May 26, 2024

అంగారపర్ణుడు

రచన: శ్యామసుందర రావు

మహా భారతములో ఆదిపర్వంలో ఈ అంగారపర్ణుడి కద వస్తుంది. వారణావతములోని లక్క గృహము దహనము నుండి బయటపడ్డ పాండవులు కుంతీ, విదురుని సలహా మేరకు కొంత కాలము ఏకచక్రపురంలో బ్రాహ్మణ బ్రహ్మచారులుగా రహస్య జీవనము సాగిస్తూ, బకాసురిని వధ తరువాత బ్రాహ్మణుడు ఇచ్చిన సమాచారంతో పాంచాల రాజ్యానికి ద్రౌపది స్వయంవరానికి బయలు దేరుతారు. ఆ సమయములో వారు గంగానది ఒడ్డున గల అరణ్యము గుండా ప్రయాణిస్తున్నప్పుడు, వారి అడుగుల సవ్వడి విన్న అంగారపర్ణుడు అనే గంధర్వడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నప్పుడు ఈ అలికిడిని ఆటంకంగా భావించి మానువులెవరో తన అరణ్యములో ప్రవేశించారని ఆగ్రహించి ధనుష్టాంకారము చేస్తాడు. పాండవులతో అంగారపర్ణుడు,”ఓరి మానవులారా ఎవరు మీరు? నా పేరుతో ఉన్న అరణ్యములో నేను నా భార్యలతో జల క్రీడలాడుతున్నప్పుడు ఇతరులెవ్వరు ఈ దారికి రాకూడదు అని తెలియదా? నేను కుబేరుని ఆప్తమిత్రుడైన అంగారపర్ణుడు అనే గంధర్వుడను. అర్ధరాత్రి, ప్రాతః సాయం సంధ్యలు యక్ష రాక్షస గంధర్వాదులు యథేచ్ఛగా సంచరించే సమయము ఈ సమయములో మానవులు ఈ ప్రాంతాలలో అడుగు పెట్టటానికి భయపడతారు. ఈ సమయాల్లో ఎవరు మా ముందు నిలవలేరు. మీరు ఇక్కడ ఒక్క క్షణము కూడా నిలువకుండా ఎక్కడికైనా పారిపోయి ప్రాణాలను దక్కించుకొండి ” అని హెచ్చరిస్తాడు.

కానీ వచ్చినవారు అమిత శక్తి సంపన్నులైన పాండవులు. అంగారపర్ణుడి హెచ్చరిక విన్న అర్జునుడు పకపకా నవ్వి,”గంధర్వా! నీవు అవివేకిలా ఉన్నావు, అరణ్యాలు, నదీ జలాలకు అధినాయకుడివా ? ఈ గంగ శివుని జటాజూటము నుండి భువికి చేరి ఎందరినో పవిత్రులుగా చేసి పాతాళానికి వెళ్ళింది. నీవు గంగా స్నానానికి వచ్చావు అంటే పవిత్రుడివి అవుదామని కదా. అటువంటి వాడివి మమ్మల్ని ఆక్షేపిస్తావా?” అని అర్జునుడు తల్లి, సోదరులతో కలసి సోమశ్రవ తీర్ధములో ప్రవేశిస్తాడు.అహము దెబ్బతిన్న అంగారపర్ణుడు పాండవులపైకి బాణాల వర్షము కురిపిస్తాడు కానీ ప్రత్యర్థి సామాన్యుడు కాదు విలువిద్యలో ఆరితేరినవాడు, అమోఘమైన శక్తివంతమైన అస్త్ర శస్త్రాలను కలిగి ఉన్నవాడు అవటం వలన అర్జునుడు అంగారపర్ణుడిని ఎదుర్కొన్నాడు. అంగారపర్ణుడి శరపరంపరకు దీటుగా అర్జనుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఫలితముగా అంగారపర్ణుని రధము కాలిపోయి అంగారపర్ణుడు నేలకూలాడు. నేలకూలిన అంగారపర్ణుని అర్జునుడు ఈడ్చుకొని వెళ్లి ధర్మరాజు సమక్షంలో పడేసాడు. ఈ హఠాత్ పరిణామానికి అంగారాపర్ణుని భార్య కుంభీనాసి భయపడి ధర్మరాజును పతిబిక్ష పెట్టమని వేడుకుంది. అంగారపర్ణుడు కూడా క్షమించమని వేడుకున్నాడు
“అర్జునా పరాజితుడైన వ్యక్తిని శిక్షించటం తగదు విడిచిపెట్టు” అని ధర్మరాజు అర్జునునితో అనగా అన్నగారి మాట మీద గౌరవముతో విడిచిపెడుతూ,”ఎవరిని దిక్కరించక యథేచ్ఛగా విహరించు”అని అంగారపర్ణునితో చెపుతాడు. అంగారపర్ణుడు అర్జునుని ఔదార్యానికి, ధర్మరాజు విజ్ఞతకు సంతోషించి ,”అర్జునా! నీ చేత పరాజితుడినయిన నేను అంగారపర్ణుడు అనే పేరుతో సంచరించలేను. పోయిన నా రథాన్నినా మంత్రశక్తితో పొందలేను. ఇకపై నేను చిత్రరథుడు అనే పేరుతో ప్రఖ్యాతి పొందెదను. నా దగ్గర పరమ రహస్యమైన చాక్షుసి విద్య ఉంది. ఆ విద్యను నీకు ప్రసాదిస్తాను. నీవు నాకు ఆగ్నేయాస్త్రాన్ని ప్రసాదించు, చాక్షుసి విద్య వలన ముల్లోకాలలో జరిగేవన్నిటిని క్షణకాలంలో తెలుసుకోవచ్చు. అలాగే ఈ విద్యతో పాటు మీ అన్నదమ్ములందరికీ తలా నూరు గంధర్వ అశ్వాలను బహుమతిగా ఇస్తాను. మీరు నన్నుమీ మిత్రుడిగా స్వీకరించండి” అని అంగాపర్ణుడు(చిత్రరధుడు) అడుగుతాడు. అర్జునుడు అంగారపర్ణునికి స్నేహహస్తాన్ని అందించి ,”మిత్రమా నీవు కావాలన్న ఆగ్నేయాస్త్రాన్ని నేను ఇస్తాను కానీ నీ చాక్షుసి విద్య నేను స్వీకరించను. నీవు ఇస్తానని గాంధర్వ అశ్వాలను స్వీకరిస్తాము మేము కృతజ్ఞులము” అని అర్జునుడు చెపుతాడు.
ఆ తరువాత సంభాషణలో అంగారపర్ణుడు పాండవులతో ఇంతటి ధర్మాత్ములు బుద్ధిమంతులై ఉండి కూడా పురోహితుడు లేకుండా ఉండటం శోభస్కరము కాదు. పురోహితుని సాయము ఉంటే సర్వత్రా విజయులు పూజ్యులు అవుతారు కాబట్టి త్వరగా పురోహితుని పొందమని సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు పాండవులు ధౌమ్యుని పురోహితునిగా ఏర్పాటు చేసుకుంటారు. అలాగే అంగారపర్ణుడు వారికి విశ్వామిత్రుడు, వశిష్టుడి గొప్పతనాలను వివరిస్తాడు. వారి సంభాషణలో అంగారపర్ణుడు అర్జునుడిని “తాపత్య కులశేఖర” అని సంభోదిస్తాడు అది విన్న అర్జునుడు ,”గాంధర్వ వీర నీవు నన్నుతాపత్య కులశేఖర అని సంభోదించావు, మాకు ఆ తపతికి గల సంబంధము ఏమి “అని వివరణ అడుగగా అంగారపర్ణుడు “తపతీ – సంవరణోపాఖ్యానం”ను వారికి వివరిస్తాడు.
తపతి కాలచక్ర గామి. ప్రత్యక్ష సాక్షి అయిన సూర్యదేవుని పుత్రిక. ఈవిడ చక్కని అందగత్తె, సౌందర్యరాశి. అటువంటి సౌందర్యరాశి యక్ష,గంధర్వ దేవతా స్త్రీలలో ఎవరు లేరు. అటువంటి ఆమెకు వివాహము ఎలా చేయాలి అనేది పెద్ద సమస్యగా మారింది. అటువంటి సమయములో ఒకానొక సందర్భములో సంవరుణుడు అనే రాజు వేటకు వెళ్ళాడు. ఆ వేటలో అయన గుఱ్ఱము అలసి పోయి నేలకూలింది. అప్పుడు మహారాజు కాలినడక కొండచరియాలోని దుర్గమ ప్రాంతములోకి ప్రవేశించాడు. అక్కడ ఆయనకు త్రిలోకాలను అబ్బురపరిచే సౌందర్యరాశి తపతి కనిపించింది. ఆవిడ సౌందర్యానికి ముగ్దుడైన మహారాజు ఆవిడను సమీపించి వివరాలు అడిగాడు కానీ సహజమైన సిగ్గు వలన తపతి మౌనము వహించగా రాజు ఆ మౌనాన్ని భరించలేకపోయాడు. అప్పుడు తపతి,”రాజా, ఈ విధమైన మోహము నీలాంటి విజ్ఞులకు తగదు. మోహము అజ్ఞానంధకారానికి చిహ్నము. జ్ఞానివైన నీవు సత్యాన్ని గ్రహించాలి.”అని చెప్పగా రాజుకు సత్యేమేమిటో తెలియక తికమక పడి నీవు ఎవరివి అని అడిగాడు “రాజా కాలస్వరూపుడు, ప్రాతసంధ్యాల దివాకరుడు నా తండ్రి, సావిత్రిదేవి నా అక్క, నాకు నీ పై ప్రేమ ఉన్నప్పటికీ స్త్రీలు అస్వతంత్రులు కాబట్టి, నా తండ్రి అనుమతితోనే నేను నీ దానము కాగలను కాబట్టి నీవు నా తండ్రిని వేడి నన్ను స్వీకరించు”అని తపతి సంవరుణుడితో చెపుతుంది.
తపతి మాటలు విన్న సంవరుణుడు నీరసించిపోయారు. సూర్యుని వేడుకొని తాపతిని వివాహము చేసుకోవటం అంత సులువైన పని కాదు. కానీ తపతిని వివాహమాడాలి అన్న బలమైన కోరికతో హస్తినాపురానికి వెళ్లకుండా, అక్కడే ఆశ్రమము ఏర్పాటు చేసుకొని ఆదిత్యుని ఆరాధిస్తూ కాలము గడుపుతున్నాడు. కొంతకాలము అయినాక కులగురువైన వశిష్ఠుని స్మరించుకోగా, అయన ప్రత్యక్షమయి విషయము తెలుసుకొని సూర్యమండలానికి వెళ్ళాడు. ఆదిత్యుని దర్శించి ఈ వృత్తాంతమును ఆయనకు విశదీకరించాడు. అంతకుమునుపే ఆదిత్యునికి సంవరుణుడే తపతికి తగిన వాడని ఆలోచన ఉన్నందువల్ల వశిష్ఠుల వారి ప్రతిపాదనను అంగీకరించి సంవరణునికి తపతికి వేదోక్త మార్గములో వివాహము జరిపించాడు.
వివాహము అనంతరము సంవరణుడు రాజ్యానికి వెళ్ళాక 12 సంవత్సరములు అరణ్యములోని భార్యతో అమితమైన అనందాన్ని పొందుతున్నాడు. కానీ రాజ్యములో రాజు లేకపోవటం వలన సరిఅయిన పాలన లేక, రాజ్యములో కరువు కాటకాలు ప్రబలిపోయినాయి. కులగురువైన వశిష్ఠులవారు ప్రజల సంక్షేమము కోసము శాంతి పౌష్టిక క్రియలను ఆచరించారు. రాజును రాజ్యానికి ఆహ్వానించి రాజ్యములో కరువు కాటకాలు లేకుండా చేసి ప్రజలు సుఖ శాంతులతో ఉండేటట్లు చూసారు. కొంతకాలానికి వారికి పుత్రోదయము అయింది. అతడే కురు మహీపతి . తని పేరుతోనే కురు వంశముగా ప్రసిద్ధికెక్కింది. అప్పటి నుండి మీరు తపస్యా వంశీయులు అయినారు. ఆ విషయము తెలిసినవాడిని అవటం వలన నిన్ను తాపత్య కులశేఖర అని సంభోదించాను అని అంగారపర్ణుడు అర్జునునిక్ తపతి సంవరణోపాఖ్యానమును వివరిస్తాడు.

1 thought on “అంగారపర్ణుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *