May 19, 2024

ధృతి – 13

ఆఖరు భాగం

రచన: మణికుమారి గోవిందరాజుల

ఆ రోజు రాత్రి అన్నం తింటున్నప్పుడు చెప్పింది తాను చేసిన ఘనకార్యం.
నిర్ఘాంతపోయి చూస్తుండిపోయింది తులసి.
“అదేంటే? ఇప్పుడు వద్దు అనుకున్నాముగా? పరీక్షలు దగ్గరకొస్తుండగా నీకిది అవసరమా? దీని పర్యవసానం నీ చదువు మీద పడితే నువు ఎంత డిస్ట్రబ్ అవుతావు? ఇప్పుడు నీ పిలక వాళ్ళ చేతుల్లో ఉన్నది” లబలబలాడింది.
“అమ్మా! ఆయనది అంత చీప్ మెంటాలిటీ కాదు. నువ్వేమీ కంగారు పడకు. ఇప్పుడు నేనేమీ చెప్పకపోతే, అది నేను ఒప్పుకున్నట్లుగా వాళ్ళు భావిస్తే? అదింకా కష్టం అమ్మా…. కూల్ మా కూల్”
“అమ్మ అంటున్నదని కాదు కానీ నువు చేసింది కరెక్ట్ కాదు అమ్మడూ…నీ భవిష్యత్తు రిస్క్ లో పెట్టినట్లు అయింది కదా? అయినా నాకు ఒకటి అర్థం కాలేదు. అఫ్కోర్స్…. ఎప్పటికీ నీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము. కానీ ఈ సంబంధం ఎందుకు వద్దనుకున్నావు? నీ కారణాలేంటి?” కుతూహలంగా అడిగాడు దినేష్.
కొద్దిసేపు మౌనంగా ఉన్నది ధృతి. తర్వాత “నాన్నా! పెళ్ళి అంటే అబ్బాయి, అమ్మాయి ఒక బంధంతో ఒకటవడమే కాదు. వెళ్ళిన అమ్మాయి ఆ ఇంట్లో ఒదిగిపోవాలి. ఇంటికి వచ్చిన అమ్మాయి ఈ ఇంటి బిడ్డ అని ఆ ఇంటివాళ్ళు దగ్గరికి తీసుకోవాలి. అంతే కాని కొడుకు వేరు, కోడలు వేరు అనుకోకూడదు. ఏ ఒక్క వ్యక్తీ ఫ్లాలెస్ ఉండరు. తప్పులుంటాయి. ప్రతిసారీ ఆ తప్పుల్ని ఎత్తి చూపకూడదు. అమ్మా! నువ్వూ బామ్మా ఎలా ఉంటారు? మీ ఇద్దరూ అత్తా కోడళ్ళలా ఉండరు. ఫ్రెండ్స్ లా ఉంటారు. . హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా అని మీ ఇద్దరూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు. తప్పుల్ని మరచిపోతున్నారు అంతే. నాన్న మీ ఇద్దరిలో ఎవర్నీ సపోర్ట్ చేయడు. అందుకని మీకు మీరే సర్దుకుంటున్నారు. అందువల్ల పిల్లలమైన మేము బామ్మతో సంతోషంగా ఉండగలుగుతున్నాము. నాన్నా! అత్తా కోడళ్ళకు పడకపోవడం వల్ల, నలిగిపోతున్న మా ఫ్రెండ్స్, వాళ్ళింట్లో జరుగుతున్న గందరగోళం చెప్తుంటే భయమేస్తుంది” తండ్రి భుజం మీద తల వాల్చింది.
“అందరిళ్ళల్లో అలా ఎందుకు ఉంటుంది తల్లీ?”
“నాన్నా! అందరు మగవాళ్ళూ నీలా ఎందుకు ఉండరు? నన్ను మహరాణిలా చూసుకుంటావు. నువు ఇచ్చిన ధైర్యమే నా బలం. నేను ఏ తప్పు చేసినా ఆ తప్పేంటో, ఎందుకు చేయకూడదో చెప్తావే కాని దండించవు. ఆడపిల్లలకు తండ్రే మొదటి స్నేహితుడు. ఆ స్నేహం బలంగా ఉండాలంటే తండ్రి ఎంత ఉన్నతుడై ఉండాలి? థాంక్యూ నాన్నా ఫర్ ఎవ్రీథింగ్…”
“అంతే తల్లీ… అంతే! ఎంతైనా మీ ఇద్దరూ ఒకటి. నేనొక్కదాన్ని ఒకటి” నిష్టూరంగా అన్నది తులసి.
“అవును నాకు మా నాన్న తర్వాతే అన్నీ. నువెప్పుడూ అలా ఉండకు… ఇలా ఉండకు… అంటూ ఉంటావు… కానీ నాన్నో… అలా ఎందుకు ఉండకూదదో… ఇలా ఎందుకు ఉండాలో చెప్తారు. అదీ పెంపకమంటె…” వెక్కిరించింది తల్లిని.
తండ్రిని కావిటేసుకున్నట్లుగా కూర్చుని, తండ్రి మీద ప్రేమతో వెలిగిపోతున్న కూతుర్ని చూస్తుంటే అపురూపంగా అనిపించింది. గభాల్న తింటున్నదల్లా లేచి వచ్చి కూతుర్ని ఎడమ చేత్తో దగ్గరికి తీసుకుని నుదుటిమీద ముద్దు పెట్టుకున్నది. “అదృష్టవతురాలివి బంగారం” అంటూ…
“అమ్మా! నువు కూడా మంచిదానివేలే…” కరుణిస్తున్నట్లుగా అని నవ్వింది.
“ఇంతకూ ఎందుకు వద్దనుకున్నావో చెప్పలేదు” గుర్తు చేసాడు దినేష్.
“నాన్నా శేఖరం గారు నిజంగా చాలా మంచివారు. కాని ఒకసారి కొడుక్కు పెళ్ళయ్యాక, ప్రపంచానికి మాత్రమే మంచివారుగా మిగిలి పోతారు”
“ఏవొచ్చిందే… పెళ్ళై కాపురం చేసేదానిలా మాట్లాడుతున్నావు”
“అమ్మా! చుట్టూ ఉన్న ప్రపంచం చూస్తూ కొద్దిగా ఆలోచించగలిగితే మనకే అన్నీ తెలిసిపోతాయి. శేఖరం గారు నిజంగా గొప్ప వ్యక్తి. కాని ఆయన భార్య, చాలా గర్వం, కింది వాళ్ళని మనుషులుగా చూడలేని తత్వం కల ఆవిడ. ఇక వాళ్ళ అమ్మాయి దక్ష… చాలా అసూయా, కోపం, అహంకారం మూర్తీభవించిన విగ్రహం. ఇక వారి అబ్బాయిని మనం చూడలేదు. మనం చూస్తున్నదీ, మనకు తెలిసినదీ వాళ్ళ ఆస్తి ఒక్కటే. రేపు నేను అక్కడికి వెళ్ళాక, ఏమన్నా తేడా వస్తే ఆయనా,, భార్యా, కొడుకు వేపే ఉంటారు కానీ, ఇంటిపెద్దగా, మామగారిగా, నిజం ఎటువేపు ఉందని తెలుసుకోరు… కోడలినైన నన్ను సపోర్ట్ చేయరు…” ఆశ్చర్యంగా చూడసాగింది కూతుర్ని తులసి.
“నీకెన్నేళ్లే?. . . ముదినాపసానిలా మాట్లాడుతున్నావు?”
“అమ్మా! నాకు ఊహ తెలిసినప్పటినుండి నా పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నారు. మీరేంటిలే… ఏ ఆడపిల్ల తలితండ్రులయినా అలానే మాట్లాడుకుంటారు. కాని చాలా మంది ఆడపిల్లలు ఆ కబుర్లన్నీ వింటూ కలల లోకంలో విహరిస్తూ, ఊహల్లో తెలిపోతుంటారు. ఏ రాజకుమారుడో గుర్రం మీద వచ్చి తనను తీసుకెళ్తాడని. మళ్లీ ఇదెలా తెలుసు అనకు… మా ఫ్రెండ్స్ అనుకుంటుంటే విన్నాను. అందువల్ల చుట్టూ గమనించటం మొదలు పెట్టాను. అదీ నాన్నా… అందుకని వద్దు అనుకున్నాను. నాకు ఆ మాత్రం స్వతంత్రం ఉందనే అనుకుంటున్నాను”
“నీకెప్పుడూ ఆ స్వేచ్ఛ ఉన్నది. కాని పెళ్ళంటేనే లాటరీ లాంటిది. మనకెంతో తెలుసు అనుకున్న వాళ్ళల్లో కూడా పెళ్ళయ్యాక కొత్త వ్యక్తిని చూడొచ్చు. పెళ్ళికి ముందున్న ప్రయారిటీస్ పెళ్ళయ్యాక మారొచ్చు. ‘నన్ను ఎంతో ప్రేమిస్తాడు’ అని నువు అనుకున్నవాడు పెళ్ళయ్యాక నీలో తప్పులు చూసి నిన్ను ద్వేషించొచ్చు. నిన్ను భయపెట్టడం కాదు, కాని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నీకు పెళ్ళెలా అవుతుంది? ఈ మధ్య అదేంటి…? లివ్ ఇన్ రిలేషన్ షిప్ అని వస్తోంది కదా… అలా ఏళ్ళు కలిసి ఉండి, ఎంతో అర్థం చేసుకున్నామని అనుకుని కూడా పెళ్ళి అయిన వెంటనే విడాకులు తీసుకున్న వాళ్ళున్నారు”
“మంచివారు అనుకుని పెళ్ళి చేసుకోవడం వేరు… మంచివారు కాదు అని తెలిసి కూడా పెళ్ళి చేసుకోవాలని అనుకోవడం వేరు మై డియర్ ఫాదర్” నవ్వుతూ తేల్చేసి “నిద్ర వస్తోంది… నేను వెళ్తున్నాను. గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్లిపోతున్న ధృతి వంకే విస్మయంగా చూస్తుండిపోయారు ఇద్దరూ.

******

డ్రామా రిహార్సల్స్ తో, ఆటల ప్రాక్టీస్, పాటల సందడితో కాలేజీ అంతా హడావుడిగా ఉన్నది. ధృతి ఈ సారి సెలెక్ట్ చేసుకున్న డ్యాన్స్ కి ప్రాక్టీస్ చాలా శ్రద్ధగా చేసుకుంటున్నది. రోజులు చాలా ఫాస్ట్ గా గడుస్తున్నాయి.
విశ్వ ఫోన్ చేసాడు ప్రోగ్రాం రోజు తాను వస్తున్నా అని. “మొదటి సంవత్సరం నీ డ్యాన్స్ అందరినీ మైమరపించింది. ఇది లాస్ట్ కాబట్టి నేను మిస్ అయ్యే చాన్సే లేదు. అదీ కాక ఏదో ఒకటి తేల్చుకునే పోతాను. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను” అని కూడా అన్నాడు.
ఆరోజే ప్రోగ్రాం. విశ్వ ముందువరసలో కూర్చున్నాడు. ఇంకా ప్రోగ్రామ్స్ మొదలు కాలేదు స్టేజ్ వెనకాల నుండి తొంగి చూసింది. విశ్వ నవ్వుతూ చేయి ఊపి థమ్సప్ చూపించాడు. తాను కూడా నవ్వి విశ్వ పక్కనచూసింది తల్లీ తండ్రీ ఇంకా రాలేదు. వెనకాల ఉన్న గ్రీన్ రూం లోకి వెళ్ళింది. అందరూ వాళ్ల వాళ్ల ప్రోగ్రామ్స్ కోసం రడీ అవుతున్నారు. “అక్కా నువెంత అందంగా ఉన్నావో తెలుసా” జూనియర్ ఒకమ్మాయి అడ్మైరింగ్ గా చూస్తూ చెప్పింది. “థాంక్స్ రా డియర్… నువు కూడా సూపర్ ఉన్నావు” తిరిగి మెచ్చుకున్నది.
“అందరూ రడీనా? ఇంకో అరగంటలో మొదలవబోతున్నది ప్రోగ్రాం”
“యస్…” అందరూ ఉత్సాహంగా అరిచారు.
ఎదురుగా ఉన్న పెద్ద అద్దంలో తనని తాను చూసుకున్నది. ఎరుపూ ఆకుపచ్చ కాంబినేషన్ లోని భరతనాట్యం డ్రెస్ లో తనకు తానే ఎంతో అందంగా కనపడింది.
“నువు దిష్టి తీయించుకోవాలోయ్” ఫ్రెండ్స్ మెచ్చుకోలుగా చూస్తూ అన్నారు.
“మీరంతా కూడాను” వాళ్లకు చెప్పి మళ్లీ స్తేజ్ వెనక్కి వచ్చి బయటికి చూసింది. విశ్వ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నాడు. తన వాళ్ళెవరూ కనపడలేదు.
“ఏమయింది వీళ్ళకు?” మనసులో విసుక్కుని తల్లికి చేద్దామని ఫోన్ తీసేసరికి సైలెంట్లో ఉన్న ఫోన్ బ్లింక్ అవుతున్నది. లేట్ అయిందని చేసినట్లున్నారు అనుకుని ఆన్ చేసేసరికి అటునుండి తల్లి “ధృతీ… ధృతీ …” అంటున్నది కాని ఏడుపు దానిని డామినేట్ చేస్తున్నది.
కంగారుతో కాళ్ళూ చేతులు ఆడలేదు ధృతికి. “అమ్మా! అమ్మా! ఏమైంది? ఇంకా రాలేదేంటి?”
“ధృతీ… అర్తీ కార్తీ ఇంకా ఇంటికి రాలేదు. స్కూల్లో అడిగితే ఎప్పుడో వెళ్ళిపోయారని చెప్పారు. అందుకే మేము ఇంకా రాలేదు” ఫోన్ లాక్కున్న బామ్మ చెప్పింది.
కంగారు తగ్గింది ధృతికి. “అంతేనా… ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళుంటారు. వస్తారులే బామ్మా… దానికేనా అమ్మ ఏడుస్తున్నది. అమ్మ మరీనూ. మీరు తొందరగా వచ్చేయండి. ” ఫోన్ పెట్టేయబోయింది.
“ఫోన్ పెట్టకే… ఏదో ఉత్తరం కూడా వచ్చిందట. మీ నాన్న తలకాయ పట్టుకుని కూర్చున్నాడు. నీతో ఏదో మాట్లాడాలట. తొందరగా వచ్చెయ్యి” ఏడుస్తూనే చెప్పింది బామ్మ.
మతిపోయినట్లైంది ధృతికి. “ఆ…” అన్న అరుపు నోట్లోనుండి రాబోయింది. కాని ఇప్పుడు తానెటువంటి స్టెప్ తీసుకున్నా ఎన్నోరోజులనుండి అందరూ పడుతున్న కష్టం వృధా అవుతుంది. అలా అని ఏమి జరగనట్లు మామూలుగా డ్యాన్స్ చేయలేదు. ఎవర్నీ కంగారు పెట్టకుండా బయటపడాలి. ఎలా? ఒక్క క్షణం ఆలోచించి విశ్వకు ఫోన్ చేసింది. “విశ్వ… అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నన్ను తీసుకెళ్ళు. నువు కారు తీసుకుని ఎక్జిట్ దగ్గరికి వచ్చెయ్యి. నేనొస్తాను. ఎవరికీ ఏమీ చెప్పకు. ఒక్కడివే రా” ఏమి జరిగింది అనిఅడిగేదానికి సమాధానం చెప్పకుండా మళ్లీ గ్రీన్ రూం లోకి వచ్చి తనతో పాటున్న ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ని బయటికి రమ్మని పిలిచింది. ఆ అమ్మాయి బయటికి రాగానే “వాసవీ నేను అర్జెంట్ పని వచ్చి ఇంటికి వెళ్తున్నాను. నా ఐటెం సమయం వచ్చినప్పుడు లాస్ట్ కి అని అనౌన్స్ చేయి. ఎవరికీ ఏమీ చెప్పకు” “ఏమయింది ధృతీ” అని వెనకనుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా, అక్కడున్న షాల్ అందుకుని, నిండా ముసుగులాగా వేసుకుని పరుగునా వెనక దోవ గుండా బయటికి వచ్చింది…
అప్పటికే విశ్వ కార్ అన్ చేసి రడీగా ఉన్నాడు. “ఏమయింది ధృతీ? ఎందుకు ఇంత కంగారుగా బయలు దేరావు?” కారు స్టడీగా డ్రైవ్ చేస్తూనే అనునయంగా అడిగాడు విశ్వ.
“ఆర్తీ, కార్తీ మధ్యాహ్నం నుండి ఇంటికి రాలేదట విశ్వా. ఏదో ఉత్తరం కూడా వచ్చింది. నువు రా అని చెప్పింది బామ్మ అంతే. ఇంకా ఏమీ తెలీదు. అందుకే ఎవరికీ చెప్పకుండా ఇంటికి బయలు దేరాను” చెప్తుందగానే మనసులో ఏదో అనుమానం పొడసూపినట్లయింది “దీని వెనుక శేఖరం గారి హస్తమేమన్నా ఉండి ఉంటుందా?” అని. “ఛ. . ఇంత తక్కువగా ఆలోచిస్తున్నా ఏమిటి?” ఆ ఆలోచనను విరమించుకున్నది.
కారు ఇంటి ముందు ఆగగానే పరుగునా లోపలికి వెళ్ళింది ధృతి. కారు పార్క్ చేసి వెనకే వెళ్ళాడు విశ్వ. కూతుర్ని చూస్తూనే “ధృతీ! ఏమీ కాదన్నావు… చూడు ఏమి జరిగిందో? ఆ పెద్దాయనే ఏదో చేసుంటాడు” ఏడుస్తూ వచ్చి కూతుర్ని పట్టుకున్నది.
“అమ్మా! అలా ఏమీ జరగదు. శివకు కబురు చేసారా?” తల్లిని పట్టుకుంటూనే తండ్రిని అడిగింది.
“వాడు ఆ పని మీదే వెళ్ళాడు” చెప్పింది బామ్మ.
“ఏదీ ఆ ఉత్తరం?” అడిగింది ధృతి.
“శివ తీసుకెళ్ళాడు” చెప్పాడు దినేష్.
ఇంటికి వస్తూనే అక్కా అంటూ ఎదురొచ్చే తమ్ముడూ, చెల్లి కనపడకపోయేసరికి చాలా దుఃఖం వచ్చింది. ఈడేరిన ఆడపిల్లని ఏ దుర్మార్గులు తీసుకెళ్ళారో…రోజూ పేపర్లో చూస్తున్న వార్తలు భయపెట్టాయి. వాడు ఆకలికి అసలే ఉండలేడు. పొద్దున్న అనగా వెళ్ళిన పిల్లలకు ఏమన్నా తినడానికి పెట్టారో లేదో? తల్చుకుంటున్నకొద్దీ కడుపులోనుండి ఏడుపు తన్నుకుని వచ్చింది. పెద్దంగా ఏడుస్తూ కూలబడిపోయింది. అప్పటివరకూ రకరకాలుగా పిల్లల్ని తల్చుకుంటూ కళ్లనీళ్ళు పెట్టుకుంటున్న పూర్ణిమ, తన దుఃఖం మర్చిపోయి, పరుగునా వచ్చి కూతుర్ని పొదివి పట్టుకున్నది. బామ్మ అయితే పిల్లలు ఇంటికి రాలేదన్న సంగతి తెలిసినప్పటినుండి పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు.
“ఇదంతా ఆయనే చేయించిఉంటాడు. అయినా పెద్దవాళ్ళతో మనకెందుకు చెప్పు? పనివేళా వెళ్ళి నాకిష్టం లేదని చెప్పొచ్చావు. ఇప్పుడు చూడు ఏమయిందో?” ఏడుస్తూనే అన్నది పూర్ణిమ.
“అయినా చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళడమేంటి? పద వెళ్ళి ఆయన్నే నిలదీద్దాం? ఇదేనా పెద్దరికం అని” ఏడుపు ఎటెళ్ళిందొ? కోపంతో మొహం ఎర్రబారింది పూర్ణిమకు.
“అమ్మా! తొందరపడకు. ఆయన అలాంటి వారు కాదు. నాలుగు సంవత్సరాలుగా ఆయన్ని చూస్తున్నాను. కాదు కాబట్టే నేను వెళ్ళి ధైర్యంగా చెప్పగలిగాను” తన బాధను అణచుకుంటూ తల్లిని ఊరడించింది ధృతి.
“అమ్మ అన్నది కూడా ఆలోచించాలి ధృతీ. పెద్దవారు. నువు అన్న మాటలకు హర్ట్ అయి ఉండొచ్చు. ఆ బాధతో ఏమైనా చేయొచ్చేమో” సాలోచనగా అన్నాడు దినేష్. పడుతున్న బాధ దినేష్ ని సక్రమంగా ఆలోచించనివ్వటం లేదు.
తల అడ్డంగా ఊపింది ధృతి. “ సర్ ది అంత చిన్న మనస్తత్వం కాదు నాన్నా. నువున్న పరిస్తితుల్లొ నువలా అంటున్నావే కాని నిజం నీకు తెలీదా?. . . . ” మాట్లాడుతుండగానే పోలిసులొస్తున్నారు అంటూ గుసగుసలు మొదలయ్యాయి.
ఫోన్ లో ధృతి చెప్పినదాన్ని బట్టి ఆ పెద్దాయన కాలేజీ ఫౌండర్ శేఖరం గారే అయ్యుంటారని అనుకున్నాడు విశ్వ. కాని ఆయన అలాంటి మనిషి కాదు. ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది అని కూడా అనుకుని జరుగుతున్నది గమనించ సాగాడు.
ఇంతలో శివతో పాటు ఇతర స్టాఫ్ లోపలికి వచ్చారు.
“అమ్మా! ఏమి జరిగిందో చెప్తారా? అంతా శివ చెప్పినా మీ ద్వారా వినడం రూల్ కదా?” ఇనస్పెక్టర్ ప్రకాష్ పూర్ణిమ దగ్గరకొచ్చి అడిగాడు.
“ఈ రోజు మా అమ్మాయి ధృతి కాలేజీలో ఆనివర్సరీ ప్రోగ్రాం కి వెళ్ళాలి. పిల్లలకు తొందరగా రావాలి అని చెప్పాను. వాళ్ళ క్లాస్ టీచర్ కి ఫోన్ చేసి ఇంటికి పంపించమని రిక్వెస్ట్ చేసి, పర్మిషన్ తీసుకున్నాను. రోజూ స్కూల్ కి ఇద్దరూ సైకిళ్ళమీదే వెళతారు. మేము రడీ అయ్యాక కూడా వాళ్ళింకా రాలేదు. స్కూల్ కి వెళ్ళి అడిగితే వాళ్ల టీచర్ చెప్పింది, నేను అడిగిన సమయానికే వాళ్ళు ఇంటికి బయలుదేరారు అని. అప్పుడు శివకు కబురు చేసాను. ఇక ఆ తర్వాతది అంతా మీకు తెలిసే ఉంటుంది”
“మీకు ఎవరన్నా శత్రువులున్నారా సర్” దినేష్ వేపు తిరిగి అడిగాడు ప్రకాష్.
“మాకు శత్రువులు ఉండే అవకాశం కూడా లేదు. మాది చాలా మామూలు కుటుంబం” స్పష్టం చేసాడు దినేష్.
“మేము వచ్చేప్పుడే స్కూలు చుట్టుపక్కల విచారించి వస్తున్నాము. వాళ్ళు మామూలు రూట్లోనే వచ్చారట కాని మధ్యలో ప్యాంటూ షర్టు వేసుకున్న అమ్మాయి మాస్క్, గాగుల్స్ పెట్టుకుని ఉన్నదట…వచ్చి వాళ్లకేదో చెప్ప్పిందట, వీళ్ళు కాసేపు తల అడ్దంగా ఊపి ఏదో అన్నారట. కాని ఆ వ్యక్తి ఫోన్ లో ఏదో చూపించేసరికి, సైకిళ్ళు పక్కనే ఉన్న షాప్ ముందు పెట్టి, ఆమెతో వెళ్ళి పోయారట. అంతవరకు చూసినతను చెప్పాడు. అక్కడి సీ సీ కెమెరాలన్నీ చూసాము. ఎందులోనూ వాళ్లతో పాటు కొత్తవాళ్లు లేరు” చెప్పాడు శివ.
ఏదో హడావుడి జరుగుతున్నదని చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు. అప్పటికి సమయం రాత్రి పది అయింది. విషయం తెలిసి చిన్నగా కాలేజీ స్టూడెంట్స్ ఒక్కొక్కరూ రాసాగారు.
“అవునూ… ఉత్తరం అన్నారు కదా? ఏది శివా?” అడిగింది ధృతి.
“చేతి రాత ఎక్స్పర్ట్ కి ఇచ్చి వచ్చాను. దానిలో పెద్దగా ఏమీ లేదు. రాత్రి పదకొండు గంటలకు ఎక్కడికి రావాలో చెప్తాము. మేము అడిగిన డబ్బు తీసుకు వచ్చి పిల్లల్ని తీసుకువెళ్ళమనీ, పోలీసులకు చెప్పారో చాలా భయంకరమైన పరిణామం చూడాల్సొస్తుందనీ రాసారు… వాళ్ళకు తెలీదు ఇంట్లోనే డిపార్ట్మెంట్ ఉన్నదని” చెప్పాడు శివ.
ఇంతలో ఒక పోలీసు వచ్చి శివకు సాల్యూట్ చేసి చేతికి ఒక కాగితం ఇచ్చాడు. “ఇదిగో ఇదే ఆ ఉత్తరం. చూడు” ధృతి చేతికిచ్చాడు శివ.
అది తెరిచి చదువుతుండగానే ధృతికి చాలా పరిచయమైన రాత లా అనిపించసాగింది. ఎక్కడ చూసానబ్బా? దీక్షగా దాన్నే చూస్తూ ఆలోచించసాగింది. ఇంతలో అందరూ పక్కకు తప్పుకుంటూ నమస్కారములు చెప్తుండగా శేఖరం గారు లోపలకు వచ్చారు.
“అమ్మా ధృతీ… నువు వస్తూ నాకు చెప్పాల్సింది. ఏమి జరిగింది అసలు? పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకు తెలిసిన వాళ్ళున్నారు. కనుక్కుందాము భయపడకండి” ఇటు ధృతిని పలకరించి, అటుతిరిగి దినేష్ కి ధైర్యం చెప్పాడు శేఖరం.
దినేష్ కి శేఖరాన్ని చూస్తూనే చాలా కోపం వచ్చింది. కాని ధృతి సైగతో తల వంచుకున్నాడు.
ధృతికి సడన్గా గుర్తొచ్చింది అదెవరి రాతో. శివను దగ్గరకు పిలిచి అతని చెవిలో చిన్నగా ఏదో చెప్పింది. వెంటనే శివ గుమ్మం దగ్గరకు వెళ్ళి ఒక్కళ్ళు కూడా ఉండకుండా అందరినీ వెళ్ళిపొమ్మని హెచ్చరించాడు. అందర్నీ పంపేసరికి పది నిముషాల పైనే గడిచింది. విశ్వ, శేఖరం, శివ, కుటుంబ సభ్యులూ మాత్రమే మిగిలారు. శేఖరానికి ఏమీ అర్థం కావడం లేదు. అందర్నీ పంపి తనొక్కడినే ఎందుకు ఉంచారా అని. విశ్వను గుర్తు పట్టి పలకరింపుగా నవ్వాడు. విశ్వకు కూడా ఏమి జరుగుతున్నదీ అర్థం కావడం లేదు.
“సర్… ఈ చేతిరాతను మీరేమన్నా గుర్తుపట్తగలరేమో చూడండి” ధృతి లేచి లెటర్ ని శేఖరం చేతికి ఇచ్చింది.
చూస్తూనే గుర్తు పట్టాడు. మొహం అవమానంతో తెల్లగా పాలిపోయింది. “ధృతీ! ఇదీ…ఇదీ…”
“అవును సర్ ఇది దక్షదే… “నెమ్మదిగా అన్నది ధృతి.
పదినిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. మంచినీళ్ళు కావాలన్నట్లుగా సైగ చేసారు. శివ వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు.
“సర్! ఒక్కసారి దక్షకు ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కోండి. మనం వెళ్దాము” ధృతికి అర్థమవుతున్నది ఆయన మనసులో చెలరేగుతున్న కల్లోలము.
“చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కాలి ధృతీ!. ఇప్పుడర్థమవుతున్నది నాకు. అందర్నీ ఎందుకు పంపించావో… ఇటువంటి సందర్భంలో ఇంకెవరన్నా అయితే నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. నువు కాబట్టి అంత సంయమనంతో ఆలోచించావు” అంతటి మనిషీ అవమానభారంతో వణికిపోతున్నాడు.
“సర్! అంతమాట అనకండి. నాకు మీరేంటో తెలుసు. మీరంటే నాకు ఎనలేని గౌరవము. మొదలు పిల్లల్ని తెచ్చుకుందాము” అనునయంగా శేఖరం చేతులు పట్టుకుని చెప్పింది.
“దక్షా! ఎక్కడున్నావు?”
“ఇంట్లోనే నాన్నా!” ఫోన్ పెట్తేసి శివ వేపు చూసాడు. వందేళ్లు మీదపడ్డట్లుగా అయిన ఆయన్ని చూస్తే అక్కడున్న అందరికీ జాలేసింది.
“సర్ ! దక్ష ఇంట్లోనే ఉన్నది కాబట్టి మీరు ముందెళ్ళండి. వెళ్ళి తనను నెమ్మదిగా అడగండి. చెప్పకపోతే నేను వస్తాను. అప్పటివరకు బయట ఉంటాను. పదండి వెళదాము.
“అమ్మా! వెళ్ళి తమ్ముణ్నీ, చెల్లెల్నీ తీసుకొస్తాము. వంట చేయి… బాగా ఆకలిగా ఉన్నది. రాగానే తిందాము” తల్లికి చెప్పి వారితో పాటు కారెక్కింది. మనసులోని కంగారూ, బాధా తగ్గి రిలాక్స్ గా ఉన్నది ధృతి.
“సర్! దక్షకు ఎందుకో మొదటినుండీ నేనంటే పడదు. అయినా కాని ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు” కారెక్కాక అన్నది ధృతి.
కారెక్కిన దగ్గరనుండి ధృతి చేయి వదల్లేదు శేఖరం. శివ డ్రైవింగ్ చేస్తుండగా పక్కన విశ్వ కూర్చున్నాడు. వెనక వీరిద్దరూ కూర్చున్నారు.
ఇంటిదగ్గరకొచ్చాక ముగ్గురూ కార్లోనే ఉండగా శేఖరం ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ముందుగదిలోనే దక్ష ఉన్నది. సీరియస్ గా దక్ష వేపు చూసి జేబులో నుండి ఆమె రాసిన ఉత్తరం తీసి ఇచ్చాడు. అది చూడగానే కూర్చున్నదల్లా భయంతో లేచి నిల్చుంది. “ఎక్కడ పిల్లలు?” సీరియస్ గా అడిగాడు. భయంతో వణికిపోతున్నది దక్ష. కుదిరితే పారిపోదామా అన్నట్లుగా ఉన్నది. ఇక ఏమి చెప్పినా లాభం లేదని అర్థమయింది. చెప్పటానికి నోట్లోంచి మాట రావడం లేదు. మౌనంగా తన బెడ్ రూం చూపించింది. లోపలికి వెళ్ళి చూస్తే పిల్లలు మంచం మీద నిద్రపోతున్నట్లుగా పడుకుని ఉన్నారు. వాళ్లను చూడగానే పోతున్న ఊపిరి వచ్చినట్లుగా అయింది.
తండ్రి పక్కనే నించున్న దక్షకి “క్లోరోఫాం కాలేజీనుండి…” చెప్పబోతున్నదల్లా ఒక్క క్షణం ఏమి జరిగిందో అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి కోపంతో రుద్రుడిలా చూస్తున్న తండ్రికనపడ్డాడు. మందుతున్న చెంప తగిలిన దెబ్బని గుర్తు చేసింది. చెంప పట్టుకుని నిల్చున్న కూతుర్ని వదిలేసి, ధృతీ వాళ్లకు లోపలికి రమ్మని ఫోన్ చేసాడు.

******

“చిన్నప్పటినుండి నన్నే అందరూ మెచ్చుకోవటం చూసాను. మొదటి సారిగా నన్ను కాకుండా ధృతిని మెచ్చుకోవటం తట్టుకోలేకపోయాను. నాన్న కూడా ప్రతీ రోజు ధృతినే పొగిడేవాడు. అదీకాక ఇంటికోడలిగా కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఏదో ఒకటి చేసి ధృతిని కించపరచాలని చాలా సార్లు ప్రయత్నించాను. కాని కుదరలేదు. ఈ రోజు ధృతి చేసే డ్యాన్స్ గురించి కాలేజీ మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటున్నది. అది కనక జరిగితే ఆ తర్వాత ఆమె వెళ్లేదాకా నేను అవి వింటూ ఉండాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, జరిగిన అవమానాలు నన్ను పిచ్చిదాన్ని చేసాయి. ఎలాగో ఒకలా ఈడ్యాన్స్ ఆపితే చాలు అన్న ఉద్దేశ్యమే తప్ప పిల్లలకు హాని చేయాలన్న ఆలోచన నాకు లేదు. స్కూల్ దగ్గరకు వెళ్ళి, వాళ్ళను కలుసుకున్నాను. నేను వాళ్ళకు తెలీదు. అందుకే మొదలు రామని అన్నారు. కాని ఈ మధ్యాహ్నమే ధృతి ఫోన్ నుండి దొంగ తనంగా నేను ఇచ్చిన మెసేజ్ “ఈమెతో వచ్చేయండి. అమ్మావాళ్ళు వచ్చేసారు. మీ బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి” చూపించాను. దాంతో, వాళ్ళ అక్క ఫోన్ నంబర్ చూసి వెంటనే నాతో వచ్చారు. కార్లో పోతుండగానే ఇద్దరికీ క్లోరోఫాం వాసన చూపించాను. అమ్మ ఊరికెళ్ళిందని ఇంటికే తీసుకెళ్ళాను. ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక వాళ్లని ఇంట్లో అప్పచెప్పేద్దాము అనుకున్నాను. పోలీసులకు చెప్పొద్దంటే, చెప్పకుండా పదకొండు వరకు చూస్తారని, ఆ తర్వాత ఎక్కడో ఒకచోటికి పిలిచి వాళ్ళను అప్పగిద్దామని అనుకున్నాను. ధృతికి ఇలా దొరికిపోతానని అనుకోలేదు. ఇంకెవ్వరికీ తెలీదు. ఒక్కదాన్నే ఇదంతా చేసాను” తల వంచుకుని చెప్తున్న దక్షను కోపంగా చూడసాగారు అక్కడున్న అందరూ.
పిల్లలకు ఇంకా మత్తు వదల్లేదు వస్తూండగా దోవలో శేఖరానికి తెలిసిన డాక్టర్ దగ్గరకెళ్ళి చూపించుకుని, ప్రమాదం ఏమీ లేదని అనిపించుకుని వచ్చారు. రేపటికి కాని లేవరని చెప్పిన డాక్టర్, శేఖరాన్ని చూసి వేరే ప్రశ్నలేమీ అడగలేదు.
“అమ్మా! పూర్ణిమగారూ…దినేష్ గారూ… నా కూతురివల్ల, నా జీవితంలో నేను ఇంత అవమానం పాలవుతానని కలలో కూడా ఊహించలేదు. నా గుండె ఎంత బండదో చూడండి… ఇంత అవమానాన్ని తట్టుకుని బతికి ఉన్నాను. చేసిన తప్పుకి క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. మీరే శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అవమాన భారం మనసునీ, శరీరాన్ని కృంగదీస్తుండగా చేతులు జోడించి అడుగుతున్న శేఖరాన్ని చూసి అక్కడ అందరికీ జాలేసింది.
“ఛ… ఛ… అలా అనకండి. తెలిసీ తెలియని చిన్నపిల్ల చేష్ట అది. ముఖ్యంగా పిల్లలు క్షేమంగా ఉన్నారు. అదే పదివేలు. మీమీద మాకు ఎలాంటి కోపమూ లేదు. మీరుకూడా మర్చిపోండి” అన్నాడు దినేష్.
“దక్షా… చెప్తున్నానని మళ్లీ నా మీద కోపంపెంచుకోకు. నువ్వు చేసిన ఈ పని వల్ల మేరునగ ధీరుడిలా ఉండి, ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన, మీ నాన్నగారు ఎలా అయిపోయారో చూడు. నీ ఈర్ష్య నిన్ను దహించడమే కాకుండా, మీ నాన్న పరువు ప్రతిష్టల్ని కూడా లాగేసుకోబోయింది. అందుకే అంటారు. మంచి చేయడానికి ఆలోచించనక్కరలేదు. చెడు ఆలోచన వస్తే అలోచించకుండా తుడిచెయ్యాలి అని. ఇప్పుడు జరిగినది నువు మర్చిపో… నేను కూడా మర్చిపోతాను. మనం ఇక నుండి ఫ్రెండ్స్?” నవ్వుతూ చెయ్యి చాపిన ఆ చేతిని కళ్లకద్దుకున్నది దక్ష.
“సర్… మీరేమీ మనసులో పెట్టుకోకండి. విషయం మనను దాటి బయటికి పోదు. అర్థరాత్రి అయింది. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి” చెప్పింది ధృతి. దక్షతో అందరికీ క్షమార్పణ చెప్పించి, అందరికీ మరోసారి థాంక్స్ చెప్పి వెళ్లిపోయారు తండ్రీ కూతుళ్ళు.
“ఇక నేను వెళ్ళొస్తాను ధృతీ” చెప్పాడు విశ్వ. తల ఊపి అతనితో బయటికి వచ్చింది.
“థాంక్స్ విశ్వా…ఈ సమయంలో నువు పక్కన ఉండడం నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది…” కారులో కూర్చున్న అతనికి చెప్పింది.
“నేనేమి చేసాను ధృతీ? అంతా నువ్వే చేసావుగా”
“ఏమీ చెయ్యక్కరలేదు విశ్వా… మనసైనవాడు పక్కన ఉంటే ధైర్యం అదే వస్తుంది” చిలిపిగా నవ్వుతూ కన్ను కొట్టింది.
ఎన్నాళ్ళుగానో అడుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లైంది విశ్వకు….

*******

రెండేళ్ళ తర్వాత యూఎస్ వేపు వెళ్తున్న విమానంలో ఉన్న విశ్వ “మేఘాలలో తేలిపోతున్నది” అంటూ హమ్ చేసుకుంటున్నాడు, తన భుజం మీద వాలి నిద్రపోతున్న భార్య ధృతిని చూస్తూ….

శుభం

1 thought on “ధృతి – 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *