March 30, 2023

నల్ల పన్ను

రచన: ఎ.బి.వి. నాగేశ్వరరావు

ఉప్పు మీద పన్నా! తెల్లవారికిదేమి తెగువ !!
అనుకొంటిరి, ఆందోళితులైరి ఆనాడు మనవారు.
దోపిడీ అనీ, దమన నీతనీ, ఆవేశపడి ఆగ్రహించిరి,
ఏకతాటిన ఉద్యమించిరి మరి, మనవారు ఆనాడు.

నీటి పై పన్ను, పాలపై పన్ను, పండ్లపై పన్ను,
రోగమున తిను రొట్టె ముక్కకు పన్ను,
ఔషధములపై పన్ను, వైద్య సేవలకు పన్ను,
ఉసురు నిలిపే వస్తు పరికరాలపై పన్ను,
విధి వక్రిస్తుంటే ఎక్కించే ప్రాణ వాయువుపై పన్ను,
భద్రత పేరిట పన్ను, స్వచ్ఛత సాకున పన్ను,
అదీ, ఇదీ అనక- అన్నింటనుండు పన్ను.
పన్నుపై పన్ను, పలు రకాల పోకడల పన్ను !
రెండు ప్రభుత్వాలకూ వెన్నుదన్ను పన్ను,
సరిచూడ వివరమున – స్వతంత్ర భారతిన ఈనాడు!!

తెల్లవారు చేసింది తప్పేమి కాదనీ,
వేసినందున పన్ను…
ఉప్పు గుర్తింపు ఇనుమడించిందనీ,
ఉప్పునూ వదలనిది నల్లవారి పన్ను !
చరిత్ర స్ఫూర్తి ఎగతాళిగా…
నవ్య భారతిన-
నగుబాటే విధి విధాన చందము ఈనాడు !!

ఎన్ని రూపములనున్నా-
దైవమొక్కటేనని ఆస్తికులు అన్నా,
లేని దైవానికి రూపములు ఏమిటని?
నాస్తికులు ఒప్పుకోకున్నా,
ఇద్దరూ ఒక్కటై, ఏకంగా ఒప్పుకొనేది –
స్వతంత్ర భారతిన సర్వాంతర్యామి- పన్ను అనీ !
నానా రూపాల వేళ్ళూని, దశ దిశలా మోహరించి,
దినదిన ప్రవర్థమానముతో-
జనుల నడ్డినిట్టే విరుచు చున్నదనీ,
పన్ను కట్టుటకు పుస్తెల తాకట్టు పెట్టు రోజులు ఇవనీ,
విధించినా చనుబాలపై పన్ను,
విపరీతముకాదు ఈనాటి ఈ ధోరణి అనీ !!

మతములెన్ని ఉన్నా, అభిమతములు అనేకములై ఉన్నా,
ఎవరి ఆచార సాంప్రదాయములు, వైవిధ్యములు, వారివిగా,
భిన్నత్వంలో ఏకత్వం మనం చాటుకొనుచున్నా,
అందరినీ అనుక్షణం అప్రతిహతముగ ఆచరింపజేసే –
ఏకత్వంలో భిన్నత్వం మన విశృంఖల పన్ను తత్వం !
వవ్వి పోదురుగాక ఏమి, ఇది నల్లవారి పాలన మరి !!

—<<>>—

1 thought on “నల్ల పన్ను

  1. A keen observation on the present taxation system and a great comparison between old and present and future taxation. Very good. Thank to the writer for his great effort.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

January 2022
M T W T F S S
« Dec   Feb »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31