April 23, 2024

మౌనరాగం

రచన: ముక్కమల్ల ధరిత్రిదేవి

 

స్పందన

ఎంత చల్లని తల్లివమ్మ నా తల్లీ నీవు !
వెన్న లాంటి నీ మనసు
వెన్నెల చల్లదనానికి నెలవు!
నీ చేతి స్పర్శ నాకు ప్రాణవాయువేను
అది నిత్యం ఊపిరులూది
పోస్తోంది నాకు ఆయువు!
ఆ అడుగుల సడి చాలమ్మ నాకు
నా మది నిండుగ సందడి రేపు
నీ చూపుల మమతల జల్లుల
తడిసి మైమరిచి నా కొమ్మలు రెమ్మలు
పురివిప్పి పరవశించి నిను
పలకరిస్తున్నాయి చూడవా !
ఏ శుభ ఘడియల నను నాటితివో !
నీ ఇంట నేనో వీడని బంధమైతి !
ఏ అమృత బిందువుల నందించి పెంచితివో !
దినం దినం ఏపుగ ఎదిగి ఎదిగి
పైపైకి పెరిగి పెరిగి ఈనాడిలా
నీ ముంగిట ముచ్చటగా నిలిచితి !
అదిగో, విప్పార్చుకున్న పత్ర దళాల
గుంపుల నడుమ గుత్తులు గుత్తులుగా
పుట్టుకొచ్చిన నా బిడ్డలు, ఈ చిరుమొగ్గలు !
వాటి సందళ్ళు ! ఒకపరి వినవా !
మొదట మొక్కనే ! నీ చేతి మహిమ !
నేడు చెట్టునై విరబూసిన పువ్వుల
గుభాళింపులతో నీ లోగిలి నింపు
భాగ్యశాలినైతి నా తల్లీ !
ఎంత చల్లని తల్లివమ్మ నీవు !
చీడపీడలు నన్నావహించిన వేళ
జాగుసేయక క్షణమైన నీ చేతులే
దివ్యౌషధాలై నను కాచుకున్న వైనం
మరువగలన మరుజన్మనైన ! జననీ !
ఋణమన్న నొచ్చుకొందువో ఏమో!
మరి ఏమివ్వగలదానను?
దైవ పూజకు కొన్ని, నీ సిగనలంకరింప
మరికొన్ని, ఇవిగో, సుగంధసుమబాలలు !
కొంగు నిండుగ, స్వీకరింపుము తల్లీ !
ఎంత చల్లని తల్లివమ్మ నీవు !
వెన్న లాంటి నీ మనసు
వెన్నెల చల్లదనానికి నెలవు !
మౌనరాగం నాది ! నీ మది తాకిన చాలు,
ధన్యత నొందు నా ఈ జన్మంబు !!

******************

ప్రతిస్పందన

చిట్టి తల్లీ ! నీ మౌనరాగం
నా మది తాకిందిలే !
నీ తేనెలొలుకు పలుకుల తీయదనం
వినమ్రత ఉట్టిపడే ఆ భావజాలం !
అచ్చెరువొందించె నన్నో క్షణకాలం !
అలవోకగ నేజేసితినా చిన్ని కార్యం, ఆహా !
ఆశించని ఊహించని విస్మయమే సుమీ !
అనుకోని ఈ స్పందన !
అబ్బురమే! పులకించితి ! 🙂
ముద్దులొలికే నిను ముచ్చటపడి తెచ్చుకొంటి
మూలనున్న కుంపటి తీసి ముస్తాబు చేసి
మట్టితో నింపి నిను కూర్చుండబెట్టి నీరందిస్తి !
ఆ మాత్రపు ఆదరణకే
పొంగిపోయితివా నా చిట్టితల్లీ !
మారాకు వేసిన ప్రతిసారీ మురిసిపోతి
చీడ నిన్నాశించిన తల్లడిల్లితి ! ☺️
నా చేతి స్పర్శ నీకు ప్రాణవాయువాయెనా !
నా అడుగుల సడి నీకు సందడి అంటివా !
పదిలంగా ఈ పసిడి పలుకులు
నిలిచిపోవా నాలో పదికాలాలు !
ముంగిట సౌరభాలు నింపితివి
లోగిలికే కొత్త సొబగులద్దితివి !
భాగ్యశాలిని నేనమ్మ నిజానికి…
విరబూసిన ఆ పువ్వులు చాలు
చిరునవ్వులకవి కావా చిరునామాలు !
అంతకుమించి ఇంకేమి కావాలి నాకు?
చిట్టితల్లీ !! నీ మౌన రాగం
నా మదిజేరిందిలే,
మరల మరల వింటూ
పరవశిస్తాలే !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *