March 19, 2024

మనిషి ఎదుట మాట్లాడితే…

రచన: కంచరాన భుజంగరావు

కొమ్మలపైనుండి లేచినప్పుడు
రెక్కలున్న పచ్చనాకుల్లా అనిపిస్తాయి
దొండపండులాంటి ముక్కులుండబట్టి
సరిపోయింది
లేకుంటే, ఆకుల్లో ఆకుల్లా ఉన్న
వీటి ఆనవాలు
పట్టుకోవడం కూడా కష్టమయ్యేది

వీటి చురుకైన మొహంలో
ఎన్నెన్ని చలాకీ నవ్వులాటలో!
ముక్కూ ముక్కూ రాసుకుని
మురిపెంగా సిగ్గుపడినప్పుడూ…
దోరజామకాయలతో ఇష్టంగా
ఎంగిలి పడినప్పుడూ…
వీటి ఎరుపు ముక్కు మురిపెం
మరింత పలకమారుతుంది!

మెడచుట్టూ బంగారు తొడుగులా
అమరిన రింగుతో
రాజకుటుంబీకుల్లా ఉంటాయి
దివ్యమైన తేజస్సు వర్చస్సుతో
పచ్చని ఈకల పసిమి కొమ్మల్లా
ప్రకాశిస్తుంటాయి
రోజంతా తమలో తాము
కిచకిచా మాట్లాడుకుంటాయి
వాగుడుకాయల్లా పగలంతా వాగి
చీకటి పడగానే పిచ్చి కలలు కంటాయి
లోగొంతులో వెన్నెల నీడలతో
నిశ్శబ్దంగా సంభాషిస్తాయి

తమలో తాము
మాట్లాడుకున్నంత వరకు
రెక్కలెగరేస్తూ స్వేచ్ఛగానే ఉంటాయి
పలుకు మాటగా మారి
పొరపాటున మనిషి చెవిలో పడితే
రెక్క మూసుకుని
పంజరంలో పడుంటాయి
పాపం,చిలుకలు…!
మనిషి ఎదుట మాట్లాడితే
బందిఖానా ఖాయమని
ఎప్పుడు తెలుసుకుంటాయో!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *