April 27, 2024

మమతల బంధం – మన జీవనవేదం

రచన: రాజ్యలక్ష్మి. బి

“నాకు రెండువేలు కావాలి”
“ఎందుకు?”చదువుకుంటున్న సుబ్రహ్మణ్యం తలెత్తకుండానే ప్రశ్నించాడు.
“ఆడవాళ్లకు కూడా అవసరాలు వుంటాయి. అని తెలుసుకోండి, ప్రతీదీ ఆరా తియ్యడం యేమిటి ?” విసుగ్గా కిటికీ దగ్గర నించుంది పద్మ.
చదవడం ఆపేసి సాలోచనగా పద్మను చూస్తూ “ఎందుకు అన్నాను కానీ అవసరం లేదని అనలేదుగా, చెప్పకూడని రహస్యమా ” అన్నాడు నవ్వుతూ సుబ్రహ్మణ్యం.
అసలే కోపంగా వున్న పద్మ వదనం మరింత యెర్రబడింది.
“వెక్కిరింపు అనవసరం. నాకు మీ దగ్గర రహస్యమేమిటి? నా ఫ్రెండ్ పుట్టినరోజు ! అందుకు ” అన్నది రోషంగా !! “అయితే అంతఖర్చుపెట్టి బహుమతి కొనాలా !!” అంతే విసురుగా అన్నాడు.
“యీరోజుల్లో అంతమాత్రం లేనిది ఏం కొనగలం? అన్నది పద్మ.
‘పద్మా నేను సామాన్య వుద్యోగిని, అర్ధం చేసుకో!రెండువేలు ఒకనెలలో ఖర్చు మన యితర ఖర్చులు నువ్వే ఆలోచించు.” అన్నాడు నెమ్మదిగా.
” నేను డబ్బు అడిగినప్పుడల్లా ఆదాయవ్యయాలు చెప్పడం లో మీ వుద్దేశ్యం యేమిటి ? యీ సమస్యలు మనకు యెప్పుడూ వుండేవే, భవానీ పుట్టినరోజు, నేను దానికి బహుమతి యివ్వాలి, అంతే ” గట్టిగా అన్నది.
సుబ్రహ్మణ్యం కూడా నిక్కచ్చిగా “చూడు పద్మా, మన పరిస్థితులకనుగుణంగా నడుచుకోవాలి, వూహల్లో విహరించకు “అన్నాడు.
“రెండువేలు అడిగితే వూహల్లో విహరించడమా!అంతమాత్రం కూడా అడిగే హక్కులేదా !!”పద్మకు యింకా కోపం తారాస్థాయికి చేరింది.
సుబ్రహ్మణ్యం యిదేదో సీరియస్ వ్యవహారమే అనుకున్నాడు. ఓర్పునశించింది.
“యివ్వననడం లేదు, పద్మా, చిన్నవుద్యోగం iనాది. ఇరవైవేల జీతగాడిని, ని ఆర్ధిక అవసరాలను తీర్చలేను. నాలుగునెలలకిందట మీ చెల్లెలి పెళ్లికి యెక్కువే ఖర్చు అయ్యింది. అందుకేమైనా
అన్నానా !`పెళ్ళిముఖ్యం !నేనూ మనిషినే, అన్నీచూసుకోవాలిగా, కావాలంటే అయిదువందల లో యేదైనా కోనివ్వు ! “అన్నాడు.
“నా స్నేహితురాలికి యేమివ్వాలో నాకు తెలుసు. మీరేం చెప్ప్పక్కర్లేదు “అంటూ విసుక్కుంటుంటే
కొడుకు మూడేళ్ల రఘు రావడం తో మాట ఆపేసింది.
“అమ్మా1యెత్తుకో “అంటూ పద్మదగ్గరకు వచ్చాడు.
“పోరా పో పోయి ఆడుకో లేకపోతే బామ్మను అడుగు “విసుక్కుంది పద్మ.
బిక్కముఖం నించున్న రఘును యెత్తుకున్నాడు సుబ్రహ్మణ్యం.
‘మన విసుగు, చికాకు పిల్లల మీద చూపించకూడదు. మన సమస్యలు పిల్లలకు తెలియకూడదు.
నా శక్తి చెప్పాను. ఆ పైన నీ యిష్టం. అంటూ పిల్లాణ్ణి యెత్తుకుని బయటికి వెళ్లాడు.

———–

మర్నాడు సాయంత్రం ముస్తాబవుతున్న పద్మ దగ్గరకొచ్చ్చాడు.
“”మొత్తానికి పుట్టినరోజుకి వెళ్లడానికి నిర్ణయించుకున్నావన్నమాట ! “అడిగాడు.
“మీ డబ్బేమీ యివ్వక్కర్లేదులేండి, బాధపడకండీ “అన్నది పద్మ.
“ఓహో!మీ మా చాలాదూరం పోయావు, అయితే డబ్బెక్కడిదో తెలుసుకోవచ్చా “అడిగాడు సుబ్రహ్మణ్యం.
“ఉంగరం అమ్మేసాను “ముక్తసరిగా అన్నది పద్మ.
ఉలిక్కిపడ్డాడు, షాక్ కొట్టినట్టు ఫీలయ్యాడు.
“ఏ వుంగరం” అడిగాడు.
“నాకున్నదొక్కటే వుంగరం” అన్నది
పద్మా మతి పోయిందా నీకు ? అది నీ వేలుకు నేను తొడిగిన వుంగరం. అమ్మడానికి మనసెలా వచ్చింది !చదువుకున్నదానివి, నీకసలు బుధుందా !”తీవ్రం గా అన్నాడు. మాటల్లో చెప్పలేని బాధ !!
వినిపించుకోలేదు పద్మ,
“ఇన్ని విలువలు తెలిసిన మీరు నా కోర్కె విలువ తెలుసుకోలేకపోయారా!”అంటూ విసురుగా వెళ్లిపోయింది పద్మ
iరాత్రి తీరిగ్గా వాలుకుర్చీలో పడుకుని చదువుకుంటున్నాడు. అతనిదగ్గరకు వచ్చి కూర్చుంది పద్మ !
కొంత నిశ్శబ్దం
పద్మ మెల్లిగా” నేను వుద్యోగం చేస్తే మీకు అభ్యంతరమా ” నెమ్మదిగా అడిగింది.
సుభ్రమణ్యం మౌనంగా వుండిపోయారు. ఊహించని పద్మ ప్రశ్నకు కొద్దిగా కదిలిపోయాడు. అయినా మెల్లిగా మంద స్వరంతో “అయితే నీకు అభ్యంతరం లేదన్నట్టేగా అన్నాడు “లేదు కనుకనే మిమ్మల్ని అడుగుతున్నాను ” పద్మ స్వరంలో పట్టుదల ధ్వనించింది.
“ఇన్నాళ్లూ లేని ఆలోచన యిప్పుడెందుకు వచ్చింది?”అడిగాడు.
“ఎందుకంటే నా అవసరాలకు ఒకళ్లపై ఆధారపడకూడదని “అన్నది రోషంగా.
పద్మ మాట్లాడే పద్ధతికి బాధపడ్డాడు.
“ఒకళ్లు అంటే నేను పరాయివాడినా నీకు “పద్మ కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు.
పద్మ జవాబు లేదు.
“నా సంగతి సరే మన రఘుని ఏం చేద్దామనుకున్నావు ? ‘సుభ్రమణ్యం ప్రశ్నించాడు.
“ఒకళ్ల యేడుపుకోసం మరొకళ్ల అయిష్టత కోసం చిన్నచిన్న కోరికలను సరదాలనూ చంపుకుని జీవచ్ఛవం లా బతకలేను. రఘును అత్తయ్యగారు చూసుకుంటారు, లేకపోతే పనిపిల్లను యేర్పాటు చేస్తాను. “కఠినం గా సమాధానం వచ్చింది పద్మ దగ్గర్నించి.
“వూ ” బరువుగా నిట్టూర్చాడు సుబ్రహమణ్యం.
“రఘు విషయంలో తల్లిగా నీ భాద్యత అంతేనన్నమాట !నువ్వు విసిరేసే డబ్బుకు పనిపిల్ల వస్తుంది కానీ నీ మమతా లాలన లభిస్తాయా !ఒకసారి ఆలోచించు “అన్నాడు.
“భర్తా బిడ్డలే స్వర్గం అనుకోవడానికి యిది పూర్వకాలం కాదు. నేను వుద్యోగం చేస్తానంటేనే మీరింత బాధ పడుతున్నారు, కనీసావసరాలకు కూడా డబ్బడిగి లేదనిపించుకోవడం నాకెంత బాధో ఆలోచించలేకపోయారా ” అన్నది బాధగా పద్మ.
“వృధాగా తర్కించకు పద్మా, నువ్వు వుద్యోగం చెయ్యడం నాకు యెంత మాత్రం యిష్టం లేదk ఆర్ధికం గా బాధలు వుంటే వుద్యోగం చేసినా అర్ధం వుంది. చెయ్యాలి కూడా ! కానీ అలోచించి చూడు, మనకేలోటూ లేకుండా గడిచిపోతున్నది, ఇంకా సంసారం పెద్దదై పిల్లలు యెదిగి వచ్చేసరికి చదువులకీ పెళ్లిళ్లకు నేను యెలాగూ ఇన్సూరెన్సులు కడ్తున్నాను. నేనున్నా లేకపోయినా నీకేలోటూ రానివ్వను. యిక నీకు వుద్యోగం దేనికి ? అనవసర విలాసాలకు, అంతేనా ” అన్నాడు.
“ఎంత తేలిగ్గా తీసిపారేసారు!కేవలం తిండీ, నిద్రేనా, మరి యే వ్యాపకం లేదా, నలుగురిలో బతుకుతున్నప్పుడు యితర ఖర్చులు వుండవా !! మీ స్నేహితులూ, మీ విలాసాలూ ఖర్చు పెట్టుకోవడం లేదా !!”ప్రశ్నించింది.
“ఎందుకు పదేపదే మీ మా అంటూ గోరంతలు కొండంతలు చేస్తున్నావు!! సాగినంతమేరకు యిద్దరం
ఖర్చు పెడుతున్నాంగా !! నువ్వూ నీ ఖర్చులూ అంటూ నిన్ను నేను తేడాగా చూస్తున్నానా !
పరిస్థితులకనుగుణం గా సద్దుకుందామంటున్నాను. నేను యెన్ని అవసరాలు మానుకుంటున్నానో నీకేంతెలుసు ?కానీ పైకి చెప్పి అందర్నీ బాధ పెట్టను. దేవుడి దయ వల్ల మనం హాయిగా వున్నాం. ఏ దిగులూ పెట్టుకోకు, నా శక్తి మేరకు నీకు ఏలోటూ రానివ్వను “అన్నాడు సుబ్రహమణ్యం.
“నాకూ తెలుసు యివన్నీ, డబ్బు అవసరమైతే చేతిలో విద్య వున్నప్పుడు యెందుకు చేతులు ముడుచుకు కూర్చోవాలి?” అన్నది పద్మ.
ఇక లాభం లేదనుకున్నాడు. “చూడు పద్మా ఎంత ప్రగతి సాధించినా సంఘంలో పదిమందిలో తిరిగే స్త్రీని గౌరవ మర్యాదలతో చూడగలిగే సంస్కారం యింకా చాలామందిలో లేదు. యిదొక సంధియుగం !అటు ‘పాత ‘ వదలలేరు ‘ కొత్త ‘ పూర్తిగా జీర్ణించుకోలేరు. పాతకొత్త మేళవింపుతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అయినా మనం ఆపలేం. అతివిలువైన కుటుంబవ్యవస్థ దెబ్బతింటున్నది. స్త్రీ పురుషులు యిద్దరూ చదువుకుంటున్నారు. పిల్లలను ‘డే కేర్ ‘ లో వేస్తున్నారు. వృద్ధులకు ఆశ్రమాలున్నాయి. యాంత్రిక జీవనం, యాంత్రిక మనుషులు. తల్లీ బిడ్డలమధ్య భార్యాభర్తలమధ్య మాధుర్యం, కమనీయబంధాలు ఆప్యాయతలు ప్రేమఁ మాసిపోతున్నాయి కుటుంబంలో నిండుదనం పోతున్నది వింటున్నావా !”ఆవేదన కంఠంతో పద్మను చూసాడు.
పద్మ మౌనంగా వింటున్నది.
“పద్మా మారుతున్న ప్రపంచంలో మార్పులు తప్పవు. ఒకనాటికి మన యితిహాసాలే మనకు గుర్తుండవు. నిస్సహాయులం. కానీ ప్రశాంతంగా వున్న మన సంసార సుఖశాంతులను చెదరగొట్టుకుందామా ! బాగా ఆలోచించు ” అన్నాడు సుబ్రహమణ్యం.
వినీవినీ పద్మ నిర్ల్యక్ష్యంగా బదులిచ్చింది పద్మ.
“చీమను కూడా భూతద్దంలో చూపించి భయపెడ్తున్నారు. నేను కట్టుబడివున్నంతమాత్రాన వచ్చే మార్పు ఆగుతుందా ! ఏమైనా సరే నేను వుద్యోగం చెయ్యడానికే నిర్ణయించుకున్నాను. ” చకచకా చెప్పేసి వెళ్లిపడుకుంది పద్మ.
తనలో తాను అనుకున్నాడు ‘ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవాళ్లకు చెప్పగలం కానీ వితండంగా వాదించేవాళ్లకు ఏం చెప్పగలం !కానీయ్ కొన్నివిషయాలు అనుభవాలే కాలమే నిర్ణయిస్తాయి ”

————-

ఆదివారం మధ్యాహ్నం లెక్చరర్ పని చేస్తున్న వాణి ఇంటికి వెళ్లింది పద్మ.
“అది స్పెషల్ క్లాసులున్నాయని వెళ్లిందమ్మ, “వాణి అమ్మగారు నెమ్మదిగా మూల్గుతూ చెప్పింది. “నాకా వయసు వచ్చింది. చూపు కనిపించదు, ఓపికా లేదు. ఇటు నాకు అటు పిల్లలకు చాకిరీ చేస్తూ నానా యాతనా పడుతూ డబ్బు సంపాదిస్తున్నది. ఇంట్లో పిల్లలిద్దరికీ జ్వరాలు. అదొచ్చేవరకూ కాస్త కాఫీ యిచ్చే దిక్కులేకుండా పడున్నాం. ” కళ్లొత్తుకుంటూ చెప్పింది ఆవిడ
సానుభూతితో యిల్లంతా కలియచూసింది పద్మ.
ఇద్దరు పిల్లలూ మంచాల. పిల్లల్ని మీద పడున్నారు పెద్దపిల్ల ఆరేళ్ళు, పిల్లాడు మూడేళ్లు. ఇల్లంతా చిందరగా చీదరగా వున్నది. పిల్లాడు ‘అమ్మా అమ్మా ‘ అని ముల్గుతున్నాడు, పిల్ల “తలనొప్పీ ” అని యేడుస్తున్నది. పద్మకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి. వాణి భర్త గుండెపోటుతో పోయాడు. వాణి చదువు కుటుంబాన్ని నిలిపింది. పద్మ వాణికోసం యెదురు చూస్తూ కూర్చుంది.
సుమారు నాల్గింటికి వచ్చింది వాణి. వస్తూనే పద్మని చూసి నవ్వేసి పిల్లలదగ్గరికెళ్లి పల్కరించి వాళ్లకు ముఖం తుడిచి బట్టలు మార్చి వేడివేడిగా పాలిచ్చిందీ. తల్లికి కాఫీ యిచ్చింది. అప్పుడు తను ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని పద్మకూ, తనకూ కాఫీ కలుపుకుని వచ్చి పద్మ పక్కన చేరింది.
“పద్మా చూస్తున్నావుగా నా తిప్పలు, ఆయన వున్నన్నాళ్లు యెంత హాయిగా గడిచిందో యిప్పుడు అన్ని పాట్లు పడుతున్నాను పిల్లల్ని చూసుకోవాలి, చాకిరీ చేసుకోవాలి, కాలేజీకి వెళ్లి అరిచీ అరిచీ పాఠాలు చెప్పాలి. మేనేజ్మెంట్ కి తలొంచాలి !స్టూడెంట్స్ గట్టిగా మందలించకూడదు. యీ ఉద్యోగాలన్నీ ఒకవిధంగా బానిస బతుకులే, పిల్లలు జ్వరముతో పడున్నారు, అయినా వెళ్లక తప్పలేదు. నా ఖర్మ !పిల్లలు ఎదగాలి, నా బాధలు తీరాలి. నాకు విముక్తి యెప్పుడో “కన్నీళ్లొత్తుకుంది వాణి.
పద్మకు వానిని చూస్తే జాలేసింది. తను వాణిని యేదైనా వుద్యోగం వుందేమో కనుక్కోవడానికి !కానీ వాణిని చూసిన తర్వాత పద్మకు మతిపోయింది. కోరిక మనసులోనే సమాధి అయ్యింది. వాణితో కాసేపు కబుర్లు చెప్పి యింటికి వచ్చేసింది బయల్దేరుదాం “పద్మ పద్మ.
“వాణి వుద్యోగం యిప్పిస్తానందా “అడిగాడు సుబ్రహమణ్యం.
“నేనందుకు వెళ్లలేదు “ముక్తసరిగా చెప్పింది పద్మ.
——————
“సంక్రాంతికి రమ్మనమని మామయ్యగారు వుత్తరం వ్రాసారు” అంటూ వుత్తరం పద్మకు ఇచ్చాడు ఒకరోజు సుబ్రహమణ్యం.
ఆతృతగా చదివింది పద్మ.
“పెద్దచెల్లెలు కూడా వస్తున్నది, మనమెప్పుడు బయల్దేరుదాం ” వుత్సాహంగా అడిగింది పద్మ.
ఈసారి అత్తగారి దగ్గరనిండి సమాధానం వచ్చింది.
“ఈ మధ్యనేగా మీ పుట్టింటికి వెళ్లొచ్చావు!పండగ మనకూ వుంది, పిల్లాడికి యిక్కడే భోగిపళ్లు పోసుకుందాం ” అన్నది అత్తగారు.
సుబ్రహమణ్యం మెల్లిగా అక్కడినించి తప్పుకుని తన గదిలోకి వెళ్లాడు.
పద్మకు చర్రుమంది !
“ప్రతిదానికీ అందరి సలహాలు అవసరమా ? పుట్టింటికి వెళ్లడానికి కూడా నీతిబోధనాలేనా !1″ విసుగ్గా అత్తగారికి బదులిచ్చింది పద్మ
అత్తగారు కూడా వూరుకోలేదు, “ఒక్క సంక్రాతి పండగే యెందుకు, అన్ని పండగలూ అక్కడేవుండి జరుపుకో ” విసురుగా కోడల్ని చూస్తూ అనుకుంటూ లోపలికెళ్లింది.
పద్మ ముఖం యెఱ్ఱబడింది. అభిమానం, రోషం తన్నుకుంటూ వచ్చాయి. సుడిగాలిలాగా భర్త దగ్గరకు వెళ్లింది.
తల దువ్వ్వుకుంటున్న సుబ్రహమణ్యం అద్దంలో భార్య ప్రతిబింబం చూసికూడా చూడనట్టే వూరుకున్నాడు.
“ఇంకొక్క నిమిషం కూడా యిక్కడ వుండను” అంటూ గావుకేక పెట్టింది పద్మ.
గమనించనట్టే వూరుకున్నాడు.
“మీకే చెప్పేది, వినబడలేదా !!”ఉక్రోషంగా అడిగింది.
“ఏమిటీ ” అన్నాడు తాపీగా తలతిప్పకుండానే.
“ఏమిటండీ ఆవిడ వుద్దేశ్యం ? పండక్కు పుట్టింటికి వెళ్తానంటే శాశ్వతంగా అక్కడే వుండమనే మనిషిని యింతవరకూ చూడలేదు. నాకే!! మహారాణిలాగా వుంటానక్కడ !! నన్ను భరించలేనంత బీదవాళ్లు కాదు మావాళ్లు.”యించుమించు కన్నీళ్లొస్తున్నాయి పద్మకు.
“తప్పు తప్పు. మీవాళ్లు నిన్ను పువ్వుల్లో పెట్టిచూసుకుంటారు., తర్వాత వాదించుకుందాం కానీ పద భోజనం చేద్దాం, ఆకలి యెక్కువైతే తెలివి తక్కువవుతుందిట !”భార్య చెయ్యి పట్టుకున్నాడు నవ్వుతూ.
“నేను రాను” చెయ్యి విదిలించుకుని కన్నీళ్లతో సూట్కేసులో బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది.
” కోపంలో యెంత అందంగా వున్నావు పద్మా ! నీకు సత్యభామ అని పేరు పెట్టాల్సింది ” నవ్వుతూ పరిష్టితి తేలిక చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పద్మ ఏమీ పట్టించుకోవడం లేదు. విషయం సీరియస్ అయ్యిందని గ్రహించాడు
దగ్గర కూర్చుని బ్రతిమాలుతున్న ధోరణిలో “చూడు పద్మా యేమిటి తొందరపాటు, నీకు అమ్మతో వాదన యెందుకు ! వెళ్లాలనుకుంటే నేను పంపనా ? అమ్మ వయసులో పెద్దది అందరం యిక్కడ పండగ జరుపుకోవాలనుకున్నది. . ” అన్నాడు
“నాకు మీ దయా వద్దు, ధర్మమూ వద్దు. ఇక నా వల్ల కాదు. నా దారి నన్ను చూసోకినవ్వండి ” స్థిరంగా అన్నది పద్మ.
“సరే నీ యిష్టం, యిప్పుడు ఏం చెప్పినా వినేటట్లు లేవు “అంటూ బయటకు వెళ్లాడు
మధ్యాహ్నం పన్నెండు అవుతుండగా యింటిముండు ఆటో ఆగింది. అప్పుడే సుబ్రహమణ్యం కూడా లోపలికి వచ్చాడు. పద్మ ఆటో యెక్కబోతున్నది, భర్తను చూసి ఆగింది అత్తగారు గుమ్మం దగ్గరనించున్నారు.
“అదేమిట్రా నిల్చున్నపళాన ప్రయాణమయ్యింది. కోపగించిందా ?” కొడుకుని ప్రశ్నించింది.
“అబ్బే లేదమ్మా నేనే పంపిస్తున్నాను, పదిరోజుల్లో వస్తుంది ” సర్ది చెప్పాడు.
ఆ మాట విన్న పద్మ మనసు చివుక్కుమన్నది. ఇంత ఉత్తముడి మాట కాదని వెళ్తున్నాను అనుకున్నది. “అంతా సద్దేసుకున్నావా “అన్న భర్త మాట వినగానే పద్మ మనసు మళ్లీ బిగుసుకుంది. మనవడిని అందిస్తూ “బిడ్డ జాగ్రత్తమ్మా ” అన్నది అత్తగారు. సుబ్రహమణ్యం కూడా ఆటో ఎక్కాడు. అత్తగారితో ఒక్కమాటా చెప్పలేదు

“భయపడకండీ మీవేమీ తీసుకెళ్లడం లేదు” అంటూ తాళంచెవి యిచ్చి దూరంగా నించుంది. ఐదునిమిషాల తర్వాత పెట్టేమూసి తాళంచెవి తిరిగి యిచ్చేసాడు. బస్సు కదిలిందీ. చేతిలో డబ్బు పెట్టబోయాడు కానీ పద్మ తీసుకోలేదు.
సుబ్రహమణ్యం సీరియస్ గా “అయితే అసలింక నేను అక్కరలేదా ? పూర్తిగా నన్నnవద్దనుకున్నావా ?” అడిగాడు. పద్మ మాట్లాడలేదు
ఇక విసుగనిపించింది అతనికి. “పద్మా పండక్కి వెళ్తున్నావు, అంతే, ఎన్నాళ్ల్లు వుండాలనిపిస్తే అన్నాళ్లు వుండు. కోపం, పట్టుదలా పెట్టుకోకు. రావాలనిపించగానే వెంటనే వచ్చెయ్యి “అంటూ పిల్లాడి చొక్కాజేబులో డబ్బులుపెట్టి బస్ దిగి వెళ్ళిపోయాడు.

———————
“అల్లుడుగారు రాలేదమ్మా?”
“బావగారేరి చెల్లాయి”
“ఒక్కదానివే వచ్చావా పద్మా “.
అందరూ వచ్చిన తనను సంతోషించకుండా రాని ఆయన్ను అడిగేవాళ్ళే అని విసుక్కుంది పద్మసాయంత్రం పిల్లాడూకూడా నాన్న కావాలీ అంటూ యేడుస్తుంటే మరింత రోషం వచ్చింది పద్మకు. యెందుకో మనసంతా వికలం అయ్యింది. కాసేపు అలాగే పడుకుంది.
వదిన కావేరీ కాఫీ యిచ్చింది.
పద్మ “వదినా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళవా పండక్కి “అడిగింది.
“లేదు పద్మ, యిక్కడే అత్తయ్య, మామయ్య అందరు వున్నారుగా, అందుకే వెళ్లదలచుకోలేదు !”అన్నది కావేరి.
పద్మకు యేదో తెలియని ముల్లుగుచ్చుకున్నట్టు ఫీల్ అయ్యింది. రఘు వెళ్లి అమ్మమ్మ దగ్గర పడుకున్నాడు.
మర్నాడు వుదయం చెల్లెలు గీత, కృష్ణ వచ్చారు. గీత చాల అందంగా తయారయ్యింది. ఖరీదైన చీర, అందమైన హ్యాండ్బ్యాగ్, అధునాతనంగా తయారయ్యింది. పద్మకు కొద్దిగా అసూయ కలిగింది. ‘ దానికేం తక్కువ ఢిల్లీలో కాపురం, ఆఫీసర్ గారి భార్య, అత్తా దగ్గర లేదు, యిష్టారాజ్యం ‘ అనుకుంది మనసులో పద్మ.
“నన్ను గుమస్తాతో పెళ్లి చేసారు నాన్న” కొంచెం కోపం కూడా వచ్చింది పద్మకు.

—————–

తెల్లవారితే పండగ ! ఆ రాత్రి భోజనాల తర్వాత గౌరీపతిగారు ” సుబ్రహమణ్యం కూడా వస్తే బాగుండేది. ఇల్లు కళకళలాడుతూ వుండేది ” అన్నారు.
“అవునవును మీకు కావాల్సింది కళకళ, మాకు కావాల్సింది గలగల ” అన్నాడు అల్లుడు కృష్ణ.
“అతను అలాంటివాడు కాదు, యీకాలంలో అటువంటి వాళ్లు అరుదు “గౌరీపతిగారు యేదో అంటూనే వున్నారు, “ఓహో “అంటూ చెయ్యి కడుక్కుని సరసరా వెళ్లిపోయాడు కృష్ణ.
“అతనసలె ముక్కోపి, మీ ధోరణి మీది “భర్తను విసుక్కుంది జానకమ్మ.
“అలాగా నాకు తెలియదే ! అతనెప్పుడూ యింతేనా ?? ఏమ్మా గీతా ” కంగారుగా గీత వైపు చూసారు.
గీత జీవం లేని నవ్వు నవ్వింది.
ఇదంతా చూస్తున్న పద్మకు అంతా అయోమయంగా అనిపించింది. గీత విషయం అర్ధం కాలేదు.
రాత్రి తన గదిలో పడుకోవడానికి . వెళ్తున్న పద్మకు అప్రయత్నంగా గీత, కృష్ణ ల సంభాషణ వినిపించింది. “పండగవగానే రాత్రి వెళ్లిపోదాం. ” అంటున్నాడు కృష్ణ !
గీత మాటలు వినిపించలేదు.
“ఏయ్ మొద్దూ వినిపించడం లేదా?” మొరటుగా అరిచాడు కృష్ణ.
గీత మాటలు వినిపించలేదు.
“నిన్నే మట్టిబుర్రా “అంటూ మొరటుగా అరిచాడు మళ్లీ !
“ఏమండీ యింకో నాల్గురోజులుందామండీ, అసలు పండగ అంతా రేపు యెల్లుండే కదండీ !”భయం భయం గా
వేడుకున్నట్టుగా వుంది గీత గొంతు.
“ఏమిటే వాగుతున్నావు ? అవతల మన చుట్టమేమీ లేడు నాకు !”అని విసుక్కుంటున్నాడు.
“పోనీ మీరు వెళ్లండి ప్లీజ్ ” దినంగా అడుగుతున్నది గీత
“బుద్ధి తక్కువదానా నేను లెకపోతే విచ్చలవిడిగా తిరుగుదామనుకున్నావా!నోరుమూసుకుని పద, రేపు రాత్రికి వెళ్లిపోదాం !” చాలా అసహ్యంగా వుంది కృష్ణ గొంతు.
ఇక వినాలనిపించలేదు పద్మకు. అసహ్యమేసింది. గదిలోకి వచ్చి పడుకుంది. కానీ నిద్ర పట్టలేదు.
” నోరారా పద్మా “అని తీయగా, ప్రేమగా పిలిచే భర్త గుర్తుకొచ్చాడు. గీత భర్త ముందు నోరు విప్పడానికే భయపడుతున్నది. తనెంత విసుక్కున్నా తన కూడా కూడా తిరిగే తన భర్తను చులకన చేసి వచ్చెయ్యడం వలన తను పొరపాటేమైనా చేసిందా ? మొదటిసారిగా తనల్ని తాను ప్రశ్నించుకుంది పద్మ.
మర్నాడుదయం గీత స్నానం చేసి యెండలో తల ఆరబెట్టుకుంటున్నది. పద్మ మెల్లిగా చెల్లెలు దగ్గర చేరింది.
“ఏమిటే గీతా కళ్లు వుబ్బివున్నాయి. ముఖం వాచిపోయింది ” అడిగింది గీతను.
“కంట్లో కుంకుడుపులుసు పడింది” అంతే అన్నది గీత.
“కృష్ణ నిన్ను బాగానే చూసుకుంటాడా ” చెల్లెలి భుజం మీద చెయ్యేసి ప్రేమగా అడిగింది పద్మ.
పద్మ ఆలా అడిగేసరికి గీతకు యేడుపొచ్చేసింది.
“ఏం చెప్పనక్కయ్యా నా ఖర్మ ! యెంత డబ్బుంటే ఏం లాభం ? సుఖం లేకపోయిన తర్వాత, ఆయనకు నా మీద అనుమానం ! నేను ఒక్కదాన్నే యెక్కడికి వెళ్లకూడదు, పార్టీలకు ఆయనతో పాటు అధునాతనంగా తయారయ్యి వెళ్లాలి. అక్కడా నామీద నిఘా ! నేను యెవరికైనా వుత్తరాలు వ్రాస్తే చూపించి మరీ పోస్ట్ చెయ్యాలి! అడుగడుగునా ధుమధుమలాడడమే !! ఒకవిధంగా చెప్పాలంటే డబ్బున్న బానిస బతుకు ! నాకు సంతోషమే లేదు” కన్నీటి పర్యంతమయ్యింది గీత.
“అట్లాంటి మూర్ఖుడితో యెలా కాపురం చేస్తున్నావే? నేనయితే పుట్టింటికి వచ్చేసి అలాంటి వాణ్ణి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేదాన్ని ” అన్నది పద్మ గర్వంగా.
గీత “ఇదేనా నీ తెలివి అక్కయ్యా ! నువ్వు యెంతో తెలివిగలదానివనుకున్నాను, ఇదా నువ్వు నాకిచ్చే సలహా !! వింతగా, హేళనగా పద్మను చూస్తూ ప్రశ్నించింది.
“అంటే” చెల్లెలి హేళనకు పద్మ అహం దెబ్బ తిన్నది.
పద్మ కొయ్యబారిపోయింది. అంత హీనంగా చూస్తున్న భర్తే సర్వస్వం అంటున్నది గీత. అతనితో పోల్చిచూస్తే తన భర్త దైవస్వరూపుడే. అటువంటి వ్యక్తిని తను విసుక్కుంది. తను తెలివితక్కువ పని చేసింది.
“ఏమే అలా కూచున్నావు యెండలో ? మీ ఆయన రాలేదనా !ఏం అత్యవసరం వచ్చిందో ! బాబును తయారుచెయ్యి. ” తల్లిమాటలు విని లోపలికి వెళ్లింది. కొత్త బట్టలు తియ్యడానికి సూట్కేస్ తెరిచింది. పద్మ.
పెట్టేముందు కూర్చున్నదన్న మాటేగానీ యేవేవో ఆలోచనలు బుఱ్ఱ పని చేయడం లేదు. అర్ధరహితంగా పెట్టెలో వున్నబట్టలన్నీ అటూయిటూ తియ్యడం, వెయ్యడం చేస్తున్నది. అలాచేస్తున్నప్పుడు అడుగున ఒకకవరు
చేతికి తగిలింది. అప్రయత్నంగా దానిని విప్పింది. అంతే అక్షరాలవెంట కళ్లు, బుఱ్ఱ పరుగెత్తాయి.

డియర్ పద్మా,
నువ్వు ఏం చెప్పినా వినేస్థితిలో లేవు. అందుకే నా అభిప్రాయాలన్నీ వ్రాసి ఒకకవరులో పెట్టాను. కోపం తగ్గిన తర్వాత మంచి మూడ్ వున్నప్పుడు చదువు.
చదువుకున్నదానివి !అర్ధం చేసుకో. పెళ్ళికాకముందు పుట్టిల్లు వేరు, పెళ్లయిన తర్వాత పుట్టిల్లు వేరు. నువ్వు పుట్టి పెరిగిన బంధాన్ని పురస్కరించుకుని అక్క్కడ కొన్నాళ్లు వుండొచ్చు కానీ నీకేమీ అక్కడ అధికారం లేదు. మనయిల్లు నీ ఇల్లు యిక్కడ నీ అధికారం చెల్లుతుంది. అధికారం చేతులు మారేటప్పుడు కొంతకాలం అత్తాకోడళ్ల మధ్య కొంత సమయం! పడుతుంది. మనయింటి పద్ధతులను ఆనవాయితీలను అమ్మ నీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నది. రేపు మనకొచ్చే కోడలికి కూడా నువ్వు చెప్తావు కదా !! జీవితంలో యేదో వెలితి వున్నదని నీ అనుమానం. కానీ అలోచించి చూడు, కానీ మనకు యే లోటూ లేదు. నీకు నేను ముఖ్యం. మా అమ్మ కాదు. అమ్మను నువ్వు గౌరవిస్తే నన్ను అభిమానించినట్టే కదా ! కోపంతో అభిమానంతో వెళ్ళావు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నిస్సంకోచంగా నీ యింటికి వచ్చేసెయ్యి. నేను యెదురు చూస్తుంటాను.
నీ సుబ్రహమణ్యం

పద్మ కళ్లు కన్నీటి ధారలయ్యాయి. భర్తను యెంత తప్పుగా అర్ధం చేసుకుంది ? తాళంచెవి యివ్వమంటే తానెంత నీచం గా మాట్లాడింది ప్రేమించే భర్తను కాదని యెంత తప్పు చేసింది !అతని సుఖం కన్నా తనకు వుద్యోగం ముఖ్యం కాదు. పద్మకు జ్ఞానోదయం అయ్యింది. పండగ అవగానే తన భర్త దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కనుము అయ్యింది.
“నాన్నా అమ్మా రేపు నేను వెళ్తాను మా యింటికి” అన్నది పద్మ. నిండు మనసుతో ఆశీర్వదించి పంపారు వాళ్లు.
పద్మ ఆటో దిగగానే చిరునవ్వుతో సుబ్రహమణ్యం పిల్లాణ్ణి యెత్తుకున్నాడు. “కాళ్ళుకడుక్కో అమ్మా యెప్పుడు భోంచేసావో “అంటూ అత్తగారు దగ్గ్గరుండీ ఆప్యాయంగా వడ్డించింది. తల్లీకొడుకుల ఆదరాభిమానాలకు సిగ్గుతో తలెత్తలేకపోయింది.
అత్తగారు మనవడితో ఆడుకుంటూ కూర్చున్నారు. పద్మ గదిలో భర్త దగ్గరకు వెళ్లింది. “నేను చాలా పొరపడ్డాను నన్ను క్షమించండి ” అన్నది తల దించుకుని.
“మనలో మనకు పొరపాట్లేమిటి పద్మా, జరిగింది మర్చిపో “అంటూ పద్మను దగ్గర తీసుకున్నాడు.
అత్తగారి దగ్గరకు వచ్చి “మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి ” అని పద్మ కన్నీటిపర్యంతమయ్యింది. ఆవిడ నవ్వుతూ పద్మను అక్కున చేర్చుకుంది.
మబ్బులు తొలగిన నీలాకాశం చుక్కలతో మెరిసిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *