April 23, 2024

నేస్తానికి నజరానా

రచన: ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి

వసిష్ట గోదావరి వంతెన మీద నుండి కారు నెమ్మదిగా వెళ్తోంది. కార్తీకమాసం ఉదయం సమయం. గోదావరి మీద మంచు తెరలు ఇంకా విడి వడలేదు. గోదావరిలో నీళ్ళు తక్కువగా ఉన్నాయి. ఇరవై నిముషాలలో రావులపాలెం చేరుకున్నాము.
“కారు పక్కకు ఆపి పువ్వులు తీసుకోండి” రాజేశ్వరి అభ్యర్ధన.
కళా వెంకటరావు విగ్రహం పక్కగా డ్రైవర్ కారు ఆపాడు. చామంతుల దండ, విడి పూలు తీసుకోమని డ్రైవర్ కి వంద రూపాయలు ఇచ్చాను. కొద్ది సేపటికి డ్రైవర్ చామంతుల దండ ఒక కవర్ లో, విడి పూలు ఇంకో కవర్ లో తీసుకు వచ్చాడు. కారు మళ్లీ బయలుదేరి , గౌతమి గోదావరి వంతెన మీద నుండి వెళ్తోంది. చాలా గోతులు ఉన్నాయి. “ఇదేమిటి? వంతెన మీద కూడా రిపేర్ చేయరా?” డ్రైవర్ ని అడిగాను.
“కొత్త వంతెన వచ్చాక, ఈ వంతెన గురించి పట్టించుకోవడం లేదండి” చెప్పాడు డ్రైవర్.
వంతెన కిందకు చూసాను. ఇక్కడ కూడా గోదావరిలో నీళ్ళు తక్కువగానే ఉన్నాయి. ఒకప్పుడు నిండు గర్భిణిగా ఉండే గౌతమి చిక్కి పోయిన గోమాతలా ఉంది. వంతెన దాటగానే డ్రైవర్ కుడి పక్కకు దారి మారి , కారుని గోదావరి తీరం వెంబడి పోనివ్వసాగాడు. ఏటి ఒడ్డున రోడ్ బాగానే ఉంది. కుడి పక్కన గోదావరి , ఎడమ పక్కన కాలువ చూడముచ్చటగా ఉన్నాయి. మంచు తగ్గింది. అరగంటలో కపిలేశ్వరపురం మీదుగా కోటిపల్లి చేరుకొన్నాం. రేవు దగ్గర కారు ఆపాడు డ్రైవర్. నేనూ, నా వెనుకే వైరు బుట్టతో రాజేశ్వరి కారు దిగాం. ఒక బ్రాహ్మడు వచ్చి ‘స్నానం చేస్తారా? సంకల్పం చెబుతాను.’ అని అడిగాడు. లేదని తల అడ్డంగా ఊపాను.
కరోనా తగ్గినా, బయట స్నానాలు అంటే ఇంకా భయంగానే ఉంది. రావి చెట్టు దగ్గర ఉన్న కొట్టులో అరటి డిప్పలు కొని తెచ్చాను. మెట్లు దిగి గోదావరి నీళ్ళు ఇద్దరం నెత్తి మీద జల్లుకున్నాం. వైరు బుట్టలోని సామగ్రి తీసి రాజేశ్వరి అరటి డిప్పల మీద వత్తులు పెట్టి వెలిగించి ఆ దీపాలకు పూలతో పూజ చేసింది. తర్వాత నేను, తనూ కూడా ఆ దీపాలను గోదావరిలో వదిలి నమస్కారం చేసుకున్నాం. తల ఎత్తేసరికి సూర్య భగవానుడు కనిపించాడు. ఆయనకి కూడా నమస్కరించాము. ముక్తేశ్వరం రేవు నుండి జనంతో లాంచి కోటిపల్లి రేవుకి వచ్చి ఆగింది. ఒక నలుగురు గోదావరిలో దిగి స్నానాలు చేస్తున్నారు. ఇందాకా మాకు కనిపించిన బ్రాహ్మడే వాళ్లకి సంకల్పం చెప్పాడు.
గత ఏడాది కార్తీక మాసంలో మేము వచ్చినపుడు రేవు అంతా భక్తులతో నిండిపోయింది. ఇప్పుడు ఆ సందడే లేదు. ఇది భయమా? జాగ్రత్తా? ఏమో? నా ఆలోచనలని భగ్నం చేస్తూ రాజేశ్వరి “ఆ పంతులుగారిని పిలవండి” అని చెప్పింది. నేను ఆయన కేసి తిరిగి చేయి ఊపి రమ్మనమని సైగ చేసాను. ఆయన రాగానే వైరు బుట్టలోంచి రెండు ఆపిల్స్ తీసి నా చేతిలో పెట్టి ఆయనకు ఇమ్మని చెప్పింది. నేను వంద రూపాయలు తీసి పళ్ళు,దక్షిణ ఆయనకు ఇచ్చాను. రాజేశ్వరి రెండు కమలా పళ్ళు ,దక్షిణ ఇచ్చింది. ఆయన మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు.
కారు ఎక్కి కోటీశ్వరస్వామి గుడికి వచ్చాము. స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ధ్వజస్తంభం పక్కనే ఉన్న ఇనుప స్టాండ్ మీద ప్రమిదలలో దీపాలు పెట్టాం.
“నేను కాసేపు కార్తీక పురాణం చదువుకుంటాను. నన్ను డిస్ట్రబ్ చేయకండి” అని చెప్పి పుస్తకం తీసి చదువుకోవడం మొదలుపెట్టింది. నేను గుడి బయటకు వచ్చి ఫోన్ తీసి మెసేజ్ లు చూసుకుంటున్నాను.
రేపు కలెక్టర్ తో వీడియో సమావేశం ఉంది. సూపర్నేంట్ కి ఆదేశాలు ఇచ్చే వచ్చాను. మధ్యాహ్నం కి ఆఫీస్ కి వస్తానని చెప్పాను. అయినా టెన్షన్ గా ఉంది.రాజేశ్వరితో ఆదివారం వెళ్దామంటే , మీరు ఎప్పుడూ వాయిదాలు వేస్తారు, అలా కుదరదు, ఒక పూట సెలవు పెట్టండి. ఈ రోజే వెళ్దామని పట్టు పట్టింది. సరే ననక తప్పలేదు .
ఆలోచిస్తూనే మెసేజ్ లు చూస్తున్నాను. ఎవరో ఒక స్త్రీమూర్తి నా ముందు నుంచే వెళ్లి ,మళ్లీ వెనక్కు వచ్చి నా ముందు నిలబడింది. నేను తలెత్తి ఆమె వంక చూసాను . ఆమె నా వంక పరీక్షగా చూసి వెంటనే ‘చందూ “అని నవ్వింది.
ఆ నవ్వు నాకు బాగా గుర్తు. నవ్వితే బుగ్గలు అందంగా సొట్టలు పదే ప్రియంవద మొహం. అవును. ఆమే .సందేహం లేదు. ఫోన్ జేబులో పెట్టి ,’ప్రియా, బాగున్నావా?’ అన్నాను.
“ఆ! బాగానే ఉన్నాను. నువ్వు ఎలా వున్నావ్? ఎక్కడ పని చేస్తున్నావు? ఒక్కడివే వచ్చావా?” ప్రశ్నల వర్షం కురిపించింది ప్రియంవద. చాలా కాలానికి పెద్ద నవ్వు నవ్వాను.
“నేను ఇరగవరం మండలం తహసిల్దార్ గా పనిచేస్తున్నాను. నేనూ , శ్రీమతి వచ్చాం. ఆవిడ గుడిలో ఉంది.మేము బాగానే ఉన్నాం. నీ ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు వచ్చాయా?” చిలిపిగా అడిగాను.
ప్రియంవద సున్నితంగా నా నెత్తి మీద మొట్టి ,”నీకు ఇంకా చిలిపితనం పోలేదు” అంది సుతారంగా నవ్వుతూ. ప్రియంవద కూతురు తల్లి కేసి ఆశ్చర్యంగా చూసింది.
“ఇతను చంద్రశేఖర్. మార్టేరు హైస్కూల్ లో నా క్లాసుమేటు. చందు, ఇది మా అమ్మాయి ప్రమద్వర. ఏం.టెక్. చేసింది. వైజాగ్ లో లెక్చరర్ గా చేస్తోంది. నీ పిల్లలు ఏం చేస్తున్నారు?” అడిగింది ప్రియంవద.
“నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే. పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒకడు బెంగుళూరు, ఇంకోడు చెన్నై లో ఉన్నారు. అవును, మీవారి గురించి చెప్పలేదు. ఏం చేస్తారు?”
నా ప్రశ్నకు సమాధానంగా చెయ్యి పైకెత్తి “గాల్లో తిరుగుతూ ఉంటారు” అంది ప్రియంవద. నేను అర్ధం కాక ఆమె కేసి చూసాను. ఈలోగా రాజేశ్వరి వచ్చింది. నేను ప్రియంవదని నా బాల్య స్నేహితురాలని పరిచయం చేసాను. పరస్పర నమస్కారాలయ్యాయి. “మీరు ఏం చేస్తారు?” అడిగింది రాజేశ్వరి, ప్రియంవదని.
“నేను కాకినాడ హైస్కూల్ లో పి.ఈ.టి. గా పనిచేస్తున్నాను.నాకు ఒక్కత్తే కూతురు.ప్రమద్వర. వైజాగ్ లో లెక్చరర్ గా పనిచేస్తోంది.” కూతుర్ని పరిచయం చేసింది ప్రియంవద.
“మీ అమ్మాయి పేరు లాగే, మీ అమ్మాయి కూడా అందంగా ఉంది” అని మెచ్చుకుంది రాజేశ్వరి. నలుగురం కలిసి సెల్ఫీ దిగాం. ప్రియంవద ఫోన్ నెంబర్ తీసుకుని హడావిడిగా కారు ఎక్కి శివపురం వచ్చాను. రాజేశ్వరిని ఇంటి దగ్గర దింపి ,నేను ఇరగవరం ఆఫీస్ కి వెళ్లాను. పావుగంట లో ఆఫీస్ కి చేరుకున్నాను.రెండు రోజులు హడావిడిగా గడిచి పోయింది.
ఆదివారం ఉదయం పేపర్ చదవడం అయ్యాకా ఫోన్ చూస్తూంటే, ప్రియంవద తో ఉన్న ఫోటో కంటపడింది. నా మనసు గతంలోకి పయనించింది.
******
శివపురంలో హైస్కూల్ లేకపోవడం వలన నేను మార్టేరు హైస్కూల్ లో చేరాను.సత్య మూర్తి,సూరిబాబు,బాపూజీ,కృష్ణంరాజు, జిలాని అందరం ఒక గ్రూపుగా ఉండే వాళ్ళం. ఎనిమిదవ తరగతిలో ప్రియంవద చేరాకా మా ఆలోచనలు ఆమె చుట్టూ తిరిగేవి.ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉండేది. చదువులోనే కాక ఆటల్లో కూడా ప్రియంవద చాలా ముందు ఉండేది. ఖో ఖో చాలా బాగా ఆడేది. రన్నింగ్, హై జంప్ లలో మొదటి స్థానంలో ఉండేది. అందుకే డ్రిల్ మాస్టారు ప్రహ్లాదరెడ్డి గారికి అభిమాన పుత్రిక అయ్యింది. మొదటిసారిగా బాలికల విభాగంలో తణుకు జోన్ పరిధిలో రన్నింగ్, హైజంప్ లలో ఫస్ట్ వచ్చి స్కూల్ ఖ్యాతి పెంచింది. హెడ్ మాస్టర్ సుబ్బరాజు గారు కూడా ఆమెని ప్రోత్సహించి జిల్లా పోటీలకు పంపగా అక్కడా ఫస్ట్ వచ్చింది. ఆ విధంగా క్రీడలు అంటే ప్రియంవద అన్న ముద్ర పడిపోయింది.
నేను బొమ్మలు బాగా వేసే వాడిని. అందుకని ప్రియంవద తన సైన్సు నోట్స్ లో బొమ్మలు వేయమని అడిగేది. నేను ఆనందంగా సైన్సుకి సంబంధించిన బొమ్మలు పెన్సిల్ తో వేసి ఇచ్చే వాడిని. ఆ విధంగా మా ఇద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది. ఏదైనా జోక్ చెబితే ప్రియంవద పెద్దగా నవ్వేది.అప్పుడు ఆమె బుగ్గలు సొట్టలు పడి అందంగా గులాబీ రంగులో మెరిసేవి. అందుకే ఆమె నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. హైస్కూల్ చదువు అయ్యాకా ఇద్దరం ఆచంట జూనియర్ కాలేజీ లో చేరాం. నేను శివపురం నుండి మార్టేరు వచ్చేవరకూ మార్టేరు వంతెన దగ్గర నా కోసం వేచి ఉండేది. నేను వచ్చాకా ఇద్దరం సైకిల్ల మీద ఆచంట వెళ్ళేవాళ్ళం. ఇంటర్ లో కూడా ఇద్దరం ఒకటే గ్రూప్. అందుకనే ఎక్కువ కలిసి మెలిసి తిరిగే వాళ్ళం. కాలేజీ లో కూడా క్రీడల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకునేది. ఒక్కోసారి ఎగస్ట్రా క్లాసులు ఉన్నా, క్రీడలకు ప్రాక్టీసు చేయాలన్నా నేను తనకు తోడు ఉండి ,ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం. ఒకోసారి చీకటి పడిపోయేది. నేను, ప్రియంవదని మార్టేరులో వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి , అప్పుడు నేను శివపురం వెళ్ళేవాడిని. “నా వలన నీకు చాలా ఆలస్యమవుతోంది” అని బాధపడేది. ఫరవాలేదులే అని నవ్వుతూ వెళ్ళేవాడిని.
ఇంటర్ అయ్యాకా నేను డిగ్రీ చదవడానికి మా మామయ్య గారింటికి వైజాగ్ వెళ్ళిపోయాను. ప్రియంవద డ్రిల్ మాస్టర్ ట్రైనింగ్ కి వెళ్లిందని బాపూజీ చెప్పాడు ఒకసారి కలిసినప్పుడు. తర్వాత వాళ్ళు నర్సాపురం వెళ్లిపోయారని తెలిసింది. ఇన్నాళ్ళకు మళ్ళీ కోటిపల్లిలో కలిసాం.
రాజేశ్వరి టిఫిన్ పట్టుకు రావడంతో గతం వదిలి, వాస్తవంలోకి వచ్చాను.
మరుసటి నెల మా ఆఫీస్ సూపెర్నేంట్ కొడుకు పెళ్లి కాకినాడలో. అదే ముహూర్తానికి రాజేశ్వరి వాళ్ళ పిన్ని మనవడి పెళ్లి విజయవాడలో వుంది. నేను ఇటు కాకినాడ వెళ్ళడానికి, రాజేశ్వరి విజయవాడ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. నాకూ కాకినాడ వెళ్లి ప్రియంవదని చూడాలని, ఆమెతో మాట్లాడాలని చాలా ఉత్సాహంగా ఉంది. కాకినాడలో పెళ్లి ఉదయం పది గంటలకు. పెళ్లి అయ్యాక భోజనం చేసి కారులో ప్రియంవద ఇంటికి రామారావుపేట వెళ్లాను. చాలా ఆదరంగా ఆహ్వానించింది ప్రియంవద. కాసేపు మామూలు కబుర్లు అయ్యాకా ప్రియంవదని అడిగాను. “నేను వైజాగ్ వెళ్ళాక నీ గురించి తెలియలేదు. మీరు నర్సాపురం వెళ్లిపోయారని బాపూజీ చెప్పాడు. ఎందుకు వెళ్ళారు? చెప్పు.”
ప్రియంవద ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చింది. “చెందూ, మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని మాకు అనుభవం అయ్యింది. మా నాన్నగారు మార్టేరు టింబర్ డిపోలో గుమాస్తాగా పనిచేసేవారు. ఒకరోజు కూలీలు పెద్ద కర్ర దుంగని తీసుకు వస్తూండగా, పగ్గం తెగిపోయి కింద పడి నాన్నగారి కాలుమీద పడింది. అంత బరువైన దుంగ పడటంతో ఆయన పాదం పూర్తిగా నలిగిపోయింది. ఫలితంగా పాదం తీసేసారు. పనికి వెళ్ళడం లేదు. ఇల్లు గడిచే దారి లేదు. మేము ఇద్దరం ఆడపిల్లలమే. అక్క కాన్వెంట్ లో టీచర్ గా చేసేది. నేను పి.యి.టి. ట్రైనింగ్ పూర్తి చేసాను. ఇంకా జాబు రాలేదు. అప్పుడు తప్పని పరిస్థితులలో మా పెద్దమ్మగారి ఇంటికి నర్సాపురం వెళ్లాం. పెద్దమ్మకి చాలా పెద్ద టైలరింగ్ షాప్ ఉంది. నేనూ, అక్క టైలరింగ్ చేస్తే, అమ్మ ఇంటి దగ్గర లేసులు అల్లేది. కుటుంబం ఆర్ధికంగా నిలదొక్కుకుంది. ఒక ఏడాది గడిచింది.నాకు కొత్తపేట హైస్కూల్ లో ఉద్యోగం వచ్చింది. అందరం ఎంతో సంతోషించాం . కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవ లేదు. హార్ట్ ఎటాక్ వచ్చి నాన్న చనిపోయారు. అమ్మ,అక్క పెద్దమ్మ దగ్గరే ఉన్నారు. అక్క పెళ్లి బాధ్యత నేను తీసుకున్నాను.
చందూ, మూడు సంవత్సరాలు కడుపు కట్టుకుని, జీతం అంతా పొదుపు చేసి అక్క పెళ్లి చేసాను. తర్వాత అమ్మని నా దగ్గరకు తెచ్చుకున్నాను. అప్పుడే చక్రధర్ నాకు పరిచయ మయ్యాడు. మా పక్క పోర్షన్ లో ఉండేవాడు. సొంతంగా చిట్టిలు నడిపేవాడు. మా అమ్మకు అతను అంటే బాగా గురి కుదిరింది. ఒకసారి వాళ్ళ తల్లితండ్రులు వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళని అడిగింది ‘మా అమ్మాయిని , మీ అబ్బాయికి చేసుకుంటారా?అని “ వాళ్ళకు అభ్యంతరం లేదన్నారు. చక్రధర్ కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. కొత్తపేటలోనే సింపుల్ గా మా పెళ్లి జరిగింది. ఒక ఏడాదికి నాకు ఆడపిల్ల పుట్టింది. అంతే, మర్నాడే చక్రధర్ మాయమయ్యాడు.అమలాపురం వాళ్ళ తల్లితండ్రులు దగ్గరికీ వెళ్ళలేదు. నెల గడిచింది, రెండు నెలలు గడిచాయి.అతను రాలేదు. చక్రధర్ కి చిట్టిలు కట్టినవారు నా దగ్గరకు వచ్చి డబ్బులకు వత్తిడి చేయసాగారు.పరువు కోసం ఆ బాకీలన్నీ నేనే తీర్చాను.
అల్లుడు పరారవ్వడం, అప్పులు నా మీద పడటం చూసి అమ్మ దిగులుతో మంచం పట్టింది.’మగదిక్కు లేకుండా ఈ పిల్లని ఎలా పెంచి పెద్ద చేస్తావే?’ అంటూ బాధపడేది. ఆరు నెలలు తిరిగేసరికి అమ్మ ,నాన్న దగ్గరకు వెళ్ళిపోయింది. నేనూ , నా కూతురు మిగిలాం. చక్రధర్ చేసిన అప్పులు అన్నీ తీర్చేసి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని కాకినాడ వచ్చేసాను. ప్రమద్వర కాకినాడలో బి .టెక్.చేసి వైజాగ్ లో ఏం.టెక్. పూర్తి చేసింది. డిస్టింక్షన్ లో పాస్ అవడంతో వెంటనే జాబు వచ్చింది వైజాగ్ లో. ఈ పాతికేళ్లలో ఎన్నో బాధలు పడ్డాను.ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. మగతోడు లేని ఆడది అంటే అన్దరికీ లోకువేగా. నా జీవన గమనం లో ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. బహుశ నేను స్పోర్ట్స్ వుమన్ అవడం వలనే అది సాధ్య పడింది.
ఇప్పుడు అమ్మాయి పెళ్లి నాకు ఒక సమస్యగా మారింది. పిల్ల తండ్రి గురించి అడిగితే ఏం చెప్పాలి?ఆడపిల్ల పుట్టిందని వెళ్లిపోయాడని చెప్పాలా? అప్పులు చేసి అవి తీర్చలేక పారిపోయాడని చెప్పాలా?” ఒక్క క్షణం ఆగింది ప్రియంవద. ఆమె కళ్ళలో సన్నటి నీటి పొర కదలాడింది. నా చిన్ననాటి స్నేహితురాలు, ఎంతో ధైర్యశాలి, అలా బేలగా మారిపోవడం నన్ను కదిలించింది.
“బాధపడకు ప్రియంవదా. నేను నీకు అండగా ఉంటాను. మీ అమ్మాయికి మంచి వరుడిని చూస్తాను.నువ్వు దిగులుపడకు” అన్నాను మనస్ఫూర్తిగా. ప్రియంవద చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది.
“సారీ చందు, నా గొడవతో నిన్ను ఇబ్బంది పెట్టాను. టీ తీసుకువస్తాను” అని లోపలకు వెళ్ళింది. అప్పుడు ఇల్లు పరిశీలించాను . ప్రియంవద, వాళ్ళ అమ్మాయి ఉన్న ఫోటో ఒకటి, దాని పక్కనే ఆసియన్ క్రీడల్లో పతకం గెల్చుకున్న అమ్మాయి ఫోటో కూడా ఉంది. ప్రియంవద టీ తీసుకు రాగానే అడిగాను’ఆ మెడల్ గెలిచిన అమ్మాయి ఎవరు?’ అని. దానికి చిన్నగా నవ్వింది ప్రియంవద. “ఆ అమ్మాయి తేజస్విని. నేను రామచంద్రపురంలో పనిచేసేటప్పుడు నా శిష్యురాలు. రన్నింగ్ లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది. బాగా ప్రోత్సహించాను. కాలేజీలో కూడా బాగా కృషి చేసి ఆసియన్ క్రీడల్లో మెడల్ గెలుచుకుంది.నా జాబ్ నాకు తృప్తి నిచ్చింది ” ఆనందంగా చెప్పింది.
ఒక అరగంట సేపు ఉండి ఇంటికి బయల్దేరాను. దారిలో ప్రియంవద గురించిన ఆలోచనలే నన్ను చుట్టు ముట్టాయి. ఆ రోజు ఇంట్లో నేనొక్కడినే. రాజేశ్వరి మర్నాడు వచ్చింది. పెళ్లి విశేషాలు అన్నీ చెప్పింది.
“మీకు ఇంకో విశేషం చెప్పాలి. అక్కడ నేనో సెలబ్రిటీ నయ్యాను.” ఆమె మాటలకు నేను ఆశ్చర్యంగా ఆమె కేసి చూసాను. ఆమె నవ్వింది. “మా అన్నయ్య కొడుకు రాజేష్ అమెరికాలో ఉంటున్నాడుగా. వాడికి రికమెండ్ చేయమని ఆడపిల్లల తల్లులు నా వెంట పడ్డారు.” రాజేశ్వరి మాటలు పూర్తి కాగానే నాకు లైట్ వెలిగింది.
రాత్రి భోజనాలు అయ్యి, వంటిల్లు సర్ది హాలులోకి వచ్చింది రాజేశ్వరి. నేను కాకినాడ పెళ్లి విశేషాలు చెప్పి , ప్రియంవద ఇంటికి వెళ్ళడం, ఆమె నాకు చెప్పిన విషయాలు రాజేశ్వరికి చెప్పాను. తను కూడా ప్రియంవద పట్ల జాలిపడింది.
“రాజీ, నువ్వు నాకో సహాయం చెయ్యాలి.మీ రాజేష్ కి , ప్రమద్వరకి పెళ్లి జరిగేటట్లు చూడాలి.”అన్నాను నేను.
“జీవితాన్ని సవాల్ గా తీసుకుని, పోరాడి గెలిచిన ప్రియంవద అంటే నాకు ఇంకా గౌరవం పెరిగింది. ప్రమద్వరని మొన్న మనం కోటిపల్లి లో చూసాంగా. పిల్ల చక్కగా ఉంది, చదువుకుంది, జాబు కూడా చేస్తోంది.” అని చెప్పి వెంటనే వాళ్ళ అన్నయ్యతో మాట్లాడింది. మేము కోటిపల్లిలో దిగిన ఫోటో వాట్సాప్ లో పంపింది. మా బావమరిది, భార్య కూడా అమ్మాయి నచ్చిందని చెప్పారు. ఆ వెంటనే రాజేష్ కి ప్రమద్వర ఫోటో పంపి,’ రేపు నాతొ మాట్లాడు’అని మెసేజ్ పెట్టింది రాజేశ్వరి.
రెండు రోజులు గడిచాకా రాజేష్, మా ఆవిడతో మాట్లాడాడు. అమ్మాయి నచ్చిందని, పై నెలలో ఇండియా వచ్చినపుడు అన్నీ మాట్లాడదాం అని అన్నాడు.
మరుసటి ఆదివారం నేనూ ,రాజేశ్వరి కాకినాడ వెళ్లి ప్రియంవదని కలిసాం. “మేము మిమ్మల్ని ఒక కోరిక కోరాలని వచ్చాం” నవ్వుతూ అంది రాజేశ్వరి. “మీరు ఏమి అడిగినా కాదనను.చెప్పండి”అంది తనూ నవ్వుతూ ప్రియంవద.
“మా అన్నయ్యగారి అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. మీ అమ్మాయిని, మా అన్నయ్య గారింటికి కోడలుగా పంపమని మిమ్మల్ని కోరడానికి వచ్చాం” అంది రాజేశ్వరి. ప్రియంవద ఆ మాటలకు ఆశ్చర్య పోయింది. ఆమె కళ్ళల్లో ఆనంద భాష్పాలు గిర్రున తిరిగాయి. చటుక్కున రాజేశ్వరి రెండు చేతులూ పట్టుకుంది. రాజేశ్వరి ఒక్క క్షణం ఆమె కేసి తిరిగి”ప్రమద్వర ఇంక మా అమ్మాయి.మీకు అభ్యంతరం లేకపోతే , మేమే కన్యాదానం చేస్తాం “అంది.
“ఇన్ని వరాలు ఒకేసారి ఇస్తే, నేను ఎలా తట్టుకోగలను” అంది ప్రియంవద ఆనందంగా.
రెండు నెలలు తర్వాత రాజేష్ రావడం, ప్రమద్వరని చూడటం, పదిహేను రోజుల్లో వాళ్లిద్దరికీ నేనూ ,రాజేశ్వరి పీటల మీద కూర్చుని పెళ్ళిచేయడం జరిగింది. ప్రియంవద కళ్ళల్లో మళ్లీ మెరుపు చూసాను నేను.

*******

4 thoughts on “నేస్తానికి నజరానా

 1. బాగుందండీ. కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చలనచిత్ర సన్నివేశాలు గుర్తుకు వచ్చాయి కానీ జీవితంలో ని సంఘటనలనుండే కదా సినిమా కథలు పుట్టుకొచ్చేది. నజరానా ఏమిటో తెలియాలంటే చివరివరకు చదవాల్సిందే. అదీ మీ రచన లో పట్టు.
  అభినందనలతో
  కందికొండ రవి కిరణ్
  కవి

 2. చాలా మంచి ముగింపు ఇచ్చారు.

  1. బాగుందండీ. కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చలనచిత్ర సన్నివేశాలు గుర్తుకు వచ్చాయి కానీ జీవితంలో ని సంఘటనలనుండే కదా సినిమా కథలు పుట్టుకొచ్చేది. నజరానా ఏమిటో తెలియాలంటే చివరివరకు చదవాల్సిందే. అదీ మీ రచన లో పట్టు.
   అభినందనలతో
   కందికొండ రవి కిరణ్
   కవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *