April 27, 2024

సిక్కిం పిల్లల బాల్యం

రచన: రమా శాండిల్య

నేను భారతదేశం మొత్తం గుళ్ళు గోపురాలు మాత్రమే కాకుండా అనేక పరిస్థితులు కూడా గమనిస్తూ ప్రయాణిస్తుంటాను.
అలా సిక్కిం వెళ్ళినప్పుడు, అక్కడ నేను చూసిన చిన్నపిల్లల బాల్యం గురించి నేను గమనించినంతవరకూ వ్రాస్తున్నాను…
సిక్కిం ఒక అందమైన కొండ, లోయ సముదాయంగా చెప్పవచ్చు. చూడటానికి అద్భుతమైన అందాలు ప్రోగుపోసుకున్నట్లుండే అందమైన భారత దేశంలో సిక్కిం ఒకటి.
సిక్కిం రాజధాని ‘గేంగ్ టక్’
అక్కడ, మేము మూడు రోజులు ఒక హోమ్ స్టే లో ఉన్నాము.
ఆ హోమ్ స్టే ఇచ్చిన కుటుంబంలో సభ్యులు ఐదుగురు. అక్కడ భార్య, భర్త, అతని తల్లి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారు నివసించే గది కాకుండా మరో మూడు బెడ్ రూమ్ లు అటాచ్ బాత్ తో ఉంటాయి. ఒక పెద్ద హాలు, దానిని ఆనుకుని ఒక కిచెన్ ఉంటాయి. హోమ్ స్టే అంటే ఆ ఇంటివారు ఇంటి పెద్దలుగా వ్యవహరిస్తూ, మన అవసరాలు, మన భోజన సదుపాయాలు చూస్తూ ఉంటారు.
మనకు, వారే వండమన్నా వండుతారు. మనం చేసుకు తినాలనుకుంటే వారి కిచెన్ ఉపయోగించుకుని మనమే వండుకోవచ్చును.
అలా ఒకరింట్లో నేను ఉండి సిక్కిం అందాలు చూసాను. వారి పిల్లలను గమనించ గలిగాము. మన పిల్లల బాల్యం కంటే ఎంతో కష్టతరమైన బాల్యం సిక్కిం లోని పిల్లలది.
సూర్యోదయంలో తల్లిదండ్రులతో పాటు లేచి, సూర్యాస్తమయం వరకు పెద్దలతో పాటు పిల్లలు కూడా పెద్దలతో సమంగా కష్టపడుతున్నారు.
మేమున్నన్ని రోజులు వారిని గమనిస్తూ వున్నాను. అప్పుడు వారి పిల్లలను గమనించాను. వారికి పసితనం నుండీ కష్టపడటం అలవాటు చేస్తారు. ఆడ మగ అనే భేదం లేకుండా పనులు నేర్పుతారు.
అక్కడి జీవనవిధానం పర్వతారోహణకు సరిపడేలా ఉంటుంది. దారి మొత్తం కొండ దారే ఉంటుంది. కొండ వాలులో గృహ నిర్మాణాలు జరుపుకుని, దానిలో నివసించడం వలన వారు ఎక్కడికి వెళ్లాలన్నా మినిమం 200 అడుగులు ఎక్కడం, దిగడం చెయ్యాలి. నేను చూసిన పిల్లల యొక్క స్కూల్ 1200 అడుగుల ఎత్తులో ఉంది. వారు రోజూ ఉదయం ఆరుగంటలకు స్కూల్ యూనిఫామ్ వేసుకుని, జావలాంటి పదార్థం త్రాగి, డబ్బాలో బియ్యంపిండి కుడుములు మధ్యలో బీన్స్, కేరట్ కొంచెం మసాలాపెట్టి కుడుములు లాగా చేసి అవి డబ్బాలో పెట్టుకుని మధ్యాహ్నం తినడానికి పట్టుకెడుతున్నారు. పెద్దపిల్లలు సైకిల్ మీద, చిన్న వాళ్ళు నడచి వెళ్లి మళ్లీ సాయంత్రం నాలుగుకు ఇంటికొస్తారు. అప్పుడు ఇంట్లో పనంతా చేస్తారు. వారి మెయిన్ పని టూరిస్ట్ లకు సేవ చెయ్యడమే…
పిల్లల తల్లి మాకు గది శుభ్రం చెయ్యడం, వంట చెయ్యడం చేసేది. తండ్రి టాక్సీలో చుట్టుప్రక్కల అన్నీ చూపించేవాడు. పిల్లలు మాకు కావలసిన బ్రెడ్, పండ్లూ లాంటివి ఆ కొండలన్ని ఎగప్రాకి తెచ్చి పెడుతుండేవారు.
మేము మొత్తం సిక్కిం అంతా తిరిగి చూసాము. సౌత్ సిక్కిం అంతా టీ తోటలతో చాలా అందంగా ఉంటుంది. వారి పొలాలలో పనిచేయడానికి నార్త్ నుంచి పనివారు వచ్చి ఆ తోటల్లో నివాసముండి పనిచేస్తుంటారని చెప్పారు అక్కడివారు. కొండవాలులో లైన్లు గీసినట్లుండే ఆకుపచ్చని టీ తోటలు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది.
సిక్కిం టీ తోటల్లో ఆకు తెంపే పనివారు బుట్టల్ని తమాషాగా తలకు తగిలించుకుని కోసుకుంటారు తేయాకుని. ఇక్కడకూడా చిన్నపిల్లలతో పనిచేయిస్తుంటారు. ఎదిగే ఆ పిల్లలు అలా తమ తలకు మించిన భారంతో పనులు చేస్తూ ఎదుగుతారా? అనిపించింది.
అంత పసితనం నుంచీ స్కూల్ బేగ్, కిరాణా సామాన్ల బరువు, కాయకూరల బరువు మోసే ఆ చిన్నారులను చూస్తే, తప్పనిసరిగా మన పిల్లల అదృష్టానికి భగవంతుడికి కృతజ్ఞతలర్పించక మానం ఎవరైనా కూడా!!
అక్కడి పిల్లలతో పోలిస్తే మన పిల్లల బాల్యం ఎంత అందమైనదో, తేలికగా గడుస్తోందో అనిపించింది.
బయట దేశాల్లో కల్చరల్ ఎక్చేంజ్ అని ఏదో ప్రోగ్రాం ఉందిట. అలాగే మన రాష్ట్రాల మధ్య ఈ కల్చరల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి పిల్లలను అన్ని రాష్ట్రాల పిల్లల కష్టసుఖాలు తెలుసుకుని పెరిగేలా చేస్తే మంచి పౌరులుగా ఎదుగుతారేమో అనిపించింది.

2 thoughts on “సిక్కిం పిల్లల బాల్యం

  1. Such cultural exchange teaches good lessons for the children of the other states. But the children of Sikkim might get envious and decide not to work with the parents.
    It is nostalgic to think about such experiences. However, the state of Sikkim needs better infrastructure and better machinery so that the people and children would have an easier life. I hope that India would develop and deploy appropriate technology to make life easier and enjoyable. People do not have to be idle but use their brains, knowledge, and skills more than hard labor.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *