March 19, 2024

అన్నపూర్ణ తల్లి..

రచన: జ్యోతి వలబోజు

వాడిపోయిన మొహంతో వచ్చి బ్యాగ్ సోఫాలో పడేసి దిగాలుగా కూర్చుంది వనజ.. తలుపు చప్పుడు విని హాల్లోకి వచ్చిన వనజ అత్తగారు లక్ష్మిని చూసి విస్తుపోయింది.
“వనజా! ఏమైందమ్మా! రోజూ రాత్రి ఎనిమిది అయ్యేది, ఇవాళ ఇంత తొందరగా వచ్చేసావేమిటి? తలనొప్పిగా ఉందా? టీ ఇవ్వనా?” అంటూ పక్కనే కూర్చుంది.
ఆ మాత్రం ఆప్యాయతను తట్టుకోలేక, అప్పటిదాకా మౌనంగా ఉన్న వనజ అత్తమ్మ చేయి పట్టుకుని భోరుమని ఏడ్చేసింది.
“అయ్యో! ఏమైందమ్మా.. ఎవరేమన్నారు. చెప్పు నా తల్లి కదూ. ఇలా బెంబేలెత్తిపోవడం ఎప్పుడూ చూడలేదు. ఎంత ధైర్యవంతురాలివి. పెద్ద పత్రికలో జర్నలిస్టుగా ఎంత డేరింగ్ గా ఉండేదానివి ఇలా ఏడుస్తున్నావెందుకు, అంత కష్టమేమొచ్చింది…” వనజను పొదుముకుంటూ అడిగింది లక్ష్మి..
“అత్తమ్మా! నా ఉద్యోగం పోయింది. పదిహేనేళ్లుగా ఆ ప్రముఖ పత్రికలో పని చేస్తున్నా కదా. సీనియర్ ని. నాతోపాటు మరో ఇరవైమందిని ఇంటికి పొమ్మన్నారు..”వెక్కుతూ చెప్పింది వనజ.
“అదేంటి! నువ్వు చాలా సీనియర్ వి కదా. ఎందుకు తీసేసారు. ఏదైనా గొడవ జరిగిందా?” ఆశ్చర్యపోయింది లక్ష్మి.
“ కరోనా మూలంగా పత్రిక అమ్మకాలు పడిపోయాయి. ప్రకటనలు రావట్లేదు. ప్రింటింగ్ కూడా తగ్గింది. పత్రిక నడపడం కష్టమవుతుందని స్టాఫ్ ని తగ్గించారు. అందులో నేనొకదాన్ని.. ఇప్పుడెలా గడపాలో అర్ధం కావట్లేదు. వేరేచోట వెళ్లి ఉద్యోగం కోసం ట్రై చేయలేను. వేరే పని చేయాలన్ని కష్టమే. అన్నీ మూతపడ్డాయి. అందరూ లాక్డౌన్ అని ఇంట్లోనే ఉంటున్నారు.. నాకేమీ అర్ధం కావట్లేదు అత్తమ్మా!” ఏడుపు ఉధృతి తగ్గింది..
“సరేలే.. నువ్వెళ్లి మొహం కడుక్కుని రా. టీ తాగుదువు కాని. ఏం చేయాలో ఆలోచిద్దాం..” అని చెప్తూనే ఆలోచనలో పడింది లక్ష్మి.
రాత్రి లక్ష్మి తన భర్తతో ఈ విషయమై చర్చించింది. ఆయన కూడా ఏదో చేద్దాం. కోడలికి ధైర్యం చెప్పు. నేను అబ్బాయితో మాట్లాడతాను అన్నాడు.
వనజ భర్త అశోక్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఇంటినుండి పని చేస్తున్నాడు. ఉద్యోగం పోయి ఏడుస్తున్న భార్యను ఓదార్చాడు. నెలకు టంచనుగా జీతం ఇచ్చే ఉద్యోగం పోయేసరికి ఇంటి ఖర్చులు, పిల్లల ఖర్చులు ఎలా తట్టుకోవాలో అర్ధం కావట్లేదు వనజకు. అత్తగారు, మావగారు కూడా ఉన్నారు.. అశోక్ కూడా ఆందోళనగానే ఉన్నాడు.
అలా రోజులు నిస్సారంగా గడుస్తున్నాయి.
*****
“అత్తమ్మా! అత్తమ్మా! “ అంటూ వంటింట్లో ఉన్న లక్ష్మి దగ్గరకు వచ్చింది వనజ.
“ఏమిటే! ఏం జరిగింది?” పప్పులో పోపు పెడుతూ అడిగింది.
“మన ఎదురింట్లో శ్యామలవాళ్లు ఉన్నారు కదా. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందంట. బ్యాంకులో పని చేస్తుంది కదా. ఇంట్లో ఉండడానికి లేదు. హోమ్ క్వారంటైన్ ఉండమన్నారంట. పిల్లలతో ఎలాగో ఏమో అని బాధపడుతుంది. పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు దగ్గర లేరు.”బాధగా చెప్పింది.
“అయ్యో! వాళ్లకు భోజనం అదీ ఎలాగో ఏమో.. బయటనుండి కూడా తెప్పించుకునేట్టు లేదు ఈ లాక్డవున్ లో.. నువ్వెళ్లి చెప్పు ఇవాళ్టినుండి రోజు మద్యాహ్నం , రాత్రి భోజనం మనం ఇద్దాం. టిఫిన్ సంగతి చూసుకోమను శ్యామల వాళ్లాయన్ని. శ్యామల క్వారంటైన్ అయిపోయేవరకు పంపిద్దాం. మనం వండుకునేదే గుప్పెడు ఎక్కువేస్తే సరిపోతుంది. ఇరుగుపొరుగు అన్నతర్వాత ఆ మాత్రం సాయం చేయలేమా. ఫోన్ చేసి చెప్పు. మిగతా విషయాలు చూసుకోమను” వనజ మొహం చూడకుండా పని చేసుకుంటూనే చెప్పింది లక్ష్మి.
“అత్తమ్మా! నువ్వెంత మంచిదానివి.. అడక్కుండానే సాయం చేస్తానంటున్నావు. శ్యామల తనవాళ్లను సాయం అడిగితే ఎవరూ రాలేదంట. వాళ్లాయన ఉద్యోగం చేసుకుంటూ, ఒక్కడు అన్ని విషయాలను ముఖ్యంగా పిల్లల భోజనం ఎలా చూసుకోగలడు. వంట కూడా రాదు అని ఏడ్చింది. సరే ఇప్పుడే కాల్ చేస్తా” అని సంతోషంగా వెళ్లింది వనజ.
దేవుడే వరమిచ్చినట్టుగా సంతోషపడ్డారు శ్యామల దంపతులు. పూర్తిగా నయమయ్యాక పిల్లలతో కలిసి ఇద్దరూ పళ్లు తీసుకుని వచ్చారు. వనజ, లక్ష్మిలకు చేతులు జోడించి నమస్కారం పెట్టారు.
“ మీ రుణం ఎలా తీర్చుకోము. చేతిలో డబ్బులున్నా మనిషి సాయం చాలా ముఖ్యం. ఈ కరోనా టైమ్ లో కనీసం భోజనం దొరకడం కూడా కష్టమైన సమయంలో మేము అడక్కుండానే అన్నపూర్ణమ్మ తల్లిలా ఆదుకున్నారు. మాకందరికీ కడుపునిండా భోజనం పెట్టారు. మా సంతోషం కొద్దీ ఇస్తున్నాం. ఈ డబ్బును తీసుకోండి.. మీ ఆదరణను మేము అవమానిస్తున్నాం అనుకోవద్దు. ఈ కష్టకాలంలో సాయం చేయడం చాలా గొప్ప పని. ఈ విధంగా మా బరువు కొంచెం తగ్గుతుంది.” అంది శ్యామల.
“వద్దమ్మా!.. అన్నం అమ్ముకునేవాళ్లం కాదుగా. కాస్త పెట్టినందుకు డబ్బులు తీసుకోవడం మంచిది కాదు. మీ దగ్గరే ఉంచండి.” అని తిరస్కరించింది లక్ష్మి.
“సరే.. మీరు డబ్బులు తీసుకోకపోతే పర్లేదు. ఇలా కరోనా టైములో ఎవరికైనా భోజనం కావాలంటే మీరు ఏర్పాటు చేయగలరా.. వనజ ఇంట్లోనే ఉంటుంది కదా. ఇలా చేస్తే మీకు కాస్త ఆదాయం వస్తుంది. అన్నింటికి మించి ఆ బాధితులకు కడుపునిండా అన్నం పెట్టినవారవుతారు. మీకు తెలీనిదేముంది. ఈ సమయంలో తనవారే దూరం పెడుతున్నారు. ఇక వారు తిన్నారా లేదా అన్నది ఎవరు చూస్తారు. మీరు వాళ్ల ఆకలి తీర్చగలరు. వద్దనకండి.. ఆలోచించండి..”
వనజ, లక్ష్మి ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.
“మేము ఇలా చేయాలనే ఆలోచన అస్సలు లేదు. చేయగలమా లేదా అన్నది ఆలోచిస్తాము. రేపు చెప్తాము ఏ సంగతి” అనగానే శ్యామలవాళ్లు వెళ్లిపోయారు.
************
రాత్రి భోజనాలు అయ్యి పిల్లలు నిద్రపోయాక పెద్దవాళ్లందరూ హాల్లో కూర్చున్నారు.
“అశోక్.. నువ్వేమంటావురా.. వనజ ఉద్యోగం లేదు. నీ ఒక్కడి జీతంతో ఇల్లు గడవడం అంత సులువు కాదు. పిల్లల ఖర్చులు, మా ఖర్చులు ఉండనే ఉన్నాయి. నేను వనజ కలిసి ఈ పని చేయగలం కదా. ఇది మనం చేయగలిగే సాయమూ, మనకు ఆదాయమూ అవుతుంది.” అంది లక్ష్మి.
“మీరేమంటారు? మాట్లాడరేంటి?’ అని భర్తను అడిగింది లక్ష్మి.
“నేనేమంటానోయి.. మంచి ఆలోచన కాని చేయగలవా?. ఇంట్లో నలుగురు, ఆరుగురు అంటే పర్లేదు కాని ఎక్కువమందికి కావాలసి వస్తే ఎలా చేస్తారు. నేనేమైనా సాయం కావాలంటే తప్పకుండా చేస్తా”
“అమ్మా! నాకేం అభ్యంతరం లేదు. మీకు కష్టమవుతుందేమో.. పనిమనిషి కూడా లేదు. ఎక్కువమందికి భోజనాలు అంటే చాలా పనుంటుంది కదా.. వనజా! ఒక జర్నలిస్టుగా పని చేసావ్. ఈ వంట పని చేయగలవా? ఆలోచించు.” అన్నాడు అశోక్.
“అశోక్! ఇప్పుడు నేను బయటకెళ్లి ఉద్యోగం వెతుక్కునే పరిస్థితి లేదు. ఎవరిదగ్గరా పని లేదు. మనం ఇంటినుండే చేయగలిగిన పని చేసే అవకాశం వచ్చింది. నాకేమీ అభ్యంతరం లేదు. అత్తమ్మ ఉన్నారుగా..కలిసి చేసుకుంటాం.”అని ధీమాగా చెప్పింది వనజ.
“అవునురా.. కలిసి చేసుకుంటాం. అవసరమైతే ఎవరినన్నా పిలుచుకుంటాములే.. నాకు కావలసిన వస్తువులు తెచ్చిపెట్టు చాలు. కాని ఒక్క మాట డెలీవరీ అంటే కష్టం కాని చేసి పాకింగ్ చేసి పెడతాం పికప్ చేసుకోవాలని చెప్పాలి. అలా రాలేనివారికి వనజ ఇచ్చి వస్తుంది. తనకు యాక్టివా ఉందిగా“ నవ్వుతూ చెప్పింది లక్ష్మి.
“ప్యాకింగ్ లాంటివి ఉంటే నేను చేసిపెడతా.” అన్నాడు అశోక్ తండ్రి.
“ఇంకేం.. ఈ మాట మీ ఫ్రెంఢ్స్ కి, కాలనీవాళ్లకు చెప్పండి. ముందు శ్యామలవాళ్లకు చెప్పండి . ఈ ఐడియా ఇచ్చింది వాళ్లేగా..”అని చెప్పింది లక్ష్మి.
“పదండి.. పదండి.. పడుకుందాం. రేపు తొందరగా లేచి పని మొదలెట్టాలి.. సామాన్లు తెచ్చుకోవాలి.. రేపే మన అన్నపూర్ణమ్మ తల్లిని ప్రారంభిద్దాం.
అన్నపూర్ణ పేరుతో కరోనా టైమ్ లో క్వారంటైన్ ఉన్నవాళ్లకి రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం అందించడం వల్ల చాలామంది కరోనా బాధితులు లాభపడ్డారు. నిశ్చింతగా తమ క్వారంటైన్ సమయాన్ని గడిపేసారు. ఎంత సంపాదించినా, ఎవరున్నా లేకున్నా తిండి కావలసిందే కదా. ఈ కష్టకాలంలో మేమున్నాం అంటూ ముందుకు వచ్చిన వనజ, లక్ష్మిలను అందరూ అభినందించారు. కాలనీలోని మరికొందరు మహిళలు వీళ్లతో కలిసి పనిచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *