June 24, 2024

నిజాయితీ ఆచరణ

రచన: రాజ్యలక్ష్మి బి

ధర్మయ్య బస్సు కోసం యెదురుచూస్తూ నిలబడి గంట పైన అయ్యింది. దీపాలు కూడా వీధుల్లో వెలుగుతున్నాయి. చాలా దూరం వెళ్లాలి. నాలుగేళ్ల తర్వాత అమ్మను చూడ్డానికి బయల్దేరాడు. ఇప్పుడు బస్సెక్కితేకాని అర్ధరాత్రికయినా తనవూరు చేర్తాడు. ధర్మయ్యకు చాలా విసుగ్గా వుంది. రెండు రోజుల క్రిందట మారయ్య తాత బజార్లో కనపడి ‘ఒరేయి ధర్మా మీ అమ్మకు బాగాలేదురా నిన్ను చూడాలనుకుంటున్నది. నీకు చెప్పమన్నది. మీ మామ యింటికి రావాలంటే మీ అత్త గుమ్మం దగ్గర కూడా రానియ్యదు. మీ మామ మెతకటోడు. ఎట్ల చెప్తావో యేమో నీ మామకు. ఒకసారి నీ పల్లెకెళ్లి అమ్మను చూసిరా ‘ చెప్పాడు.

అమ్మ జ్ఞాపకం రాగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి, యెవరూ చూడకుండా పక్కకు తిరిగి కళ్లు తుడుచుకున్నాడు. అమ్మకు తను చదువుకుని పెద్ద కొలువు చెయ్యాలి, బోలెడు డబ్బు సంపాదించాలని కోరిక. అందుకే తనల్ని పక్క వూళ్లో వుండే మేనమామ దగ్గరికి పంపించింది. మేనమామ ప్రభుత్వ బళ్లో ధర్మయ్యను ఐదో క్లాసులో చేర్చాడు. ధర్మయ్యకు కూడా చదువంటే యిష్టం. ముఖ్యంగా దేశం. కోసం, న్యాయం కోసం, నిజాయితీ కోసం, సత్యం కోసం జీవించిన వాళ్ల గురించి చదువుతున్నపుడు తను. కూడా అలాగే వుండాలని అనుకుంటాడు.

ఆలోచనలను ఆపేసి మళ్లీ బస్సు వస్తుందేమోనని తలెత్తి చూసాడు ధర్మయ్య. కనుచూపుమేరా బస్సు కనిపించలేదు. అమ్మ దగ్గరకు వెళ్తానని చెప్పినప్పుడు మామయ్య డబ్బులు లేవన్నాడు. మామయ్య కూడా మిల్లులో పని చేస్తాడు. ధర్మయ్యంటే యిష్టం కానీ అత్తయ్య గయ్యాళిది. ధర్మయ్యతో యింటి చాకిరీ చేయిస్తుంది. తిన్నావా తినలేదా కూడా అడగదు. ధర్మయ్య కూడా చిన్నవాడైనా. అన్నీ అర్ధం చేసుకున్నాడు. యెంత కష్టమైనా పడుతున్నాడు కానీ చదువు, బడి మాత్రం వదల్లేదు. అతనికి ఒక్కటే కోరిక. అమ్మని సుఖపెట్టాలి. చిన్నప్పుడే తండ్రి చనిపోతే అమ్మ కూలీ పనులూ, పొలం పన్లు చేస్తూ తనల్ని పెంచింది. ఆ అమ్మకు యిప్పుడు ఒంట్లో బాగా లేదు. ధర్మయ్యకు అమ్మను చూడాలని బలంగా వుంది.

మామయ్యను బ్రతిమిలాడాడు. మామయ్య కసురుకున్నాడు. అయినా కాళ్లావేళ్లా పడ్డాడు. ఏడ్చాడు. చివరికి మేనమామ పెళ్లానికి తెలియకుండా ఆ సాయంకాలం ధర్మయ్యకు వూరికి వెళ్లేందుకే యిచ్చాడు, తిరుగు డబ్బులు అమ్మదగ్గర తెచ్చుకోమన్నాడు. అక్కడికే సంతోషించి ధర్మయ్య ముక్కూ కళ్లు చొక్కాతో తుడుచుకుని, నిక్కరు పైకి లాక్కుంటూ, బస్సు స్టేషన్ కి పరుగెత్తుకుంటూ వచ్చాడు కంగారు కంగారుగా. తీరా చూస్తే బస్సు రాలేదు.

హమ్మయ్య. మొత్తానికి ధర్మయ్య వెళ్లే బస్సు వచ్చింది. అందరూ తోసుకుంటూ, తోసుకుంటూ యెక్కుతున్నారు. ధర్మయ్యకు తను చదువుకుంటున్న పాఠాల్లో చదివినట్టు యెవ్వరూ వరుసలో నించుని యెక్కడం లేదు. తోపుడులో పాపం ఒక ముసలాయన జారిపడ్డాడు కూడా. ధర్మయ్య ఆయన్ను చెయ్యి పట్టి యెక్కించాడు. ధర్మయ్య చివరగా బస్సు ఎక్కాడు. సీట్లు ఖాళీ లేవు. కడ్డీ పట్టుకుని డబ్బులు యింకో చెయ్యిలో పెట్టుకుని నించున్నాడు.

బస్సు బయల్దేరింది. కండక్టర్ అందరికీ డబ్బులు తీసుకుని టికెట్ పంచ్ చేసి వరుసగా వస్తున్నాడు. పది నిమిషాల తర్వాత బస్సు చెట్టు కింద ఆగింది. అక్కడ అందరికీ టిక్కెట్లు యిచ్చేదాకా బస్సు ఆగుతుంది. కండక్టర్ అందరికీ టికెట్లు యిస్తూ ధర్మయ్య దగ్గరకు వచ్చాడు. ధర్మయ్య తన పల్లె పేరు చెప్పి డబ్బులు యిచ్చాడు. కానీ డబ్బులు సరిపోవని యింకా యివ్వమన్నాడు కండక్టర్. ధర్మయ్య తన దగ్గర లేవన్నాడు. అయితే దిగిపొమ్మని చెప్తూ కండక్టర్ ముందుకెళ్లాడు. ధర్మయ్య యెంత రాత్రయినా అమ్మను చూడాలని పట్టుదలగా వున్నాడు. అందుకే బస్సు దిగలేదు. కానీ సరిపడా డబ్బులు లేవు. అతనికి ఏం చెయ్యాలో తోచడం లేదు. బిక్కమొహంతో అయోమయంగా నిలబడ్డాడు

“ఇంకా యిక్కడే నిలబడ్డావా. దిగు దిగు “అంటూ కండక్టర్ అందరికీ టికెట్లు యిచ్చి తన సీట్లో కూర్చుంటూ యెదురుగా నిలబడ్డ ధర్మయ్యను గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు ప్రయాణికులందరూ ధర్మయ్యను చూసారు. అమాయకంగా చూస్తున్న అతనిని చూసి, ఒక ప్రయాణికుడు,

“అతనికి ఆ డబ్బులతో అర టికెట్ యివ్వండీ “అని కండక్టర్ తో అన్నాడు.

“అబ్బాయ్. నీకు అర టికెట్ యిస్తాను ముందు స్టేజీలో చెకింగ్ వుంది. వాళ్లు నీ వయసుడిగితే పన్నెండేళ్ళని చెప్పు సరేనా “అన్నాడు ధర్మయ్య తో కండక్టర్.

“నాకు పధ్నాలుగేళ్లు. నేను అబద్ధం చెప్పను “అన్నాడు ధర్మయ్య.

కండక్టర్ కోపంగా “బస్సు దిగనంటావు, అబద్ధం చెప్పనంటావు.తమాషాగా వుందా.” అరిచాడు. డ్రైవర్ కూడా అరిచాడు. ప్రయాణికులు కూడా “అబ్బో మహా సత్యహరిశ్చంద్రుడు మళ్లీ పుట్టాడు “అంటూ వెక్కిరిస్తూ కొందరు విసుక్కుంటూ ధర్మయ్యను చూసారు. ఆలా అందరూ చీదరించుకుంటుంటే ధర్మయ్యకు బాధా, యేడుపు! బళ్లో పాఠాల్లో పంతులుగారు నిజమే చెప్పాలంటారు. తను నిజం చెప్తానంటే యెందుకు వీళ్లు నన్ను హేళన చేస్తున్నారు అనుకుని బాధపడ్డాడు.

ఇదంతా చూస్తున్న ఒక ప్రయాణికుడు తను కొరవ పడ్డ డబ్బులు యిస్తానన్నాడు. ధర్మయ్యకు ఆలా తీసుకోవడం యిష్టం లేదు. ఆలోచించాడు.

“మీరందరూ ఒప్పుకుంటే బస్సులో దుమ్ము దులిపి, అద్దాలు తుడుస్తాను. నా టికెట్ కి సరిపడా డబ్బులివ్వండి“ అంటూ తుడవడానికి చొక్కా విప్పాడు. అంతలో ఒక చిన్నపాప వాంతి చేసుకుంటుంటే ధర్మయ్య గబుక్కున పాప నోటిదగ్గర తన దోసిట పెట్టాడు. అది చూసి అందరూ అవాక్కయ్యారు. పాప తల్లి ధర్మయ్యను కృతజ్ఞతగా చూసింది. ప్రయాణికులకు అప్పటికి కానీ ధర్మయ్య మాటలూ ప్రవర్తన అర్ధం కాలేదు. సిగ్గుపడ్డారు. అతని ఆత్మాభిమానానికి సంతోషించారు. కండక్టర్ దుమ్ముదులిపిన తర్వాత పల్లెకు సరిపడా టికెట్ యిచ్చాడు. బస్సు బస్సు బయల్దేరింది. కన్నీళ్లతో అందరికీ నమస్కరించాడు ధర్మయ్య.

“బాబుగార్లూ. బళ్ళల్లో మాకు కష్టపడి బ్రతకమనీ, నిజాయితీగా వుండమని, అబద్ధాలు చెప్పకూడదని బోధిస్తారు. మరి నేను నిజమే చెప్తే యెందుకు మీరు వెక్కిరించారు. మమ్మల్ని నిజాయితీగా పెంచవలసిన మీరే మమ్మల్ని తప్పుదోవలోకి తోస్తున్నారు” అంటూ ముగించాడు. ప్రయాణికులు సిగ్గుతో తలదించుకున్నారు. బస్సు చీకటిలోనించి వెలుతురులోకి సాగిపోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *