June 19, 2024

“గవి గంగాధరేశ్వరుడు” బెంగుళూర్

రచన: రమా శాండిల్య

గవి అంటే కన్నడలో, ‘గుహ అని అర్థంట!!

పాత బెంగుళూర్ లో అతి పురాతన ఆలయం. గవి గంగాధరాలయం. ఈ ఆలయం ఒక కొండ గుహ లోపల ఉన్నది. ఏ మాత్రము మార్పులు చెయ్యకుండా అలాగే కాపాడుతున్న అతి పురాతన ఆలయం ఈ శివాలయం. పైగా ఎన్నో ప్రాముఖ్యతలున్న ఆలయం ఇది.
ఈ ఆలయం సూర్య ప్రతిష్ట అని, ఇక్కడ శివుడితో సమానంగా సూర్యుడికి కూడా ఆరాధన జరుగుతోందని ఇక్కడి పూజారులు చెప్పారు.
ఈ ఆలయం పూర్వకాలంలో గౌతమ ఋషి తప్పస్సు చేసిన చోటని, ఆయన తరువాత భగీరథ ముని తపస్సు చేసుకునేవారని, వీరి కాలంలో, కాశీ వరకు పాతాళ మార్గాన దారి ఉండేదని ఇప్పటి భక్తులకు కూడా ఆ ఋషులు, మునులు ఆ మార్గాన ఈ ఆలయం నుంచి కాశీకీ, కాశీ నుంచి ఇక్కడకూ ప్రయాణిస్తుంటారని నమ్ముతారట!!
తరువాతి కాలంలో ఎందరో రాజుల ఆధీనంలో ఉండి ఈ స్వామి పూజలందుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తుందని చెబుతారు.

తరువాత 1535 కాలంలో, ‘ కేంపే గౌడ’ అనే వారు పునర్ నిర్మించారని ఇక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయం పురాతన భవంతులశాఖ ఆధ్వర్యంలో కూడా ఉన్నదని చెబుతున్నారు.
ఈ గుడిలో ముఖ్యంగా నన్నాకర్షించిన విషయం, ఈ ఆలయం ముందు రాతితో చేసిన త్రిశూలము, రెండు రాతి డమరుకాలు, ఒక రాతి శూలము, ఒక రాతి బలిపీఠము ఉన్నాయి. అవి కలియుగాంతాన, వచ్చే ప్రళయాన్ని ముందుగానే సూచిస్తూ మ్రోగుతాయిట! అంటే, ‘యాగంటి బసవన్న’ వేసే రంకె లాగా అన్నమాట! మన దేవాలయాలలో నిక్షిప్తం చేసిన సమాచారం యొక్క గొప్పతానానికి, వారిచ్చిన సమాచారానికి ఇంతకన్నా మంచి తార్కాణం ఏముంటుంది, కదా!
ఇక్కడి, ఈ దేవాలయంలో, ‘అగ్ని’ కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడకు వచ్చిన భక్తులు ప్రతీ వారు, రెండు జ్యోతులను వెలిగించి దేవాలయానికి చూపిస్తుంటారు. అంటే పూర్వకాలం నుంచీ ఇప్పటి వరకూ ఎన్ని కోట్ల దీపజ్యోతులు ప్రకాశిస్తూ ఉన్నాయో కదా! ఆ శక్తి ఈ ఆలయంలో తెలుస్తూ ఉన్నది.
ఇంకొక ముఖ్య విశేషం – ఈ ఆలయంలో మకర సంక్రమణం రోజు సూర్యుడు మకారంలో ప్రవేశించే ఆ క్షణం నుంచీ ఒక గంటసేపు, గంగాధర లింగం మీద మొదటి కిరణం ప్రసారించి, గుడి బయట ఉన్న నంది వరకూ, ఆ సూర్య కిరణాల ప్రకాశం ప్రయాణిస్తుందట. అది చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారట. అంటే సూర్యుడు ప్రతిష్టించిన లింగానికి సంవత్సరానికి ఒకసారి తానే స్వయంగా సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేసుకుంటాడన్నమాట! అద్భుతమే కదా!


సూర్య కిరణాలు పడటం విశేషం ఏమిటి? అనుకుంటున్నారా! విశేషమే ఇక్కడ, పూర్తిగా రాతితో మూసేసి ఉన్న గుహలో ఉన్న శివలింగం మీద సూర్యకిరణం పడటం విశేషమే కదా! పైగా, ఆరోజు ఆ సమయంలో ఆ స్వామిని దర్శించుకుంటే మనలో ఉండే నెగిటివ్ ఎమోషన్స్ తగ్గుతాయి అనే నమ్మకమట ఇక్కడి భక్తులకు! అవే రోగాలను తగ్గిస్తాయి అని నమ్ముతారట.
శివుడు లింగ రూపంలో ఇక్కడ ఉన్నాడు. కనుక, శివరాత్రి రోజు లింగోధ్బవకాలానికి లక్షలమంది దర్శిస్తారట. ఇక్కడ ముఖ్యంగా చేసే ఉత్సవాలు శివరాత్రి, మకర సంక్రాంతి చాలా బావుంటాయట.

ఈ ఆలయంలో ఉన్న దేవతామూర్తులు:

గవి గంగాధరేశ్వరుడు: ఈయనకు నిరంతరం, అభిషేకం, అర్చన, హారతీ జరుగుతూనే ఉంటుంది. చాలా అందమైన మూర్తి!
పార్వతి అమ్మవారు: చాలా పెద్దముత్తైదువలా చాలా అందమైన విగ్రహం ఈ అమ్మవారిది. ఎంతసేపు చూసినా తనివి తీరదసలు.
వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు తల్లితండ్రులకిరువైపులా దర్శనమిస్తారు.
ఎవరైతే, తపస్సుచేసి శివుడిని తీసుకువచ్చారో వారిరువురు ఇప్పటికి విగ్రహరూపంలో తపస్సు చేస్తూనే ఉన్నారు. వారే గౌతమ మహారుషి, భరద్వాజ మహాముని.
చండికేశ్వరుడు, ఉమాదేవి సమేత ఉమామహేశ్వరుడు, వల్లభ గణపతి, దుర్గవినాసిని దుర్గమ్మ, అగ్నిదేవుడు, సప్తమాతృకలు, దక్షిణామూర్తి, కాలభైరవుడు, వీరభద్రుడు, వీరందరూ జీవం ఉట్టిపడుతూ ఉన్నారు.
క్షేత్ర పాలకులు, శ్రీ లక్ష్మినారాయణుడు, ఆంజనేయుడు.


సూర్యుడు, చంద్రుడు అమావాస్య, పౌర్ణమి పూజలందుకుంటారట ఇరువురు.
మహాగణపతి, అయ్యప్ప, వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు విడిగా గుడి ఆవరణలో పూజలందుకుంటున్నారు. వీరే కాక నవగ్రహాలు కూడా ఉన్నాయి.
ఇదే కాక ఈ ఆలయంలో చక్కటి క్రమశిక్షణతో ఒక్కొక్కరుగా దర్శనం చేసుకోవడం చాలా నచ్చింది. పవిత్రత, క్రమశిక్షణ కలిగిన మంచి దేవాలయం చూశానన్న తృప్తి కలిగింది. బెంగుళూర్ వచ్చిన వారు తప్పకుండా దర్శించుకోవలసిన ఆలయం ఇది.

ఓం నమశివాయ నమః 🙏

1 thought on ““గవి గంగాధరేశ్వరుడు” బెంగుళూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *