెట్టేది?”
“ఇది బాధ అనుకునే చేస్తున్నానా?” అన్నాడు శేఖర్.
“మీరూరికే బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం వుండకపోదు. మీరలా దిగాలు పడితే పిల్లలు బెంబేలు పడిపోతారు” అన్నాడు అనునయంగా సారధి.
ఆయన్ని వూరడించి బయటకొస్తుంటే సావిత్రం “మీరు వెళ్లండి. నేను యిక్కడే వుంటాను” అంది.
ఆ మాటలకి స్వాతి ముఖం విప్పారింది. కృతజ్ఞతగా ఆమె చేతులు పట్టుకొంది.
“పిచ్చిపిల్లా! ఏమంత ఘనకార్యం చేసేనని. నా జన్మంతా ఏ పుణ్యకార్యమూ చెయ్యకుండానే గడిచిపోయింది. తోటివారికి కాస్తంత సహాయపడితే పుణ్యలోకాలు చేరొచ్చని స్వార్థంతోనే చేస్తున్నానులే అమ్మాయి!” అంది నవ్వుతూ.
తల్లి అడగకుండానే సమయానికి అలా ప్రవర్తించి ఆదుకోవటం సారధికి సంతోషాన్ని కల్గించింది. స్వాతి, శేఖర్, సారధి వెనక్కి వచ్చేసేరు.

ఇంకా వుంది.

1 thought on “చంద్రోదయం – 17

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *