March 19, 2024

‘గోపమ్మ కథ’

రచన: గిరిజారాణి కలవల

ముందు గోపమ్మ అంటే ఎవరో చెప్పాలి కదా! గోపమ్మ అసలు పేరు కృష్ణవేణి. తల్లితండ్రులు గోపమ్మ, గోపయ్య.. పెద్ద కూతురు పేరు లక్ష్మి.
రెండో కూతురు కృష్ణవేణి. గోపయ్య పంచాయతీ ఆఫీసులో స్వీపర్ పని చేసేవాడట. గోపమ్మ మా అత్తగారి ఇంట్లో పనిచేసేదట. తల్లితో పాటుగా కృష్ణవేణి కూడా మా ఇంటికి వస్తూండేదట. అట.. అని ఎందుకన్నానంటే.. అప్పటికి ఇంకా నాకు నా అత్తారింటికి దారి తెలీదు. క్రీస్తుపూర్వంలాగా.. నా పెళ్లి పూర్వం కాబట్టి ఆ తల్లి గోపమ్మ నాకంతగా తెలీదు. తల్లి తర్వాత ఈ కృష్ణవేణి పూర్తి డ్యూటీలోకి వచ్చేసిందట… ఆ తల్లి గోపమ్మని అలా పిలిచి పిలిచి.. ఆ పేరే అలవాటై పోవడంతో మా ఇంట్లోవాళ్లు ఈ కృష్ణవేణికి కూడా.. గోపమ్మ పేరే స్ధిరపరిచారట. నేను అత్తగారింట్లో అడుగుపెట్టేసరికి , సీనియర్ గోపమ్మ రిటైర్ అయినట్టుంది. ఈ జూనియర్ గోపమ్మ పని చేస్తూండేది. అప్పటికే తనకి పెళ్ళి అయింది. మొగుడు అంజి పగలు రిక్షా తొక్కేవాడు. వచ్చిన డబ్బులతో రాత్రి మందు కొట్టేవాడు. ఆ తర్వాత ఆ తాగిన మత్తులో గోపమ్మని కొట్టేవాడు. ఆ మూడు పనులే వాడు చేసేది.
తెల్లారేసరికి మామూలుగా అయిపోయేవారు ఇద్దరూనూ.. భర్తకీ.. పిల్లలకీ తిండి బాధ్యత గోపమ్మదే.. కష్టజీవి.
గోపమ్మ మా ఇంట్లో పొద్దున్నే వాకిలి బయట పేడ నీళ్ళు కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టడంతో మొదలయిన పని.. తర్వాత.. అంట్లు తోమడం.. గదులు చిమ్మి తడి గుడ్డతో తుడవడం.. బట్టలు ఉతికి ఆరేయడం చేసేది. ఇప్పటి కాలం పనిమనుషులులా ఒప్పుకున్నంత పనే చేస్తాను, ఆ పైన పూచికపుల్ల కూడా తీయను అనే రకం కాదు. ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది. రెండు పూటలా కూడా పనికి వచ్చేది. పై పనులు కూడా.. రేషన్ షాపు పనులూ.. బియ్యం ఏరడం.. చింతకాయలూ, ఉసిరికాయల సీజన్లో దంచడాలూ… పండగలప్పుడు బూజులు దులపడాలూ చేసేది. ఏ పని చెప్పినా హుషారుగానే చేసేది. అది అడక్కపోయినా ఇలా పై పనులు చేయించుకుంటే దానికి తగ్గట్టు డబ్బు చేతిలో పెట్టేదాన్ని.
డబ్బులు మాత్రం లెక్కలు తెలీదు. జీతం డబ్బులు చేతిలో పెట్టి, ‘నేనెంత ఇచ్చానే’.. అంటే.. “ఒక వందా, ఒక యాభై, ఒక పదీ, ఇంకో పదీ, ఇంకో పదీ,ఇంకో ఇరవై “ ఇలా అనేది.. మొత్తం ఎంతా అంటే తెలిసేది కాదు. “నేను తక్కువ ఇస్తేనో?” అని అడిగితే, “మీరు అలా చెయ్యరుగా!” అని నవ్వేసేది.
పెద్దవాడు రమేష్, రెండోవాడు సురేష్..
దాని పెద్దకొడుకుకి ఎంత వయసుంటుందో… నేను చెప్పాల్సివచ్చేది… ఎందుకంటే అడిగితే… “మీ పెళ్లి కి నేను కడుపుతో ఉన్నాను. దాన్ని బట్టి నువ్వే లెక్కగట్టి వాడికెన్నేళ్ళో చెప్పమ్మా!” అనేది. ఆ లెక్కన మా పెళ్లి అయిన సంవత్సరం.. అప్పటికి దానికి ఎన్నో నెలో.. కలిపి లెక్కకట్టి చెప్పేదాన్ని. ఏ ఏటికా ఏడు దానికి చెప్పాల్సిన వచ్చేది.

రెండోవాడు పుట్టినపుడు, నిండు నెలలతో వుండి కూడా,ఆ సాయంత్రం కూడా పనికి వచ్చి, మొత్తం చేసి వెళ్ళింది.
మర్నాడు పనికి రాలేదు.. గోపమ్మ అక్క లక్ష్మి వచ్చి.. ” మా సెల్లికి రాతిరి నొప్పులొచ్చాయమ్మా.. ఆసుపత్రికి తీసుకెళ్ళిన పావుగంటకే పెసవం అయింది అబ్బాయి పుట్టాడు. ఈ పురుడు పదకొండురోజులూ పనికి నేను వస్తాను. తర్వాత గోపమ్మే వస్తుంది”అంది.
ఆశ్చర్యపోయాను నెలలు నిండికూడా నిన్నటి వరకూ ఎంత బాగా పనిచేసుకోగలిగింది. అదే మన ఇళ్లలో బెడ్ రెస్టులూ అంటూ కదలనే కదలనివారుంటారు. ఆ పురిటి నొప్పులు కూడా భరించలేని సుకుమారులు మన పిల్లలు. నొప్పి భరించలేను, ఆపరేషన్ చేసేయండి అంటూ పరపరా కోయించేసుకుంటారు. కొందరు డాక్టర్లు కూడా అంతంత సేపు వెయిట్ చేయలేకనో, మరే కారణం చేతనో సిజేరియన్ చేయడానికే సిద్ధం అయిపోతుంటారు.
ఇలాంటి గోపమ్మలు అంత ఖర్చు లు భరించి, ప్రైవేటు ఆసుపత్రిలో చేరలేరు. ఉచితాసుపత్రిలోనే, లేకపోతే ఇంటి దగ్గరే నాటు మంత్రసానుల దగ్గరే కానుపులు చేయించుకుంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ల మీద కూడా ఇలాంటి వారికి సరైన అవగాహన ఉండేది కాదు. మగవారు చేయించుకుంటే నీరసపడిపోతారనే అపోహ ఎక్కువగా వుండడంతో.. వీళ్ళ ఇళ్ళల్లో మగవాళ్ళు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయుంచుకునేవారు కాదు. ఆడవాళ్ళు చంకలో ఒకరు,ఉయ్యాల్లో ఒకరు, మళ్లీ కడుపులో ఒకరు ఇలా వుంటూనే వుండడతో ఇక ట్యూబెక్టమీ చేయించుకుందామనే ఆలోచనే వుండేది కాదు. ఎంతమందినైనా కనడానికి సిద్ధం అయేవారు. అధిక ప్రసవాల వల్ల వారిలో ఏర్పడే రక్తహీనత, నీరసం, తరచూ వచ్చే అనారోగ్యం పట్టించుకునేవారు కాదు. అయినా ఎంతమందిని కన్నా కూడా పెంచడం వీళ్ళకి పెద్ద కష్టమేమీ కాదు. చదువులు చెప్పిద్దామనే ఆలోచన వుండేది కాదు. పదో ఏడు రాగానే..ఏదో ఒక పనిలో పెట్టేసేవారు. అప్పటి నుండే పిల్లలు ఎంతో కొంత సంపాదించేసేవారు. ఆడపిల్లలు అయితే పాచి పనులకూ,మగ పిల్లలు అయితే హొటల్ లో క్లీనర్ గానో, మెకానిక్కుల దగ్గర హెల్పర్ గానో పెట్టేసేవారు.
ఎంత ఈజీగా ప్రసవం అయిందో కదా గోపమ్మకి అనుకున్నాను. “బాలింతరాలు కదా! కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమను. మూడోనెల వచ్చాక వస్తుందిలే పనికి. అప్పటిదాకా నువ్వు చెయ్యి.” అన్నాను.
“అమ్మో! లేదమ్మా! మూడునెలలు అంటే నాకు కుదరదు. నేను పని చేసుకునే ఇళ్లు నాకు ఉన్నాయి కదా ! అయినా మా ఇళ్లలో ఇలాంటివన్నీ మామూలే. ఏం ఫర్వాలేదమ్మా!. ” అంది లక్ష్మి. ఇక ఏం మాట్లాడలేకపోయాను.
పదకొండురోజుల తర్వాత మామూలుగానే పనికి వచ్చేసింది గోపమ్మ. చంటిపిల్లాడు సురేష్ ని కూడా చంకని వేసుకుని వచ్చేది. సందులో పక్క వేసి పడుకోపెట్టేది . చీమలు కుడతాయేమో అని నాకు భయం వేసి, హాల్లో పడుకోపెట్టమనేదాన్ని. పని మధ్యలో, వాడు ఏడిచినప్పుడల్లా , వాడికోసారి పాలు పడుతూ ఉండేది. అయినా వాళ్ళ ఇళ్ల లో ఇలా పాచిపనులకీ, పొలం పనులకీ వెళ్ళేటపుడు.. పిల్లల్ని తీసుకెళ్ళడం కుదరకపోతే ఇలా పాలుతాగే పసిపిల్లలకి కొద్దిగా నల్లమందు పాలలో కలిపి పట్టేస్తే.. ఎక్కువసేపు నిద్ర పోతారట.. గోపమ్మే చెప్పింది నాకు. ఎడపిల్లలని కాపలా ఉంచి తల్లులు పనికి వెళ్లి పోయేవారట. అయ్యో పాపం కదా! అనిపించింది నాకు.
మా ఇల్లే కాకుండా ఇంకో రెండు మూడు ఇళ్ళలో పనిచేసేది గోపమ్మ. పగలంతా కష్టపడి పనిచేయడంతో రాత్రయేసరికి అలిసిపోయి ఒళ్లు తెలీకుండా నిద్ర పోయేది. ఒకసారి ఆ నిద్ర లో.. చంటిపిల్లాడిని పక్కలో వేసుకుని మొద్దు నిద్రపోయింది. వాడికి ఆకలేసి ఏడుస్తూంటే, ఆ నిద్రమత్తులో పాలరొమ్ము వాడి నోటికి అందించింది. పసివాడికి ఊపిరి తగులుతోందో లేదో కూడా చూసుకోకుండా నిద్రలో మునిగిపోయింది. రొమ్ము ముక్కుకి నొక్కుకిపోయి, గాలి తగలక ఊపిరి ఆడక తెల్లారేసరికి పిల్లాడు విగతజీవి అయిపోయాడు. తర్వాత ఎంత భోరుమని ఏడిచినా ఏం లాభం? జరగాల్సిన విషాదం జరిగిపోయింది.
ఆ సంఘటన నుంచి తేరుకోవడానికి చాలా రోజులే పట్టింది గోపమ్మకి. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్ళకి మరో పిల్లాడు పుట్టాడు. విజయవాడ దుర్గమ్మకి మొక్కుకుంటే పుట్టాడని ,ఆ పిల్లాడికి దుర్గారావు అని పేరు పెట్టింది.
యధాప్రకారం ఇళ్ళలో పాచిపనులు.. చేస్తూనే ఉంది. జీతంతో పాటుగా ఓ మనిషి కి సరిపడా అన్నం తప్పనిసరిగా పెట్టాలని డిమాండ్ చేసేది గోపమ్మ.. ఇప్పటి పనిమనుషులు.. మన ఇళ్ల లో మిగిలిన అన్నం, టిఫిన్ లు ఇస్తే పారేయడమే తప్ప పట్టుకెళ్ళడం లేదు.. కానీ గోపమ్మ మాత్రం.. ఏది ఇచ్చినా తీసుకెళ్ళేది. ఉదయం టిఫిన్, రెండు పూటలా కాఫీ.. అన్నం ఇవ్వాలి. అన్నం, కూర, పప్పు.. ఇలా అందరిళ్ళలో నుంచి తీసుకెళ్ళినవి ఓ పూట వాళ్ళకి సరిపోయేవి. ఏ పూటైనా రిక్షా కి గిరాకీ లు సరిగ్గా దొరకక డబ్బులు చేతిలో ఆడకపోతే.. ఆ పూట అంజికి తాగుడు డబ్బులు కూడా గోపమ్మే సర్దాలి. లేకపోతే భీభత్సం చేసేసేవాడు. ఓ సారి ఇలాగే తన దగ్గర లేవని అన్నా కూడా డబ్బులు కోసం గోపమ్మని తెగ సతాయిస్తూ కొట్టడానికి రాబోతోంటే… తప్పించుకుందికి చేతికి దొరికిన రోకలి బండ అంజి మీదకి విసిరేసింది. అది వాడి కాలికి తగిలి బోర్లా పడిపోయాడు. అసలే అర్భకపు ప్రాణి అంజి.. ఆ దెబ్బకి కాలు విరిగింది. మోకాలు కింద భాగంలో ఫ్రాక్చర్ అయింది .ఏతావాతా గోపమ్మకే అదనపు భారం మీద పడింది. ఆరునెలలు రిక్షా తొక్కలేకపోయాడు. ఆ కాలుకి కట్టు కట్టించింది. సిమెంట్ కట్టు మీద నమ్మకం లేదు వాళ్ళకి. ఐసాపాలెం అనే ఊళ్ళో.. కోడిగుడ్డు సొన ఇంకా ఏవో ఆకు పసరు తో వైద్యం చేయిస్తే విరిగిన ఎముకలు అతుక్కుంటాయనే నమ్మకం. దాంతో నెలకోసారి ఆ వూరు తీసుకెళ్లి, వైద్యం చేయించేది. ఇవన్నీ గోపమ్మకి ఖర్చుతడిసి మోపెడైంది.
“ఎప్పుడూ కష్టజీవితమే నాది. అయినా మా ఇళ్లలో ఏ ఆడదీ సుఖపడినదీ, ఏ బాధలూ లేనిదీ ఉండదమ్మా! మా బతుకులన్నీ ఇలాటివే అనేది.”
నిజమే అనిపించేది నాకు. ఆ కుటుంబాలలో మగాళ్ళు తొంభై శాతం మంది ,ఇలాంటి చెడు అలవాట్లతోనే వుండేవారు. కుటుంబ పోషణ ఏ మాత్రం పట్టించుకునేవారు కాదు. జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. నిర్లక్ష్యంగా ఉండడం, పైపెచ్చు భార్యలని హించించడం కనపడుతూ వుండేది. చాలా మంది ఈ తాగుడే కాకుండా ఇతరత్రా అలవాట్లుతో అర్ధాయుష్కులే అయ్యేవారు. పిల్లలకి చదువులు ఉండేవి కాదు… ఆడపిల్లలయితే తల్లులతో పాటు పాచిపనులకి పది పన్నేండేళ్ళ నుంచే నేర్చుకోవడం మొదలెట్టేసేవారు.మగపిల్లలయితే, ఏదైనా పని కాఫీ హొటళ్ళలోనో, మెకానిక్ ల దగ్గరో, లేదంటే పుల్ల ఐసులు అమ్ముకుంటూనో, అదీ లేదంటే రోడ్లు మీద ఆవారాగా తిరుగుతూ గోళీ లు ఆడుకుంటూ, చిన్నపుడే బీడీలు, సిగరెట్లు గుట్కా లు అలవాటు చేసుకుంటూ.. తర్వాత వాటిలో ప్రావీణ్యం సంపాదించడాని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవారు.
అలాంటి కుటుంబమే గోపమ్మది. తన సంపాదనతోనే మొగుడ్ని, ఇద్దరు కొడుకులని మేపేది. రెండో కొడుకు దుర్గారావు పుట్టినప్పటి నుండీ కూడా వాడు ఏదో ఒక జబ్బుతోనే ఉండేవాడు. పదేళ్లు వచ్చినా అర్భకంగానే ఉండేవాడు. పాపం గోపమ్మ వాడి ఆరోగ్యం కోసం, ఎప్పుడూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉండేది. గుండెకి నెమ్ము చేసిందని చెప్పేది. జీతంలో సగం పైన వాడి ముందుకీ,తిండితో సరిపోయేది. వాడికి బలవర్ధకమైన ఆహారం పెట్టమని డాక్టర్ చెప్పారని, రోజూ పాలు, కోడిగుడ్లు పెడుతూండేది. ఎప్పుడూ ఈసురోమంటూ వుండేవాడు.
ఒంటి చేత్తో ఇంటి భారం మోయలేకపోయేది. అప్పుడప్పుడు తనకో కూతురుంటే బావుండేది, పనిలో తనకి కాస్త తోడుగా ఉండేదని అనుకునేది. దేవుడు దాని మొర విన్నాడు కాబోలు.
ఒకరోజు తనతో పాటుగా ఓ పిల్లని తీసుకువచ్చింది. మాసిపోయిన గౌనూ , చింకిజుట్టూ, చేతిమీద ఇంకా పచ్చిగా రసి కారుతూ కాలిన గాయమూ, ఏడుపు చారికలు కట్టిన మొహమూ…అలా ఉంది ఆ పిల్ల.
“ఎవరు గోపమ్మా? ఈ పిల్ల మీ వాళ్ళ పిల్లలా లేదే..” అని అడిగితే, గోపమ్మ చెప్పిన సంగతి విని షాక్ అయ్యాను.
ప్రతీరోజూ తన పనిఅయిపోయాక , ఇంటికి వెళ్ళే దారిలో బస్ స్టాండ్ లో గోపమ్మ ఫ్రెండ్స్ బేచ్ అందరూ కూర్చుని మీటింగ్ పెట్టుకోవడం అలవాటు. వాళ్ళ వాళ్ళ బాధలూ,పనిచేసేచోట పడే కష్టాలూ, ఇలా వారి వారి లోకాభిరామాయణాలు చెప్పుకుని.. కాసేపు ముచ్చట్లాడి.. ఆ తర్వాత ఇళ్ళకి చేరేవారు.
ఒకరోజు ఇలాగే కబుర్లు చెప్పుకునే టైములో, బస్ స్టాండ్ లో, ఓ మూలన గోడ పక్కన నేలమీద పడుకుని ఉన్న, సుమారు ఎనిమిదేళ్ళపిల్ల గోపమ్మ కంట పడింది. ఎవరో ప్రయాణీకులే.. వాళ్ళ పిల్లని.. నిద్రపోతోంటే అక్కడ పడుకోపెట్టి.. ఏ బాత్ రూమ్ కో వెళ్ళుంటారనుకుంది. మర్నాడు ఉదయం పనికి వచ్చేటప్పుడు కూడా చూసినప్పుడు కూడా ఆ పిల్ల అక్కడే ఉండడం చూసి.. దగ్గరకి వెళ్లి వాకబు చేసిందట.. ఎవరివి? ఎందుకిక్కడే నిన్నటి నుంచి ఉన్నావు? మీ వాళ్ళు ఎవరూ కనపడలేదేంటీ? అని అడిగేసరికి ఆ పిల్ల వెక్కుతూ ఇలా చెప్పిందట. . ” హైదరాబాద్ లో ఓ అమ్మగారింట్లో పనికి మా అమ్మ నన్ను పంపించింది. వాళ్ళింట్లో అంట్లు తోమడం, బండలు తుడవడం.. బట్టలు ఉతకడం, కూరగాయలు కట్ చేయడం అన్ని పనులూ చేసేదాన్ని.. వాళ్ళ చిన్న పాపని ఎత్తుకుని ఆడించాలి.. పార్కులో తిప్పాలి.. సరిగ్గా చేయకపోతే అన్నం పెట్టేది కాదు.. బాగా కొట్టేది కూడా.. ఓ సారి పాపని ఎత్తుకున్నపుడు.. నా చేతి లోంచి జారి పాప కింద పడిపోయింది.. దెబ్బలేం తగలలేదుకానీ.. కొంచెం ఏడిచింది అంతే.. ఆ అమ్మగారు కోపంతో.. అట్లకాడ కాల్చి నా చేతి మీద వాత పెట్టేసింది.. చూడు” అంటూ తన చేతిని చూపించిందట.
“అయ్యో.. మరి మీ అమ్మకి చెప్పకపోయావా?” అని గోపమ్మ అడిగితే..
.” మా అమ్మ ఫోన్ చేసినా, అమ్మగారే మాట్లాడేది.. నాకు ఇచ్చేది కాదు.. నెంబర్ కూడా నాకు తెలీదు.. అసలు మా అమ్మ ఉండే ఊరికి ఎలా వెళ్ళాలో కూడా తెలీదు… మా ఊరు నుంచి అమ్మగారు తన కారులో తీసుకువెళ్లారు నన్ను.. ఏ బస్సు ఎక్కితే మా ఊరు వస్తుందో నాకు తెలీదు… వాత పెట్టేసరికి నాకు ఏడుపు, భయం వచ్చి.. వాళ్ళందరూ పడుకున్నాక.. నెమ్మదిగా తలుపు తీసుకుని బయటకి వచ్చేసాను… రోడ్డు మీద వెళ్లే వాళ్ళని బస్సు ఎక్కడ ఎక్కాలి అని అడిగితే దారి చెప్పారు.. ఏదో బస్సు ఎక్కేసి.. ఇదిగో ఈ ఊళ్లో దిగి ఇక్కడే ఉండిపోయాను.. ” అంటూ తన కధ చెప్పిందట.
“చూడమ్మగారూ! ఆ మహాతల్లి.. ఎంత వాత పెట్టిందో… పచ్చి పుండులా ఉంది పాపం.. ” అంటూ ఈ పిల్ల చెయ్యిని ముందుకి చాపి చూపించింది. అబ్బ.. వళ్ళు జలదరించింది… పసిపిల్ల అని కూడా చూడకుండా అలా వాత పెట్టడానికి ఆవిడకి చేతులు ఎలా వచ్చాయో.. అనుకున్నా.. “ముందు డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్లి మందు ఇప్పించు ఆ పిల్లకి.. తర్వాత ఎక్కడనుంచి వచ్చిందో.. ఏంటో కనుక్కుందాం..” అంటూ ఐదొందలు ఇచ్చి పంపించాను.
తర్వాత ఓ పదిరోజులకి ఆ గాయం తగ్గు మొహం పట్టింది. గోపమ్మ సంరక్షణలో ఆ పిల్ల కూడా కాస్త తేరుకుంది. ఎంతడిగినా తన ఊరిపేరు చెప్పలేకపోయింది..తన పేరు రత్న అనీ.. తన తల్లి పేరు సామ్రాజ్యం అనీ.. తండ్రి పేరు పిచ్చయ్య అనీ… తండ్రికి టీ బంకు ఉందనీ చెప్పింది.. అంతకుమించి ఇంకేం వివరాలూ చెప్పలేదు. ఎలా కనుక్కోవాలో తెలీలేదు గోపమ్మకి…
అప్పట్లో… ఇలా ఫేస్బుక్లూ .. వాట్స్ఆప్ లూ లేవు.. ఒకరినుంచి మరొకరికి షేర్ చేసి తెలియబరచడానికి.. అంతగా ఎవరైనా
వచ్చి అడిగితే అప్పుడు చూసుకోవచ్చు అనుకుని ఆ పిల్లకి లక్ష్మి అని పేరు పెట్టి.. తనింట్లోనే ఉంచేసుకుంది. అసలు ఎవరూ కూడా వచ్చి వాకబు చేసిన పాపాన పోలేదు. దాంతో గోపమ్మ కూడా.. ఈ పిల్ల దేవుడిచ్చిన కూతురే అనుకుని.. తన కొడుకులతో పాటే పెంచింది. లక్ష్మి కూడా గోపమ్మ ని ‘అమ్మా’ అని పిలుస్తూ… గోపమ్మ పని చేసే ఇళ్ల లో తాను కూడా పని చేస్తూ సహాయంగా ఉండేది. ఎప్పుడు పుట్టిందో.. ఎవరికి పుట్టిందో.. ఏ వూరిదో తెలీకపోయినా… గోపమ్మకి కూతురే అయిపోయింది. మా ఇంట్లో నేను మా అమ్మాయి పుట్టినరోజునాడు లక్ష్మికి కూడా పుట్టినరోజు జరిపేదాన్ని. కొత్తబట్టలు కుట్టించి… తనతో కూడా కేక్ కట్ చేయించి ఫోటోలు తీయించేదాన్ని. ఎంత మురిసిపోయేదో ఆ పిల్ల. స్కూల్ లో చేర్పించి చదువు నేర్పిద్దామని నేనూ, గోపమ్మా ఎంత ప్రయత్నించినా లక్ష్మికి ఇంట్రస్ట్ లేకపోయేది. గోపమ్మతో పాచిపనులకి పోవడానికే ఇష్టపడేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *