March 19, 2024

మోదుగ పూలు .. 5

రచన: సంధ్యా యల్లాప్రగడ

సోమవారం సాయంత్రం స్కూలు అయ్యాక వివేక్‌ నెమ్మదిగా వెతుకుతూ చంద్రయ్య దగ్గరకు వెళ్ళాడు.
“తాతా! నీతో మాట్లాడాలి. నీకు టైం ఉన్నప్పుడు నా రూముకు రాగలవా?” అడిగాడు మృదువుగా.
“సరే సార్!” చెప్పాడు చంద్రయ్యతాత.
వివేక్‌ మరుసటి రోజు లెసన్స్ చూసుకోవటానికి వెళ్ళిపోయాడు.
గంట తరువాత తాత వచ్చి తలుపు కొట్టాడు.
వివేక్‌ తలుపు తీసి తాతను ఆదరంగా ఆహ్వానించాడు.
“తాతా! కూర్చో” బల్లను చూపాడు.
చంద్రయ్యతాత కూర్చున్నాడు. “చెప్పు సార్‌ ఏం విషయం!” అడిగాడు నవ్వుతూ.
“తాతా! నేను గిరిజనుడ్ని. నా చదువు హాస్టల్ అంతా గిరిజన సర్టిఫికేటుపైననే నడిచింది. కాని నిన్న సంతకెళ్ళి వచ్చే వరకూ గిరిజనులకు మరో భాష ఉందని కూడా తెలియదు” విచారంగా చెప్పాడు.
చంద్రయ్య తాత ఆశ్చర్యపోయాడు. “అదేంటి అది కూడా మీ నాయన చెప్పలేదా? పట్నం పోయిన పిల్లలు మన భాష రాదని విన్నాను కాని ఇట్ల ఉంటదని కూడా తెల్వదా?” విస్తుపోతూ అన్నాడు.
వివేక్‌ తల ఊపాడు కాదన్నట్లుగా, తెలీదన్నట్లుగా.
“మేము తండాలో చాలా వింటాం. పిల్లలు మారిపోతున్నారు. చదువులకు పోయి మన కట్టుబాట్లు, కట్టు అన్ని మరిచిపోతున్నారని. మీ నాయన ఏడున్నాడు?” అడిగాడు తాత.
“లేడు. చచ్చిపోయాడు. నేను టెన్తులో ఉన్నప్పుడు” అన్నాడు విచారంగా వివేక్.
“మీ అమ్మ ఆదివాసేనా?” అడిగాడు చంద్రన్నతాత.
“అవును కానీ ఆమెకేమీ తెలీదు” చెప్పాడు వివేక్.
“తెలిసుంటది. కానీ చెప్పలేదు. ఎందుకో…..” ఆలోచనగా అన్నాడు.
“చాలా వరకు తెలుగులో తర్వాత ఇంగ్లీషు నేర్చేసరికి మన పోరలు అలసిపోతారు. ఇంక వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడే ఓపికేడుంది. అది సరే కాని మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలొచ్చేదా?”
“లేదు తాతా”
“మీ నాయన అడవినుంచేనా? చాలా మంది ఊర్ల కూడా ఉన్నారు. గిరిజనులంటే ఆదివాసి గుట్టలలో, అడవులలో, ఊర్ల కూడా ఉన్నారు. మీరెక్కడోళ్ళో” అంటూ ఆగాడు వివేక్‌ వైపు చూస్తూ.
“తెలీదు. నాయన మాత్రం అడవిని తలచుకు ఏడ్చేవాడు అప్పడప్పుడు!” చెప్పాడు వివేక్.
“మీ గోత్రం తెలుసా?” అడిగాడు తాత.
“గోత్రమంటే?” ఎదురడిగాడు వివేక్.
తాత పకపకా నవ్వి “బాగుంది గోత్రం కూడా తెలీదు. నీకు మీ పుర్వీకులెవరో… ఎక్కడోళ్ళో ఎట్ల తెలుస్తుంది? సరే మీ అమ్మ, నాయనలకు ఏమైనా పచ్చ బోట్లు ఉండేనా? మీ ఇంట్ల ఉన్న దేవుళ్ళెవరు?”
“నాకేమీ తెలీదు. పచ్చ బొట్టు కూడా నాకు గుర్తులేదు” చెప్పాడు వివేక్.
“అవునా. నీకు పచ్చేమైనా ఉందా?” అడిగాడు తాత.
“లేదు!” చెప్పాడు వివేక్‌.
దగ్గరగా వచ్చి ముక్కను పరిక్షగా చూశాడు తాత. ఆయనకు ఏమీ కనపడలేదు.
“మీ నాయన ఎందుకో నీవు గిరిజనుడవని తెలీకూడదనుకున్నాడు. అట్లే ఉండేలా పెంచ్చాడులావుంది. సరే చుద్దాం మల్లోస్తా!!” అంటూ వెళ్ళిపోయాడు తాత.

****

వివేక్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ‘ఏ కారణంతో తండ్రి ఇంత గోప్యంగా ఉంచాడు’ అనుకున్నాడు.
అంతా అగమ్యగోచరంగా అనిపించింది. సాగర్‌ వచ్చి పిలిచే వరకూ కదలలేదు వివేక్.
లేచి వెళ్ళి అందరితో కలసి భోం చేశాడు వివేక్.
ఆనాటి నుంచి తన పని తను చేసుకుంటున్నా మనస్సులో ఒక దిగులు ప్రవేశించింది. రోజు రోజుకు అది పెరగసాగింది. మరో వారము గిర్రున తిరిగింది. ఆ ఆదివారం అందరు టీచర్లు కలసి పిక్‌నిక్ వెళ్ళాలని ప్లాను చేశారు.
“పోచిర జలపాతమని ఇక్కడికి దగ్గరే మన జీపులో వెళ్ళవచ్చు” అన్నారు వివేక్‌తో.
వివేక్ కూడా వచ్చి జీపులో కూర్చున్నాడు. చైతన్యకు బండి ఉంది. అతను మరో టీచరు కలసి బండి మీద వచ్చారు. అందురూ కలసి అడవిలో వెళ్ళారు. అక్కడికి కొంత దూరము జీపు వెడుతుంది. తరువాత రెండు కిలోమీటర్లు నడవాలి. అందరూ జోకులేసుకుంటూ నడుస్తూ సాగారు. మధ్యలో చేలకు అడ్డం పడి నడిచారు.
అక్కడ గోదావరి నది రాళ్ళ మీదుగా జాలువారుతూ గలగలలు చేస్తూ ప్రవహిస్తోంది. ఆ చప్పుడు,
వీళ్ళు నడిచి వచ్చే దారిలో వినపడుతోంది.
ఆ దారి సీదా సాదాగా లేదు. ఎగుళ్ళు, దిగుళ్ళు… రాళ్ళు, గుట్టలు. నెమ్మదిగా పాకుతూ, ఎక్కుతూ నీటి వైపుకు సాగారు. కొన్ని చోట్ల పూర్తిగా బురదగా ఉంది. దాని దాటటానికి ఇబ్బంది పడి అడుగులు జాగ్రత్తగా, నెమ్మదిగావేస్తూ, నడుస్తూ గోదావరి నది ఒడ్డుకు చేరారు.
వీళ్ళకు దారి చూపెడుతూ చంద్రయ్య తాత ముందుగా నడుస్తున్నాడు. ఆయన వద్ద లంచ్‌ సరంజామా కూడా ఉంది. అయినా అందరికన్నా ముందు చకచకా వెళ్ళిపోతుంటే ఈ యువ టీచర్లు నానా అగచాట్లు పడ్డారు తాతను ఫాలో అవటానికి.
నదిని చేరాక ఆ తీరు మారిపోయింది. ఆ నీళ్ళు చూసాక అందరూ కేరింతలు కొడుతు నీటిలోకి దిగారు.
వివేక్ మనస్సులో దిగులు మరిచి ఆ నదిని, ఆ జలపాతాన్నీ ఆస్వాదించాడు. చాలా సేపు నీళ్ళలో చెలగాటలాడి ఒడ్డుకు చేరారు.
చంద్రయ్య తాత అందరికీ భోజనాలు అందించాడు. అందరూ తిని, టీ త్రాగి కొంచం సేపు ఆటలాడారు.
“వానా కాలము మనమీ నీటిలో దిగలేము. ఈ ప్రవాహము చాలా వేగంగా ఉంటుంది” అన్నాడు మధు.
“అవును. కాని ఈ ఆదివాసి పిల్లలు ఎంత వేగవంతమైన ప్రవాహమైనా ఈదుతారు. వీళ్ళని చూస్తే నాకెంతో వింతగా ఉంటుంది” అన్నాడు చైతన్య.
అందరూ అవునవునంటూ తలలు ఊపారు.
“గిరిజనుడికి అడవి స్వగృహం. అతని పుట్టినిల్లైనా, ఊయలైనా అడవే. అడవిలోని మిగిలిన జంతువులతో పాటుగా గిరిజనులూ అడవి ఒడిలో పెరుగుతారు. ప్రాణులన్నీ అడవిలో ఉన్న వనరులను వాడుకోవటమన్నది అక్కడి సూత్రం. ఎవరి హక్కులు వారివి. అడవిలో ప్రతి చెట్టు అతనికి తెలుసు. అడవిలో ప్రతీ పక్షి కూత అతనికి తెలుసు. అతను అడవిని ప్రేమిస్తాడు. షికారు కోసమో, వినోదము కోసమో అతను అడవి జంతువులను వధించడు. తోచక చెట్లు నరకడు. అతను ప్రకృతి బిడ్డ. అడవి అతనిని కన్నతల్లిలా లాలించి సంరక్షిస్తుంది. అతనికి ఈతే కాదు, కొండలెక్కడం, దూకటం పర్వతాలపైన నుంచి దూకటం అన్నీ అతనికి వెన్నతో పెట్టిన విద్య. మనము ఇంత కష్టపడి దేకుతూ వచ్చామా… కానీ తాత చూడండి మన కంటే ముందే ఎంత ఈజీగా ఇంత బరువు పట్టుకు వచ్చాడు. అదే మరి గిరిజనులంటే. మనం వాళ్ళ ముందు పనికిరాం నిజానికి” అన్నాడు సాగర్.
అందరు అంగీకారముగా తలలు ఊపారు.
అందరూ మళ్ళీ తిరిగి పాఠశాల వైపు బయలుదేరారు. వెనక్కు చేరే సరికే సాయంత్రమయ్యింది.
ప్రసాదరావుసారు వచ్చి ఉన్నాడు. అందరూ ఆయనకు గ్రీట్ చేసి వెళ్ళిపోయారు. వివేక్ వెడుతుంటే ఆగమని పిలిచాడు ప్రసాదరావు సార్‌.

***
“ఎలా ఉంది నీకు ఇక్కడ వివేక్‌? అంతా బాగుందా? సెట్‌ అయ్యావా?” అడిగాడు ప్రసాదరావుసార్‌.
“అంతా బాగుంది సార్. అందరు చాలా ప్రెండ్లీ గా ఉన్నారు. నా వరకు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలకు పాఠాలు చెప్పటం సంతోషంగా ఉంది. వాళ్ళు చాలా తెలివైన పిల్లలు సార్‌. ఇలా చెబితే అలా అల్లుకుపోతున్నారు.” చెప్పాడు వివేక్‌ ఉత్సాహంగా.
“అవును వివేక్‌. మన పిల్లలంతా చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళకు కొంత సపోర్టు ఇస్తే చాలు. వీళ్ళ డెవలప్‌మెంటే మా లక్ష్యం. ఇంతకీ పట్నం నుంచి దూరంగా వచ్చేశానని దిగులుపడుతున్నవా?” అడిగాడాయన ఆరాగా.
“లేదు సారు. నేను టీచ్‌ చెయ్యటమే కాదు చాలా నేర్చుకుంటున్నా కూడా” అన్నాడు ఉత్సాహంగా వివేక్.
“ఏ విషయమేంటి?” నవ్వుతూ అడిగాడు ప్రసాదరావుసార్‌.
“ట్రైబల్‌ కల్చర్‌ సర్. నేను గిరిజనుడనయినా నాకు తెలిసింది జీరో. అందుకే చాలా దిగులయింది. ఎలాగైనా నా రూట్స్ తెలుసుకోవాలని ప్రయత్నం” చెప్పాడు పట్టుదల నిండిన గొంతుతో.
“మీ ఇంట్లో అడగొచ్చుగా?” అన్నాడాయన.
“లేదు సారు. నాయన లేడు. అమ్మకేమీ తెలవదు. చెప్పదు. నేనే తెలుసుకోవాలి!”
“చంద్రయ్యని అడగాల్సింది…”
“అడిగాను సార్. చంద్రయ్యతాత ఏం చెప్పలే…”
“ఓహో! అలాగా. చాలా మంది రిసెర్చ్ చేసే పిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఈ ఆదివాసీ పిల్లలు కూడా రిసెర్చు చేసినవాళ్ళు ఉన్నారు వీళ్ళ కల్చరు మీద…” ఆలోచనగా అన్నాడాయన.
“ఎవరు సార్ వాళ్ళు?” తొందర పడుతూ అడిగాడు వివేక్‌.
“కలిపిస్తాలే. ఉన్నాడేమో పిల్లద్దాం. వస్తాడు పిలిస్తే. అది సరే కానీ నీకు ఒక విషయం చెప్పాలి” ఆగాడు ప్రసాదరావుసార్‌…
“చెప్పండి సార్‌” కొద్దిగ్గా ముందుకు వంగి వినటానికి సిద్దమైనాడు వివేక్
“నీకు నెల జీతం బ్యాంకులో పడుతుంది. చేతులకివ్వరు. నీవు పైసలు కావాలంటే ఉట్నూరు వెళ్ళి ఏటిఎమ్ లో తీసుకో. ముందు ఈ పదిహేను రోజులకీ ఇచ్చాక, నెల మొదటి తారీకు నుంచి మొదలవుతుంది. నీ మీద మంచి రిపోర్టు వచ్చింది. నీవు ఇలాగే మంచిగ పనిచేస్తే నీకు జీతం పెంపు ఉంటుంది. అది ఆరు నెలల తరువాత అసెస్‌మెంటుతో. నేను రేపు వెళ్ళిపోవాలి. వెళ్ళే లోపు ఆ పిల్లోడ్ని కలిపిస్తా” అన్నాడు.
తల ఊపాడు వివేక్.
“ఇంతకీ ఏమేమి చూసావు ఇక్కడ? మీ పట్నం కన్నా చాలా వింతలున్నాయి చుట్టు పక్కల. చంద్రయ్యనడుగు తోలుకుపోతాడు” సలహా ఇచ్చాడాయన.
“సంత కెళ్ళాము సారు. ఈ రోజు వాటర్‌ఫాల్” అన్నాడు వివేక్.
“బావుంది. కుదిరినప్పుడు తండాలవీ కూడా చూడు. ఇక్కడ చాలా వింతలే ఉన్నాయి. వాళ్ళ పండగలకు అవీ వెళ్ళొచ్చు. మన పిల్లల యోగా చూశావా? వాళ్ళు క్రిందటి ఏడు రాష్ట్రస్థాయిలో యోగా విన్నర్స్. ఈ సారి కూడా కప్పు కొట్టాలి. నీకు స్పోర్ట్సు అంటే ఇష్టమేనా” అడిగాడు ప్రసాదరావుసార్.
“కబడీ అదీ ఆడాము సార్. కాని పెద్ద చాంపియన్ కాదు.”
“సరే కానివ్వు. మరి ఫస్టు తరువాత ఉట్నూరు వెళ్ళి మనీ తెచ్చుకో. ఇంటికాడ అమ్మా వాళ్ళు బావున్నారా?”
తల ఊపి నమస్కారం పెట్టి బయటికొచ్చాడు వివేక్‌.
ఆలోచనగా నడుస్తూ త్వరలో ఒక సోర్సును కలవబోతున్నానన్న ఉత్సాహముగా ఫీల్ అవుతూ తన రూముకు వచ్చేశాడు.

*****

2 thoughts on “మోదుగ పూలు .. 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *