March 4, 2024

ఔషధ విలువల మొక్కలు -2 (6 – 10)

రచన: నాగమంజరి గుమ్మా


*దూర్వాయుగ్మ పత్రం*

గరిక పోచ యనుచు కడు హీనముగ జూచు*
జనుల మనములెల్ల ఝల్లు మనగ*
ప్రీతి తోడ మెచ్చె విఘ్నేశ్వరుడు తాను*
గరిక నిచ్చినంత గరిమ నిచ్చు*

శ్రీ గణేశునికి చాలా ఇష్టమైన పత్రులలో మొదటిది గరిక అనబడే దూర్వాయుగ్మం . గడ్డి పోచ అని తక్కువ చేసి పలికే వీలు లేకుండా తనకు ఎంతో ఇష్టమైన ద్రవ్యంగా స్వీకరించారు స్వామి . ప్రేమగా గరికను సమర్పిస్తే చాలు కోరిన కోరికలు తీర్చేస్తారు.

అంచున గాజు పూత ( సిలికాన్) ఉన్న ఈ గరిక రక్తస్రావాన్ని అరికడుతుంది . పిల్లలకు ఆటలలో గాయాలు తగిలి రక్తం కారుతూ ఉంటే గరికను నీటితో కడిగి బాగా నలిపి పెట్టాలి. క్షణంలో రక్తం కారడం తగ్గిపోతుంది . గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని రూపు మాపడానికి అమ్మతం తెచ్చి దర్భలపై ఉంచి మళ్ళీ స్వర్గానికి చేర్చాడట. ఆ దర్భలు ఆనాటి నుండి పవిత్ర మయ్యాయి . వాటి సోదరే ఈ గరిక కూడా .

7

*దత్తూరపత్రం*

దత్తూర మనెడి పేరిట*
మత్తేభ ముఖుని కొలువగ మహి నిలచె నిదే*
ఉత్తమ మౌ భ్రాంతుల కిది*
విత్తులు విషమగు, పొసగవు పెరడుల పెంచన్*

శ్రీ విఘ్నేశ్వర పూజలో దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకులను కూడా ఉపయోగిస్తారు. తెల్లని పూవులు, ముండ్ల తో కూడిన కాయలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో నల్లని ఉమ్మెత్తను ఉపయోగిస్తారు. ఈ గింజలు విష తుల్యములు. కానీ ఆకుల రసము భ్రాంతి వంటి మానసిక రోగాలను అదుపు చేస్తుంది. జుట్టు పూర్తిగా తీసివేసి, ఆకుల రసాన్ని తలపై మర్దనా చేయాలి. కొన్ని పత్యాలు పాటించాలి. (స్వయంగా ఏవి ప్రయోగాలు చేయరాదు. వైద్య విధానము సంక్షిప్తం చేయబడుతుంది). ఆరుబయలు లో పెరగవలసిన మొక్కే కానీ, ఇంటి పెరటిలో పెంచదగినది కాదు.

8

*తులసి పత్రం*

తులసి పూజ సేయ తులతూగు భాగ్యాన *
తులసి నెరుగని దెవ రిలను చూడ*
కఫము కోయు మందు కడసారి తీర్థము*
తులసి యున్న తావు దొరలు సిరులు*

తులసి గురించి తెలియని దెవరికి? తులసిలో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, భూతులసి అని మూడురకాలున్నాయి. భూ తులసి గింజలనే సబ్జా గింజలు పేరుతో వేసవిలో చల్లదనానికి నీటిలో నానబెట్టి తాగుతారు.

పసిపిల్లల నుండి పండు ముదుసలి వరకు గొంతు సంబంధ వ్యాధులకు దివ్యౌషధం. దగ్గు, జలుబు, కఫం మొదలగునవి హరిస్తుంది. ఆఖరులో తులసి తీర్థం పోసేది అందుకే… చెప్పదలచుకున్న మాటలు ఎటువంటి ఆటంకం లేకుండా చెప్తారనే…

ఇకపోతే శంఖచూడుడు అనే రాక్షసుని భార్య బృంద. విష్ణువు మాయోపాయంతో శంఖ చూడుడు ను వధించగా, బృంద విష్ణువును శిలగా మారిపోమని శపిస్తుంది. అప్పుడు విష్ణువు బృందను మరు జన్మలో తాను గండకీ నదిలో సాలగ్రామం అవుతానని, బృంద తులసిగా పుట్టి తనను సేవించాలని చెప్తారు.

లక్ష్మీ సరస్వతీ అత్తా కోడళ్ళు అవడం చేత ఇద్దరూ ఒకే వ్యక్తిని కటాక్షించరు అని ప్రతీతి. (విద్య, ధనము లలో ఏదో ఒకటి మాత్రమే కలుగుతుందని..) శ్రీ గణేశుడు విద్యల నాధుడు అయిన పిదప లక్ష్మీదేవి వరం కోరుకోమని అంటే, లక్ష్మీదేవిని తన చెంత ఉండాలని తాను లక్ష్మీ గణపతి నవుతానని, తనని పూజించిన వారికి విద్య, ధనము రెండూ కలగాలని కోరుతారు గణపతి. లక్ష్మీదేవి సరేనంటారు. అలా ఒక్క వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడు విష్ణు స్వరూపం గా తులసి పూజలను అందుకుంటారు. మిగతా రోజుల్లో ఆయనకు తులసి పూజ నిషిద్దం. (శ్రీ గణేశ పురాణం ఆధారంగా) అలా 21 పత్రాల్లో తులసి కూడా చేరింది.

9

*విష్ణు క్రాంత పత్రం*

చిట్టి నీలిపూలు శివుని వెన్నుని ప్రీతి*
శ్రీ గణేశు పూజ చేయ నోచె*
పూజ లెన్నియైన పూవులెన్నియు నైన*
ఔషధమివి యనుచు నాదరించు*

చిన్ని నీలిపువ్వులున్న ఈ విష్ణుక్రాంత పత్రం శ్రీ గణేశ పూజకు నోచుకున్నది. సంస్కృతంలో వీటిని శంఖపుష్పి అని ఆంగ్లంలో morning glory అని అంటారు. ఆయుర్వేదంలో విష్ణు క్రాంత మొక్క మొత్తం ఆకులు, పూవులు సహా ప్రాధాన్యం ఉంది. విఘ్నేశ్వరు నికే కాకుండా విష్ణువుకు, శివునకు కూడా ఈ పువ్వులు ప్రీతియైనవి. ఈ ఆకులు చెరువు నీటిలో వేసినపుడు , జలచరాలు ఆ ఆకులను తిని, వృద్ది చెంది నీటిని శుద్ధి చేస్తాయట.

10

*బదరీ పత్రం*

రేగు పత్రి యొకటి శ్రీ గణేశుని చేరి*
పూజలందు మనుచు పొసగి వేడె*
బదరి మనెడి పేరు పరిఢ విల్లెద వీవు*
కాచుపిల్లల ననె గౌరి సుతుడు*

బదరి లేదా రేగు, ఇది చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాధుల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు ఆకులను ప్రతిరోజూ ఒకటి లేదా రెండు పూటలు తినిపిస్తే వ్యాధులు పూర్తిగా నయమవుతాయి. (ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది).వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు కూడా బదరీ పత్రం పేరుతో ఉంది. ఈ పత్రి గురించి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *