May 8, 2024

దానవ గురువు ‘శుక్రాచార్యుడు’

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

తెలివితేటలలో బృహస్పతి ఎంతటివాడో శుక్రాచార్యుడు కూడా అంతటి వాడు. దేవతలు బృహస్పతిని గురువులుగాఉండమని అడిగినప్పుడు బృహస్పతి , “నాకన్నా శుక్రాచార్యుడు సమర్ధుడు ఆయనను అడగండి” అని చెపుతాడు. కానీ దేవతలు బృహస్పతిని గురువుగా ఎంచుకుంటారు బృహస్పతి మీద, దేవతల మీద కోపముతో శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా ఉంటాడు. ఆనాటి నుంచి దేవా దానవుల సంగ్రామాల్లో దానవులకు అన్ని విధాలుగా సహకరించివారి విజయాలకు తోడ్పడినవాడు శుక్రాచార్యుడు, కానీ దేవతలా పక్షనా న్యాయము ధర్మము ఉండటం వలన అన్నిటికన్నా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అండదండలు ఉండటం వలన అంతిమ విజయము ఎప్పుడు దేవతలనే వరించేది శుక్రాచార్యుని సలహాల’ మేరకు దానవ రాజులు తపస్సులు చేసి వరాలు పొందినప్పటికీ గెలుపు దేవతలా పక్షనా ఉండేది దానవ గురువు శుక్రాచార్యుని గురించి తెలుసుకుందాము.
శుక్రాచార్యుని తండ్రి బ్రహ్మ మానస పుత్రుడైన భృగు మహర్షి భృగు మహర్షి నవ బ్రహ్మలలో ఒకడు. అయన కొడుకు ఉశనసుడు. ఉశన సుడు వేద విద్య నేర్చుకోవటానికి అంగీరస మహర్షి దగ్గరకు వెళతాడు కానీ అయన తనకుమారుడైన బృహస్పతి పట్ల పక్షపాత ధోరణి చూపుతున్నాడని అక్కడినుండి వచ్చేస్తాడు. ఆ తరువాత గౌతమ మహర్షి దగ్గర విద్యనభ్యసించి శివుని మెప్పు కోసము ఘోరమైన తపస్సు చేసి మృతసంజీవనీ విద్యను వరముగా పొందుతాడు. వర గర్వముతో కుబేరునిపై దాడి చేసి ధనమంతా దోచుకుంటాడు ఈ విషయము తెలిసిన శివుడు ఆగ్రహించి త్రిశూలంతోఉశనుసుడి చంపటానికి బయలుదేరుతాడు. శివుడి నుండి రక్షించుకోవటానికి వేరే మార్గము లేక శివుని దగ్గరకే చేరుతాడు ఆగ్రహము తో ఉన్న శివుడు ఉశనసుడిని మింగేస్తాడు కడుపులో ఉన్న ఉశనుసుడు బయటకు రావాలని ప్రయత్నిస్తుంటే శివుడు ఒక్క మూత్ర ద్వారము తప్ప అని నవరంధ్రాలు మూసివేస్తాడు. అప్పుడు ఉశనుసుడు గత్యంతరం లేక మూత్ర ద్వారము గుండా బయటికి వస్తాడు అప్పటికి కోపము తగ్గని శివుడు చంపాలని చుస్తే మాత పార్వతి దేవి జాలితో వదిలి వేయమని కోరుతుంది ఆవిడ కోరిక మేరకు శివుడు ఉశనుసుడిని వదిలి, “వీడు సక్రమ మార్గములో బయటికి రాలేదు కాబట్టి శక్తివంతుడైనప్పటికీ శుక్రాచార్యుడు అనే పేరుతొ రాక్షసులకు గురువుగాఉంటావని చెప్పి పంపిస్తాడు కుబేరుని ధనాన్ని తిరిగి కుబేరునికి ఇప్పిస్తాడు. ఆ విధముగా పరమ శివుని వరము గా మృత సంజవీని విద్యను పొందిన ఉశనుసుడు శివుని ఆగ్రహముతో శుక్రాచార్యునిగా రాక్షసుల గురువు అవుతాడు అదే సమయములో బృహస్పతి దేవతల గురువు అవుతాడు అప్పటి నుండి శుక్రాచార్యునికి బృహస్పతి మీద ఈర్ష్య అసూయలు పెరిగిపోతూ ఉంటాయి.
శుక్రాచార్యుడిని గురువుగా పెట్టుకొని దానవ రాజు హిరణ్యకశిపుడు ఏకాచత్రాధిపత్యముగా 72, 61, 60, 000సంవత్సరాలు ముల్లోకాలను పాలించాడు. కొంతకాలము తరువాత రాక్షకులకు వరుస అపజయాలు ఎదురవుతుంటే శుక్రాచార్యుడు తపస్సు చేసి శివుని మెప్పించి కొత్త అస్త్రాలను సాధించి వస్తానని తపస్సు చేయడానికి వెళతాడు. శివుడు ప్రత్యక్షమై దేవతలను గెలవాలంటే నీవు తలక్రిందులుగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయాలనీ అంటాడు. అందుకని శుక్రాచార్యుడు మళ్ళీ తపస్సు ప్రారంభిస్తాడు. శుక్రాచార్యుడు లేడని తెలిసి దేవతలు రాక్షసులపై దాడి చేసి చంపుతుంటారు అప్పుడు రాక్షసులు శుక్రాచార్యుని తల్లి ఉశన శరణు కోరుతారు. కానీ నిద్రాదేవి ప్రభావము వలన ఆవిడ ఏమి చేయలేక పోతుంది విష్ణువు ఇంద్రుని లో ప్రవేశించి రాక్షసులపై యుద్ధము చేస్తుంటాడు అప్పుడు ఉశన విష్ణువును శపించాలని ప్రయత్నించగా విష్ణువు ఆవిడను సంహరిస్తాడు ఆది చూసి భృగు మహర్షి తన భార్యను చంపిన విష్ణువును భూమిమీద ఏడుసార్లు పుట్టమని శపిస్తాడు ఆ శాపము ప్రభావమే రాక్షస సంహారము కోసము విషుమూర్తి అవతారాలు. ఇదంతా శ్రీ మహావిష్ణవు లీల.
శుక్రాచార్యుడు శక్తి వంతుడై వస్తే దేవతలకు కష్టాలు ప్రారంభమవుతాయని ఇంద్రుడు తన కూతురు జయంతిని అయన సేవలకు వినియోగిస్తాడు శుక్రాచార్యుడు తపస్సుకు శివుడు ప్రత్యక్షమై శక్తివంతమైన అస్త్రశస్త్రాలను వరంగా ఇస్తాడు వరాలు పొందిన శుక్రాచార్యుడు జయంతిని తనను వివాహ మాడ వలసినది అడిగితె పదివేల సంవత్సరాలు తనతో ఉంటె పెళ్లి చేసుకుంటాను అని ఆవిడ చెప్పగా అలాగే పదివేల సంవత్సరాలు దేవతల మాయను తెలుసుకోక అక్కడే ఉండిపోయాడు. ఆ సమయములోనే బృహస్పతి శుక్రాచార్యుని రూపములో రాక్షసులు దగ్గరకు చేరి వాళ్ళను ధర్మ భ్రష్టులుగా, దురాచార వంతులుగా చేశాడు. తమ తప్పు తెలుసుకున్న రాక్షసులను ప్రహ్లాదుని దౌత్యముతో శుక్రాచార్యుడిని క్షమించమని అడుగుతారు ఆ తరువాత శుక్రాచార్యుడు ప్రియవ్రతుని కుమార్తె ఊర్జస్వాతిని వివాహమాడుతాడు వారికి నలుగురు కుమారులు ఒక కుమార్తె కలుగుతారు. కుమారులలో చండ , అమార్కుడు ఇద్దరు ప్రహ్లాదునికి గురువులు మిగిలిన వారు త్వాష్ట్ర మరియు ధరాత్రులు. కూతురు దేవయాని, ఈవిడ అంటే శుక్రాచార్యునికి విపరీతమైన ప్రేమ ఆ ప్రేమ వల్లే బృహస్పతి కొడుకైన కచునికి రాక్షసుల అభీష్టానికి వ్యతిరేకముగా మృత సంజీవని విద్యను నేర్పుతాడు రాక్షసులు కచుడిని చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను సారాలో కలిపి శుక్రాచార్యుని చేత త్రాగిస్తారు తన తప్పు తెలుసుకున్నా శుక్రాచార్యుడు కూతురి మీద ప్రేమతో తన కడుపులో ఉన్న కచునికి మృతసంజీవనీ విద్యను నేర్పి కడుపు చీల్చుకుని వచ్చిన కచుడు శుక్రాచార్యుని బ్రతికిస్తాడు దేవయాని కచుడ్ని వివాహము చేసుకోమని అడిగితె కచుడు, ” నీవు గురువుగారి కూతురివి నాకు సోదరి సమాను రాలివి నేను చేసుకోను” అని చెపితే దేవయాని శపించటము కచుడు ప్రతిగా శపించటము జరిగి కచుడు నేర్చుకున్న విద్యతో దేవలోకానికి వెళతాడు.
వృషపర్వుడు అనే రాక్షస రాజుకి గురువుగా శుక్రాచార్యుడు ఉంటాడు అయన కూతురు శర్మిష్ట. దేవయానిని రక్షించిన యయాతి మహారాజు దేవయానిని వివాహమాడవలసి వస్తుంది. శుక్రాచార్యుని ఆగ్రహానికి గురికాకుండా ఉండటానికి రాజు తన కూతురు శర్మిష్టను దేవయాని వెంబడి దాసిగా పంపిస్తాడు. అక్కడ యయాతి రహస్యముగా శర్మిష్ఠతో కాపురము చేయటము వల్ల శర్మిష్ట కు ద్రుహ్వి, అనువు, పూరురవుడు అనేకొడుకులు పుడతారు. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న దేవయాని యయాతిని నిలదీస్తుంది. నియమభంగం చేశాడని తన తండ్రికి ఫిర్యాదు చేస్తుంది . శుక్రాచార్యుడు ఆగ్రహించి నీకు వార్ధక్యం వచ్చుగాక అని శాపంయిస్తాడు. శుక్రాచార్యుని ప్రాధేయపడితే, ” నీ వార్ధక్యం నీ కుమారులలో ఎవరైనా స్వీకరిస్తే నీవు యవ్వనవంతుడివి అవుతావు” అంటే పురూరవుడు వార్దక్యన్ని తీసుకొంటానికి అంగీకరిస్తాడు. యయాతి యౌవనాన్ని పొందుతాడు. యయాతి తనివితీరా సుఖభోగాలు అనుభవించిన తర్వాత యౌవనాన్ని పూరురవుడికి యిచ్చి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతూ, తాను అడిగిన వెంటనే తనకు యౌవనాన్ని యిచ్చిన పూరురవుడే తన తర్వాత రాజు అయ్యే అధికారం ఉంటుందని ప్రకటించి అతనికి రాజ్యాభిషేకం చేసి వెళ్ళిపోతాడు. ఆ విధముగా దేవయానికి యయాతి వల్ల యదు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టినప్పటికీ ఎంత కష్ట పడినా చివరికి శర్మిష్ఠ కొడుకే రాజవుతాడు దేవయాని కల నెరవేరదు.
బలిచక్రవర్తి చేత యజ్ఞాలు యాగాలు చేస్తున్న సమయములో శ్రీ మహావిష్ణువు వామనావతారంలో దానము స్వీకరించటానికి వచ్చి మూడు అడుగుల చోటు దానము ఇమ్మంటాడు వచ్చిన వాడు విష్ణువు అని తెలుసుకున్నశుక్రాచార్యుడు బలిని దానము ఇవ్వదని వారిస్తాడు కానీ ఇచ్చిన మాటకోసము గురువు మాటను లెక్క చేయకుండా దానము ఇచ్చి విష్ణువు చేత పాతాళానికి తొక్కివేయబడతాడు శుక్రాచార్యుడు కూడా తన శిష్యుని ధర్మ నిరతికీ దాన గుణానికి సంతోషిస్తాడు, ఆవిధముగా బలి చక్రవర్తి శుక్రాచార్యుని ఆధ్వర్యములో 20, 30, 64, 000వేల సంవత్సరాలు పాలిస్తాడు.
శుక్రాచార్యుడు “ఔశన సంహిత” అనే గ్రంధాన్ని వ్రాస్తాడు ఆ గ్రంధములో వివాహల గురించి, కులాంతర వివాహాల గురించి వివరిస్తాడు ఎందుకంటే అయన కూతురు కచుని శాపము వలన క్షత్రియుడిని వివాహమాడింది. మునులు శుక్రాచార్యుని ధర్మ శాస్త్రాల గురించి వివరించమని అడిగితె వారికి ఇచ్చిన వివరణ తొమ్మిది అధ్యాయలుగా “ఔశన స్మృతి ” అనే గ్రంధముగా రూపొందింది. ఆ గ్రంధములో బ్రహ్మచారి విధులు, గాయత్రీ మంత్రము, శ్రాద్ధ విషయాలు, గృహస్తు చేయవలసిన ప్రేతకర్మ, అసౌచాము, ప్రయాసచిత్తము, మొదలైన అంశాలకు వివరణ ఉంటుంది. ఇంత ప్రతిభా వంతుడు, జ్ఞానీ అయినా రాక్షసులు పక్షాన ఉండి నిరంతరము దానవులకు సహకరిస్తూ ఉండటం వలన ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. అలాగే కూతురి మీద ఉన్న ప్రేమకూడా అయన చేత తప్పులు చేయించింది ఏది ఏమైనప్పటికి శుక్రాచార్యుడు కూడా గొప్ప మహర్షులలో ఒకడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *