March 19, 2024

దేవీ భాగవతం – 5

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి

 

చతుర్థ స్కంధము 13వ కథ

నర నారాయణుల పుట్టుక

 

ధర్ముడు బ్రహ్మపుత్రుడు. బ్రహ్మ హృదయమునుండి పుట్టిన వాడు. సత్య ధర్మ పరిపాలకుడు. దక్షప్రజాపతియొక్క10 మంది కన్యలను అతడు వివాహమాడెను. ఎందరో సంతానము కలిగిరి. హరి, కృష్ణుడు, నరుడు, నారాయణులను వారు ఉండిరి. హరి, కృష్ణుడు నిరంతరము యోగాభ్యాసము సల్పుచుండిరి.

నర నారాయణులు హిమాలయములు చేరి బదరికాశ్రమము వద్ద పవిత్రస్థానమున తపమాచరించిరి. అట్లు వెయ్యి యేళ్ళు తపస్సుచేసిరి. వారి తేజస్సుతో జగమంతా నిండెను. యింద్రుడు భయపడి తన అధికారమునకు ముప్పువచ్చునని తలచి వారిని సమీపించి వరము కోరుకొమ్మనగా వారు మౌనము వహించితిరి.

ఇంద్రుడు భయంకరమగు మోహినీ మాయ విడుదల జేసెను. తుఫానులను సృష్టించెను. వారిని భయభ్రాంతులను చేయ సంకల్పించెను. అగ్నులను కురిపించెను. కాని అవి ఎట్టి ప్రభావమును చూపలేదు.

వారు భగవతి జగదీశ్వరిని ధ్యానించుచున్నారు. పరాప్రకృతిjైున ఆ దేవి విలక్షణమైనది. ఆమెను ధ్యానించువారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వారు ఆ దేవి యొక్క వాక్బీజము, కామబీజము, మాయా బీజములను ఉచ్ఛరించుచున్నారు. కావున ఎట్లయిన వారిని తపస్సు నుండి విచలితులను చేయవలెనని ఇంద్రుడు తలచెను.

కామేదేవుడగు మన్మధుని, వసంత ఋతువును పిలిపించి అప్సరసలను తీసుకు వెళ్ళి ఏవిధముగానైనా వారికి తపోభంగము కలుగునట్లు చేయమనెను.

ఇంద్రుని ఆదేశానుసారముగా మొదట వసంతఋతువు గంధమాదన పర్వత సమీపమును తన ప్రభావముచే మిక్కిలి రమణీయ వాతావరణము కల్పించెను. మన్మధుడు, రతీదేవితో గూడి పంచబాణములతో బదరికాశ్రమమున స్థిరపడెను. రంభ, తిలోత్తమ, కూడా చేరి వారి ఆటపాటలతో నరనారాయణులకు ధ్యానభంగము వాటిల్లెను. శిశిర ఋతువు కాలమునకు ముందే సమాప్తమగుట, వాసంతము సమీపించుట వారికి ఆశ్చర్యము కలిగెను. వారు అది తప్పక ఇంద్రుని పనే అని గ్రహించిరి. వారు కన్నులను తెరిచి చూడగా అనేక అప్సర గణములు వారికి కన్పించెను. పదహారువేలమంది అప్సరసలు అచట నరనారాయణులనే చూచుచుండిరి.

వారందరూ కపటులై పలుకుచున్న మాటలకు నారాయణుడు కుపితుడై తన తొడభాగమును గొట్టి మహా సౌందర్యవతియైన ‘‘ఊర్వశి’’ని సృష్టించెను. ఆమెతో పాటు అనేకమంది పరివారమును వారి సేవలకై సృజించెను.

స్వర్గము నుండి వచ్చిన దివ్య స్త్రీలందరూ ఆశ్చర్యపోయి నారాయణుని కాళ్ళపై బడిరి. మేమంతా మీ సేవ చేయుదుము. మమ్ము అనుగ్రహించమని కోరిరి. ఇంద్రుడు పంపగా వచ్చితిమి. మీ దర్శన భాగ్యము మాకు కల్గినది. మేమెంతో పుణ్యము చేసితిమి. మా చేష్టల వలన మీరు మాకు శాపమునివ్వక శాంతులైరి అని నమస్కరించిరి.

వారందరిని దీవించి నరనారాయణలు వారికి ఊర్వశిని అప్పగించి స్వర్గమునకు వెళ్ళి ఇంద్రునికి కానుకగా తీసుకుని వెళ్ళమని చెప్పిరి.

కాని ఆ స్త్రీలు తాము నరనారాయణుల సేవ చేయుటకు అంగీకరించవలసినదిగా అర్థించిరి.

తపోభంగమగుటయేగాక వారితో సంభాషించుటవలననే అహంభావముతో ఈ పరిస్థితి కలిగినదని నారాయణుడు భావించెను. నరుడు అతనిని శాంతింపజేసి పూర్వము అహంకార క్రోధముల వల్లనే మనము దైత్యరాజు ప్రహ్లాదునితో పోరు సల్పితిమని గుర్తు చేసెను. అంత నారాయణుడు శాంతించి వారు మరల తపస్సు నారంభించిరి.

పై కథ వలన నర నారాయణుల పుట్టుక, వారి గొప్ప తపో వైభవము ఊర్వశి పుట్టుక చెప్పబడినవి.

 

 

12వ స్కంధము 14వ కథ

దేవీభాగవత మహిమ

 

దేవీభాగవత మహిమ గూర్చి వ్యాసుడు తెలుపుట ` భగవంతుడైన శ్రీమన్నారాయణనుండి నారదుడు తెలుసుకొనుట…

భగవతి మహాదేవి యొక్క ఈ దేవీభాగవతమను పురాణము అద్భుతమైనది. శ్రవణము వలన మానవుడు కృతకృత్యుడగును. వ్యాసుని వలన సంపూర్ణముగా విన్న జనమేజయుడు ‘ప్రణవ’ మను మంత్రదీక్షను తీసుకుని నవరాత్రులు పుణ్యసమయమున అంబా యజ్ఞమును చేసెను. ధౌమ్యుడు మొదలగు మహర్షులను రప్పించెను. భూరి దాన దక్షిణలు ఒసగెను. ఉత్తమ విప్రులద్వారా ఈ భాగవతము పఠింపజేసెను. జనులందరూ పారాయణమొనరించిరి. బ్రాహ్మణులను భోజనముతో సంతృప్తిచేసెను. ముత్తైదువలు, కుమారీలు, బ్రహ్మచారులకు భోజనమిడెను. అనాధలకును సంతృప్తి పరచెను.

ఇట్లు యజ్ఞము చేయుట వలన అనేక సత్ఫలితములను రాజు పొందెను. దేవలోకము నుండి నారదుడేతెంచి జనమేజయుని తండ్రిjైున పరీక్షిన్మహారాజు దివ్య శరీరమును పొంది పరమపదగతిని పొందెనని అందువలన జనమేజయుని జీవితము కృతకృత్యమైనదని దేవలోకమునందు అతని కీర్తి పొగడబడుచున్నదని చెప్పెను. భగవతి జగదంబిక యజ్ఞము సదా చేయుచుండాలని, పారాయణ చేయాలని అది నిత్య నియమాలు కావాలని వ్యాసుడు చెప్పెను.

దీనిని పఠించిన పుణ్యపురుషునకు వేదపఠనముతో సమానమైన పుణ్యము లభించును. శ్రేష్ఠమైన విద్వాంసులు ప్రయత్న పూర్వకముగా దీనిని పఠించవలెను.

దేవీ ముఖకమలమునుండి వెలువడిన ‘‘సర్వం ఖల్విదమేవాహం నాన్యదస్తి సనాతనమ్‌’’ అను అర్థ శ్లోకము శ్రీమద్దేవీ భాగవతమను పేరుతో ప్రసిద్ధిగాంచెను. ఈ పురాణము వైదిక సిద్ధాంత బోధకము. దేవి వటపత్ర సాయియైన విష్ణువునకు దీని నుపదేశించెను.

దీనిని ప్రప్రధమంగా బ్రహ్మ వందకోట్ల శ్లోకములతో విస్తృతముగా వర్ణించెను. వ్యాసుడుతన కుమారుడైన శుకదేవునికి భోధించుటకు దీనియొక్క సారమును ప్రోగుచేసి ‘‘పదునెనిమిది వేల’’ శ్లోకములలో ఈ పురాణము రచించెను. 12 స్కంధములలో దీనిని విభజించెను. ఆ సమయములోనే దీనికి ‘‘దేవీభాగవతము’’ అని పేరుపెట్టెను. ఈ పురాణమిప్పుడునూ దేవలోకమున విస్తృత రూపమున నున్నట్లు సూత మహాముని ఋషులకు చెప్పెను.

దీనితో సమానమైన పవిత్రము, పాపనాశనము, పుణ్యప్రదమైన వేరొక పురాణము లేదు. దీనియందలి ఒక్కొక్క పదమును అధ్యయనము చేసినచో మానవునకు అశ్వమేధ యజ్ఞఫలము లభించును.

పురాణప్రవచనము చేయు పండితుని వస్త్రాభరణములతో సంతృప్తి చేయవలెను. అతనిని వ్యాసునిగానే భావించాలి. శ్రవణము చేయాలి. స్వయముగా చేతితో వ్రాసి లేదా లేఖకుని ద్వారా వ్రాయించినదానిని గాని భాద్రపద పూర్ణిమ పుణ్యతిథినాడు బంగార సింహాసనముతో సహా ఈ పురాణమును తెలిసిన విప్రునకు దానమివ్వవలెను. దక్షిణగా కపిలగోవుని అలంకృతుని గావించి, బంగారు హారాలతో అలంకరించి దూడతో సహా పండితులకు సమర్పించాలి. ఇందు ఎన్ని అధ్యాయములున్నవో అంతమంది బ్రాహ్మణులకు ప్రవచనము సమాప్తిjైున పిమ్మట భోజనము పెట్టాలి. ముత్తైదువలకు, కుమారీలకు కూడా భోజనము పెట్టాలి. వారిలో దేవి ఉందని భావించాలి. చందనము, వస్త్రములు, మాలలు, పుష్పాదుల నొసగి పూజించాలి. ఉత్తమమగు పాయసాన్నము తినిపించాలి.

ఈ పురాణగానముచేత పృధివిని దానమొనరించిన ఫలము లభించును. అట్టి పుణ్యాత్ములు దేవీలోకమును చేరుకొనును.

నిత్యము శ్రవణము చేయుభక్తునకు ఎచ్చట, ఎప్పుడూ ఏదీ కష్టము కాదు. పుత్రసంతానము లేనివారికి పుత్రులు కలుగును. ధనము గోరేవారికి ధనము లభించును. విద్యార్థులు పఠించిన విద్వాంసులగుదురు. గొడ్రాలు గాని, కాకవంద్యగాని, మృతవంద్య దోషములున్నవారు పఠించిన ఆయా దోషములు పోవును. సందేహములేదు.

ఎవరియింట ఈ పురాణము పూజింపబడునో వారిఇంట లక్ష్మీ సరస్వతులుందురు. భేతాళ, ఢాకినీ, శాకినీ వంటి భూతముల దృష్టి ఆ యింటిపై పడదు. జ్వర తీవ్రతతోనున్న వారికి దీనిని తాకించి చదివించినచో ఆ బాధ తగ్గును. వందసార్లు చదివిన క్షయరోగము నుండి విముక్తి కల్గును. యిందలి అధ్యాయములను మనసు నందుంచుకొని రెండు సంధ్యలయందు గుర్తుచేసుకుని పఠించిన జ్ఞానవంతుడగును.

శరన్నవరాత్రులందు భక్తి శ్రద్ధలతో దీనిని పూజించి పఠించవలెను. భగవతి వారిపై ప్రసన్నత చూపును. అధిక ఫలము లభించును.

చైత్రము, ఆషాఢము, ఆశ్వయుజము, మాఘము లందు శుక్లపక్షము నందు గాయత్రిని ప్రసన్నము చేసుకొనుటకు వైదికులు నిత్యము పఠించెదరు. దీనియందు ఎవరి యెడల విరోధమను మాటలేదు. దేవీ ఉపాసనయే చెప్పబడినది. అందరి యందు విరాజమానమైన దేవీ చరిత్ర ఇది. ఈ దేవీ శక్తిని సంతుష్ట పరచుటకు ద్విజులు పారాయణ చేయాలి. స్త్రీలు, శూద్రులు వింటూ ఉండాలి. యిది పరంపరాగత మర్యాద. వేదసారము, పరమ పావనము jైునది ఈ దేవీభాగవతము. దీనిని వినిన పురుషుడు ఘనాపాఠీతో సమానుడు.

‘‘సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం ।

నమామి హ్రీం మయీమ్‌ దేవీం ధియోయోనః ప్రచోదయాత్‌’’ ॥

‘‘భగవతి సచ్చిదానంద రూపిణి. ఆ దేవి యే భగవతి గాయత్రీ నామముతో ఖ్యాతి వహించెను. ‘‘హ్రీం’’ స్వరూపమైన జగదంబికకు నేను నమస్కరించుచున్నాను. ఆ తల్లి మా బుద్ధికి దయతో సత్ప్రేరణను ప్రసాదించుగాక’’ అని సూతుడు మునులకు చెప్పెను.

ఈ పురాణ ప్రభావమువలన వారి లౌకిక ఆధ్యాత్మిక సందేహములన్ని తీరిపోయెను. మిక్కిలి గుహ్యతర విషయములను వినుటచే ఈ సంసార రూప సముద్రమును వారు సులభముగా దాటుటకు సూతునిచే తమకు ఈ భాగవత పురాణము లభించెనని వారు సంతృప్తి చెందిరి.

 

 

 

ఐదవ స్కంధము 15వ కథ

మహిషాసురుని వృత్తాంతము

 

ధనువు అనే పేరుగల ఒక దానవునికి రంభుడు, కరంభుడు అనే యిరువురు కుమారులు గలరు. వారు గొప్ప పరాక్రమవంతులు. వారిరువురకు సంతానము లేదు. పంచనదము యొక్క పావన జలమందు అనేక సంవత్సరములు కఠిన తపమాచరించిరి. కరంభుడు నీటిలో కఠిన తపస్సు చేయుచుండగా ఇంద్రుడు భయపడి ఒక మొసలి రూపములో ఆ నీటిలో ప్రవేశించి కరంభుని చంపివేసెను. రంభుడు ఒక పాలు కలిగిన వటవృక్షము నెంచుకొని అచట పంచ అగ్నుల మధ్య తపస్సు చేయసాగెను. తమ్ముని మరణవార్త విన్న రంభుడు నిరాశాపరుడై తన మస్తకమును ఖండిరచి ఆత్మహత్యకు ప్రయత్నించెను. వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై అతనికి ఒక వరమొసగెను.

మూడులోకములను జయించు పుత్రుని తనకి వరముగా నిమ్మని రంభుడు కోరగా అగ్ని అటులనే వరమిచ్చి అతడు ఎవరియందు పుత్రుని కోరునో అతని మనస్సు ఎవరిపై నిలుచునో వారివల్లనే సంతానము కలుగునని చెప్పి అంతర్థానమై పోయెను.

రంభుడు ఒకసారి అనేక మంది యక్షులుగల ప్రదేశమున తిరుగుచుండెను. అతని దృష్టి ఒక మహిషి మీద పడెను. అ మహిషి కూడా రంభుని చూసి కామించెను.

అతని వీర్యముతో ఆమె గర్భవతి అయ్యెను. ఒక రోజు వేరొక మహిషము ఈ మహిషి మీద పడి గాయపరచుచుండెను. వెంటనే రంభుడు దానిని ఎదుర్కొనగా అది రంభుని గాయపరచెను. అది రంభుని పొడిచి పొడిచి చంపివేసెను. భయకంపితురాలైన మహిషి ప్రాణభయముతో పరుగిడుచుండెను. మహిషము వెంబడిరచెను. కొంత దూరములో కొందరు యక్షులు కనపడిరి. మహిషి వారిని శరణు వేడెను. యక్షులలో మహిషము గొప్పపోరు సలిపెను. తుదకు వారి బాణముల దెబ్బకు మహిషము చచ్చెను.

యక్షులందరూ రంభుని శవమునకు దహన సంస్కారముల కొరకు చితి పేర్చిరి. మహిషి తన భర్త చితిపై తానుకూడా పరుండి సతిని అయ్యెదనని రంభుని శవముపై పరుండెను. యక్షులందరూ ఎంత చెప్పినా వినలేదు. మంటలలో భర్తపై ఆమె పరుండెను.

వెంటనే చితియొక్క మధ్యభాగమునుండి మహా బలవంతుడగు మహిషాసురుడు ఉద్భవించెను. పుత్రుని కృపతో చూచుటకు రంభుడు స్వయముగా రెండవ శరీరము ధరించి రక్తబీజుని రూపములో చితినుంచి బయటకు వచ్చెను. ఇట్లు మహిషాసురుడు, రక్తబీజుడు రంభుని శరీరమునుండి వెలువడిరి.

మహిషాసురుడు అతి కఠినమైన తపమాచరించెను. హంసవాహనారూఢుడై బ్రహ్మ ప్రత్యక్షమయ్యెను. వరము కోరుకొమ్మనెను. మృత్యుభయము తన దరిదాపులకు కూడా రావలదని, దేవ, దానవ, మానవులచే తనకు మరణము రాకుండవలెనని అమరత్వమును కోరెను.

పుట్టిన వాడు గిట్టక తప్పదు కావున మరొక వరము కోరుకొమ్మనగా ఆ దైత్యుడు తనకు ఎవరి వలనకూడా మృత్యువు రారాదు కాని స్త్రీ ఎవరైనా తనను చంపవచ్చునని అతడు బ్రహ్మను కోరెను. తథాస్తు అని బ్రహ్మ అంతర్థానమయ్యెను. స్త్రీ అబల కదా ఏమీ చేయలేదని ఆతని నమ్మకం.

మహిషాసురుని అచటి రాజసింహాసనమున కూర్చుండబెట్టి దానవరాజుగా చేసిరి. అతడు దేవతలకును, దానవులకును, మానవులచేతను అవధ్యుడు.

ఆ తరువాత దేవదానవులకు మిక్కిలి భీకర యుద్ధము జరిగినది.

యింద్రాదులు ఆ మహిషాసురుని ధాటికి ఆగలేక త్రిమూర్తులను శరణుజొచ్చిరి. అపుడు దేవతలందరి తేజస్సులతోనూ, ఓ స్త్రీమూర్తి ఉద్భవించి ‘దుర్గా’వతారిణిjైు వెలసినది.

ఆతని అహంకారము చేత మిక్కిలి క్రూరుడై జనములను పీడిరచుచుండగా భగవతి దుర్గ అవతారమును దాల్చి భీకరమైన పోరు సల్పి ఆ మహిషాసురుని చంపినది. అందుకే ఎవరిని తక్కువగా అంచనా వెయ్యరాదు.

ఇది మహిషాసుర సంహార కథ.

 

 

 

 

 

5వ స్కంధము (16వ కథ)

దుర్గావతరణము

 

రంభుని కుమారుడైన మహిషాసురుడనే దానవుడు మిక్కిలి అహంకారిjైు దేవతలను, ప్రజలను పీడిరచుచుండెను. దేవ, దానవ, మానవులెవ్వరి చేతిలోను వాడికి చావులేదు. స్త్రీ చేతిలోనే వాడికి మరణం రాసి ఉంది. స్త్రీలు అబలలు కదా చంపలేరు అని వాడి అహంకారము. ఇంద్రాదుల పైకి బిడాలుడు, తామ్రుడు మొదలగు భయంకర రాక్షసులను వాడు పంపెను. వారు యుద్ధము చేసి మిక్కిలి పరాక్రమము చూపుతూ తుదకు దేవతలచే చంపబడిరి. స్వర్గముపై మహిషాసురుని కన్ను పడెను. ఐరావతమును, కామధేనువును, ఉచ్ఛైశ్రవమను గుర్రమును వాడు తన అధికారములోకి తెచ్చుకొనెను. స్వర్గము మీదికి దాడికి దిగబడెను. దేవలందరూ వాడి ధాటికి ఆగలేక పిరికి వారయి గుహలలో తలదాచుకున్నారు. వారి పరాక్రమములు నీరసపడెను. స్థానభ్రష్టులయి వారు దీనావస్థలో త్రిమూర్తులను శరణుజొచ్చిరి.

ఆ దుష్టదానవుని వధించుట కేవలం ఒక స్త్రీమూర్తికే ఆగును అని బ్రహ్మ సలహా ఇచ్చెను. విష్ణువుతో కలిసి ఏదైనా ఉపాయము చేతనే మనం వానిని జయించగలమని శంకరుడు చెప్పెను. వారంతా వైకుంఠమునకు వెళ్ళుచుండగా శుభశకునములు కలిగెను. శుభసూచకముగా వాయువు ఉత్తమమైన పరిమళము వీచసాగెను. ఉత్తమ జాతి పక్షులు మధుర నాదములు చేసెను. దిశలు స్వచ్ఛమయ్యెను.

కదనరంగములో మహిషాసురుని చంపగల స్త్రీశక్తి ఎవరి యందు ఉన్నదని దేవతలందరూ విష్ణువును ప్రార్థించిరి. విష్ణువు ఇట్లు చెప్పెను.

‘‘సకలదేవతల తేజస్సుతో మిగుల సౌందర్యవతి, యోగ్యురాలైన ఒక దేవి ప్రకటితము కావలెను. ఆమె బలముతోనే వాని మరణము సంభవించును. వాడు మహా మాయావి. వానిని మాయచేతనే చంపవలెను. మీరందరూ మీమీ శక్తులను ప్రార్థించండి, మీ భార్యలు కూడా మీకు సహాయపడవలెను. దానివలన సకల శక్తుల బలిమి వలన ఒక గొప్ప శక్తిశాలి ప్రకటితమగును. మనవద్దనున్న సకల దివ్య ఆయుధములు ఆమెకు యిచ్చెదను. బలవంతురాలై ఆ దేవి ఆ దురాచారిని సంహరించగలదు.’’

అప్పుడు బ్రహ్మదేవుని దేహమునుండి ఒక అద్భుతమైన వెలుగు కాంతి ప్రటితమయ్యెను. ఎర్రని కాంతి. పద్మరాగమణులను తలపించుచున్నది. మిక్కిలి సుందరము, కొంతవేడి, కొంత చల్లదనము కల్గి ఉంది. అనేక కాంతి కిరణములు వచ్చుచుండెను. శంకరుని నుండి కూడా యిలాగే విశాల తేజస్సు ఆవిర్భవించెను. గౌరవర్ణముతో శోభించే ఆ కాంతి తీక్ష్ణమై భయంకరముగా ఉండెను. ఎవరూ చూడలేనంత వెలుగు దానిది. ఆ ఆకృతి వికృతముగా ఉండెను. దేవతలకు సౌఖముకూర్చునది, దైత్యులకు భయము గొల్పునది ఆ తేజము. తమోగుణము కొండ ఆకారము దాల్చినట్లుండెను.

వేరొక తేజస్సు విష్ణువు నుండి వెలువడెను. శ్యామవర్ణము గలది, సత్త్వగుణ ప్రధానమైనది. ఇంద్రుని నుండి దుర్నిరీక్ష్యమై అలౌకిక తేజస్సు పుట్టెను. సమస్త గుణములందుండెను.

అటులే వరుణుడు, కుబేరుడు, యముడు, అగ్ని దేహములనుండి వేరువేరు వెల్గులుత్పన్నములయ్యెను. అవి అన్నియు కలిపి ఒక దివ్యతేజః పుంజముగా ఆవిర్భవించెను.

విలక్షణముగా ఉన్నది. హిమాలయమువలె ఉన్నది. అందరూ చూస్తూ ఉండగానే ఆ తేజస్సు ఒక అపురూప సౌందర్యరాశి వలె రూపుదిద్దుకొనెను. శ్రేష్ఠురాలు, విలక్షణమైనది, ఆ దేవియే భగవతి లక్ష్మి అయ్యెను. సత్త్వ రజ స్తమో గుణములు మెరయుచుండెను. 18 భుజములతో విరాజిల్లెను. త్రివర్ణములో మెరయుచుండెను. లోకములనన్నిటిని సమ్మోహితము చేయుచుండెను. నేత్రములు నల్లనివి, పెదవులు ఎర్రగానుండెను. 18 భుజములు గల ఆ దేవి అవసరమున వేయి భుజములతో అలరారెను. ఆమె కోపమును వర్ణించుటకెవ్వరికి సాధ్యం కాలేదు. దేవతల అభీష్టము నెరవేర్చుటకై దేవి ప్రకటితమయ్యెను.

ఆమె నిర్గుణ. రూపము లేనిదైనప్పటికీ సమయానుకూలముగా ఆమె సగుణరూపము పొందును. కార్యనిర్వహణకు అనుగుణముగా ఆమె నామము ఏర్పడెను. ఆమె గౌణనామములన్నియు ధాతువుయొక్క అర్థమునకు సంబంధించి ఉండును.

శ్వేత వర్ణముతో ఆమె ముఖము మిక్కిలి కాంతితో వెల్గుచుండును. యముని తేజస్సుతో ఆమె కేశరాశి నిర్మాణము జరిగెను. సుదీర్ఘములు పరిమళభరితములు అగ్ని తేజముతో కన్నులు ఉండెను. కృష్ణ, రక్త, శ్వేత వర్ణములు కనుబొమ్మలు సంధ్యతేజస్సు, కామధేనువు ధనుస్సు వలె ఉండెను. కుబేర తేజస్సుతో నాశిక ఉండెను. కోమలము, మనోహరము, దంతములు ప్రజాపతి తేజస్సుతో ప్రకాశవంతములై కుందములవలె కొనలు తేలి ఉండెను. అథరోష్టములు సూర్యకాంతితో మెరయుచుండెను. పై పెదవి కార్తికేయుని తేజస్సుతో వెలిగెను. ఆమె పదునెనిమిది బాహువులు విష్ణుతేజముతో వెల్గెను. వసువుల తేజస్సుతో ఎర్రని రంగుగల వ్రేళ్ళు వెల్గెను. చంద్రుని తేజస్సుతో వక్షోజములు, ఇంద్ర తేజస్సుతో కటి ప్రదేశం, త్రివణులు ఉత్పన్నము అయినవి. వరుణ తేజస్సుతో తొడలు, జఘనములు వెల్గెను.

విశాలమైన నితంబ భాగము భూమి తేజస్సు. మధురమైన స్వరము, సర్వ అంగములు మనోహరమై ఉండెను.

దేవతలందరూ వారి వారి దివ్యాభరణములను, దివ్యాస్త్రములను ఒసగిరి. అద్భుతమైన రత్న కేయూరములు, కంకణములు సముద్రుడు, విశ్వకర్మ ఇచ్చిరి. త్వష్ట కంఠహారమును, వరుణుడు కమలపుష్పములను, వైజయంతి అను హారమును ఇచ్చెను. హిమవంతుడు ఆమెకు ఆసనము నొసగెను. సకల శుభలక్షణjైున ఆ దేవి సింహాసనమును అధిష్టించెను.

శంఖ, చక్ర, త్రిశూలములు సమర్పించిరి. అమ్ముల పది, ధనుస్సును వాయువొసగెను. వజ్రాయుధము, మంచి ధ్వని గల గంట ఇంద్రుడు యిచ్చెను. కాలదండమును యముడు, బ్రహ్మ దివ్య కమండలమును, వరుణుడు పాశమును, విశ్వకర్మ గండ్రగొడ్డలి, కుబేరుడు బంగారు మధుపాత్రన, కౌమోదకి గదను త్వష్ట, సూర్యుడు కిరణములను ఒసగిరి.

శివ, కళ్యాణి, శాంతి, పుష్టి, రుద్రాణి, కాళ రాత్రి, ఇంద్రాణి, సిద్ధి, బుద్ధి, వృద్ధి, వైష్ణవీ, అంబ అని అనేక నామములతో దేవతలు స్తుతించిరి. వారి స్తుతులకు సంతసించిన దేవీ భగవతి అట్టహాసముగా పెద్ద స్వరముతో గర్జించెను. దేవతలు భయపడిరి. ఆ గర్జన వల్ల సుమేరు పర్వతము జారిపోయెను. సాగర అలలు పైపైకి ఎగసి పడెను. భూమి కంపించెను. దిక్కులు ప్రతిధ్వనించెను. ఆకాశము విరిగిపడినట్లున్న ఆ శబ్దమునకు దానవులు భయకంపితులైరి.

ఆ దివ్యస్త్రీ విషయమును తెలుసుకొని, మహిషాసురుడు తన మంత్రులైన విరూపాక్షుడు, తామ్రుడు అను వారిని దూతలుగా పంపి ఆమెను పెండ్లాడవలసిందిగా కబురు చేసెను. కాని వారినీ, వారి అనుచరులైన వాష్కల, దుర్ముఖులను దేవి సంహరించెను. చిక్షురాఖ్య, తామ్రాక్ష, అసిలోమ, బిడాలాక్షులు కూడా సంహరింపబడిరి.

చివరకు మహిషాసురుడే యుద్ధభూమికి వచ్చెను. ఆమె శంఖము పూరించెను. ఆ శంఖధ్వని ఆశ్చర్యపరిచెను. అతడనేక విధముల దేవిని అనునయించ ప్రయత్నించెను. అవాకులు, చవాకులు పేలెను. మండోదరి ప్రసంగమునుదెచ్చి దేవిని ప్రసన్నురాలిని చేయబోయెను.

జగదంబికకు, మహిషాసురునికి పిమ్మట భీకర పోరు జరిగెను. యిరువురు బాణవర్షములు కురిపించిరి. మహిషుడు అనేక మాయా రూపములను ధరించెను. కాని చండిక ఆ రూపములను ఎదుర్కొని అతనిని నిర్వీర్యుని చేసినది. చివరకు, ఆమె చక్రమును ప్రయోగించెను. వెంటనే మహిషాసురుడు విగత జీవి అయ్యెను. దేవతలు విజయనాదములు చేసిరి.మహిషాసుర సంహారముతో దేవతలందరూ ఆనందించిరి. దేవిని స్తుతించిరి. దేవి అంతర్ధానమై తననిజస్థానమైన మణిద్వీప సదనమునకు వెళ్ళిపోయెను. యిదీ మహిషాసుర వధ వృత్తాంతము.

 

 

సశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *