May 25, 2024

ధృతి – 7

రచన: మణి గోవిందరాజుల

“రంగా! అడ్రెస్ షేర్ చెయ్యవే… మేము రడీగా ఉన్నాము. మీ ఇంటికే బ్రేక్ ఫాస్ట్ కి వస్తున్నాము. నిన్న నీ మనవరాలిని చూసినప్పటినుండీ నా మనసంతా అమ్మాయి మీదే ఉన్నది. ఏమైనా సరే ఆ సంగతి తేల్చుకోవడానికే వస్తున్నాను, నా మనవడిని తీసుకుని…” అవతలనుండి పెద్దగా వినపడ్డ మాటలకు మత్తు పూర్తిగా వదిలింది. టైము చూస్తే ఇంకా ఆరు కూడా కాలేదు.
“ఒసే! సువ్వీ… బుద్ది ఉందటే? పొద్దున్నే తయారయ్యావు? కాస్తాగు. నేను లేచి మొహం అదీ అయ్యాక మా కోడలితో అడ్రెస్ షేర్ చేయిస్తాను. అయినా ఇంకా పిల్లలు కూడా లేవలేదు. ఎనిమిది తర్వాత బయల్దేరు. టిఫిన్ ఇక్కడే చేద్దురు గాని!” కోప్పడుతూనే ప్రోగ్రాం చెప్పింది.
“ఓయ్! రంగా… మగపిల్లాడివాళ్ళం. కాస్తంతన్నా మర్యాద లేకపోగా తిడతున్నావ్, ఏమొచ్చిందే?” లబ లబ లాడింది సువర్చల.
“నువు మగ పిల్లాడి తరపు అయితే నేను ఆడపిల్ల వాళ్ళం. కాలం మారింది. నువే నేర్చుకో మర్యాద” నవ్వుతూ తిప్పికొట్టింది. “సరేలే… మనకెప్పుడూ ఉండేదే కాని నేను ఫోన్ చేసాక రా” చెప్పి ఫోన్ ఆఫ్ చేసింది.
“దీని ఫోన్ చల్లంగుండ. కరదర్శనం కూడా చేసుకోలేదు” అనుకుంటూ రెండు చేతుల్నీ దగ్గరికి చేర్చి విప్పిన దోసిటను కళ్ళకద్దుకుని “కరాగ్రే వసతే లక్ష్మీ! కరమధ్యే సరస్వతీ! కరమూలే స్థితా గౌరీ ! ప్రభాతే కరదర్శనం” శ్లోకం చదువుకుని చేతులను కళ్ళకద్దుకుంది. “సముద్ర వసనే దేవీ పర్వతస్తవ మండలే! విష్ట్నుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే” మంచం దిగబోతూ ప్రభాత భూమి శ్లోకం చదువుకుని, వంగి భూమిని కళ్ళకద్దుకుని కాలు కిందపెట్టింది.
బామ్మ మాటలకు మెలకువ వచ్చి బామ్మ చేసేవన్నీ గమనిస్తున్న ఆర్తీ, కార్తీ “ఎందుకు బామ్మా, రోజూ అలా చేస్తావు?” కుతూహలంగా అడిగారు.
పిల్లలు ఏదన్నా కుతూహలంగా అడిగినప్పుడు అప్పుడే చెప్పకపోతే ఇక ఆ తర్వాత వాళ్ళకు అడగాలనీ, మనకు చెప్పాలనీ గుర్తుండదు. అందుకే లేచే ప్రతిపాదనను వాయిదా వేసుకుని ఇద్దర్నీ దగ్గరికి తీసుకున్నది.
“ఆర్తీ, కార్తీ… అరచేతిలో దేవుళ్ళందరూ కొలువై ఉంటారు, అని మన పెద్దలు చెప్తారు. లేవగానే మనమొహం అద్దంలో చూసుకున్నా, లేక ఇంకా ఎవరినన్నా చూసినా ఆ రోజు జరిగే శుభాశుభాలకు వాళ్ళో, మనమో బాధ్యులనుకుంటాము”
“అవునవును… అమ్మ ఎప్పుడన్నా షాపింగ్ సరిగా కాకపోతే ‘ఈ రోజు ఎవరి మొహం చూసానో’ అంటుంది. నాన్న వెంటనే ‘నీ మొహమే అద్దంలో చూసుకుని ఉంటావు’ అంటారు. అందుకేనేమో” కిసుక్కున నవ్వుతూ అన్నది ఆర్తి.
నవ్వింది బామ్మ. “అవన్నీ సరదాగా అనుకునేవి. అరచేతి వేళ్ళ అంచుల మీద లక్ష్మీదేవి, అరచేతి మధ్యలో సరస్వతీ దేవి, అరచేతి మూలలో అంటే బొటనవేలికింద ఎత్తుగా ఉన్నదే అక్కడ గౌరీదేవి తిష్ఠ వేసుకుని కూర్చుని ఉంటారని మన నమ్మకం.
“అందుకే మన చేతిలో ఉన్న దేవతలకు వందనం చేసి అరచేతిని కళ్ళకద్దుకుంటే అంతా శుభమే జరుగుతుంది అన్న పాజిటివ్ ఆలోచన మన మనస్సులో ఉండిపోతుంది. ఆ రోజంతా హాయిగా గడిచిపోతుంది. అందుకని చేతులను కళ్లకద్దుకుంటూ ఆ శ్లోకం చదువుకోవాలి” చెప్పింది బామ్మ.
“బాగుంది… బాగుంది… మేము కూడా నేర్చుకుంటాము. మరి భూమికి దండం పెట్టావెందుకు? అడిగాడు కార్తి.
“భూమాత అంటే విష్ట్నుమూర్తి భార్య. అంటే మనందరమూ కొల్చుకోవలసిన దేవత. అందుకని పొద్దున్న లేస్తూనే ‘అమ్మా! నమస్కారములతో నిన్ను ప్రార్థించుచున్నాను… నిన్ను నా కాళ్ళతో అపవిత్రం చేస్తున్నందుకు నన్ను క్షమించు తల్లీ’ అని ప్రార్థన చేసుకుని కాలు కిందపెట్టాలి. అది మనం ఆ దేవతలకు ఇచ్చే గౌరవం అన్నమాట.”
“ఇదికూడా బాగుంది. మేము కూడా అలానే చేస్తాము బామ్మా, మాకు నేర్పించు!”చెప్పారు ఇద్దరూ.
“మీ నాన్నకూ, అక్కకూ కూడా నేర్పించానురా… ఇద్దరూ కొన్నాళ్ళు చేసి మానేసారు. మీరు కూడా అలానే చేస్తారా?” అడిగింది.
“లేదు బామ్మా! నిజ్జంగా మేము రోజూ చేస్తాము. నేర్పించు… నేర్పించు” ఉత్సాహపడ్డారు ఇద్దరూ.
వీళ్ల హడావుడికి నిద్ర లేచిన ధృతి ఆ మాటలు విని “సారీ! బామ్మా… ఇకనుండి నేను కూడా వీళ్ళతో చేస్తాను. ప్రామిస్” అన్నది.
“పోవే… నువ్వూ నీ మాటలు… ఇప్పటివరకే. ఇప్పటికే కొన్ని వందలసార్లు ప్రామిస్ చేసావు” వెక్కిరించింది.
“నిజ్జం బామ్మా… ఈ సారి నేను వాళ్ళతో కూడా ప్రాక్టీస్ చేయిస్తాను… ప్లీప్లీప్లీ… ప్లీజ్ బామ్మా!”కాళ్ళు పట్టుకుంటున్నట్లుగా యాక్షన్ చేసింది. ఆర్తీ కార్తీ పగలబడి నవ్వారు. వాళ్ళకు అక్క ఏది చేసినా అపురూపమే.
తానుకూడా నవ్వి ధృతి నెత్తిమీద ఒక మొట్టికాయవేసింది బామ్మ. తర్వాత ఒకసారి వాళ్ళతో చదివించి బయటికి వచ్చింది.
అప్పటికే లేచి డికాక్షన్ వేస్తున్న పూర్ణిమ అత్తగారిని చూసి నవ్వింది. “మొహం కడుక్కొని రండి అత్తయ్యా. ఫ్రెష్ గా డికాక్షన్ రడీ” చెప్పింది.
“ఇప్పుడు మా ఫ్రెండు సువర్చల, నిన్న చెప్పానే వాళ్ళు వస్తామన్నారు. నంబరిస్తాను. వాళ్ళకు అడ్రెస్ షేర్ చెయ్యాలట” కోడలిచ్చిన కాఫీ అందుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ చెప్పింది.
ఉలిక్కిపడింది పూర్ణిమ. “ఇప్పుడా? ఇంతపొద్దున్నే?” ఆశ్చర్యంగా అడిగింది.
“ఇంకా పొద్దున్నే వస్తామన్నారు. నేనే అరిచి ఆపేసాను. దానికి మన ధృతి బాగా నచ్చిందట. రాత్రి సరిగా నిద్ర కూడా పోయుండదు. అందుకని లేవగానే అడగడానికి వస్తున్నామని ఫోన్ చేసింది” కాఫీ ఒక గుటక వేసి “అబ్బ! సూపరుందే కాఫీ!” అన్నది.
“అదేంటత్తయ్యా? అదింకా డిగ్రీ చదువుతున్నది. చదువు పూర్తికాకుండానే పెళ్ళా?” ఆశ్చర్యంగా, కోపం బయటపడనీయకుండా అడిగింది.
కనబడనీయలేదని పూర్ణిమ అనుకున్నా అనుభవశాలికి అర్థం కాదా? “లేదు లేవే? వాళ్ళకేమన్నా మనం మాట ఇచ్చామా? వస్తామన్నారు… సరే రమ్మన్నాను. టిఫిన్ తిని వెళ్ళిపోతారు. కంగారుపడకు” భరోసా ఇచ్చింది.
“హమ్మయ్య!” మనసులోనే అనుకున్నది. “ఇడ్లీ పిండి ఉన్నది. బాగా టమాటాలు, ఉల్లిపాయలు వేసి రవ్వ తిప్పుతాను. చట్నీ, సాంబార్, పొళ్ళు ఉన్నాయి. సరిపోతాయాండి? ఇంకా ఏమన్నా ఐడియా ఇవ్వండి”
“సరిపోతాయిలే… నిన్న చేసిన గులాబ్ జామూన్స్ ఉన్నాయిగా?”
“అవా? ఎప్పుడో ఖాళీ చేసారు. సేమ్యా పాయసం చేస్తాను”
“చాల్లే! నేను స్నానం చేసి వస్తాను” లేచి వెళ్ళిపోయింది బామ్మ.
“అమ్మా!” పిలుస్తూ ముగ్గురు పిల్లలూ వచ్చారు. వాళ్ళకు కావాల్సినవి ఇచ్చి “ధృతీ! నిన్న మీకు మాల్ లో కలిసిన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారట. వాళ్ళకు బామ్మ ఫోన్ నుండి లొకేషన్ షేర్ చెయ్యి”
“ఇంత పొద్దున్నేనా?”
“అవును. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారట. బామ్మ ఫ్రెండ్ కదా? నాన్న కూడా చిన్నప్పటినుండి తెలుసు కదా? చూట్టానికి వస్తున్నారు, బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారట. నాన్నను కూడా లేపి చెప్పు” అసలు సంగతి చెప్పలేదు పూర్ణిమ, అప్పుడు చూసుకోవచ్చులే అని
“సరేలే! పదండ్రా… మనం స్నానాలు చేద్దాము” పిల్లల్ని తీసుకుని తమ రూం వేపు వెళ్తూ “ఆర్తమ్మ… రేయ్ కార్తీ నాన్నను లేపి మీరు స్నానానికి రండి. ఈ లోపు నేను చేసేస్తాను” వాళ్ళను తండ్రి రూం లోకి పంపి తన రూం కి వెళ్ళింది ధృతి.
“రండాంటీ… బాగున్నారా? చాలా ఏళ్ళయింది, మిమ్మల్ని చూసి” లోపలికి ఆహ్వానిస్తూ చెప్పాడు దినేష్.
“అవును దినేష్, మా అమ్మాయి పెళ్ళిలోనే నిన్ను చూట్టం. అబ్బో! ఆ తర్వాత జీవితం చాలా మలుపులు తిరిగిందిలే. ఇదిగో ఇప్పుడు వీళ్ళతోనే అమెరికాలో ఉంటున్నాను. వీడు నా మనవడు కిశోర్” పక్కనే ఉన్న మనవడిని చూపిస్తూ అన్నది సువర్చల.
అతన్ని చూస్తూనే విభ్రాంతికి గురయ్యాడు దినేష్. మగవాళ్ళల్లో అంత అందం ఉంటుందని ఎవరన్నా చెప్తే నమ్మేవాడు కాదు. కాని ‘ఇదిగో మగవాళ్ళ అందం ఇలా ఉంటుంది’ అని చూపించటానికి ఇతను ఉన్నాడు అనిపించింది.
“నమస్తే అంకుల్” కొద్దిగా వంగి పాదాలు నమస్కారం పెడుతున్నట్లుగా అన్నాడు కిశోర్.
“రా! బాబూ… కూర్చో. ఆంటీ కూర్చోండి. ఏమోయ్! పూర్ణా… ఆంటీ వాళ్ళొచ్చారు” లోపలికి చూస్తూ కేకేసాడు.
“వస్తున్నానండీ!” అంటూనే లోపల్నుండి వచ్చింది పూర్ణ. వస్తూనే ఎదురుగుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న కిశోర్ ని చూస్తూనే, రకరకాల భావాలు మదిలో మెదులుతుండగా, మాటలు రానట్లుగా ఉండిపోయింది.
“ఏమ్మా! బాగున్నావా? నిన్ను నీ పెళ్ళిలో చూడటమే. మళ్ళీ ఇప్పుడే చూట్టం”
“అబ్బా! అమ్మమ్మా… నిన్నటినుండీ ఇదేమాట వినీ వినీ బోర్ కొట్టింది. నమస్తే ఆంటీ. మా అమ్మమ్మ రాత్రంతా నన్ను నిద్ర పోనివ్వలేదు. తెల్లారేసరికి రడీ అయిపోయింది” నవ్వుతూ అన్నాడు కిశోర్.
“అప్పుడే పెళ్ళా” అని తాను అత్తగారితో అన్న మాటలు మర్చిపోయింది పూర్ణ. “అబ్బ! ధృతికి సరిజోడు” అనుకుంది పూర్ణ.
“మా రంగడేడి?” నవ్వుతూ అడుగుతూనే లోపలికి వెళ్ళడానికి లేచింది సువర్చల.
“కూచో… కూచో… వస్తున్నా… పొద్దున్న పొద్దున్నే తినడానికి వస్తున్నానంటివి. మరి నీ కోసం స్పెషల్స్ చేయొద్దూ? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను” నవ్వుతూ బయటికొచ్చింది బామ్మ.
“అమ్మా! పూర్ణమ్మా… రక్షించు తల్లీ… అన్నపూర్ణమ్మ తల్లీ… మీ అత్తగారి బారి నుండి రక్షించు తల్లీ” భయంగా అన్నట్లుగా యాక్షన్ చేసింది.
“పోవే… రుచి చూసి అదుర్స్ అంటావ్. ఎందుకంటే మా కోడలు చేసింది కాబట్టి”
“హమ్మయ్య బతికించావ్. ఏదీ మా మనవరాలు?” అటూ ఇటూ చూస్తూ అడిగింది.
“వస్తార్లే ఇంకా ఏంటి సంగతులు” స్నేహితురాలి పక్కన కూర్చుంటూ అడిగింది.
“బామ్మా! నిన్నటినుండి నా ప్రాణం తీసింది మా అమ్మమ్మ. నన్ను సరిగా నిద్ర కూడా పోనివ్వలేదు” స్వచ్ఛంగా నవ్వుతూ అంటున్న కిశోర్ ని పరిశీలనగా చూసింది. అతనికి ఏమీ చెప్పకుండా తీసుకుని వచ్చిందని అనిపించింది.
“మీ అమ్మ పెళ్ళికి ముందరివరకు మా స్నేహం వయసు నలభై ఏళ్ళు. పిల్లల పెళ్ళిళ్ళయ్యాక దారులు వేరయ్యాయి. ఇప్పుడై అయినా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నువ్వుండి తీసుకొచ్చావు. ఇంకా సంతోషం. రావే మనం లోపలికి వెళ్దాము. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు” చెప్తూ సువర్చలని డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళింది బామ్మ.
“ఏమి చేస్తున్నావు బాబూ?” అడిగాడు దినేష్. దినేష్ కి మరీ మరీ నచ్చుతున్నాడు కిశోర్. మాటా, మర్యాదా, చక్కటి చిరునవ్వూ… పెర్ఫెక్ట్ పెళ్ళికొడుకు.. మనసులో అనుకున్నాడు. నిన్న తల్లి చెప్పిన మాట మనసులో మెదిలింది.
“ఎంబీయే అయిపోయిందండీ. జాబ్ వచ్చింది. కానీ ఇక్కడ ఒకసారి అందర్నీ చూపించమని మా అమ్మమ్మ అడిగింది. అందుకని అందరం వచ్చాము. ఇంకో వారంలో టూర్ అయిపోతుంది. రేపు బెంగళూరు వెళ్తున్నాము. అందుకని ఈ రోజంతా మీతో ఉంటానని అన్నది. నాకు వేరే ఫ్రెండ్ తో పదింటికి అప్పాయింట్ మెంట్ ఉన్నది. ఇప్పుడెళ్ళి, సాయంత్రం వచ్చి అమ్మమ్మను తీసుకెళ్తాను” వివరంగా ప్రోగ్రాం చెప్పాడు కిశోర్.
“హై కిశోర్, హౌ ఆర్ యూ?” పలకరిస్తూ హాల్లోకి వచ్చింది ధృతి.
“హై ధృతీ. హౌ ఆర్ యూ?” తనూ పలకరించాడు కిశోర్. ఇద్దరూ కాలేజీ ముచ్చట్లలో ముణిగిపోయారు.
లేత గోధుమరంగు చుడీదార్ మీద ఎర్రటి చున్నీ వేసుకుంది. చెవులకు లోలాకులు, నుదుటిన చిన్న బొట్టు, చేతులకు ఒక్కో గుండ్రటి గాజు. పెదాలకు లిప్ స్టిక్ లేదు. కళ్ళకు మస్కారా లేదు. ఎటువంటి మేకప్ లేకుండానే అందం వెల్లి విరుస్తున్నది ధృతిలో.
కిశోర్, ధృతిల సంభాషణ చాలా సహజంగా ఎన్నో రోజులనుండి తెలిసిన స్నేహితులు మాట్లాడుకున్నట్లుగా ఉన్నది. అమెరికాలోని యూనివర్శిటీల గురించి అడుగుతూ, ఎలా అప్ప్లై చేసుకోవాలో అడిగింది ధృతి. అన్నిటి గురించీ చక్కగా చెప్పాడు కిశోర్.
ఇప్పటి వరకు ఏ మగవాడైనా తనను చూడగానే ఒక రకమైన మెచ్చుకోలుతో చూసారు. ఫస్ట్ టైం ఒక మగాడు తనని ఒక ఫ్రెండ్ లా చూసి మాట్లాడ్డము చాలా నచ్చింది ధృతికి. అందుకే తాను కూడా ఫ్రీగా ఉన్నది.
“ఏమర్రా! టిఫిన్ చేద్దాము రండి!” లోపల్నుండి కేకేసింది బామ్మ.
“అమ్మమ్మా! నేను మళ్ళీ సాయంత్రం అయిదుకి వస్తాను. వచ్చేముందు ఫోన్ చేస్తాను బయటికి వచ్చేయ్. మనం ఆరింటికి మామా వాళ్ళింటికి వెళ్ళాలి గుర్తుంది కదా?” చేయి కడుక్కుని టిష్యూ తో మూతి అద్దుకుంటూ చెప్పాడు కిశోర్.
“ఆంటీ ఎక్సలెంట్ ఫుడ్. రియల్లీ ఎంజాయ్డ్. బై ఆల్. బై ఆర్తీ, కార్తీ” అందరికీ చెప్పి సెలవు తీసుకున్నాడు కిశోర్.
కొద్దిసేపు మాట్లాడి “అమ్మా! స్పెషల్ క్లాస్ ఉన్నది. నేను కూడా వెళ్తాను. వెళ్ళొస్తాను బామ్మా, అమ్మమ్మా!” ఇద్దరికీ చెప్పి బ్యాగ్ అందుకుని బయటికి వచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది ధృతి.
“దినేష్! ముసుగులో గుద్దులాట ఎందుకు? నేనొచ్చింది మా కిశోర్ కి మీ ధృతిని ఇమ్మని అడగడానికి. నేనూ… ఏదైనా సూటిగానే అడుగుతాను. ఇక మా వివరాలంటావా? కిశోర్ కాక ఇంకోడున్నాడు. వాడిప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. మా అల్లుడు, కూతురు అక్కడికెళ్ళాక బాగా సంపాదించారు. అక్కడో రెండు మూడిళ్ళే కాక ఇక్కడ కూడా ఆస్తులున్నాయి. పెద్దగా ఎందులోనూ జోక్యం చేసుకోని తత్వం నా కూతురిది, అల్లుడిది”చెప్పింది సువర్చల.
పూర్ణిమ, దినేష్ లిద్దరూ మనసులో సంతోషపడిపోయారు. అదృష్టం కాళ్ళ దగ్గరకి వచ్చింది అనిపించింది.
“ఇంకో మాట. అమ్మాయి చదువు కాలేదని వద్దనుకోవద్దు. చదువు అయ్యాకే పెళ్ళి చేద్దాము. నా మనవడు అని చెప్పటం కాదు కాని , అందగాడే కాక చాలా బుద్ధిమంతుడు. అత్త, మామ పోరుండదు. నీ సంగతి నాకు చిన్నప్పటినుండీ తెలిసిందే…”
నిశ్శబ్దంగా ఆమె చెప్పేది విన్నారు ఇద్దరూ. ఆర్తీ కార్తీ బయట ఆడుకోవటానికి వెళ్ళారు. శివా కూడ హాల్లో ఓ పక్కన కూర్చున్నాడు.
“ఏమంటావు రంగా?” స్నేహితురాలిని అడిగింది సువర్చల.
“నువు ఇప్పుడే కదా చెప్పావు. వాళ్ళను ఆలోచించుకోనివ్వు. ముఖ్యంగా మా ధృతి స్వతంత్ర భావాలున్న పిల్ల. దాని అభిప్రాయం కూడా కనుక్కోవాలి కదా?”
“కనుక్కోండి. కనుక్కున్నాకే చెప్పండి. నా కూతురిలా చూసుకుంటాను. ప్రపంచంలోకెల్లా అదృష్టవంతురాలవుతుంది నీ బిడ్డ. ఈ మొత్తం బాధ్యత నాకే ఇచ్చారు నా అల్లుడూ, కూతురూను. అందుకే నేను ఇంతగా పాకులాడుతున్నాను…”
అప్పటివరకు మనసులో ఉన్న సందేహం తీరింది ఇద్దరికీ.
“అయినా సరే ఆంటీ! ధృతిని అడిగాకే మీకు ఏ సంగతీ చెప్పగలను. పైగా కిశోర్ తో మీరింకా చెప్పినట్లు లేరు. అతని అభిప్రాయం కూడా మీరు కనుక్కోవాలి కదా? తీరా మేము ఒప్పుకున్నాకా ఆ అబ్బాయి నో అంటే బాగుండదు కదా ఆంటీ?”
“లేదు దినేష్, నేను వాడితో చెప్పాను”
“చెప్పాను అంటున్నారు. ఒప్పుకున్నాడా కిశోర్”
“ఒప్పుకోకపోతే ఇక్కడిదాకా ఎలా వస్తాడు? వాడితో చెప్పాకే వాణ్ణి తీసుకుని వచ్చాను” కాని ఈ సారి ఆమె మాటల్లో కొద్దిగా కంగారు ధ్వనించింది.
“ఏదైనా ఆంటీ! మీరు ఖచ్చితంగా ఏ సంగతీ చెప్పేవరకు నేను మా అమ్మాయిని అడగలేను. మీరు చెప్పినట్లుగా కిశోర్ ని పెళ్ళి చేసుకున్నవాళ్ళు అదృష్టవంతులవొచ్చు. కాని చదువు తప్ప వేరే ప్రపంచం లేనట్లుగా ఉన్న నా కూతురికి ఆశలు కల్పించలేను కదా? కాని మీకు అవునన్నా కాదన్న పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఏమనుకోకండి ఆంటీ” ఆ అబ్బాయి ఎంత నచ్చినా ప్రాక్టికల్ గా ఆలోచించాడు దినేష్.
ఎవ్వరూ గమనించలేదు కాని సువర్చల పడ్డ కంగారు శివ దృష్టిలో పడింది. ఆలోచనగా తల పంకించాడు.
సాయంత్రం వరకు సరదాగా పూర్వపు కబుర్లన్నీ చెప్పుకున్నారు స్నేహితురాళ్ళిద్దరూ. మధ్య మధ్య కాఫీలూ, స్నాక్స్ మామూలే. కూతురికున్న ఆస్తుల వివరాలన్నీ చెప్పింది సువర్చల. విని ఊర్కున్నదే కాని ఆహా, ఓహో అనలేదు బామ్మ.
అమెరికా కబుర్లన్నీ కుతూహలంగా విన్నారు ఆర్తీ కార్తీ. సాయంకాలం అవుతూనే టైం ప్రకారం వచ్చాడు కిశోర్. వచ్చేముందే ఫోన్ చేయటం వల్ల మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పి బయటికి వచ్చింది సువర్చల. అందరూ బై బై చెప్తుండగా కారు కదిలింది.

**********************
“హేయ్! ధృతీ ఇంత లేట్ గా వచ్చావేంటి?” అప్పటిదాకా చూసిన ఎదురుచూపులు ఫలించినట్లుగా ఎదురొచ్చాడు విశ్వ.
“ఏమి చెప్పమంటావ్? నిన్న మాల్ లో కలిసిందే ఆవిడ, వాళ్ళ మనవడు పొద్దున్నే తయారయ్యారు. ఆవిడ ఇంకా ఇంట్లోనే ఉన్నది. నేను స్పెషల్ క్లాస్ ఉందని వచ్చేసాను” స్కూటీ పార్క్ చేస్తూ చెప్పింది.
ఉలిక్కిపడ్డాడు విశ్వ. ‘ఏంటీ!! ఆవిడ వచ్చిందా? నేను అనుకుంటూనే ఉన్నాను…” నాలిక్కరుచుకున్నాడు
“నువ్వనుకున్నావా? ఏమని?” ఆశ్చర్యంగా అడిగింది.
“అదే నిన్న నీ నంబరు తీసుకుంది కదా? మీ ఇంటికి వస్తుందని అనుకున్నాను” సర్దుకున్నాడు.
కొద్దిగా టీజ్ చేద్దామనిపించింది. “ఎందుకొచ్చారో తెలుసా? నన్ను వాళ్లమనవడిని చేసుకొమ్మని అడగడానికి” కళ్ళల్లో చిలిపితనం చిందులేసింది.
“నువ్వేమన్నావు?” అదేదీ గమనించే స్థితిలో లేడు విశ్వ. అందుకే ఆతృతగా అడిగాడు.
“నేనా? నేనేమంటాను? మీ ఇష్టం నాన్నా అని చెప్పేసి వచ్చాను” పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
పురుషుని కళ్లల్లోని భావం , అది ప్రేమా, కామమా, మోహమా అనేది ఆడపిల్లలు ఇట్టే గమనిస్తారు. దానిని బట్టే వాళ్ళను గౌరవిస్తారు.
మొదటినుండీ తనను విశ్వ చూసే చూపుల్లో ఆరాధనే తప్ప ఎన్నడు అతి కనపడలేదు. హద్దులు మీరని అతని ఆరాధన గౌరవాన్ని ఇస్తున్నది ధృతి ఆలోచనల్లో. అందుకే విశ్వ ఆతృతని ఎంజాయ్ చేస్తున్నది.
ప్రతి సంవత్సరం కష్టంగా ఉన్న సబ్జెక్ట్స్ జూనియర్స్ కి చెప్పటం అలవాటు విశ్వకి. అతనికి సాయంగా ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. ఈ రోజు అలా అనుకునే క్లాస్ పెట్టుకున్నారు.
సాయంత్రం ధృతి ఇంటికొచ్చేప్పటికి సువర్చలా వాళ్ళు వెళ్ళిపోయారు.

******************

5 thoughts on “ధృతి – 7

  1. Druthi anni parts chaduvutunnaani chalaa prasaantam gaa saagutunnadi alalu leni samudram laaga
    Prati serial lo oka aada vilan leni serial lu levasalu ippaty varaku kaani druthi lo aada vilan lu lekundaa inni episods avatam aahcharyam gaavundi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *