May 25, 2024

ధృతి – 6

రచన: మణి గోవిందరాజుల

“అదిగో బామ్మా అదే ఏఎంబీ మాల్” కార్ బొటానికల్ గార్డెన్ సిగ్నల్ దగ్గరికి రాగానే ఎక్జైటింగ్ గా చూపించారు పిల్లలు. బయటినుండి చాలా పెద్దగా ఉండి ఠీవిగా కనపడుతున్నది ఆ మాల్. “అమ్మో! ఎంత పెద్దగా ఉన్నదో” ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది బామ్మ. “మరేమనుకున్నావ్? అందుకే అక్కడికి వెళ్దామన్నది” ఉత్సాహంగా అన్నారు ఆర్తి, కార్తి.
కార్ పార్కింగ్ దగ్గర ఆగగానే బయటికి ఉరికారు ఆర్తి, కార్తి. వాళ్ళకు చాలా ఆనందంగా ఉన్నది. ఎన్ని రోజులనుండో అనుకుంటున్నా రావడం కుదరటం లేదు. అందులో ఈరోజు శివా ఉన్నాడు. చక్కగా అన్ని రైడ్స్ ఎక్కిస్తాడు. అందుకే ఇంకా ఉత్సాహంగా ఉన్నది వాళ్ళకు. లిఫ్ట్ లో అందరూ పైకెళ్ళారు. లోపలికి వెళ్ళాక ఆ మాల్ చాలా నచ్చింది బామ్మకి.
“వావ్!! ఎంత పెద్దదో…” చుట్టూ చూస్తూ అన్నది.
“బామ్మా! ఇంటికెళ్దామని అస్సలు తొందర పెట్టకూడదు. మేము రైడ్స్ అన్నీ ఎక్కాలి. ఈ ల్లోపు మీరు అన్ని షాప్స్ చూసుకోండి“ డిమాండ్ చేసారు ఇద్దరూ.
“సినిమా ఎప్పుడు చూస్తామురా? మీ ఆటలన్నీ అయ్యేసరికి షాప్స్ అన్నీ మూస్తారేమో” సందేహంగా అడిగింది బామ్మ.
“సినిమాలు గంట గంటకూ ఉంటాయి బామ్మా. ఒక గంట వాళ్ళను ఆడుకోనిచ్చి, ఆ తర్వాత సినిమా చూద్దాము. ఈ లోపు ఒక రౌండ్ వేద్దాము” చెప్పింది ధృతి. “శివా వాళ్ళను ఆడించాక మాకు ఫోన్ చేసి ఫుడ్ కోర్ట్ లో కూర్చోండి. జాగ్రత్త!” శివాకి చెప్పి రెండువేల నోటు ఇచ్చింది.
“వాకే! వాకే” హుషారుగా చెప్పి వాళ్ళను తీసుకుని లిఫ్ట్ లో పైకెళ్ళిపోయాడు శివ. బామ్మను తీసుకుని షాపులవేపు కదిలింది ధృతి.
కొంత సేపయ్యాక “హేయ్! ధృతీ” ఎవరో పిలిచినట్లనిపించి ఆగింది. అటుపక్కనుండి విశ్వ వడివడిగా వీళ్ళవేపే రాసాగాడు.
“బామ్మా! ఇతను మా సీనియర్ విశ్వ. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. విశ్వా! మా బామ్మ” బామ్మ చుట్టూ చేతులేసి చూపిస్తున్నట్లుగా ఇద్దరికీ పరిచయం చేసింది.
బామ్మని ఆశ్చర్యంగా చూసాడు విశ్వ. ఇప్పుడూ అప్పుడూ అని ఫొటో దిగినట్లుగా ఉన్నారు ఇద్దరూ. బామ్మ ఆ వయసులో కూడా ఎంతో అందంగా హుందాగా ఉన్నారు. అదే అందం ధృతికి వచ్చింది.
“హే! ధృతీ… నువు అచ్చం మీ బామ్మ పోలిక. నమస్కారం బామ్మగారూ” అన్నాడు విశ్వ.
“అవును. మా బామ్మా, మా నాన్నా, నేనూ ఒక్కలాగే ఉంటాము. ఒక్కడివే వచ్చావా?” అడిగింది ధృతి.
“ఒక్కడినా!! మా కోతి మూకనంతా వేసుకొచ్చా. అరేయ్! శశీ… ఇక్కడున్నాను” ధృతికి చెప్పి అటుపక్క విశ్వ కోసం వెతుకుతున్న బృందాన్ని పిలిచాడు.
“ఓరి బడుద్దాయ్… చెప్పొఛ్చుకదరా. నీ కోసం వెతకలేక చచ్చాము” గట్టిగా మాట్లాడుతూ దగ్గరికి వచ్చాడు. వెనకాలే మిగతా ఇద్దరు ఆడపిల్లలూ వచ్చారు.
అందరూ కాలేజీ పిల్లలే కాబట్టి ముచ్చట్లు చాలా జోరుగా సాగాయి కొంతసేపు.
అందరూ మాట్లాడుతున్నా విశ్వ చూపులు ధృతి చుట్టే తిరుగుతుండడం గమనించాడు శశి. “ఏంట్రా” అన్నట్లు కళ్ళెగరేసాడు శశి. “ఏమీ లేదులే! ఊర్కో!” అన్నట్లు సైగ చేసాడు విశ్వ. వీళ్ళీద్దరి మూగ భాష గమనించింది ధృతి.
“మీరిద్దరేంటి? ప్రేమికుల్లాగా సైగలు చేసుకుంటున్నారు?” టీజ్ చేసింది.
పట్టుబడ్డట్లుగా చూసి నవ్వేసారు ఇద్దరూ. మాల్ కే కదా అని జీన్స్ ప్యాంట్ కుర్తీ వేసుకొచ్చింది ధృతి. మెడ చుట్టూ చున్నీ రెండు కొసలూ ముందుకేసుకున్నది. పొడుగాటి జుట్టును మూడొంతులు అల్లి వదిలేసింది. చెవులకు చిన్న స్టడ్స్ పెట్టుకున్నది. ఐ లైనర్ తో ఐ లిడ్స్ కి లైనింగ్ ఇచ్చింది. అందువల్ల కళ్ళు దించినప్పుడు కూడా కళ్ళ అందం కనపడుతున్నది. చిన్న స్టికర్ బొట్టు మెరిసేది పెట్టడం వల్ల మొహం అటూ ఇటూ తిప్పినప్పుడు లైట్ల వెలుగు బిందీ మీద పడి మెరుస్తున్నది. ప్రత్యేకంగా అలంకరించుకోకపోయినా కళ్ళు తిప్పుకోలేని అందం. తెలీని వారు కూడా ఒకసారి మళ్ళీ చూస్తారు.
ఇంతలో శివ ఫోన్ చేసాడు ఇంకో అయిదు నిమిషాల్లో ఫుడ్ కోర్ట్ లో ఉంటామని. “ఇక్కడ ఎంతసేపు నిల్చుంటాము? మా వాళ్ళు ఫుడ్ కోర్ట్ లో ఉన్నారట. వెళ్దామా?” అడిగింది ధృతి.
“సరే!” అనబోయిన అన్నను ఆపి “మీరు వెళ్ళండి. మేము కొంతసేపు షాపింగ్ చేసుకుని వెళ్తాము” చెప్పింది వినీల.
“ఓకే! గైస్… బై… బై” చెప్పేసి బామ్మను తీసుకుని వెళ్తున్న ధృతి వేపే చూస్తుండిపోయాడు విశ్వ.
“చూసింది చాలు కాని ఇక కదులు” రహస్యంగా విశ్వతో అన్నాడు శశి.
“అంతొద్దు బాబూ… మేము కూడా గమనించాము. ఏంట్రా సంగతి?” అన్నను టీజ్ చేసింది వినీల.
“పోవే!” చెల్లెలు నెత్తిమీద ఒక మొట్టికాయ వేసి ముందుకు కదిలాడు. విశ్వకి ఇంకా కొంతసేపు ధృతి వాళ్ళతో ఉండాలనే ఉన్నది. కానీ వాళ్ళుండగా బాగుండదు అని అయిష్టంగానే వాళ్ళతో కలిసి నడిచాడు.
ధృతీ వాళ్ళు వెళ్ళేప్పటికే వాళ్ళకు కావాల్సినవి ఆర్డర్ ఇచ్చేసారు ఆర్తి, కార్తి. బామ్మను ఒక్కొక్క కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దొరికేవి చూపించింది ధృతి. “బామ్మా! నీకేవి కావాలో చెప్తే అవి ఆర్డర్ ఇచ్చుకుందాము”
చోళే భటూరే చెప్పింది బామ్మ. పీజా ఆర్డర్ ఇచ్చుకున్నది ధృతి. అందరూ కూర్చొని ఉండగానే ఆర్డర్ ఇచ్చినవన్నీ వచ్చాయి. కొద్దిగా ఆయిలీగా ఉన్నా చోళే భటూరే బాగున్నది. అందరూ అన్నీ షేర్ చేసుకుంటూ తిన్నారు. ఈ లోపు శివా వెళ్ళి టికెట్స్ తెచ్చాడు.
“ఒరేయ్! చెప్తే వినకుండా ఫుడ్ కోర్ట్ కి తీసుకొచ్చావు. వాళ్ళెప్పుడో వెళ్ళిపోయుంటారు” ఫుడ్కోర్ట్ లోపలికి వస్తూ సణిగింది విన్నీ.
“వాళ్ళకోసమా ఇక్కడికి రమ్మన్నది? నీదంతా ఊహ బంగారం. నాకు బాగా ఆకలిగా ఉన్నది. అందుకే వెళ్దామన్నాను. అరే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు” ఆశ్చర్యంగా మొహం పెట్టాడు
“అదిగో ఆ నటనే వద్దన్నది. సరే మేమిక్కడ కూర్చుంటాము. నువెళ్ళి మాట్లాడి రా” ఒక టేబుల్ చూసుకుని కూర్చుంటూ అన్నది విన్నీ.
నీలాంబరి, వెలిగిపోతున్న బావ మొహాన్ని చూస్తూ తన మొహంలో భావాలు వ్యక్తం కానీకుండా కూర్చున్నది. మొదటినుండీ బావ అంటే విపరీతమైన ఇష్టం నీలకు. పెళ్ళి మాటలు వచ్చినప్పుడు చెప్పొచ్చులే అనుకుని తన ప్రేమను తనలోనే దాచుకున్నది. ఇప్పుడు ఆ ఆశ లేదనుకునేసరికి నిరుత్సాహం నిలువెల్లా ఆవహించింది. దానిని బయటపడనీయకుండా విన్నీతో మాట్లాడుతూ కూర్చున్నది.
“విశ్వ, శశి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ కుచున్నారు.
ఇంతలో ఒక పెద్దావిడ వచ్చింది. బామ్మని పరీక్షగా కిందకీ మీదకీ చూడసాగింది. “నువ్వూ! నువ్వు రంగనాయకి వి కదూ?” సంతోషంగా అడిగింది ఆమె.
బామ్మ కూడా ఆవిడని చూసి ఒక్క క్షణం పోల్చుకోలేకపోయినా, ఆమె అడగ్గానే “సువర్చలవి కాదుటే నువ్వూ” తనూ సంతోషంగా అడిగింది.
“ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి? భలే అనుకోకుండా కలిసాము”
“నాళ్ళేంటే… ఏళ్ళు గడిచిపోయాయి. నీ కూతురి పెళ్ళిలో అనుకుంటా ఆఖరున కలిసింది. ఎక్కడున్నారు వాళ్ళిప్పుడు? పెళ్ళవుతూనే అమెరికా వెళ్ళారు కదా నీ కూతురూ అల్లుడూ వాళ్ళు?”
“అవును. అమెరికా లోనే ఉంటున్నారిప్పుడు కూడా. నాకూతురు నీ కొడుకు దినేష్ కంటే పెద్దదని వేరే పళ్ళి చేయాల్సొచ్చింది. లేక పోతే మనం వియ్యపురాళ్ళమయ్యే వాళ్ళం” నిట్టూర్చింది వచ్చినావిడ. “అన్నట్లు ఈ బంగారబ్బొమ్మ నీ మనవరాలా? అడగడమెందుకు నీ నోట్లోంచి ఊడిపడ్డట్లున్నది. దినేష్ పెళ్ళి సమయానికి నాకూతురి పురిటికి అమెరికా వెళ్ళాల్సొచ్చి రాలేకపోయాము. అదిగో అప్పుడు పుట్టినవాడే వాడు. అవతల టేబుల్ దగ్గర మాట్లాడుతున్నాడు చూడు” అటు చూపించింది. “అరే! నాన్నా ఇటురారా” పెద్దగా పిలిచింది అతన్ని.
టేబుల్ పక్కన నిలబడి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని ఏదో మాట్లాడుతూ నవ్వుతున్న అతను ఇటు తిరిగాడు.
అందరి చూపులూ ఒక్కసారిగ అతని మీదకు వెళ్ళాయి. “ఏమా అందం” అతన్ని చూడగానే అందరి మనసుల్లో మెదిలిన ఆలోచన అది. మగవాళ్ళకే మరులు గొలిపేట్లుగా ఉన్నాడు.
“వీడేనే నా మనవడు కిశోర్. కిశోర్ ఈ బామ్మ నా చిన్ననాటి స్నేహితురాలు. నీకెప్పుడూ చెప్తుంటానే ఆ బామ్మే!” ఒకళ్లకొకళ్ళకు పరిచయం చేసింది.
“నమస్తే బామ్మా! మిమ్మల్ని ఇప్పుడే చూడటం కానీ మీరు మాకు ఎప్పటినుండో తెలుసు” చక్కగా నమస్కారం పెడుతున్న అతన్ని ముచ్చటగా చూసింది బామ్మ.
గండు తుమ్మెదల పాటలా ఉన్న అతని స్వరం అతని రూపానికి మరింత వన్నె తెచ్చింది. మంచి తెలుపురంగు శరీరం. వత్తైన తలకట్టు. చురుకుగా చూస్తున్న కళ్ళు. అందమైన నాసిక. నవ్వుతున్నట్లున్న పెదాలు. అజాను బాహువు.
“కిశోర్… ఈ అమ్మాయి ఆ బామ్మ మనవరాలు. అమ్మలూ వీడు నా మనవడు”
“హై! గ్లాడ్ టు మీట్ యూ…” షేక్ హాండ్ కి చేయందిస్తూ చెప్పాడు. “హాయ్!” తనూ చేయందిచ్చింది.
“యు ఆర్ లుకింగ్ సో బ్యూటీఫుల్” మెచ్చుకోలుగా చూస్తూ చెప్పాడు.
“వామ్మో! వామ్మో… ఇంతవరకూ నేనే చెప్పలేదీ మాట” మనసులోనే గుండెలు బాదుకున్నాడు విశ్వ.
“థాంక్యూ… ఇతను నా కాలేజ్ మేట్ విశ్వ. అతను అతని బంధువు. వీళ్ళిద్దరూ మా చెల్లి, తమ్ముడూ. వీడు మా అన్న శివ” అందర్నీ పరిచయం చేసింది.
“హాయ్… హలో… హై క్యూటీస్” అందర్నీ పలకరించినట్లుగా మాట్లాడి “అమ్మమ్మా! మీరు మాట్లాడుకోండి నాకు పనుంది వెళతాను” చెప్పేసి వెళ్ళిపోయాడు.
ఇక పెద్దవాళ్ళిద్దరూ కబుర్లలో పడిపోయారు.
“ఏమే రంగనాయకీ… అప్పుడు కుదరలేదు కానీ ఈ సారి మనం బంధువులం కావాల్సిందే” కచ్చితంగా చెప్పింది సువర్చల.
అతన్నీ, అతని అందాన్నీ చూసిన విశ్వ మనస్సులో పెద్ద బండరాయి పడింది. “అమ్మో! అమ్మో! నేను తొందరపడకపోతే లాభం లేదు. మంచిరోజు చూసి తన మనసులో మాట చెప్పేయాలి” నిశ్చయించుకున్నాడు. శివ ని చూసినప్పటినుండీ మనసులో తొలుస్తున్న అనుమానం ‘వీడు నా అన్న’ అని పరిచయం చేసేసరికి వదిలిపోయింది. కాని కొత్తగా వచ్చిన కిశోర్ విశ్వ మనసుని అల్లకల్లోలం చేసేసాడు.
పెద్దవాళ్ళిద్దరూ వాళ్ళ చిన్నప్పటి మాటల్లో పడ్డారు. వాళ్ళు తినడం పూర్తవగానే ఆర్తీ, కార్తీ “బామ్మా సినిమా టైం అవుతున్నది” అని సన్నగా నసగడం మొదలు పెట్టారు.
“ఏమే! సువ్వీ… నువ్వంటే దేశాలు తిరుగుతున్నావు. నేను కదలకుండా గుండ్రాయిలా అక్కడే ఉన్నా కదే ఒక ఉత్తరమ్ముక్క రాయొచ్చు కదా. ఏమొచ్చిందే నీకు” చనువుగా కసిరింది బామ్మ.
“ఏమోనే… అలా గడిచిపోయాయి రోజులు. అయినా ఉత్తరాలు రాసుకోలేదని ఆగే బంధమేమీ కాదు కదా మనది. ఈ సారి ఇక నిన్ను వదిలేది లేదు. చూసావు కదా వాడిని… వాడు అక్కడే అమెరికాలోనే పుట్టి పెరిగాడు. చదువు అయిపోయింది. జాబ్ లో చేరేలోపల ఇక్కడ అందర్నీ కలిసి వెళ్దామని వచ్చాము. వీడు పుట్టిన రెండేళ్ళకు మా ఆయన పోయాడు. ఒక్కదానివీ ఇక్కడెందుకు అని మా అమ్మాయి నాక్కూడా అక్కడే గ్రీన్ కార్డ్ తీసుకున్నది. సిటిజెన్ షిప్ కూడా వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడే రావడం. నువిక్కడే ఉంటున్నావా?” తన వివరాలు క్లుప్తంగా చెప్పిన ఆమె అడిగింది బామ్మని.
“నేను ఊళ్ళోనే ఉంటున్నాను. ఇదిగో వీడి పరీక్షలకోసం వచ్చాను. రెండు, మూడు రోజుల్లో వెళ్ళిపోతాను” చెప్పింది బామ్మ.
“అయ్యో! నీతో మాట్లాడినట్లుగానే లేదే. మేమింకా నెల ఉంటాము. రేపొస్తాను మీ ఇంటికి. అమ్మలూ ఫోన్ నంబర్ ఇవ్వమ్మా” ధృతిని అడిగింది
చెప్పిన నంబర్ తన ఫోన్ లో ఫీడ్ చేసుకున్నది.
“మీ మనవలు సినిమ టైం అయిందంటున్నారు. మన చిన్నప్పుడు తెగ సినిమాలు చూసేవాళ్ళ కదా. అక్కడికి వెళ్ళాక సినిమాలు చూడటం కుదరక ఆ మోజే పోయింది. రేపు వస్తాను అన్ని ముచ్చట్లు చెప్పుకుందాము”
“ఎలాగూ వస్తానంటున్నావు కదా… భోజనానికే రా” ఆహ్వానించింది బామ్మ.
“వంట నువు చేయనంటే గ్యారంటీగా వస్తాను. ఏమే ధృతీ మీ బామ్మ ఇప్పటికైనా వంట నేర్చుకున్నదా? చిన్నప్పుడు మా ఇళ్ళకొచ్చినప్పుడు రకరకాల వంటలు చేసి చావగొట్టేది. ఇంట్లో వాళ్ళ నాన్న పొయి దగ్గరకెళ్తే కందిపోతుందని వెళ్ళనిచ్చేవాడు కాదు. పెళ్ళయ్యాక మీ తాత అంతకంటే అపురూపంగా చూసుకున్నాడు”
“ఇదిగో ఇప్పుడు వీడూ, వీడి తల్లీ నన్ను అస్సలు పని చేయనివ్వరే” నవ్వుతూ శివను చూపించింది.
“ఎలాగైనా నువు అదృష్టవంతురాలివే. నాకు చూడు అప్పటినుండి ఇప్పటివరకూ చాకిరీతోనే సరిపోతున్నది. అప్పుడు అత్తమామలకూ, ఇప్పుడు పిల్లలకు. అయినా దేనికైనా రాసుకునే పుడతాము కదా. రేపొస్తాలే. అదిగో నీ పిల్లలు నీ చేయి లాగుతున్నారు. వస్తానమ్మా” అందరికీ చెప్పి వెళ్ళిపోయింది.
ఒక్కసారిగా తుఫాను వెలసిన ప్రశాంతత ఆవరించింది ఆ ప్రదేశాన్ని.
“హమ్మయ్య! పద పద బామ్మా! మళ్లీ సినిమా మొదలవుతుంది” బామ్మ చేయిపట్టుకుని లాక్కెళ్తున్నట్లుగా తీసుకెళ్ళారు పిల్లలు.
విశ్వ వాళ్ళు కూడా బై చెప్పేసి వెళ్ళిపోయారు.
“పాప్ కార్న్ ఇప్పుడే వద్దులే. ఇంటర్ వెల్ లో తీసుకుందాము. పొట్ట ఫుల్ గా ఉన్నది” పాప్ కార్న్ తీసుకోబోతున్న ధృతి తో చెప్పింది బామ్మ.
“పర్లేదులే బామ్మా… ఇప్పుడలాగే అనిపిస్తుంది. కొద్దిసేపయ్యేసరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అయినా వీళ్ళూరుకుంటారా?” అంటూ మళ్ళీ అందరికీ కావాల్సినవి తీసుకున్నది.
సినిమా మొదలు కాకముందే లోపలికి వెళ్ళి కూర్చోమని చెప్పాడు దినేష్. అందుకే లైట్స్ ఉండగానే అందరూ లోపలికి వెళ్ళారు. వెనకాల రో, రిక్లైనర్స్ ఉన్నది తీసుకున్నది టికెట్స్. కూర్చోగానే అందరూ సీట్లను చాపుకుని కూర్చున్నారు. బామ్మకు చాలా నచ్చింది ఆ హాలు. “బాగుందే ఎక్కువమంది లేకుండా” హాలంతా కలియచూస్తూ చెప్పింది.
“అవును బామ్మా! ఇప్పుడన్నీ లిమిటెడ్ సీట్స్ తో ఉంటాయి హాల్స్. అందుకే హాల్ కూడా తొందరగా ఫుల్లు అవుతుంది. రేటెక్కువా… సీట్లు తక్కువాను” చెప్పింది.
ఇంతలో సినిమా మొదలయింది. కాళ్ళు బారా చాపుకుని, పాప్కార్న్ తింటూ మూవీని ఫుల్లుగా ఎంజాయ్ చేసింది బామ్మ.
సినిమా వదిలాక ఇక అందరూ ఏమీ తినలేము వద్దనుకుని ఇంటికి బయలు దేరారు. బాగా అలసిపోయి ఉన్నారేమో ఆర్తీ, కార్తీ నిద్ర కళ్ళతోనే కారెక్కారు. ఇంటికి వచ్చేసరికి మంచి నిద్దట్లోకి వెళ్ళిపోయారు.
ఆ రోజు విశేషాలన్నీ చెప్పింది బామ్మ కొడుకు కోడలితో.
“అన్నట్లు దినేష్… సువర్చల ఆంటీ గుర్తుందా?”
“గుర్తు లేకేమీ? మీ ఇద్దరూ కలిశారంటే తుఫానే, అని నవ్వుకునేవాళ్ళం” నవ్వుతూ గుర్తు చేసుకున్నాడు.
“అవును ఆ ఆంటీనే… ఇవ్వాళ మాల్ లో కలిసింది. అమెరికాలోనే ఉంటున్నదట. నిన్ను అల్లుడిగా చేసుకోలేకపోయిన లోటు, వాళ్ళ మనవడికి, మన ధృతిని చేసుకుని తీర్చుకుంటానంటున్నది. ఆ పిల్లాడు కూడా వచ్చాడు ఎంత బాగున్నాడనుకున్నావురా? ఒకవేళ అన్నీ బాగుంటే చాలా మంచి సంబంధం”
“చూదాము లేమ్మా… కలిసినప్పుడు ఫ్లో లో అనుకున్న మాటలు తర్వాత ఉండవు. అన్నట్లు మనవూరి కరణం గారి అమ్మాయి నిశ్చితార్ధానికి నిన్ను రమ్మని చెప్పటానికి ఫోన్ చేసారు. వచ్చే శుక్రవారమట. నువు తప్పని సరిగా ఉండాలట. నీ ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళావుగా. నేనే మాట్లాడాను”
“వచ్చే నెల అనుకున్నారు. అప్పుడే పెట్టుకుంటున్నారా? వెళ్ళకపోతే కరణం గారికి బాగా కోపం వస్తుంది. పిల్లల్ని కూడా తీసుకెళ్తాను. మీకు వీలయితే ఆ రోజు రండి. మీరొచ్చి కూడా చాలా రోజులయింది కదా? కొద్దిగా మజ్జిగ తాగుతాను. ఉందానే?” అడిగింది పూర్ణిమను”
“ఉన్నదత్తయ్యా…మీరు తాగుతారని నాకు తెలుసు కదా? అందుకే చేసుంచాను. తెస్తానుండండి” లోపలికి వెళ్ళి మజ్జిగ తెచ్చింది పూర్ణిమ.
మజ్జిగ తాగేసి గ్లాసు లోపల పెట్టి వచ్చింది. “ఇక పడుకుంటారా” చెప్పేసి బెడ్ రూం లోకి వచ్చింది.
ఆ రోజు రాత్రి పడుకుంటూ ధృతిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ థాంక్స్ చెప్పింది బామ్మ.
“ఎందుకు బామ్మా థాంక్స్”
“ఈ రోజు బాగా ఎంజాయ్ చేసామే. నాకు చాలా బాగుంది అందుకని”
“పో బామ్మా… దీనికి థాంక్స్ ఎందుకు? మేము కూడా ఎంజాయ్ చేసాము కదా? ఇక పడుకో” బామ్మ మీద చెయ్యేస్తూ చెప్పి కళ్ళు మూసుకున్నది ధృతి.
పొద్దున్నే ఫోన్ మోతకి మెలకువ వచ్చింది. “ఏమే రంగా… లొకేషన్ షేర్ చెయ్యి. ఇంకో అయిదు నిమిషాల్లో బయలుదేరుతున్నాము” అవతలనుండి సువర్చల గొంతు వినగానే ఉలిక్కిపడి లేచింది బామ్మ.
***********************************************************

7 thoughts on “ధృతి – 6

  1. Very good description…..ఒక్కసారి మళ్లీ AMB mall ku theesukellaavu…Glass lift…lo తిరిగిన ఉత్సాహం గుర్తొచ్చి థ్రిల్ ఫీల్ అయ్యాను…..characters ku పెట్టిన పేర్లు Excellent…. malls ku vachhae
    modern బామ్మలు మనకూ ఉంటే ఎంత బావుండేది….

      1. మా అమ్మ కూడా అలానే అన్ని చోట్లకు తీసుకెళ్ళేవాళ్ళం అందరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *